3, డిసెంబర్ 2022, శనివారం

ఆఖరి ప్రయాణానికి అంతా సిద్ధం.

 పుట్టినప్పుడే టిక్కెట్టు కొన్నాను, ఏం లాభం అంత ముందుగానే కొన్నా, ఆర్ ఏ సీ పొమ్మన్నారు. రైలు బయలు దేరడానికి కొద్ది ముందుగా వచ్చి ఎవరైనా కేన్సిల్ చేసుకుంటే ఆ బర్త్ ఖాయం చేస్తారుట. చాలా కాలం వెయిట్ చేసి ఇక లాభం లేదనుకుని ప్రతి రోజూ వెళ్లి నా అదృష్టం పరీక్షించుకుంటున్నాను. ఏం లాభం. ఎక్కడెక్కడి వాళ్ళో వస్తున్నారు. నాకంటే ముందే రైలు ఎక్కుతున్నారు. ఎలా అంటే అదేదో ఈ క్యూ అంటారు. అదేదో తెలియకే ఇన్నాళ్ళు ఇలా ప్లాట్ ఫారం మీదే గడ్డాలు పెంచుకుంటూ వేచి వున్నాను. వెంట తీసుకువెళ్ళే లగేజ్ లేదు, అదో అదృష్టం. నేనొక్కడినే కాదు. ఎక్కడ చూసినా అదే జనం. వారిలో కొందరికి ఎలాగైనా రైలు ఎక్కాలని వుంది. కొందరికి ఈ రైలు తప్పిపోతే బాగుండు అనిపిస్తోంది.

 కానీ రైలు రావడం, బెర్త్ కన్ఫర్మ్ కావడం ఎవరి చేతిలో లేదుగా!

(ఈ రాతలు ఇప్పుడు పిచ్చిగా అనిపించినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచిగా అనిపిస్తాయి, జీవితం అంటే అదే!, నేనూ అలాగే అనుకున్నాను వయసులో వున్నప్పుడు)

03-12-2022

ఆగిపోయిన దరహాసం – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు  శనివారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి ముందు వరండాలో (మామూలుగా అపార్ట్ మెంట్ కల్చర్ లో వరండాకు వీలుండదు, కానీ ఏరికోరి ఆ ఏర్పాటు చేసుకున్నాడు) కుర్చీలో కూర్చుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు మా మేనల్లుడు కౌటూరి దుర్గా ప్రసాద్. అలా మాట్లాడుతూనే ఓ పక్కకు ఒరిగిపోయాడు. దగ్గరలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు కానీ ఫలితం దక్కలేదు. ఏకాదశి పుణ్య తిధినాడు అనాయాసంగా కన్ను మూశాడు నా మేనల్లుడు, ఆప్త మిత్రుడు పెద్దబాబు. పెద్ద బాబు ఇక లేడు అనే వార్తతో ఇంటిల్లిపాదీ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.

నాకంటే వయసులో చాలా చిన్న. కానీ ఆ చిన్నవయసులోనే ఒక మనిషి సాధారణ  జీవితంలో ఏమి సాధించవచ్చో అన్నీ సాధించే ప్రయత్నం చేశాడు.

డిగ్రీ పాసవుతూనే ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం, ఏడాది తిరగకుండానే ఖమ్మం నాగార్జున గ్రామీణ బ్యాంకులో ఆఫీసరు కొలువు, అది వదిలేసి ప్లీడరు ప్రాక్టీసు, ఆ పిదప రాజకీయ రంగ ప్రవేశం, జలగం వెంగళరావుకు అత్యంత ఆత్మీయుడుగా మారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరో అవతారం, ఢిల్లీ దాకా వెళ్లి నానా ప్రయాస పడినా అసాధ్యం అనుకునే  కాంగ్రెస్ టిక్కెట్టు, అదీ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇంటికే వచ్చి వొళ్ళో పడడం, రాజకీయం రంగూ రుచీ వాసనా తెలియని వయసులో అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం  అలా అన్నీ పాతిక ముప్పయి వయసు లోపలే జరిగిపోయాయి.

ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి దుర్గాప్రసాద్  ప్రత్యక్ష సాక్షి. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  

ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?

ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది.


(కౌటూరి దుర్గాప్రసాద్)


 

రాజకీయాల్లో ఆటుపోట్లన్నీ తట్టుకుని నిబ్బరంగా నిలబడ్డాడు. అందులో పైకి రాలేకపోయినా మొత్తం కుటుంబానికి మంచీచెడూ కనుక్కునే పెద్ద దిక్కుగా మారాడు.  

తనపై తనకు అంతులేని ఆత్మ విశ్వాసం, దాన్ని వ్యక్తీకరిస్తున్నట్టు ఎన్నడూ చెరగని దరహాసం. పెద్దబాబును చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేసేది, ఒక్కోసారి భయం వేసేది. చాలాసార్లు  ధైర్యం కలిగేది.

ఎవరు ఏ సమస్యలో వున్నా సరే, అదో సమస్యా అని తేలిగ్గా అంటూ మనసుల్ని తేలిపరిచేవాడు. తనకు చేతనైన సాయం అడగకుండానే చేసేవాడు. తన సమస్యలను ఎవరి వద్దా ప్రస్తావించేవాడు కాదు.

1992 లో వివాహ రజతోత్సవం నాడు, ఖమ్మం నుంచి హైదరాబాదుకు ఓ గజమాలతో వచ్చి, దండలు లేని పెళ్లి చేసుకున్నానని అదే పనిగా గొప్పలు చెబుతుంటావు కదా! ఈరోజు మీ పెళ్లి నేను దగ్గర వుండి జరిపిస్తాను” అన్న పెద్దబాబును మరచిపోవడం సాధ్యం అయ్యే పనికాదు, వాడి మాటల్ని పదేపదే గుర్తు చేసుకోవడం తప్ప.

“అనాయాసేన మరణం, వినా ధైన్యేన జీవనం” ఈ సూక్తికి పెద్దబాబే పెద్ద ఉదాహరణ.

(03-12-2022)

 

 

27, నవంబర్ 2022, ఆదివారం

బుధజన దర్శనం

 నిన్న శనివారం అంతా బంధుజన, బుధజన దర్సనాలతో గడిచిపోయింది.

జ్వాలాతో కలిసి మా కుటుంబపు 108 (పిలిస్తే పలకడమే కాదు, వచ్చే పిల్లల డాక్టరు, మేనల్లుడు) డాక్టర్ ఏవీ మనోహర్ రావును అశోక్ నగర్ లోని వాళ్ల ఇంటికి వెళ్లి కలుసుకున్నాము.  పిచ్చాపాటి అనంతరం అక్కడే భోజనం చేసి, గాంధీ నగర్ లో ఉంటున్న డాక్టర్  మాడభూషి శ్రీధర్ ఇంటికి  ఫోన్ చేసి వెళ్ళాము. మా కోసం వరండాలో ఎదురుచూస్తూ వున్న శ్రీధర్ ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. నన్నూ, జ్వాలాను, జ్వాలా శ్రీమతి విజయలక్ష్మిని చూడగానే శ్రీధర్ మొహం వెలిగిపోయింది. శ్రీధర్  శ్రీమతి కల్యాణి గారు చాలా ఆపేక్షగా పలకరించారు. శ్రీధర్, కల్యాణి కబుర్లు చెబుతుంటే అలా వింటూ పోయాము. ఇన్నాళ్లుగా పెదాలు దాటకుండా, కడుపులో దాచుకున్న మాటలన్నీ శ్రీధర్ నోట వెంట ధారాపాతంగా వెలువడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా తన తల్లిగారు గురించి చెబుతుంటే కంటి వెంట నీళ్ళు తిరిగాయి.  కొడుకుని గుర్తు పట్టలేని అమ్మ, అమ్మ ఏమంటున్నదో అర్ధం కాని కొడుకు, వీళ్ళ పరిస్థితి ఏమిటో అర్ధం కాని కోడలు. నిజంగా సినిమా కధను తలదన్నేలా జరిగిపోయాయి వారి జీవితాల్లో సంఘటనలు. కల్యాణి గారు తమ జీవితంలో అత్యంత దురదృష్టపు ఘడియలను గుర్తు తెచ్చుకుని చెప్పారు. మొత్తం మీద శ్రీధర్ ఆధ్యాత్మిక భావాలు, కల్యాణి గారి మనో ధైర్యం శ్రీధర్ ని మళ్ళీ మామూలు మనిషిని చేసాయి.

(ఇదంతా ఏమిటి అయోమయంగా వుంది అనుకునే వాళ్ళు ఈమధ్య శ్రీధర్ రాసిన పెదవి దాటని మాటలు వ్యాసం చదవండి)

దంపతులిద్దరూ  నాకంటే వయసులో చిన్నవాళ్లు. లేకుంటే కల్యాణి గారి పాదాలకు నమస్కారం చేసేవాడిని.

అదే రోజు సాయంత్రం ఒక మిత్రుని కుమారుడి పెళ్లి రిసెప్షన్. ప్రముఖ సీ పీ ఎం నాయకుడు శ్రీ సీతారాం ఏచూరి కలిశారు.


(శ్రీ సీతారాం ఏచూరితో నేను, జ్వాల)

(శ్రీ మాడభూషి శ్రీధర్ తో నేను, జ్వాలా) 




(26-11-2022)

   

తెగుతున్న తీగెలు

 

(Published in Andhra Prabha today Sunday, 27-11-2022)
‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’ అన్నదా అమ్మాయి ఓచరుపై సంతకం చేయడానికి పెన్ను అడిగినప్పుడు. నిజమే. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అన్ని పనులు చేసుకునే సదుపాయాలు వున్నాయి. అయితే బ్యాంకుకు వస్తే నాలుగు మొఖాలు కనబడతాయి. ఏమండీ ఎలా ఉన్నారని పలకరిస్తారు ఎవరో ఒకరు. ఈ బ్యాంకుతో నలభయ్ ఏళ్ళ అనుబంధం. ప్రమోషన్లు కాదనుకుని ఉండిపోయిన బ్యాంకు ఉద్యోగులు ఎంతో మంది గుర్తు పడతారు. అయితే కాలం తెచ్చే మార్పులు వింతగా వుంటాయి. నా కళ్ళ ముందే ఆ బ్యాంకు బ్రాంచి ఎన్నో హంగులు సమకూర్చుకుంది. కార్పొరేట్ ఆఫీసును తలదన్నేలా తయారయింది. కార్యకలాపాలు కూడా పెరిగాయి. అందుకు తగ్గట్టు ఉద్యోగులూ పెరిగారు. కంప్యూటర్ తెర వైపే చూస్తూ పనులు చేసుకుంటున్నారు. వచ్చిన కష్టమర్ మొఖాలను కూడా గుర్తు పట్టే పరిస్తితి లేదు. నన్ను ఏళ్ళ తరబడి చూస్తున్న వాళ్ళు మాత్రం పలకరింపుగా నవ్వుతారు. కాస్త వీలు చిక్కితే వారితో మాట కలుపుతాను. అయితే అది కూడా ఈ మధ్య తక్కువే. కాస్త విరామం దొరికినా వాళ్ళు కష్టమర్ల మొహం చూడ్డం లేదు. సెల్ ఫోను కబుర్లే సరిపోతున్నాయి.
‘ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు’ అంటాడు మా పక్క పోర్షన్ అబ్బాయి. అది నిజమే కానీ ఈ వయస్సులో మరి కాలక్షేపం ఎలా! కాలం దొర్లించాలంటే ఇలా ఏదో ఒక వ్యాపకం వుండాలి కదా! షాపు అతనికి నా అభిరుచులు తెలుసు. నా ఇష్టా ఇష్టాలు తెలుసు. సారుకు పలానా బ్రాండు కారం ఇవ్వాలిరా. మరచిపోకు అంటాడు తన పనబ్బాయితో. చేసేది వ్యాపారం అయినా ఎక్కడో సుతారంగా మనసుకు తాకుతాయి అతడి మాటలు. మొన్నీ మధ్య వెడితే ఆ షాపు కూల్చేశారు. దగ్గర్లో వున్న మాల్ కే వెళ్లాలి. అంతా కలయ తిరుగుతూ, ట్రాలీ తోసుకుంటూ, దాన్ని నింపుకుంటూ, అవసరం లేని వాటిని కూడా కనబడ్డాయని కొనుక్కుంటూ ....అలా అలా కాలం దొర్లించడమే. మనుషులు కనబడుతూనే వుంటారు, మాటలకే కరువు.
