12, సెప్టెంబర్ 2024, గురువారం

సీతారాం ఏచూరి ఇక లేరు

ప్రముఖ మార్క్సిస్టు కమ్యూనిస్టు యోధుడు శ్రీ సీతారాం ఏచూరి ఇక లేరు. 72 సంవత్సరాలు పెద్ద వయసేమీ కాదు ఈ రోజుల్లో. 
తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన కొద్దిమంది ఈ తరం రాజకీయ నాయకులలో ఒకరు. రేడియో విలేకరిగా అనేక సార్లు వారిని కలుసుకునే అవకాశాలు దొరికినప్పటికీ, కాసింత తీరిగ్గా కబుర్లు చెప్పుకునే వీలు 
డాక్టర్ గోపాల్ కుమారుడి వివాహసందర్భంగా ఇచ్చిన రిసెప్షన్ లో దొరికింది. ఆ రాత్రి కూడా ఆయన ఢిల్లీ వెళ్లే ఫ్లయిట్ అందుకునే హడావిడిలో ఉన్నారు. డాక్టర్ గోపాల్, సీతారాం ఇద్దరూ క్లాస్ మేట్స్.

కింది ఫొటో:
 వేదిక:  సికిందరాబాదు సెయిలింగ్ క్లబ్   
ఎడమ నుంచి కుడికి : నేను, జ్వాలా నరసింహా రావు (అప్పట్లో తెలంగాణా సీఎం సీపి ఆర్వో),  సీతారాం ఏచూరి (ప్రత్యేక పరిచయం అవసరం లేదు) డాక్టర్ గోపాల్, డాక్టర్ భరత్, గీత రామస్వామి( హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చైర్ పర్సన్)


ఫొటో కర్టసీ:
 Bharath BabuDr

11, సెప్టెంబర్ 2024, బుధవారం

బిగ్ డిబేట్



అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ప్రస్తుతం జరుగుతున్న టీవీ డిబేట్ ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తిలకిస్తున్నారని అంచనా. 
ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా ఆధిపత్య భావాలు కలిగివుండే అమెరికా అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నవంబరులో జరగనున్న నేపథ్యంలో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనడం అతి సహజం. 
అమెరికన్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ ఘడియ రానే వచ్చింది. ముందు ప్రకటించిన సమయం ప్రకారం,  డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి Ms. కమలా హారిస్ (59) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వేదిక పైకి వచ్చి చెరో వైపు నిలబడ్డారు. రాగానే,  కమలా హారిస్ మందహాసం చేసుకుంటూ, ట్రంప్ నిలబడిన వైపు చకచకా నడుచుకుంటూ వెళ్ళి కరచాలనం కోసం చేయి చాపి, (అయామ్) కమలా హారిస్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నారు. ఒకప్పుడు ఆమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమలా హారిస్ ఇలా ఎదురు పడిన సందర్భం ఇదే మొదటి సారి అని తెలుస్తోంది.
డిబేట్ ఇంకా కొనసాగుతోంది. ప్రజాభిప్రాయాన్ని మలుపు తిప్పడంలో ఈ డిబేట్ అత్యంత క్రియాశీలకం అని అంటారు. అభ్యర్థులు మాట్లాడుతున్న తీరు, వారి హావ భావాలు, తమ విధానాలను వివరించే విధానం కూడా కీలకం అంటారు. 
రెండు గంటలకు పైగా సాగే ఈ కార్యక్రమంలో ఇంతవరకు చర్చ ప్రశాంతంగానే జరుగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు ట్రంప్ కేంద్ర బిందువు అనే పేరు వుంది కనుక వీక్షకులకి ఈ డిబేట్ పట్ల ప్రత్యేక ఆసక్తి.
ట్రంప్ మాట్లాడుతున్నప్పడు కమలా హారిస్ ఆయననే చూస్తూ వుండడం, ట్రంప్ మాత్రం ఆవిడ వైపు చూడకుండా తనదైన ధోరణిలో మాట్లాడడం ఇంతవరకు నేను గమనించిన విశేషం.
(7 PM, Seattle)

10, సెప్టెంబర్ 2024, మంగళవారం

దరిద్రం ఎలా వుంటుంది?



