30, డిసెంబర్ 2010, గురువారం

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

మొదటి ముద్దాయి కాంగ్రెస్ అధిష్టానం – భండారు శ్రీనివాసరావు

రెండువేల పదో సంవత్సరం మౌనంగా వీడుకోలు తీసుకుంటున్న వేళ ఒక్కసారి మన రాష్ట్రాన్ని విహంగ వీక్షణం చేస్తే కానవచ్చే దృశ్యం ఏమిటి?

వరుస తుపానులు, అకాల వర్షాలు, నీట మునిగిన పైర్లు, నిండా మునిగిన రైతులు, గుండె ఆగి కొందరు, గుండె చెదరి మరి కొందరు, ఊపిరి వొదిలిన పేదవాళ్ళు -

ముదిరిన ప్రాంతీయ ద్వేషాలు, పలచపడ్డ మానవ సంబంధాలు, నిన్న మొన్నటి దాకా పాలూ నీళ్ళలా కలగలసిపోయిన జనం తాలూకు కనబడని ఆనవాళ్ళు -

మింటికెగసిన ధరలు, వెన్ను విరిగిన ప్రజలు,

ఆందోళనలు, ఊరేగింపులు, హర్తాళ్ళు, రాస్తా రోఖోలు, బందులు, దేశాన్ని చీల్చే చెండుకుతినే రాబందులు,

నాయకుల నిరాహార దీక్షలు, అనుచరుల వీరావేశ ప్రదర్సనలు,

దిష్టి బొమ్మల దహనాలు, ముష్టి యుద్ధాలను మరిపించే బుల్లి తెరల గోష్టులు,

ఒక్కటంటే ఒక్కరోజు ప్రశాంతంగా గడిచిందా? ఏటిపొడుగునా ఇవే గొడవలు. ఏడాది మొత్తం ఇదే తీరు.

‘జనం గమనిస్తున్నారు జాగ్రత్త’ అని ఒకరినొకరు హెచ్చరించుకోవడమే కానీ ఆ జనం నిజంగానే గమనిస్తున్నారన్న సోయ లేకపోవడమే నేటి రాజకీయం లోని ఓ కొత్త కోణం.

సమాజం లోని అన్ని రకాల రుగ్మతలకు పరిష్కారం చూపవలసిన రాజకీయ పార్టీలే వీటికి మూలాధారాలు కావడం మరో విషాదం.

ఎన్ని పార్టీలు రాష్ట్రంలో వున్నప్పటికీ, ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ,టీ ఆర్ యస్ ల చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు గిరికీలు కొడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జగన్ పెట్టబోయే పార్టీ కూడా ఈ జాబితాలో చేరింది.

ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో టీడీపీ ది ఒక ప్రత్యెక స్తానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ మాదిరిగానే కొద్దో గొప్పో కేడర్ కలిగిన పార్టీ. తొమ్మిది సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు ఆ పార్టీకి అధినాయకుడు. రెండేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో విజయం తధ్యం అని మనసావాచా నమ్మి దెబ్బతిన్న పరిస్తితి ఆయనది. ఎన్నికలముందు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ, తమ విజయావకాశాలను నీరు కార్చిందని కూడా నమ్ముతున్న వారు టీ డీ పీ లో అనేకులున్నారు. సరే. అది గతం. ముందు ముందు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని కాదని పట్టం కట్టడానికి వారి ముందు వున్న ఏకైక ప్రత్యామ్నాయం తమ పార్టీ మాత్రమె అని కూడా వారి నమ్మకాలు కొనసాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ నేడున్న పరిస్తితిని చూస్తే వారిది దురాశ అనుకోవడానికి కూడా వీలు లేదు. కానీ ఈ మధ్యలో బాగా పుంజుకున్న తెలంగాణా అంశం వారి ఆశలపై మరోసారి నీళ్ళు చల్లింది.అన్ని పార్టీల మాదిరిగానే ఈ పార్టీపై కూడా తెలంగాణా క్రీనీడలు కమ్ము కున్నాయి. ఈ నేపధ్యం లో- అకాల వర్షాలతో కుమిలిపోతున్న రైతుల దుస్తితి ఆ పార్టీకి ఒక రకంగా కలసి వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక బలమయిన అంశం దొరికిందని ఆ పార్టీ ఉత్సాహ పడింది. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా పార్టీ అధినేతే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించడం, జాతీయ మీడియాను ఆకర్షించే స్తాయికి ఈ అంశం ఎదగడం ఆ పార్టీకి కొంత లాభించినట్టే కనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో వ్యవసాయం గురించి ఆయన చేసిన కొన్ని ప్రస్తావనలను కొందరు పదేపదే పేర్కొనడం - రైతులపట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను అదే పనిగా ప్రశ్నించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