ఒక్క ఫోన్ కొడితే అన్నీ ఇంటికే వచ్చి పడుతున్నాయి. వెనకటి బేరసారాలు లేవు. ఎందుకో యాంత్రికం అనిపిస్తుంది. అలా మార్కెట్టుకు వెళ్లి బెండకాయలు లేతవా కావా అని చివర్లు విరుస్తూ, దోసకాయలు వగరువో కాదో ఒకటికి పదిసార్లు పరీక్షగా చూస్తూ, మరీ అంత మండిపోయే రేటేమిటి, కాస్త తగ్గించరాదయ్యా బాబూ అని చనువు తీసుకుని మాట్లాడడం, సర్లెండి మీకు ఎప్పుడూ ఇచ్చే ధరే ఇది, కాదంటే ఇంటికి వెళ్లి అమ్మగార్ని అడగండి అంటూ అంతకంటే చనువుగా మాట్లాడుతూ కూరలు తను అనుకున్న రేటుకే అమ్మడం, పోనీలీ తెలిసిన మొహం అని మనసుకు సర్దిచెప్పుకుని ఇంటి మొహం పట్టడం. ... అదో వ్యాపకం, అదో కాలక్షేపం, నిజం చెప్పాలి అంటే మనం ఇంకా మనుషుల లోకంలోనే ఉన్నాము అని మనకు మనం సర్ది చెప్పుకోవడం.
యాభయ్ ఏళ్ళ క్రితం ఆ మనుషులే. ఇప్పుడూ ఆ మనుషులే. తేడా ఎక్కడ వస్తోంది.
ఒకానొక కాలంలో ఊళ్ళో ఆడవాళ్ళు అలా భుజాన బిందెలు పెట్టుకుని మంచి నీళ్ళ బావి నుంచి నీళ్ళు పట్టుకుని వచ్చేవారు. ఇంట్లో మొదటిసారి నీళ్ళ పంపు పెట్టించినప్పుడు, అమ్మయ్య నీళ్ళ మోత బాధ తప్పిందని అనుకున్న వాళ్లకు, కాలం గడుస్తున్న కొద్దీ తాము కోల్పోయింది ఏమిటో తెలిసివచ్చింది. ఊరిబావి నీళ్ళు పట్టుకుని వచ్చేటప్పుడు నూతి దగ్గర అమ్మలక్కలు మంచీ చెడూ మాట్లాడుకునే వారు. కష్టం సుఖం ఒకరితో మరొకరు పంచుకునే వారు. నీళ్ళు మోసిన కష్టం దానితో ఆవిరి అయిపోయేది.
అలాగే పిల్లల్ని బడికి తీసుకువెళ్ళే రిక్షా అంకుల్, ఇంటి దగ్గరి గుడికి వెడితే మనం చెప్పకముందే మన పేరూ గోత్రం తానే చెప్పేసి స్వామి వార్లకు అర్చన చేయించే పూజారి, ఇలాంటి వాళ్ళు ఒకరా ఇద్దరా. ఇందిరతో పెంచుకున్న బంధాలు, అనుబంధాలకు కళ్ళముందే కట్లు తెగిపోతుంటే..
పోస్టు అనే పదం అటు పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఒకరోజుల్లో అమృతతుల్యమైన పదం. పోస్ట్ మన్ బయట నుంచి పోస్ట్ అని కేక వేయగానే ఎవరో ఆపద్బాంధవుడు వచ్చినంత సంబరపడి పోయేవారు ఇంటిల్లిపాదీ. దూరాన ఉన్న కొడుకు ఉత్తరం రాశాడేమో అని గృహస్తు, మొగుడి నుంచి ఉత్తరం వచ్చిందేమో అని పుట్టింట్లో ఉన్న గర్భిణి, ఇలా ఎవరికి వారు ఆత్రంగా బయటకి వచ్చేవారు. తాము అనుకున్నది కాదు అని తెలియగానే నిరాశగా నిట్టూరుస్తూ లోపలకి పోయేవారు. ఇప్పుడేముంది? ఇలా ఫోన్ నొక్కగానే అమెరికాలో వున్న పిల్లలు కో అని పలుకుతున్నారు. కానీ ఆనాటి మధురిమ ఏదీ! ఆ ఎదురు చూపులు ఏవీ!
ఒకప్పుడు ఇంట్లో లాండ్ ఫోన్ మోగితే నేనంటే నేను ముందు అనుకుంటూ ఇంట్లో వాళ్ళు అందరూ ఫోన్ వద్దకు పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు. ఒకప్పుడు అందరికీ ప్రియమైన ఫోన్ దిక్కు లేనిదానిలా ఇప్పుడు ఇంట్లో ఓ మూల పడివుంటోంది. మూగనోము నోచుకుంటోంది. పొరబాటున మోగినా దానిని పట్టించుకునే నాధుడు వుండడు ఇంట్లో. ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు తలదించుకుని కాలక్షేపం చేస్తూ వుంటారు.
ఎక్కడో ఏదో తెగిపోతోందని తెలుస్తూనే వుంది. అతకడమే తెలియడం లేదు.



(27-11-2022)

21, నవంబర్ 2022, సోమవారం

మాస్కోలో శంకరాభరణం – భండారు శ్రీనివాసరావు

 గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో కె. విశ్వనాధ్ గారి అపూర్వ సృష్టి శంకరాభరణం సినిమాను ఇండియన్ క్లాసికల్ గా ఎంపిక చేయడం తెలుగు సినిమా రంగానికి గర్వ కారణం. ఈ వార్త టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతున్నప్పుడు ఎప్పటివో నలభయ్ ఏళ్ళకు పూర్వం సంగతులు గుర్తుకు వచ్చాయి.  

1980వ సంవత్సరంలో ఒక రోజు.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)

సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, కధానాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది,  తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.

ఆశ్చర్యంగా రెండోవారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.

కొన్నిరోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. ప్రీ వ్యూ (PRE VIEW) కాదు, ఫ్రీ వ్యూ (FREE VIEW).

నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయన గారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.

ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!

కట్ చేస్తే.....

మళ్ళీ 2017లో...

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.

శంకరాభరణం గురించి కూడా చెప్పారు.

ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మధన్యం అవడం అంటే ఇదే కాబోలు”

చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.



సీన్ కట్ చేసి కొంత వెనక్కి వెడితే....

1987- 92 మధ్య రేడియో మాస్కోలో పనిచేసిన కాలం నాటి జ్ఞాపకం. ఊలిచ్చవావిలోవాలోని మాస్కో రేడియో భవనంలో నివాసం వుండేవాళ్ళం. మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది.  కాలక్షేపం కోసం టిక్కెట్స్ కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా, అది మన శంకరాభరణం సినిమా.

పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీనటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల, సోమయాజులు గారే కాకుండా, ఆ సినిమాలో నటించిన తదితర నటీనటులు అచ్చు రష్యన్ భాషలో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.

సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

(21-11-2022)

 

 

 

 

 

ఇలపావులూరి ఇక లేరు

 ఫేస్ బుక్ లో ఓ బ్రాండ్ నేమ్. ఒక పోస్ట్ పెడితే నిమిషాల్లో వందల లైకులు, డజన్ల కొద్దీ కామెంట్లు. వేల సంఖ్యలో అబిమానులు. రాజకీయ సంబంధమైన వార్తలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. విమర్సనాస్త్రాలు సంధిస్తే చాలు,  ఆ శరపరంపరకు ఎంతటివాడయినా తల్లడిల్లాల్సిందే. అంతటి పదును వుంది ఆయన కలం పాళీకి.

మనసులోని మాటను ఎలాంటి భేషజం లేకుండా మొహం మీదనే అనేయగల ధీరత్వం ఆయన సొంతం. రాజకీయం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, సినిమాలు కావచ్చు, అంశం ఏదైనా సరే, పూర్తి పట్టుతో, నిజాయితీగా నిబద్ధతతో  రచనలు చేయగల గొప్ప నేర్పరి  మురళీమోహన్ గారు. అన్నింటికీ మంచి సహృదయులు, నావంటి ఎంతో మందికి ప్రాణస్నేహితులు.

మూడేళ్ల కిందట రాజమండ్రిలో జరిగిన బుద్ధరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ఇచ్చిన సందర్భంలో నా వెంటనే వున్నారు. నా భార్య చనిపోయినప్పుడు, వారి అబ్బాయిని  వెంటబెట్టుకుని జూబిలీ హిల్స్ లో వున్న మా అన్నయ్య గారి ఇంటిని వెతుక్కుంటూ వచ్చి నన్ను పరామర్శించారు.

నిగర్వి. చెడు అలవాట్లకు ఆమడ దూరం. అలాంటి మనిషి గుండె పోటుతో మరణించారు అని వార్తలు వస్తుంటే ముందు నమ్మలేదు. అనేకమంది ఫోన్లు చేసి చెప్పినా, మెసేజ్ లు పెట్టినా నమ్మలేదు. ఇటువంటి పుకార్లు నమ్మవద్దని వాదించాను. చివరికి దేవరకొండ రమాభాస్కర్, అక్కరాజు నిర్మల్,  శివ రాచర్ల వంటివారు చెబుతుంటే ఇక నమ్మకపోవడానికి చాన్స్ ఎక్కడ?

ఏదైనా ఒక మంచి స్నేహితుడిని ఈరోజు చాలామంది కోల్పోయారు. ఒక మంచి రచయితను తెలుగు పాఠక లోకం శక్తివంతమైన కలాన్ని ఫేస్ బుక్  చదువరులు, ఒక మంచి కుటుంబ పెద్దను వారి కుటుంబం కోల్పోయింది.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

కింది ఫోటో: ఇలపావులూరి, డి. వెంకట్రామయ్య లతో నేను




   


(21-11-2022)           

20, నవంబర్ 2022, ఆదివారం

చిక్కు సమస్యలు, చిరు పరిష్కారాలు : భండారు శ్రీనివాసరావు

(Published in ANDHRA PRABHA today, SUNDAY, 20-11-2022)


'యాభయ్ ఏళ్ళక్రితానికి,  ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ఏమిటి?' అని అడిగితే,  'ఆ రోజుల్లో సినిమా హాళ్ళలో చుట్ట, బీడీ, సిగరెట్లు తాగేవారు, ఇప్పుడది లేద'ని,  ఆరు పదులు వయసు దాటిన వారెవరైనా జవాబు చెబుతారు. 

అప్పటికీ, ఇప్పటికీ పొగత్రాగేవారి సంఖ్య తగ్గిందా అంటే అదీ లేదు. 'సినిమా హాల్లో సిగరెట్ తాగితే జరిమానా వేస్తామ'ని బెదిరించారా అంటే అదీ లేదు, 'హాలులో పొగ తాగరాదు' అంటూ, ఏదో మొక్కుబడిగా ఓ స్లయిడ్ వేయడం తప్ప. 'అన్ని సినిమా హాళ్ళ వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి కట్టుదిట్టం చేశారా' అని ప్రశ్నించుకుంటే 'లేద'నే సమాధానం వస్తుంది. 'పొగరాయుళ్ళను వెతికి పట్టుకుని కౌన్సిలింగులూ గట్రా నిర్వహించారా' అంటే అదీ లేదు. 'ప్రేక్షకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పొగత్రాగవద్దని క్లాసులు తీసుకున్నారా' అంటే ఆ దాఖలాలూ లేవు. మరి పొగత్రాగందే పట్టుమని పది నిమిషాలు ఓపలేని ధూమపాన ప్రియులు, సిగరెట్ల జోలికి పోకుండా థియేటర్లలో కూర్చుని సినిమాలు ఎలా చూస్తున్నారు?

ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ప్రజల్లో ఓ సుగుణం ఉంది. అదేమిటంటే, చూసి నేర్చుకోవడం. డేరా టాకీసులూ, టూరింగ్ హాళ్ళు, రేకుల సినిమాషెడ్లు, సిమెంటు ధియేటర్ల  కాలం ముగిసి, ఎయిర్ కండిషన్ థియేటర్ల కాలం మొదలు కాగానే 'సినిమా హాళ్ళలో పొగత్రాగడం మంచిది కాద'ని పక్క వాళ్ళని గమనిస్తూ ఎవరికి వారే తెలుసుకున్నారు. 

జనంలో వున్న ఈ సుగుణాన్ని, జనంతో సంబంధం వుండి వారిపై పెత్తనం చేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గమనించి నడుచుకుంటే, ఈనాడు మనం ఎదుర్కుంటున్న అనేక చిక్కు సమస్యలకి చిరు పరిష్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెప్పడం జరిగింది. 

ముఖ్యంగా నగరాల్లో పెచ్చు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకి పరిష్కారం కోసం నానా మార్గాలు వెతుకుతున్న అధికారులు, ఈ సూత్రాన్నే అమలు చేస్తే అనేక సమస్యలకు కనీసం సగం పరిష్కారం అయినా లభిస్తుంది. 

హైదరాబాద్ వంటి సువిశాల నగరంలో ట్రాఫిక్ ని చక్కదిద్దడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. 

అయితే, కొన్ని కొన్ని చిన్న చిన్న చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు.

అన్నింటికంటే ముందు చేయాల్సింది,  ట్రాఫిక్ అధికారులు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడం. హెల్మెట్లు, సీటు బెల్టులవంటి నిబంధనల అమలుకు తీసుకుంటున్న శ్రద్ధని, కొంతకాలం పాటయినా,  ట్రాఫిక్ చిక్కుముళ్ళని చక్కదిద్దే దిశగా మరల్చాలి. ఎక్కడ, ఏ సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా అదనపు సిబ్బందిని  ఆయా కూడళ్ళలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై నియమించాలి. ఈ సిబ్బంది కయ్యే ఖర్చుని ఆయా కూడళ్ళ చుట్టు పక్కల ఉండే దుకాణాలు, నివాస సముదాయాలనుంచి పారదర్శక పద్ధతిలో వసూలు చేసినా తప్పులేదు. 

రోడ్లు దాటడానికి రాజధాని నగరంలో అనేక చోట్ల ఫుట్ వోవర్ బ్రిడ్జీలు నిర్మించారు. వాణిజ్య ప్రకటనలకు మినహా, వాటిని జనం ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. స్త్రీ, బాల, వృద్ధులు ఆ వంతెనలు ఎక్కలేరు. ఎక్కగలిగిన వారు ఎక్కనే ఎక్కరు. అందువల్ల వాటిని మరింత ఉపయోగంలోకి తీసుకురావడానికి వాటికి లిఫ్టులు అమర్చాలి. అందుకయ్యే వ్యయాన్ని కొద్ది కొద్దిగా వినియోగదారుల నుంచి రుసుము రూపంలో రాబట్టుకోవాలి. హైదరాబాదు నగరంలో ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సదుపాయం వుంది. కానీ వాడుతున్న దాఖలా లేదు.

ప్రైవేటు విద్యాసంస్థల వద్ద నిర్మించిన కాలి వంతెనల పూర్తి వ్యయాన్ని ఆ సంస్థల నుంచే వసూలు చేయాలి. విద్యార్ధుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు పిండుతున్న ఆ సంస్ధలకి ఇదేమంత పెద్ద భారం కాబోదు.

ఇలాటి ఏర్పాట్లకి వీలులేనిచోట్ల ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అనేక రద్దీ కూడళ్ల వద్ద రోడ్డు దాటలేక అవస్తలు పడేవారు అనేకమంది కనిపిస్తుంటారు. భవసాగరం ఈదడం కంటే రోడ్డు దాటడం కష్టంగా భావిస్తుంటారు. 

బాగా అభివృద్ధిచెందిన ప్రపంచ నగరాలలో రోడ్డుదాటడానికి పుష్ బటన్  వ్యవస్థలు వుంటాయి. రోడ్డుపక్కన వున్న పుష్ బటన్ నొక్కగానే రోడ్డు క్రాస్ చేయడానికి వీలుగా పచ్చ దీపం వెలుగుతుంది. వారు రోడ్డుదాటి వెళ్ళేవరకు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి.

