6, సెప్టెంబర్ 2010, సోమవారం

రివైండ్ (పదహారో భాగం) - 2010



విన్నంతలో కన్నంతలో అమెరికా 
కుక్క ఒక్కటే ధర్మరాజు వెంట కడదాకా వెంటవుండి స్వర్గానికి వెళ్ళిందని ఇతిహాసం. అది ఎంతవరకు నిజమన్నది పక్కనపెడితే అమెరికా మాత్రం కుక్కలపాలిటి స్వర్గమనే చెప్పాలి. ‘ఛీ! ఏం బతుకు కుక్కబతుకు’ అని బాధపడే సీను అమెరికాలో లేదు. ఎందుకంటె ఈ దేశంలో కుక్కలది కుక్క బతుకు యెంత మాత్రం కాదు.ఒక రకంగా చూస్తె మనుషులే వాటి వైభోగం చూసి అసూయపడాల్సిన పరిస్తితి. అక్కడివారికి తెలుగు పాటలు వచ్చుంటే –‘పుడితే కుక్కయి పుట్టాలిరా!’ అని పాడుకుంటూ వుండేవారు.

శునక వైభోగం

కారణాలు తెలియవుకాని, అమెరికన్లకు కుక్కలంటే ప్రాణం. చాలామంది కుక్కల్ని సొంత పిల్లలకంటే ప్రేమగా పెంచుకుంటారు. వాటికి పెట్టే పేర్లు కూడా అలాగే వుంటాయి. ఒకాయన తన కుక్కకు ‘సర్’ (అంటే తెలుగులో “అయ్యగారు”) అని పేరుపెట్టుకుని కుక్క పట్ల తన భయభక్తులను చాటుకున్నాడు. ఆఫీసర్ మీద కోపంతో కుక్కకు అలా పేరుపెట్టి అక్కసు తీర్చుకున్నాడని గిట్టనివాళ్లంటారు.
ఇక్కడ కుక్కల పెంపకం చూస్తె తల తిరిగిపోతుంది.

వీటి కోసం -

 
నేనేం తక్కువ?

ప్రత్యేకమయిన సోపులు, షాంపూలు, వొంటి నూనెలు, దువ్వెనలు, హెయిర్ డ్రయర్లు, బాతు టబ్బులు, టవల్స్, పక్కబట్టలు, చలి దుస్తులు, చలవ అద్దాలు, రెడీమేడ్ ఫుడ్స్, బిస్కెట్లు (కుక్క బిస్కెట్లు అంటే అంటే వాటిని పెంచేవారికి ఎక్కడలేని కోపం ముంచుకొస్తుంది) ఆటవస్తువులు, గోళ్ళు కట్ చేసే కత్తెరలు, జుట్టు కత్తిరించే సెలూన్లు, వొళ్ళు వెచ్చపడితే చూపించడానికి క్లినిక్కులు, మందులు రాసిస్తే కొనుక్కోవడానికి విడిగా దుకాణాలు, కాలో చెయ్యో విరిగితే అందుకోసం ప్రత్యేకంగా డాక్టర్లు, ఆపరేషన్లు చేయాల్సివస్తే ప్రత్యెక ఆసుపత్రులు, వీటికోసం మళ్ళీ విడిగా ఇన్స్యూరెన్సులు ఒకటారెండా ఈ జాబితా చాంతాడంత వుంటుంది.

బస చేయడానికి స్టార్ హోటళ్లు

కుటుంబంతో వేరేవూళ్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు –వెంట వచ్చే పెంపుడు కుక్కలకోసం విడిగా ‘కుక్కల హోటళ్ళ’లో అకామడేషన్ బుక్ చేస్తారు. ఈ కుక్కల హోటళ్ళు ఆయా కుక్కల స్తాయికి తగినట్టుగా వుంటాయి. బాగా పెట్టిపుట్టిన కుక్కలు ఫైవ్ స్టార్ వసతులువున్న విడిదుల్లో మకాం చేస్తాయి. అక్కడ వుండే వసతులు అపూర్వం. అందుకోసం వసూలు చేసే చార్జీలు కూడా అనూహ్యం.

ఇలా నిద్రపుచ్చితే కాపలా కాసేది ఎవరట? 

ఇక, వూళ్ళో వున్నప్పుడు, ఉదయం సాయంత్రాలు పిల్లల్ని తీసుకువెళ్ళినట్టు – వెంటబెట్టుకుని వాహ్యాళికి తీసుకువెడతారు. ముందు తోకాడించుకుంటూ కుక్కగారు. వెనక చేతిలో ఒక ప్లాస్టిక్ సంచీతో యజమానిగారు.

