24, అక్టోబర్ 2024, గురువారం

కన్నకూతురు కాదు, కానీ కన్న బిడ్డే

కన్న కూతురు కాదు కానీ కన్న బిడ్డే! - భండారు శ్రీనివాసరావు 

జీవనయానంలో ఎంతో మంది తారసపడుతుంటారు. అయితే కొద్ది మందే యాదిలో వుంటారు.
ఈ అమ్మాయి అంకిత మా ఇంటికి వచ్చి ఏడాది అవుతోంది.
అప్పటికి నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.
అంచేత ఏదో కంపెనీని సంప్రదించి ఓ కేర్ టేకర్ అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు.  గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది. 
అయినా ఛాయిస్ నాది కాదు. 
మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని. 
ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.

ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు. 
నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బ తిన్నది. కనుచూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.
కొన్ని రోజులు గంటగంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.
ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.
ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.
అయితే ఒక విషయం చెప్పాలి. 
ఇంత మొండిపిల్లను నా జీవితంలో చూడలేదు. 
పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు. 
అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా అంటే ససేమిరా వినదు. హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ  ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది అంటుంది.
నేనే చెబుతున్నా కదా అన్నా వినదు. తాబట్టిన కుందేటికి  మూడే కాళ్ళు బాపతు.
ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.
సంక్రాంతి, దసరా వంటి పండుగలు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి అనితలతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు. 'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా ఆన్ని అవసరాలు మీరే చూసుకుంటున్నారు. ఓక వేయి నేను వుంచుకుని మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను' అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా. 
అందుకే ఆ అమ్మాయి ముట్టె పొగరుని సహిస్తూ, భరిస్తూ వచ్చాను. ఆమెకున్న ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ వచ్చాను.
 
ఈ నెలాఖరుతో కాంట్రాక్ట్ ముగుస్తోంది. నవంబరులో వాళ్ళ కులదేవత పూజలు అవీ వున్నాయి. నెల రోజులు వుండను, వూరికి పోతాను అని ఏడాది కిందట పనిలో చేరేటప్పుడే చెప్పింది. 
చంటి పిల్ల కోసం పెట్టుకున్న అమ్మాయి నా అవసరంలో నన్ను కంటికి రెప్పలా చూసుకుంది.
వెళ్ళిపోతోంది అంటే బాధగా వుంది. 
ఆ అమ్మాయి దిగే స్టేషన్ వచ్చింది. దిగిపోతోంది. మంచి జ్ఞాపకాలు మిగిల్చి పోతోంది. అంతే అనుకోవాలి.

పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.

ఈ పోస్టు అంకితకే అంకితం.

తోకటపా:
మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో  తాను వుంటే, అది ఎడిట్ చేసేదాకా వూరుకోదు. అంత మొండిఘటం.
నా స్నేహ బృందంలో ఒక్క Rajani Puccha గారు మాత్రమే ఈ అమ్మాయిని చూసారు.
కాకపోతే అంకిత INSTA లో వుంది.
అదీ ఎవరికోసం
మహేష్ బాబు కోసం.
తాను ఆ నటుడికి dhfm అంటే Die hard fan for Mahesh Babu ట.

23, అక్టోబర్ 2024, బుధవారం

అత్యాశ కాదంటారా



31-12-2005

నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయిన తేదీ ఇది.
అవీ ఇవీ అన్నీ కలిపి కొంత సొమ్ము రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద నా బ్యాంకు ఖాతాలో అదే రోజున జమచేసారు. అదే రిటైర్మెంట్ మర్నాడు జనవరి ఒకటిన అయివుంటే ఈ మొత్తం, నా పెన్షన్ రెండూ రెట్టింపు అయ్యేవేమో. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కనీవినీ ఎరుగని విధంగా  అప్పటి పే కమిషన్ పెంచిన సిఫారసులు 2006 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. పన్నెండు గంటల తేడాతో అంత గొప్ప శాశ్వత ఆర్థిక ప్రయోజనాన్ని నేను కోల్పోయాను. 
దీనికి ఎవరినీ తప్పుపట్ట లేము. ప్రాప్తం అంటారు. గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా, బిందె తీసుకువెళ్ళిన వాడికి బిందెడు నీళ్ళు, గిన్నె తీసుకువెళ్ళిన వాడికి గిన్నెడు నీళ్ళు. ఎంత ప్రాప్తం వుంటే అంతే.

ఉద్యోగం చేసినన్నాళ్ళు ప్రతినెలా ఇంటి ఖర్చుల కోసం ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంతో కొంత తీసుకునేవాడిని. అవన్నీ లెక్కకట్టి నీకు ఇవ్వాల్సింది ఇంతే అని లెక్క తేల్చారు. చివరి పదేళ్లు స్టేట్ గవర్నమెంట్ క్వార్టర్ లో వున్నా కనుక ఆ పదేళ్ల అద్దె బకాయిలు, మంచి నీళ్ళ సరఫరా బకాయిలు ఒకే మారు మినహాయించారు. అలాగే ఉద్యోగ పర్వంలో కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ అధికారిని అనే గర్వంతో తెలిసీ తెలియకుండా ఇతరులకు పూచీకత్తు సంతకాలు పెట్టి  ఇప్పించిన అప్పు బకాయిలు ఇవన్నీ పోను రెండు లక్షలు తేల్చారు . నాకయితే అంత పెద్ద మొత్తం కళ్ళ చూడడం జీవితంలో అదే మొదటిసారి. రిటైర్ అవడంలో ఇంత ఆనందం వున్నదా అని తొలిసారి అనిపించింది కూడా అప్పుడే.
ఇంటికి రాగానే ముందు మా ఆవిడకు చెప్పాను. రేపు రెడీగా వుండు బయటకు పోదాం అని. మర్నాడు ఆటోలో పంజాగుట్ట సర్కిల్ లోని ఓ నగల దుకాణానికి తీసుకువెళ్లాను. వెళ్లి చాలా గొప్పగా, పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నాను. లక్ష రూపాయలు ఖరీదు చేసే ఏ నగ అయినా కొనుక్కో అన్నాను.
ఆమె పది నిమిషాల్లో పదివేలు ఖరీదు చేసే ఒక ఉంగరం కొని నా చేతికి తొడిగింది. 
నీకు ఏమీ అక్కరలేదా అన్నాను.
" మీకొక ఉంగరం కొనాలి అనేది నా చిరకాల కోరిక. ఒకసారి కొంటే మీరు రైల్లో పారేసుకున్నారు. అందుకే ఈ ఉంగరం. మీ చేతికి వుంటే నాకు వున్నట్టే."

బుర్ర తిరగడం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది.
మా ఆవిడ అమ్మగారి తాలూకు బంగారం అంతా ఇన్నేళ్ల కాపురంలో నేను హారతి కర్పూరం చేసాను. అయినా అదేమీ పట్టించుకోకుండా నాకు ఉంగరం కొన్నది.
బుర్ర తిరక్క ఏమవుతుంది.

ఇప్పటికీ ఆ ఉంగరం వుంది. నా వేలుకి లేదు. మనసులో వుంది. 
ఆమె పోయినప్పటినుంచి దాన్ని వేలుకి పెట్టుకోవాలి అంటే మనస్సు చివుక్కుమంటుంది.
అలా కాకపోతే నేను మనిషినే కాదు.

తోకటపా :
నాకు ముగ్గురు మనుమరాళ్ళు. ఎవరో ఒకరి వేలికి ఆ బామ్మ ఉంగరం సరిపోయేదాకా నేను వుండాలని మరో కోరిక.
ఇప్పుడే 79 లో పడ్డాను.
మరీ అంత అత్యాశా!

14, అక్టోబర్ 2024, సోమవారం

అతి వర్జయేత్!

పొద్దున సాక్షిలో చదివాను. నేను చదివే మరో రెండు ప్రధాన పత్రికల్లో  కనపడలేదు. 

చాలా కాలంగా నేను చెబుతోంది ఇదే. పదవిలోకి రాగానే తమ చుట్టూ వలయంలా ఏర్పడే భద్రతా సిబ్బంది వల్ల ఎంతటి రక్షణ లభిస్తుందో తెలియదు కానీ, వారివల్ల నాయకులకు చెడ్డ పేరు రావడానికి అవకాశాలు ఎక్కువ.

పాత తరం వయోధిక పాత్రికేయులు ఇటువంటి వేడుకలకు  ఆహ్వానం లేకుండా వెళ్ళరు. ఈ తరం పోలీసులకు వారెవ్వరూ తెలియదు. పిలిచిన వాళ్ళే బాధ్యత తీసుకోవడం సముచితంగా ఉంటుంది.

 గతంలో పత్రికల వారిపట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు మా కాలంలో నేను ఎరుగుదును.
కానీ ఆ మంచి కాలానికి కాలం చెల్లింది.
వారిద్దరూ, మాడభూషి శ్రీధర్, పాశం యాదగిరి వయసు రీత్యానే కాకుండా వృత్తి రీత్యా కూడా ఈ పాత్రికేయ రంగంలో పెద్దవారు. భౌతిక గాయాల నుంచి కోలుకోవచ్చు కానీ, ఇలాంటి సందర్భాలలో  మానసిక గాయాల నుంచి కోలుకోవడం కష్టం.
ఈ ఘటనను ఖండిస్తున్నాం అనేది చిన్న మాట.
పునరావృతం కానివ్వం అనేది ఏలికల షరా మామూలు మాట.
ఇంతకంటే ఏం చెప్పను?