పొతే, టీ ఆర్ యస్.

తెలంగాణా లక్ష్య సాధన కోసం, అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే నాయకులకు కొదవ లేని పార్టీ అది. అదృష్టం ముందు పుట్టి తరువాత పుట్టిన చంద్రశేఖరరావు ఆ పార్టీ నాయకుడు. అందువల్ల కుష్టు రోగులెవరూ ఇలాటి ప్రకటనలను సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఉద్యమ పార్టీ కాబట్టి, ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా కలిగిన పార్టీ కాబట్టి, మిగిలిన ఏ రాజకీయ పార్టీకి లేని కొన్ని వెసులుబాట్లు ఈ పార్టీకి వున్నాయి. విద్యార్ధులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్న ఏకైక డిమాండ్ తో- రైతుల సమస్యను కూడా పక్కకునెట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేసినా ప్రశ్నించే వారు లేకుండా పోవడం, ప్రస్తుత తరుణంలో భావోద్వేగాలకున్న పటిమను తెలియచేస్తుంది. తీరా ఇంత చేసినా, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు దీక్షకు పూనుకునేవరకు కేసుల విషయం పరిష్కారం కాని వైనం గమనిస్తే ఇందులోని మతలబు ఏమిటో ఎవరికీ అర్ధం కాని విషయం.

ఇంకా పేరు పెట్టని జగన్ పార్టీ విషయం కూడా చెప్పుకోవాలి. పుటకకు ముందే ప్రకంపనలు సృష్టించి దరిమిలా నీరు కారిపోయిన ఇతర పార్టీలను ఉదాహరణగా చూపిస్తూ కొందరు చేస్తున్న అవహేళనల నడుమ, కొత్తగా అరంగేట్రం చేయబోతున్న ఈ పార్టీ పురుడు పోసుకుంటోంది. వైఎస్ ఆర్ రాజకీయవారసుడిగా రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు గుర్తించకపోయినా, సామాన్య జనం గుర్తిస్తే చాలని మొండిగా ముందుకు సాగిపోతున్న జగన్ సాహసానికి కారణాలను అన్వేషించే పనిలో మరి కొందరు తలమునకలుగా వున్నారు.

పోతే, రాజశేఖరరెడ్డి జీవించి వున్నంత వరకు, ముఖ్య మంత్రుల విషయంలో పాత పోకడలను సమూలంగా మార్చుకున్నట్టు సంకేతాలు పంపి సాధారణ జనంలో మంచి మార్కులు కొట్టేసిన సోనియా, వై ఎస్ ఆర్ మరణానంతరం మళ్ళీ పాత పద్ధతులకు మళ్లిపోతున్నదన్న దురభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు విజయం సాధించడం జగన్ కు కలసి వచ్చింది. ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడం ద్వారా జగన్ పట్ల సానుభూతి పెరిగేలా చేసి అధిష్టానం మొదటి పొరబాటు చేసింది. ఆ తడబాటులో చేసిన మరి కొన్ని పొరబాట్లు జగన్ ని మాస్ హీరో గా మార్చివేశాయి. తిరుగులేని జనాదరణ కలిగిన నాయకుడిగా జనం లో గుర్తింపు పొందిన తరవాత కానీ అధిష్టానానికి తాను చేసిన తప్పు ఓ పట్టాన అర్ధం కాలేదు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆ దరిమిలా పన్నిన వ్యూహాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్న చందంగా అధిష్టానం వ్యవహారాన్ని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నష్ట నివారణకోసం - విద్యార్ధులపై పెట్టిన కేసుల అంశాన్ని ఆలస్యంగానయినా చేతిలోకి తీసుకుని - కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల నిరాహార దీక్ష రూపంలో చూపించిన పరిష్కారం - పోయిన ప్రతిష్టను ఏమేరకు పూడ్చగలిగిందన్నది అనుమానాస్పదంగానే మిగిలిపోయింది.