(2012 లో  హిందూ పత్రికలో వచ్చిన కధనానికి నా స్వేచ్చానువాదం)

చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ  కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు  ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్  హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ‘ఇండియా దటీజ్ భారత్’ కు తిరిగిరావాలని చిరకాల  కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ‘ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి  ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టం లేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా  రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారిని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. ‘అదెలా సాధ్యం ?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. ‘అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నది’ కలిగిన కుటుంబంలో పుట్టిన  వారికి కలిగిన మరో  ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని  బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500  రూపాయలు. అంటే రోజుకు  నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు.  దేశ జనాభాలో 75  శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం  వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి  మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది.
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించు కోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి,వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయం పాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే  పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు.  అయిదు కిలోమీటర్లకు  మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు.  అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట  వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే  చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండి పోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని  ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26  రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ,  ఇవే వారి రోజువారీ ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా  వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే  వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి ‘దరిద్రంలో బతకడం’ అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.                   

అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
‘మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో ‘విందు భోజనం’ ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ, అభిమానం,ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
‘కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు  ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల  మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
‘మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ ఆగర్భ దారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితులనడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.     
‘ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
‘ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
‘మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
‘స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
‘సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం  మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా? మానవ కల్పితమా?
‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
‘చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
‘ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు  మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మేమే. అంటే  మనమే. అన్నింటికన్నా  ముందు చేయాల్సిన పని ఏమిటంటే, మనలో వున్న  ‘ఈ పేదరికాన్ని’ రూపుమాపుకోవడం. (12-08-2012)

9, సెప్టెంబర్ 2024, సోమవారం

అరాచకోపాఖ్యానం

అరాచకోపాఖ్యానం - భండారు శ్రీనివాసరావు 

" నువ్విక్కడ మాట్లాడకుండా బతక లేవు. రేపక్కడ ( మాస్కోలో) మాట్లాడితే బతక లేవు. ఎలా మరి?"
37 సంవత్సరాల క్రితం రేడియో మాస్కోలో పనిచేసేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరే ముందు నా తత్వం బాగా తెలిసిన మిత్రుడు ఒకడు అన్న మాట. (సోవియట్ యూనియన్ అంటే ఇనుపతెర దేశం అనే  విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ చెప్పిన మాట అది)
కానీ నా తత్వం గురించి చెప్పాను కదా! రూల్ అంటే అతిక్రమించడం. రూలు పాటించక పోతే ఎలా బతుకుతావు అనేది నా మిత్రుడు సున్నితంగా చేసిన హెచ్చరిక సారాంశం. 
అక్కడకు అంటే మాస్కో చేరిన తర్వాత చూస్తే పరిస్థితులు అలాగే వున్నాయి. మెట్రోల్లో, బస్సుల్లో, ట్రాముల్లో ఎక్కడ చూసినా నీరవ నిశ్శబ్దం. ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. మెట్రో ఎక్కగానే ఏదో పత్రికో, పుస్తకమో పట్టుకు కూర్చుంటారు. తమ స్టాపు రాగానే నిశ్శబ్ధంగా దిగిపోతారు. 
మేము నివాసం వుండే భవనంలో మాస్కో రేడియోలో పనిచేసే ఇతర భారతీయ భాషల న్యూస్ రీడర్స్ కూడా కాపురాలు వుంటారు. మొదట్లో అందరం కలిసే ఆఫీసుకు వెళ్ళే వాళ్ళం. వాళ్ళందరూ నియమాలు తు చ తప్పకుండా పాటించే రకం. పదింటికి ఆఫీసులో వుండాలి అంటే ఓ అయిదు నిమిషాలు ముందే వెళ్ళే వాళ్ళు. అందరం చేయాల్సిన పని ఒక్కటే. రేడియో అధికారులు బులెటిన్ ఇంగ్లీషులో తయారు చేసి తలా ఒక కాపీ ఇస్తారు. ఎవరి భాషల్లో వాళ్ళు దాన్ని తర్జుమా చేసి, స్టూడియోకి వెళ్లి చదవాలి. ఓ అరగంట వార్తలు, మరో అరగంట సర్కారు వారి విధివిధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి సుదీర్ఘ వివరణలు. ఈ గంట ప్రోగ్రాముకు మూడు గంటలు ముందు పోవడం ఎందుకు అనిపించి వార్తల టైముకి గంట ముందు పోయేవాడిని. దీనికి రెండు కారణాలు. ఒకటి ఆలస్యంగా లేచే అలవాటు. రెండోది ఇంటి భోజనం తప్ప బయట తినలేని బలహీనత. రేడియో క్యాంటీన్ లో మంచి భోజనం దొరుకుతుంది. కానీ నాకు సయించేది కాదు. నిజానికి ఇవన్నీ నా సమస్యలు. రేడియో వారికి ఏం సంబంధం? 
కానీ నా పద్ధతి నాది.
గీర్మన్ అని నాకు ఒక రష్యన్ సహాయకుడు వుండే వాడు. పది గంటలకు నేను సీట్లో కనబడకపోతే కంగారుగా ఇంటికి ఫోను చేసే వాడు. 
" మీరు ఇంకను రేడియోలో ప్రవేశించ లేదు. సమయము అవధి దాటుతుంది " అనేవాడు వచ్చీరాని తెలుగులో.
 " నేను టైముకి రావాలా? లేక టైముకి వార్తలు ప్రసారం కావాలా? " అని ఎదురు ప్రశ్నించే వాడిని.
కొన్నాళ్ళకు అతడికే బోధ పడింది, నేను ఎంత ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళినా అనువాదం పని పూర్తి చేసుకుని కరక్టుగా టైముకి వార్తలు చదవగలనని.
బెజవాడ ఆంధ్ర జ్యోతిలో కాలాలకు కాలాలు, పేజీలకు పేజీలు అనువాదం చేసిన అనుభవం రేడియో మాస్కోలో నాకు ఉపయోగపడింది.
నాకు అర్ధం కానిది ఒక్కటే, రూలు ప్రకారం నడిచే ఆ దేశంలో నా అరాచకాన్ని ఎలా అనుమతించారని.

క్వాలిటీ ఒకటే ధరలే వేరు

 

మొన్న మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, ఓటీటీ లో ఓ అర్థం కాని సినిమా చూసిన తర్వాత బయటకి పోదాం అన్నారు. కారు డిక్కీలో చాలా సామాను సదిరారు. 
ఇంటికి తిరిగి వచ్చేసరికి పొద్దు పోతుందేమో అనుకున్నా. పైగా శుక్రవారం సాయంత్రం కూడా.
నేరుగా ఒకచోటికి వెళ్ళాము. అక్కడ వరుసగా కార్లు ఆగి ఉన్నాయి. వాటి నుంచి ఏవో సామాన్లు దింపుతున్నారు.
మా వంతు వచ్చింది. డిక్కీ నుంచి ఇంటి నుంచి తెచ్చిన సామాగ్రి అంటే అంతగా వాడని షూస్, కోట్లు, దుస్తులు, పిల్లల బొమ్మలు, డెకొరేటివ్   గాజు వస్తువులు ఇలా ఎన్నో రకాలు.
తర్వాత పక్కనే వున్న GOOD WILL మాల్ లోకి వెళ్ళాము. అక్కడ లేని వస్తువు అంటూ లేదు. అవన్నీ నగర పౌరులు తమకు అట్టే ఉపయోగపడని, అవసరంలో వున్నవారికి ఇవ్వడానికి వీలుగా డొనేట్ చేస్తారు. గుడ్ విల్ కంపెనీ వాటిని శుభ్రం చేసి, కొత్త వాటికి ఏమాత్రం తీసిపోకుండా వున్న క్వాలిటీతో, అవసరం వున్నవారికి అతి తక్కువ ధరకి విక్రయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఈ ఏర్పాటు. కంపెనీకి వచ్చిన ఆదాయాన్ని ఛారిటీకి ఇస్తారు. చాలా చౌకగా దొరికే ఈ షాపులో కొనుగోళ్లు చేయడానికి విరగబడతారని అనుకున్నా కానీ నా అభిప్రాయం తప్పయింది. 
బయటకు వస్తున్నప్పుడు మా వాడు ఒక మాట చెప్పాడు, ఇన్నేళ్లుగా ఇక్కడ వుంటున్నా కూడా ఈ మాల్ లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అనీ, మీరు రాసుకోవడానికి ఏదైనా మ్యాటర్ దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో తీసుకు వచ్చాను అని. 
తరువాత మార్షల్స్ అనే ఓ పెద్ద దుకాణానికి వెళ్ళాము. సైజులో కానీ, వస్తువుల లభ్యతలో కానీ, నాణ్యతలో కానీ, సిబ్బంది వ్యవహార శైలిలో కానీ రెండు మాల్స్ లో ఎలాంటి తేడా కనపడలేదు, ఒక్క ధరవరల విషయంలో తప్పిస్తే.

తోక టపా:
ముప్పయ్యేళ్ళ క్రితం మేము మాస్కో వెళ్ళినప్పుడు రేడియో మాస్కో వాళ్ళే ఇల్లు, ఇంటికి కావాల్సిన సామాను అన్నీ సమకూర్చారు. కొంత కాలం గడిచిన తర్వాత ఎంత కాలం ఈ పాత సామాను అనుకుని ముందు ఒక ఫ్రిజ్ కొన్నాము. మాస్కో పోయేంతవరకూ మాకు ఫ్రిజ్ లేదు. అక్కడ ప్రతీదీ కారు చవకే కాబట్టి అలా వెళ్లి ఇలా కొనేసాము. కొన్న తర్వాత పాత ఫ్రిజ్ ఏం చేయాలనే మీమాంస ఎదురయింది. మాస్కో రేడియో వాళ్ళు రిటర్న్ చేయక్కర లేదన్నారు. ఆ అపార్ట్ మెంట్లో ఏదైనా సమస్యలు ఎదురయితే వచ్చి బాగు చేయడానికి ఒక మనిషి వున్నాడు. అతడిని పిలిచి ఫ్రిజ్ తీసుకోమని అంటే అతడు మమ్మల్ని ఎగాదిగా చూసి, డస్ట్ బిన్ లో  పడేయమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఎంత ఖరీదు అయిన వస్తువు అయినా కూడా ఉచితంగా ఇస్తే ఎవరూ తీసుకోరని అర్థం అయింది.

కింది ఫోటోలు:
మొదటి రెండు GOOD WILL MALL
చివరి రెండు
MARSHAL'S MALL

జేసీబీ



ఈ మధ్య  ఎక్కువగా వినపడుతున్న పదం జేసీబీ. (JCB). మట్టి గుట్టలను తవ్వే ఒక భారీ యంత్రం. కానీ ప్రస్తుతం దీన్ని అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను కూల్చడానికి ఉపయోగిస్తున్నారు. అదిగో పులి అంటే జనాలు భయపడినట్టు, జేసీబి కనపడగానే హైదరాబాదులో కొందరు కాలనీ వాసులు ఉలిక్కి పడుతున్నారు. 
ఇంతకీ జేసీబీ అంటే ఏమిటి అర్థం? 
ట్రాక్టర్ అంటే పొలాలు దున్నే యంత్రం. మరి జెసీబీ అంటే కూల్చే యంత్రమా! ప్రస్తుతానికి అదే అర్థంలో ఈ పదాన్ని అర్థం చేసుకుంటున్నారు.
నిజానికి JCB అంటే: 
Joseph Cyril Bomford 

ఈ పేరు కలిగిన ఒక ఆంగ్లేయుడు ఇంగ్లాండ్ లో 1945 లో ఈ యంత్రాలు తయారు చేసే కర్మాగారాన్ని తన పేరుతో నెలకొల్పాడు.
ఆ పేరుతోనే ఈ యంత్రాలు ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలోకి వచ్చాయి.
ఒక్కొక్కటి సుమారు నలభై, యాభయ్ లక్షలు ఖరీదు చేసే ఈ జేసీబీలు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి.

ఫోనుంటే తోడున్నట్టే..

ఫోనుంటే తోడున్నట్టే..

కాలం ఎంత మారింది. ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు నా కాలక్షేపం కోసం తెలుగు టీవీ ఛానెళ్లు వచ్చేలా డిష్ టీవీ పెట్టించారు. ఇప్పుడు అలాంటి ప్రయాసలు ఏమీ అక్కర్లేదు. 
అయినా మొబైల్ తోనే సర్వస్వం అన్నట్టు తయారయింది నేటి పరిస్థితి. 
పెద్ద పెద్ద టీవీలు ప్రతి గదిలో వున్నాయి కానీ ఓటీటీలకే పరిమితం.