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు



ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి  సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టి, సెట్లో  వెనుక ‘హీరో’ అనో ‘హీరోయిన్’ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ దృష్టిలో పెట్టుకొని, ముందు చూపుతో వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.

యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు. ఆ రోజుల్లో ఆ సీట్లో కూర్చుని ప్రయాణం చేయడం ఒక హోదాగా భావించేవారు.

ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి  శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  ‘అమ్మ’   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేవారు.
 అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడంలో నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూం, బెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.

ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే, దారివెంట ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చెయ్యడానికి  ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.

12, అక్టోబర్ 2024, శనివారం

అటు నేనే ఇటు నేనే



హాలీవుడ్ చిత్రాలను తలదన్నే రీతిలో గతంలో ఎప్పుడో కెమెరా పనితనం ప్రదర్శించే చిత్రాలను తెలుగులో తీశారు అనే మాటను ఈ నెట్ యుగపు పిల్లలు నమ్ముతారా! 
అలా నమ్మని పిల్లలకు మాయా బజార్ సినిమాని బలవంతంగా అయినా చూపించాలి.

ఈటీవీ లో వస్తున్న ఈ సినిమాను ఒంటరిగా చూస్తున్నాను. చూడాల్సిన వాళ్ళు మొబైల్ లో వీడియోలు చూస్తున్నట్టున్నారు!
ఇదో విషాదం!

11, అక్టోబర్ 2024, శుక్రవారం

గుడ్డుగారికో రోజు



ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.
అక్టోబర్ నెలలో రెండో శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం అంటున్నారు. 
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపోయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని ఫ్రిజ్ లో పడుకునేది ఆ కోడిగుడ్డే. మేము  తిన్నా తినకపోయినా, ఇంటికి వచ్చిన (నా) నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి వుంచేది. 
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. అటువంటి భీకర భీభత్స దృశ్యాలు చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.

అసలు కోడి గుడ్డు అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఆయనే  బీ.వీ. రావు (బి.వాసుదేవరావు, ఇప్పుడు లేరనుకోండి). తెలంగాణాకు చెందిన ఈ పెద్దమనిషి వెంకటేశ్వరా హేచరీస్ అనే పరిశ్రమను స్థాపించి కోడిగుడ్డుకు ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. మేము మాస్కోలో ఉన్నరోజుల్లో నాటి సోవియట్ ప్రభుత్వ అతిథి హోదాలో ఆయన  రష్యా వచ్చారు. ఓరోజు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి భోజనం చేసి వెళ్ళారు. తర్వాత మేము ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కూడా గుర్తు  పెట్టుకుని మా పిల్లలు ఇద్దర్నీ పూనాలో వున్న తమ స్టడ్ ఫాం కు తీసుకువెళ్ళారు. అదో సంగతి.   
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడిగుడ్డుకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడిగుడ్డు చేసుకున్న పూర్వజన్మ  సుకృతం.
గుడ్డుగా వున్నప్పుడూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తూ  త్యాగంలో బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గా వేసుకుని నోరారా తినడం తప్ప అంటారు కొందరు ఎగ్గేరియన్లు.

9, అక్టోబర్ 2024, బుధవారం

డ్రైవర్ లేని కారు

 

కొత్త ఏదైనా కొంత కాలం వింతే! - భండారు శ్రీనివాసరావు

 

మొన్న అమెరికా వెళ్ళినప్పుడు మా మూడో అన్నయ్య కనిష్ట కుమారుడు సత్యసాయి ఇంట్లో కొన్నాళ్ళు వున్నాను.  వాడి కొడుకు శైలేష్ అక్కడ వున్నన్ని రోజులు నన్ను వాళ్ళ కారులో తిప్పాడు.