ప్రేమంటే ఇదేరా!

దారిలో ఎక్కడయినా కుక్కగారికి కాలకృత్యాలు తీర్చుకోవాలని ముచ్చట వేస్తె ఏమీ మొహమాటపడకుండా- ఇతరేతర దేశాల్లోని తన సోదర కుక్కలమాదిరిగానే బహిరంగ ప్రదేశాల్లోనే బహిరంగంగా ఆ పని పూర్తి చేస్తుంది. దాని వెనుకే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చే యజమాని గారు తక్షణం చేతికి పని చెప్పి- శునకం విసర్జించిన ‘పదార్ధాన్ని’ చేతిసంచీలోకి ఎంతో జాగ్రత్తగా సేకరించి, వాహ్యాళి కార్యక్రమాన్ని యధావిధిగా - ప్రకటనల అనంతరం టీవీ సీరియల్ లాగా కొనసాగిస్తారు. అటువంటి అపూర్వ సందర్భాలలో భార్య కూడా వెంట వున్నా - సాధారణంగా భర్తగారే భక్తిప్రపతులతో ఈ పవిత్ర భాద్యతను నిర్వహిస్తూవుంటారు. పార్కుల్లో కూడా ఇదే దృశ్యం. పిల్లల్ని కన్నతల్లి ఓపక్క ఆడిస్తుంటే – మరో పక్క, కుక్కగారి పెంపుడు తండ్రి శునక సేవనంలో తరిస్తుంటాడు.

ఇవన్నీ చూసిన తరువాత ఎవరయినా ఒక విషయం ఒప్పుకోకతప్పదు.

ఏమాత్రం సిగ్గుపడకుండా , మొహమాటపడకుండా, నలుగురూ చూస్తున్నారన్న భేషజాలు లేకుండా ‘పసి పిల్లల విషయంలో కన్నతల్లులు చూపే ఆప్యాయత మాదిరిగా’ కానవచ్చే వారి ప్రవర్తన – కుక్కలపట్ల వారికున్న ప్రేమాభిమానాల్లో ఏమాత్రం కల్తీ లేదన్న స్వచ్చమయిన నిజాన్ని వెల్లడి చేస్తుంది.

దారి చూపే శునకమా!
సాధారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్ లో కుక్కలకు ప్రవేశం వుండదు. అయినా కొన్ని చోట్ల ఇవి దర్సనం ఇచ్చాయి. వాకబు చేస్తే తెలిసినదేమిటంటే – అవి గైడ్ డాగ్స్. దృష్టి లేని వారికి దోవచూపేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు అవి.

.....నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్

 చిన్నపిల్లలని అమ్మవొడి వంటి సెంటర్లలో వొదిలి వేసి - అమ్మానాన్నా ఉద్యోగాలకు వెళ్లినట్టు ఇక్కడ కుక్కపిల్లలు కనిపెట్టిచూసుకోవడానికి డే కేర్ సెంటర్లు  వున్నాయి.వాటి ఆలనా పాలనా చూసుకోవడమే కాకుండా వాటికి చక్కని శిక్షణ కూడా ఇస్తారు. పసి కూనల్ని అలా పంపించలేనివాళ్ళు ఏకంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంట్లోనే శిక్షణ ఇప్పిస్తారు. వాళ్ళు వారానికొకసారి వచ్చి ‘ఇంటికి తెలిసినవారు వచ్చినప్పుడు ఎలా మెలగాలి? పక్కింటి కుక్కతో ఎలా మెసలాలి?’ అనే విషయాలపై శిక్షణ ఇస్తారు. చీటికీ మాటికీ భౌ భౌ అంటూ మొరిగి గోలచేయకుండా మామంచి కుక్కలా ఎలా వొదిగి వుండాలో దగ్గరుండి నేర్పుతారు. కుక్కలకు మంచి నడవడిక బోధించడానికి మార్కెట్లో రకరకాల పుస్తకాలు లెక్కలేనన్ని దొరుకుతాయి. ఇవి కాక కుక్కలకు పెట్టాల్సిన ఆహారం ఎలాతయారు చేయాలి అనే అంశాలపై టీవీల్లో ప్రత్యెక కార్యక్రమాలు సరేసరి.

NOTE:All images in the blog are copyrighted to respecive owners  


2 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

మీరు కుక్కల పార్కులను గురించి వ్రాయలేదు. ఆడా మగా స్నేహ పెంపుదలకు మంచి ప్రదేశము.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

sorry - not with any intention - bhandaru srinivasrao