రాష్ట్రంలో నేడు నెలకొనివున్న పరిస్తితికి అన్ని పార్టీలకు అంతో ఇంతో బాధ్యత వున్నప్పటికీ – ఏదో సాకు చూపి తప్పించుకోలేని ప్రధాన బాధ్యత మాత్రం అధికార పక్షానిది. ఇంకా సరిగా చెప్పాలంటే- ఢిల్లీ లో కొలువయివున్న ఆ పార్టీ అధిష్టానవర్గానిది. అంతే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్తితికి కూడా పూర్తి బాధ్యత అధిష్టానానిదే.

అయిదేళ్ళు పాలించండని అధికారం అప్పగించిన ప్రజలను వారి మానాన వారిని వొదిలి గ్రూపు తగాదాలతో మునిగి తేలుతున్న కాంగ్రెస్ వారిని చూస్తుంటే ఆ పార్టీని మొండిగా అభిమానించే వారికి కూడా ఏష్టత కలుగుతోందని బుల్లి తెరలపై జనం బల్ల గుద్ది చెబుతున్నారు. ఇలాటి వారికా మనం వోట్లు వేసి గెలిపించిందని చీదరించుకునే పరిస్తితి ఏర్పడుతోందని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు పేర్కొన్నట్టు - రెండేళ్ళ క్రితం వరకు వడ్డించిన విస్తరి లాంటి కాంగ్రెస్ పరిస్తితి ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి చందాన తయారయింది.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు వ్యవధానం వున్నప్పుడు ఇలాటి అంశాలన్నీ చాలా అత్యల్ప విషయాలుగా ఆ పార్టీ భావిస్తూ వుండవచ్చు. కానీ శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక వెలువడిన దరిమిలా రాష్ట్రం లో - భవిష్యత్ రాజకీయ స్వరూప స్వభావాలు నేడున్న విధంగానే వుంటాయని అనుకోవడానికి వీలు లేదు.
‘కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతరం ముంచుకు వస్తుందని, ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ఇటు తెలంగాణలో టీ ఆర్ యస్, అటు సీమాంధ్ర లో జగన్ పెట్టబోయే పార్టీ - అన్ని స్తానాల్లో అద్భుత విజయాలను సాధిస్తాయనీ, ఆ ఉప్పెనలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందనీ టీ ఆర్ యస్ నేత చంద్రశేఖర రావు తాజాగా చెబుతున్న ‘రాజకీయ జోస్యం’ - కొత్త ఊహాగానాలకు రెక్కలు తొడుగుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలు పంపుతోంది.

‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తోందని’ తరచూ పేర్కొనే కాంగ్రెస్ నాయకులు – ఇటీవలి కాలంలో అధిష్టానం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణివల్ల పార్టీ పరిస్తితి మరింతగా దిగజారి పోతున్నదన్న వాస్తవాన్ని ఎందుకు ఢిల్లీ కి చేరవేయలేక పోతున్నారన్నది మరో యక్ష ప్రశ్నగా మిగిలిపోతోంది. (29-12-2010)

2 కామెంట్‌లు:

Vincent Raj చెప్పారు...

so nice sir

yes hi comand is very first criminal

Rao S Lakkaraju చెప్పారు...

ప్రస్తుత పరిస్థితి గురించి బాగా వ్రాసారు. నా బాధ అల్లా అందరూ కలిసి విద్యార్ధుల చదువులు చంకనాకేలా చేశారని.