ఆ కారుకు డ్రైవర్ అవసరం వుండదు. అన్నీ కంప్యూటరే చూసుకుంటుంది. కారెక్కి ఎక్కడికి వెళ్ళాలో సంకేతాలు ఇస్తే చాలు, అదే నిర్దేశిత ప్రదేశానికి తీసుకువెడుతుంది. ప్రపంచం మొత్తంలో అత్యధిక సంపన్నుడు  ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా తయారు చేసిన కారు ఇది. స్టీరింగ్ పట్టుకుని, క్లచ్ లు మారుస్తూ, బ్రేకులు వేస్తూ నడపాల్సిన అవసరం వుండదు. అవన్నీ కారులో అమర్చిన  కంప్యూటర్ బాధ్యతలు. కారుకు  అన్ని వైపులా అమర్చిన సెన్సార్లు, కెమెరాలు  అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. ముందు వెళ్ళే కారు ఎంత వేగంలో వెడుతున్నది, వెనక వచ్చే కారు ఎంత దూరంలో, ఎంత వేగంతో వస్తున్నది,  ఇరుపక్కల నుంచి ఏయే వాహనాలు ఎంత వేగంగా దూసుకు వస్తున్నది అదే గమనించి, తదనుగుణంగా తన గమనాన్ని,  వేగాన్ని  సర్దుబాటు చేసుకుంటుంది. సాధారణంగా మనకు ముందు వెళ్ళే కారు మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ కారుకు వున్న కెమెరా కళ్ళు, ముందు కారునే కాకుండా దాని ముందున్న వాహనాల వేగాన్ని, రోడ్డు పరిస్థితులను ఒక కంట కనిపెడుతుంటాయి.  స్పీడ్ పరిమితులకు తగ్గట్టుగా  కారే తనకు తానుగా వేగాన్ని పెంచుకుంటుంది. అవసరం అయితే తగ్గించుకుంటుంది. వేగ పరిమితులను మించి వాహనం నడుపుతున్నారని పోలీసులు చలానాలు విధించే ఆస్కారం ఉండదు.  ఇంజిన్ వుండదు కాబట్టి ముందూ వెనకా రెండు డిక్కీలు. పెట్రోలు అవసరం లేదు. పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇంధనం పొదుపు కాబట్టి కారు ఖరీదులో  ప్రభుత్వ రాయితీ కూడా లభిస్తుంది.

అయితే నేను విన్నదాన్ని బట్టి,  అమెరికాలో చాలామంది ఈ కారును వాడుతున్నప్పటికీ ఈ కారు ఇంకా  ప్రయోగాత్మక దశలోనే వుంది. లైసెన్స్ వున్న వ్యక్తి కారులో వుండడం తప్పనిసరి.

ఈ కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సామాన్యుడు కాదు. ప్రపంచ కుబేరుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం  ప్రెసిడెంట్ పదవికి మరోసారి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఇటీవల పాల్గొన్న ఎన్నికల సభలో వేదిక మీద నృత్యం చేసిన ఘనుడు.

ఈ టెస్లా కారు విషయంలో ఆయనకు ఎన్నో విప్లవాత్మక ఆలోచనలు వున్నట్టు చెబుతారు.

అవన్నీ సాకారం అయితే ప్రస్తుత మోటారు కార్ల పరిశ్రమ స్థితిగతులు సంపూర్ణంగా మారిపోతాయి. ఎవరికీ డ్రైవర్ అవసరం వుండదు. అసలు కారు అవసరమే వుండక పోవచ్చు. ఉబెర్ ఓలా వంటి సంస్థలకు స్వర్ణ యుగం రావచ్చు. ఫోను చేయగానే రమ్మన్న చోటుకు కారు దానంతట అదే చెప్పిన సమయానికి  వస్తుంది. పోవాలని అనుకున్న చోటుకు అదే తీసుకు వెడుతుంది. పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. ఎక్కడ పార్కింగ్ ఖాలీ వుందో అక్కడికి వెళ్లి పక్క వాహనాలను తాకకుండా అదే పార్క్ చేసుకుంటుంది. మందు బాబులను పట్టుకోవడానికి  నోట్లో గొట్టాలు పెట్టి ఊదాల్సిన శ్రమ ట్రాఫిక్ పోలీసులకు తప్పుతుంది.  రోడ్డు ప్రమాదాలు చాలావరకు తగ్గిపోతాయి. ఇంధనం కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇన్ని లాభాలు, ప్రయోజనాలు వున్నాయి కనుకే, అందరి కళ్ళు ఈ కార్ల మీదే వుంది. అయితే పోటాపోటీ కాటా కుస్తీలకి దిగే మోటారు కార్ల తయారీ రంగం పెద్దల లాబీ చేతులు కట్టుకు కూర్చ్గుంటుందా ! ఈ రంగంలోని పెత్తందారులు అందరూ,  సంపదలో ఎలాన్ మస్క్ తో పోటీ పడలేకపోయినా, అంతో ఇంతో కుబేరులే. ప్రభుత్వాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా శాసించగల ధీరులే!

ప్రపంచ కుబేరుడు కనుక మస్క్ మాటే  చెల్లుబాటు అవుతుందేమో!

కార్పొరేట్ ప్రపంచంలో రాజకీయాలు, అసలు రాజకీయరంగంలోని రాజకీయాల కన్నా దారుణమైనవి, తమ ఎత్తులతో ప్రత్యర్థి కుత్తుకలను కత్తిరించే నిర్దాక్షిణ్యం ఆ రంగంలో సర్వసాధారణం.  అమెరికాలో అయితే మరీ.

Below photo:

Tesla Driverless Car, Courtesy Image Owner 


 


08-10-2024