విద్యుత్ దీపాలతో కూడా పని లేకుండా,  జండాలను ఉపయోగించే ఒక విధానం కొన్ని విదేశాల్లో అమల్లోవుంది. అదేమిటంటే, రోడ్డుకు ఇరువైపులా  విద్యుత్  స్తంభాలకు తగిలించిన బాస్కెట్లలో కొన్ని జండాలను ఉంచుతారు. రోడ్డు దాటాలనుకునేవారు ఒక  జండాను తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకుంటూ వెళ్లిపోవచ్చు. రోడ్డు దాటిన తరవాత అవతలవైపు వున్న బాస్కెట్లో వుంచి తమదారిన వెళ్లిపోవచ్చు. ఇరుకైన రోడ్లు వున్న పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఈ పద్దతి ఉపయుక్తంగా వుంటుంది. అయితే ఇచ్చిన సదుపాయాన్ని దుర్వినియోగం చేయడమే పరమావధిగా భావించే జనం అధికంగా ఉన్న మన పౌరసమాజం కారణంగా, ఇటువంటి చిట్కాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది అనుమానమే మరి.    

పోతే, థియేటర్లు, పాఠశాలలు, ఆఫీసుల వేళల్లో తగుమార్పులు చేయడం ద్వారా, ఒకే సమయంలో, ప్రజలు, వాహనాలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు రాకుండా నియంత్రించడానికి వీలుపడుతుంది. 

కనిపించిన చోటల్లా `నోపార్కింగ్' బోర్డులు పెట్టకుండా పార్కింగ్ కి అనువయిన స్ధలాలని ముందుగా గుర్తించాలి. పోలీసు వాహనాలు `నోపార్కింగ్' ప్రదేశాల్లో నిలపకుండా చూడాలి.

ప్రయివేటు బస్సులని ఎలాగూ అదుపు చేయలేరు కనుక, రాత్రి సమయాలల్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకున్న ఖాళీ జాగాలలో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇందుకోసం వసూలు చేసే రుసుముని ఆయా విద్యా సంస్థలకే ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల అనేక ప్రాంతాలలో రాత్రివేళల్లో రోడ్ల మీద  ట్రాఫిక్ జామ్స్ తగ్గిపోతాయి. 

స్కూళ్ళకీ, ఆఫీసులకీ వెళ్ళే రద్దీ సమయాల్లో చెకింగులు జరిపే పద్ధతికి స్వస్తి చెప్పాలి. కన్నూ మిన్నూ కానని అతి వేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయేవారిని, సిగ్నల్ జంపింగ్ చేసే వాహనదారులను పట్టుకుని భారీ జరిమానాలు విధించాలి. అసలు ఇలాటి వాహనదారుల వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. 

అలాగే, రద్దీ సమయాలని దృష్టిలో పెట్టుకుని నగరాల్లో 'వీ.ఐ.పీ.' ల పర్యటనలు, రాకపోకల సమయాల్లో మార్పులు చేయాలి. వారికోసం రోడ్లపై  వాహనాలను అంతూపొంతూ లేకుండా నిలిపివేసే పద్దతికి  స్వస్తి చెప్పడానికి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు వాడుకోవాలి. 'ప్రజలకోసమే మేము, ప్రజాసేవలో మేము' అంటూ నిత్యజపం చేసే నాయకులు, ఇందుకు ఏమాత్రం సహకరిస్తారో చూడాలి. 

ప్రధానమైన ఆస్పత్రులు వున్న వీధుల్లో రాస్తారోఖోలు, ధర్నాలు, ఊరేగింపులను నిషేధించాలి. 

ఇవన్నీ చేసినా, సమస్య నూటికి నూరుపాళ్లు పరిష్కారం కాకపోవచ్చు. కానీ పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడడానికీ , పోలీసుల పట్ల ప్రజలకున్న అవగాహన, అభిప్రాయాల్లో సానుకూల మార్పు రావడానికే ఈ చర్యలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. (EOM)