28, మార్చి 2010, ఆదివారం

శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)శాసన సభలు- ప్రత్యక్ష ప్రసారాలు  (వార్తావ్యాఖ్య - భండారు శ్రీనివాసరావు)


చాలా ఏళ్ళ క్రితం -
అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో  రేడియో, దూరదర్శన్ లలో ఒక రోజుముందు - 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే  శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో - ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు- ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాతగానీ ప్రసారం చేసేవాళ్ళు  కాదు. ఎందుకంటె ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన'  కిందికి వస్తుందన్న భయం అనండి  ఇంకేదన్నా అనండి - అన్ని జాగ్రత్తలు తీసుకునేలా జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను  శాసన సభలో-   తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి  రేడియో విలేకరిగా నా స్వానుభవం.  విమర్శలు, ప్రతి విమర్శలు ఒక  స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల - ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా - ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది. 
ఇక ప్రస్తుతానికి వస్తే-
టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసన సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని  ఆశపడ్డారు.అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు.  కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే - ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి - టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం. 
చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై  సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల  ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్ట సభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి వోటర్లకు వున్న  ఒకే ఒక అవకాశం ఈ  ప్రత్యక్ష ప్రసారాలే  అన్న అంశాన్ని మరువకూడదు.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదేసమయంలో -  సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే భాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి  కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌద పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.(28-03-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                                                      


Y

కామెంట్‌లు లేవు: