11, మార్చి 2011, శుక్రవారం

వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు

వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు


‘అసలేంజరుగుతోంది?’ - ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య ఇది.

గత కొద్దిమాసాల పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా – సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.

ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్తిరమయిన భావజాలాలుంటాయి.కానీ ఈనాడు దాదాపు అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.

అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. ‘అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ’ అని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ‘ఔరా! వీరికెంత ధైర్యం!’ అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను చెరిగి పారేస్తున్నారు.

నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.

ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.

రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే రోజు ఎప్పుడో తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది  ఏదో ఒక పార్టీని నిజాయితీగా అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి - ‘వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ’ అని అడిగినట్టు అడిగితె ఎవరు ఎవరో చెప్పలేని దుస్తితి.

గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు. ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు. దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా - ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.

ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.

వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పదం రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే – ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, స్తానిక సంస్తల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో – ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. బహుశా ఈ అపవాదును తప్పించుకోవడానికే శాసన సభలో వారిద్దరూ రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని పోటాపోటీగా మాటల యుద్ధం సాగించాల్సివచ్చిందనే వారు కూడా లేకపోలేదు. కాకపొతే, ముఖ్యమంత్రి అయిన నాటినుంచి అనేక రకాల సమస్యల వలయంలో చిక్కుకుని మనసారా నవ్వుకునే అవకాశం కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డికి – నిండు సభలో చిరునవ్వులు చిందించే అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడిని అభినందించాలి. (11-03-2011)



కామెంట్‌లు లేవు: