12, అక్టోబర్ 2022, బుధవారం

దరిద్రం యెలా వుంటుంది? – భండారు శ్రీనివాసరావు

 

ఈ ముచ్చట ఇప్పటిది కాదు, ఎప్పుడో పదేళ్ల క్రితం 2012 లో నిజంగా జరిగింది. ఆంగ్ల దినపత్రిక హిందూలో ఈ కధనం వచ్చింది. దానికి నా స్వేచ్ఛానువాదం అన్నమాట.
చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్ హర్యానాలో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ‘ఇండియా దటీజ్ భారత్’ కు తిరిగిరావాలని చిరకాల కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ‘ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టంలేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారిని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. ‘అదెలా సాధ్యం?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. ‘అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నది’ కలిగిన కుటుంబంలో పుట్టిన వారిద్దరికీ కలిగిన మరో ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500 రూపాయలు. అంటే రోజుకు నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు. దేశ జనాభాలో 75 శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది.
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించుకోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి, వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయంపాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు. అయిదు కిలోమీటర్లకు మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని, దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండిపోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దార్రిద్య్ర రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26 రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ - ఇవే ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి ‘దరిద్రంలో బతకడం’ అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.
అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
‘మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో ‘విందు భోజనం’ ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
‘కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
‘మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ ఆగర్భదారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితుల నడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.
‘ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
‘ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
‘మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
‘స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
‘సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా?
‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
‘చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
‘ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మనమే. అన్నింటికన్నా ముందు చేయాల్సిన పని ఏమిటంటే, మనలో వున్న ‘ఈ పేదరికాన్ని’ రూపుమాపుకోవడమే!’
పదేళ్లు గడిచిన తర్వాత వాళ్ళ ఆలోచనల తీరు ఎలా ఉందన్నది మళ్ళీ ఆ పత్రికే రాస్తే బాగుంటుంది.

https://www.thehindu.com/opinion/columns/Harsh_Mander/barefoot-the-other-side-of-life/article2882340.ece

9, అక్టోబర్ 2022, ఆదివారం

వినేవారేరీ! - భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 09-10-2022, SUNDAY, today) 


ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి  కాస్తంత  ఉదాత్తమైన  పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల  పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక  రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.  

నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. చాలా ఏళ్ళ క్రితం  ఉమ్మడి రాష్ట్రంలో  రాజధానీ నగరం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల  కొద్దిసేపు  ట్రాఫిక్ సిగ్నల్స్  పనిచేయడం మానేశాయి. దాంతో  ఎవరి హడావిడిలో వాళ్ళు  పోవడం వల్ల  వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ  తన  పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ  కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.

అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. నాకు తెలిసిన గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను పాలకులకు ఎత్తి చూపే అధికారులు వుండేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు.  అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి, లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట  వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా  ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో  కొలువుతీరి కూర్చునేవారు.  తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి  తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో  నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి  వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు.  చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు  ఒక పని చెప్పీ చెప్పగానే,  వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా  ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను  ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు.  ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.        

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి.

అసలు విషయానికి వస్తే '

పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా  దాని వెనుక ఏదో పైకి కనిపించని  రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది. 

ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా  రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో  కొట్టి పారేస్తుంది.

చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.

ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం  ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి  కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు. 

కారణం ఒక్కటే. 'రాజకీయం'.                   

ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా  ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి  విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు  ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది. 

ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి. 

ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.

సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.




5, అక్టోబర్ 2022, బుధవారం

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 02-10-2022 SUNDAY)

శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.

మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బయి అయిదేళ్లు. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో, బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సొంత రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఇన్ని దశాబ్దాల స్వతంత్ర జీవనంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా, పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే, నేనున్నానంటూ దీనజనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.

అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా, కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని అశేష జనావళి స్తితి రాముని కాలంనాటి కధలోని కప్పను తలపిస్తోంది.

ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయకోవిదులు వృత్తి ధర్మానికి నిలువు పాతర చేసి చట్టానికి తమదైన రీతిలో భాష్యం చెబుతూ అవినీతి పరుల కొమ్ము కాయడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం ఇవన్నీ అమృతోత్సవ్  జరుపుకున్న స్వతంత్ర భారతానికి అంటుకున్న మరకలు. కడిగినా వొదలని మురికి.

ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-

నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న వ్యక్తులను చూస్తుంటే , వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా, తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.

సమస్యతో సంబంధం వున్న పక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.

వీరంతా ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం చేయాల్సింది. అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే.

ఈ సందర్భంలో, కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.

భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”

మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు, ఇందరు వున్నా కూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని కాపాడుతున్నదని అనుకోవాలి.

కవికుల తిలకుడు  బాలగంగాధర తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు,‘దేవుడా రక్షించు నా దేశాన్ని’.



 

 

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

జనారణ్య రోదనం – భండారు శ్రీనివాసరావు

దర్శనం అద్భుతం అనుభవం దుస్తరం

అందరి అనుభవాలు ఒకే రీతిన వుండవు. ఇది నా అనుభవం మాత్రమే.
సామాన్యులకు పెద్ద సమస్యలు అనిపించే వాటికి కూడా చిరు పరిష్కారాలు వుంటాయి. వాటిని వివరించడమే కాని విమర్శించడం కాదు ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
తిరుమల ప్రయాణం పెట్టుకునే చాలామంది సాధారణ భక్తులకు శ్రీవాణి (SRI VENKATESWARA AALAYA NIRMAANAM) ట్రస్ట్ టికెట్ కొనడం భారమే. ( Rs. 10000/- per head plus Rs 500/- for Darshanam). కాదనను. అయినా ఎవరి మీదా ఆధార పడకుండా, సిఫారసు లేఖల కోసం ఎవరిని దేబిరించకుండా హాయిగా స్వామి దర్శనం చేసుకుని రావాలని కోరుకునే వారికి ఈ పధకం బాగానే ఉపయోగపడుతుంది. ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే ఖామందులకు, డబ్బు లేకపోయినా దానిని మించిన పలుకుబడి కలిగినవారికి ఎటు తిరిగీ వాళ్ళ దర్శన మార్గాలు వేరేగా వుంటాయి. ( నేనూ ఉద్యోగపర్వంలో ఆ బాటన నడిచి దర్జాగా దర్శనం చేసుకుని వచ్చిన వాడినే) ఆ మాత్రం స్థాయిలో కాకపోయినా తగు స్థాయిలో సుఖప్రదమైన దర్శనం కోరుకునేవారికి మాత్రం శ్రీవాణి పధకం గొప్ప వరప్రసాదం అనే చెప్పాలి. ఇది పెద్ద ప్లస్ పాయింటు. విదేశాల్లో ఉంటూ స్వదేశంలోని తమ తలితండ్రులకు దైవ దర్శనం చేయించాలని కోరుకునేవారు చాలామంది వుంటారు. అలాటి వారికి కూడా ఇది ఉపయోగమే. ట్రస్ట్ పెట్టి నాలుగేళ్లు అయినా, పేరు చూసి ఇదేదో ప్రైవేటు వ్యవహారం అని సందేహిస్తున్న వాళ్ళు ఇంకా మిగిలి ఉండడానికి ప్రధాన కారణం కూడా ఈ కుశంకే. ఆది నుంచి ఈ పధకానికి చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రారంభించిన మొదటి వంద రోజుల్లోనే నలభయ్ కోట్ల రూపాయలు టీటీడీ ఖజానాకు జమ పడ్డాయంటే జనాదరణ ఏ స్థాయిలో వుందో అంచనా వేసుకోవచ్చు. టీటీడీకి విరాళాల వరద, భక్తులకు సులభ దర్శనాల వెల్లువ. (బహుశా ఉభయతారకంగా వుంటుంది అనుకుని అధికారులు ఆలయ నిర్మాణ నిధి విరాళాలను సులభ దర్శనం టిక్కెట్టుతో ముడి పెట్టారేమో తెలియదు)
సరే! ఇంతకుముందు పోస్టులో చెప్పినట్టు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు కొనడానికి నాకున్న కారణం, సిఫారసు లేకుండా శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవాలనే ప్రగాఢమైన ఆకాంక్ష. అయితే ఈ ఆన్ లైన్ బుకింగ్ లో అకామడేషన్ విషయంలో మాత్రం యాత్రీకులకు చాయిస్ లేకుండా చేశారు. మాతృశ్రీ వకుళాదేవి గెస్ట్ హౌస్ ఒక్కటే చాయిస్ కంప్యూటర్ చూపెట్టింది. నాన్ ఏసీ, విత్ ఫాన్ అని వుంది. సరే హైదరాబాద్ వెదర్ ప్రకారం బేరీజు వేసుకుని ఒక్క రాత్రే కదా, సర్దుకుపోదాం మళ్ళీ దీనికోసం ఎవరినో ఆశ్రయించడం దేనికని అక్కడే బుక్ చేసుకున్నాం. అమ్మయ్య! ముఖ్యమైన పనులు రెండు పూర్తయ్యాయి. పోగానే ఉండడానికి రూమ్ వుంది, నేరుగా దర్శనం చేయించే టిక్కెట్టు చేతిలో వుంది అనుకుని చలో తిరుమల అంటూ వెళ్ళాము. సిఫారసు లేకుండా దర్శనం చేసుకు రావాలనే మా కోరికను స్వామి తీరుస్తున్నాడని సంబర పడ్డాము.
Report at ARP Counter , CRO, Tirumala అని కంప్యూటర్ రసీదులో వుంది. Internet Allotment Center అని కూడా అందులోనే వుంది. కొండ చేరుకున్న తర్వాత ఈ సదసంశయం తీర్చుకోవడానికి రెండు చోట్లకు ఉసూరుమంటూ వెళ్ళాము. చలిగా వుంటుంది అనుకుంటే ఎండ దంచుతోంది. అన్నీ పాత బిల్డింగులు. రంగులు వెలిసి వున్నాయి. కూచోడానికి జాగా లేదు. టోకెన్ పద్దతి లేదు. (ఏదో చిన్న చిన్న విషయాలు అని వదిలేయకుండా పెద్ద మనసుతో పట్టించుకుంటే టీటీడీకి శోభస్కరంగా వుంటుంది) మొత్తం మీద ఆధార్ లు అన్నీ సరి చూసుకుని గెస్ట్ హౌస్ కి పొమ్మన్నారు. మళ్ళీ చాలా దూరం పోవాలి. తప్పదు కదా! పోయాము. అక్కడ అన్నీ మళ్ళీ పరీక్షించి గది తాళం చెవి చేతిలో పెట్టారు. ఇక్కడే అధికారులు కొంచెం యాత్రీకుల కష్ట సుఖాలు గురించి ఆలోచించాలి. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించిన తర్వాత పలానా గెస్ట్ హౌస్ అని టీటీడీ వాళ్ళే నిర్ణయించిన తర్వాత కూడా ఇన్ని చోట్లకు తిరగాల్సిన అవసరం ఏమిటి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో వున్నప్పుడు అలాట్ చేసిన చోటుకే నేరుగా వెళ్లి బస చేసే ఏర్పాటు చేయాలి అంటే ఏమైనా ఆడిట్ అభ్యంతరాలు ఉంటాయా! దీనివల్ల ప్రయాస, సమయం వృధా తప్పిస్తే వేరే ఉపయోగం ఏముంటుంది? ఈ మధ్య ముఖేష్ అంబానీ మహాశయులు శ్రీవారి దర్సనానికి తిరుమల వచ్చినప్పుడు ఈ విషయం ఆయన చెవిన వేసి వుంటే దేవస్థానం నెట్ వర్క్ యావత్తు గుప్పెట్లోకి తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి ఉండేవాడు.
అందరూ శ్రీవాణి దర్శనం అని వాడుకగా అంటున్నారు కానీ దీని పేరు Beginning Break Darshan. ప్రోటోకాల్ దర్శన్ కు, వీ.ఐ.పీ బ్రేక్ దర్శన్ కు మధ్య అన్నమాట. Report at VQC 1 (Vaikuntham Q Complex) at 6 AM అని వుంది. పర్వాలేదు, మరీ హడావిడిగా తెల్లవారుఝామునే లేవనక్కరలేదు. వాళ్ళు ఆరు గంటలు అన్నారు కానీ, ఎందుకైనా మంచిదనుకుని స్నానాలు అవీ పూర్తి చేసుకుని, నిబంధనల ప్రకారం మొబైల్స్ తీసుకుపోకుండా, ఓ అరగంట ముందుగానే VQC చేరుకున్నాము. అటు కాదు మరో వైపు అన్నారు అక్కడి వారు. మరి టిక్కెట్టులో అలా లేదు కదా అంటే, వింటున్నారా ధర్మారెడ్డి గారు, ఇక్కడ రాత్రికి రాత్రి మార్పులు చేస్తూ పై నుంచి ఆర్డర్లు వస్తాయి, వాటిని చచ్చినట్టు మేము అమలు చేయాలి అని జవాబు. సహజంగా ప్రతి సంస్థలోను ఉండేదే. పై వారికీ కింది వారికీ మధ్య వుండే పొరపొచ్చాలు అప్పుడప్పుడూ ఇలా బయట పడుతుంటాయి. మార్పులు చేయాలి అనుకున్నప్పుడు trial and error method ప్రాతిపదిక మీద చేయడం అసహజం ఏమీ కాదు, కానీ ఆ మార్పు గురించి భక్తులకు ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేయడానికి టీటీడీ మీద పడే భారం ఎక్కువేమీ వుండదు.
అతడు చూపెట్టిన వైపుగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాము. చాలాసేపటి తర్వాత మా క్యూ లైన్ ను రెండు వైపులా ఇనుప జాలీలు వున్న మరో క్యూ లైన్లో కలిపారు. గతంలో అనేక సార్లు తిరుమల వెళ్లాను కానీ ఆ మార్గంలో ఎన్నడూ వెళ్ళలేదు. కొంతదూరం పరుగులాంటి నడక. మరికొంత సేపు ఎందుకు ఆగామో తెలియకుండా ఆగి నిలబడడం. ఇలా ఎంతసేపో తెలియదు. అసలు మేము వెడుతున్నది శ్రీవాణి టిక్కెట్టు మార్గంలోనేనా అనే సందేహం కలిగింది కానీ మా ముందూ వెనకా వున్నవాళ్ళు సరైన తోవలోనే వెడుతున్నట్టు ధ్రువపరిచారు. మా ముందు వున్నవాళ్ళు బాగా వయసు మళ్ళిన దంపతులు. ఆ దారి మధ్యలో అక్కడక్కడా చెక్క స్పీడ్ బ్రేకర్లు. వాటిని మెట్లు అనుకోవాలి. మెట్టు వున్నది జాగ్రత్త అనే హెచ్చరిక సూచికలు లేవు. అనుకున్నట్టే మా ముందు వెడుతున్న ముసలమ్మ గారు తన ముందు వున్న మెట్టు గమనించక తూలిపడింది. ఆవిడ ఒడిలో పదిలంగా పెట్టుకున్న ముడుపుల మూట కూడా ఎగిరి పడింది. అదృష్టవశాత్తు అందులో నాణేలు చెల్లా చెదురుగా పడలేదు. వాళ్ల పిల్లలు అమెరికాలో వుంటారట. శ్రీవాణి ట్రస్ట్ గురించి తెలుసుకుని అక్కడినుంచే రానూపోనూ విమానం టిక్కెట్లు, వసతి, దర్శనం టిక్కెట్లు, స్థానికంగా తిరగడానికి వెహికిల్ బుకింగ్ అన్నీ చేశారట. అంతకు ముందు శ్రీవాణి దర్శనం చేసుకున్న వాళ్ళు చెప్పిన విషయాలు విని ఈ ఏర్పాట్లు చేశారట. ‘కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే వేరుగా వుంది, ఇంతంత దూరాలు నడవాల్సి వస్తుందని అనుకోలేదు’ అన్నది ఆవిడ. (టీటీడీ అధికారులు ఒక చిన్న పని చేయడం ద్వారా ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. ముందు ప్రోటోకాల్, తర్వాత శ్రీవాణి, ఆ తర్వాత వీఐపీ బ్రేక్. ఏరోజున ఎంతమంది అనేది ముందుగానే సమాచారం వుంటుంది. ఈ దర్శనాలకు వెళ్ళేవారిని పలానా టైముకు రిపోర్ట్ చేయమనే బదులు ఈ విభాగాల వాళ్లు, వాళ్లకు వీలైన సమయంలో ముందుగానే వచ్చి వేచి ఉండడానికి వీలుగా, గేలరీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా కూర్చొన్న వారిని ఎవరి టైముకు వారిని అక్కడ నుంచి మహాద్వారం వైపు తీసుకువెళ్లవచ్చు. ఇదేమీ కొత్త పద్దతి కాదు. వీఐపి బ్రేక్ దర్శనానికి ఇలాంటి ఏర్పాట్లు ఇప్పటికే వున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా అన్ని వేళల్లో పనిచేసే సిబ్బందికి ఇబ్బంది కదా అనే వాదన ఈ కాలంలో వర్తించదు. అలా అనుకుంటే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు మూసేసుకోవాలి. ఎంతసేపో అన్నది తెలియకుండా బాగా వయసుమళ్ళిన వాళ్లు అంతసేపు క్యూ లైన్లో నిలబడే వుండాలి అంటే మహా దుస్తరంగా వుంటుంది. ఈ ఏర్పాటు కూడా పెద్ద ఖర్చులేని పనే. కావాల్సింది యాత్రీకులకు సాధ్యమైనంత ఎక్కువ సదుపాయాలు కల్పించాలనే సంకల్పం మాత్రమే.
మహాద్వారం దగ్గరనుంచి మా క్యూ కదలికలో పరిస్థితి వేగంగా మెరుగుపడింది. ధ్వజస్తంభాన్ని తాకి దణ్ణం పెట్టుకుని గర్భగుడిలోకి వెళ్ళాము. ఎక్కడా తోపులాటలు లేవు. జరగండి జరగండి అనే అరుపులు లేవు. చక్కగా కోరుకున్నదానికంటే మిన్నగా దర్శనం చేసుకుని బత్తాయి పండు ప్రసాదంతో గుడి బయటకు వచ్చాము.
పదివేల అయిదు వందల రూపాయలు పెట్టి కొనే ఈ టిక్కెట్టుకు ఒక చిన్నయాభయ్ రూపాయల లడ్డు ఇస్తారు. ఇంకా కావాలి అంటే విడిగా కొనుక్కోవాలి. మంచిదే. అయితే ఆ ఒక్క లడ్డు కోసం పడే పాట్లు అధికారులు ఎవరైనా గమనిస్తే అయ్యో ఇన్నాళ్లు మనం ఇంతమందిని ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నామా అని వాళ్ళే జాలిపడతారు.
ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా పెద్ద వయసు వాళ్లు, (శ్రీవాణి పధకం కింద టిక్కెట్లు కొనే వారిలో వారి సంఖ్యే అధికం. వయో వృద్ధుల దర్శన పధకం వుంది కదా అనవచ్చు. వున్నా ఇటువంటి మంచి దర్శనం గేరంటీ ఇవ్వగలరా! లేరు.) కింద కాళ్ళు కాలుతూ పైన నెత్తి మాడుతూ త్వరత్వరగా పరుగెడుతున్నట్టు ఆ ముదుసలులు వెళ్ళే దృశ్యం ఇంతవరకూ ఎవరి కంటా పడలేదు అంటే ఆశ్చర్యమే మరి. పైన పై కప్పు శాశ్వతంగా వేయడానికి టీటీడీకి నిధుల కొరత ఉంటుందని అనుకోను.
ప్రసాదాల విక్రయ కేంద్రం విశాలంగా వుంది. ఉండడానికి అనేక కౌంటర్లు వున్నాయి. ఒక చోట నార సంచులు, ఒక చోట లడ్డూ ప్రసాదం, మరో చోట వడలు ఇలా బోర్డులు చాలా కనిపిస్తాయి. బ్యాగు కౌంటర్ లో సంచీ కొనుక్కుని వెళ్ళే లోపల లడ్డూ కౌంటర్ లో నో స్టాక్ బోర్డు కనపడుతుంది. విడివిడిగా ఇన్ని కౌంటర్ల బదులు అన్ని కౌంటర్లలో అన్నీ అమ్మే విధానం ఎందుకు అమలు చేయరూ అనేది ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాదు. పెద్ద పెద్ద మాల్స్ల్ లో మాదిరిగా కంప్యూటర్ కౌంటర్లు అనేకం పెట్టి ఎవరికీ కావాల్సింది (అందుబాటులో వున్నవి) వాళ్లకు సంచీల ఖరీదుతో సహా వసూలు చేసి మళ్ళీ అలాగే పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఎవరు ఎంచుకున్న ప్రసాదం ఎవరిది వారికి పంపిణీ చేసే విధానం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా స్తాకులో ఎన్ని లడ్డూలు వున్నాయి అనే డిస ప్లే బోర్డులు పెట్టవచ్చు. ఇక శ్రీవాణి టిక్కెట్టు మీద ఇచ్చే ఒక్క లడ్డూ కోసం ఖాళీగా జనం తక్కువగా వుండే కౌంటర్ కోసం అటూ ఇటూ పరిగెత్తుతూ వుండాలి. ఇది అవసరమా! ఏదో చేసి ఈ ఇబ్బందిని తొలగించలేరా! ఎందుకంటే భక్తులకు దైవ దర్శనం ఎంత ముఖ్యమూ లడ్డూ ప్రసాదం కూడా అంటే ప్రధానం. మరో పని కూడా చేయవచ్చు. శ్రీ వాణి టిక్కెట్టు కొనుక్కున్న వారు ఎక్కడ బస చేశారు అన్నది తెలిసిన విషయమే కనుక ఆ ఒక్క లడ్డు అక్కడే అందచేస్తే వాళ్లు సుఖపడుతూ సంతోషపడతారు. మనల్ని దేవస్థానం వారు గుర్తించి చక్కటి ఏర్పాట్లు చేశారు అని ముచ్చటపడతారు. తమ ఊళ్లలో నలుగురుకీ చెబుతారు. టీటీడీకి ఇది మంచిదేగా!
వీటిలో ఏ సలహా అమలు చేసినా దేవస్థానానికి పెద్దగా ఖర్చయ్యేది వుండదు. ఇక్కడ మరో విషయం గమనంలో వుంచుకోవాలి. ధర్మారెడ్డి గారు సమర్ధుడైన రెవెన్యూ సర్వీసు అధికారి. ఆ సర్వీసులో నేర్పే మొదటి పాఠం పన్నుల వసూళ్ళు ఎలా పెంచడం అనేది. కానీ తిరుమలలో ఆ అవసరం లేదు, రానే రాదు.
తిరుమల వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిధుల కొరత వుండదు. అప్పులు అవసరం పడవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తప్పని ఈ అప్పుల బెడద టీటీడీకి లేదు. ఓడీల కోసం బ్యాంకుల వద్దకు పరిగెత్తాల్సిన పని లేదు. ఖర్చు చేయడం ఎలా ప్రశ్న తప్పిస్తే రాబడి గురించిన బెంగ లేదు. ఇలాంటి వెసులుబాటు కలిగి, ప్రభుత్వ అధ్వర్యంలో పనిచేసే సంస్థ ఇదొక్కటే. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు సైతం ఆర్ధిక సమస్యలతో తల్లడిల్లిపోయాయి. తిరుమల ఆదాయం తగ్గిందేమో కానీ అప్పు చేసే అవసరం రాలేదు. అలా అని దుబారా వ్యయాన్ని సమర్థించడం లేదు. యాత్రీకుల సౌకర్యం కోసం ఏమి చేసినా, ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పు పట్టరు అని చెప్పడానికే ఈ మాటలు.
కాబట్టి శ్రీవాణి అనే కాదు, మొత్తం భక్తులకు మంచి దర్శనం, ఇబ్బందులు లేని, ఇబ్బంది పెట్టని ఏర్పాట్లు చేయండి. ఇలా చేయడం వల్ల మరో ఉపయోగం కూడా వుంది. సిఫారసు లేఖల బెడద సగానికి సగం తగ్గిపోతుంది. ఈ విషయం మీ చెవిన వేసేవారు వుండరు. ఎందుకంటే సామాన్య భక్తులు అందరూ అల్పసంతోషులు. గుడి నుంచి బయటకు వచ్చేవారిని కదిపి చూడండి. స్వామి దర్శనం చక్కగా జరిగిందనే చెబుతారు. మీ హయాములో మరిన్ని మంచి పనులు చేయండి. కానీ సామాన్య భక్తులకు ఏదైనా పనికొచ్చేది చేస్తే వాళ్లు దేవుడితో పాటు మిమ్మల్నీ గుర్తు పెట్టుకుంటారు.
ఉపశృతి: గతంలో టీటీడీ ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి ఇలా చెప్పారు.
‘రోజూ వేలమంది వస్తుంటారు. అందర్నీ కనిపెట్టి చూడడం సాధ్యం కాని పని. వారిలో ఓ అయిదు వందల మందిని ఓ మోస్తరుగా, ఓ వందమందిని జాగ్రత్తగా, ఓ ఇరవై మందిని దగ్గర వుండి చూసుకుంటే ఏ మాటా రాకుండా ఉద్యోగ కాలం పూర్తి చేసుకోవచ్చు. దర్సనాలకు ఇక్కడ ఎంత ప్రాధాన్యత వుందంటే ఓ పెద్ద అధికారే స్వయంగా ఈ పనులన్నీ పర్యవేక్షిస్తారు అంటే అర్ధం చేసుకోండి”
ఆయన మాటల్లో కొంత ఉత్ప్రేక్ష ఉండవచ్చు, కానీ నిజం లేకపోలేదు.
ఇదంతా కొండమీద సంగతులు. దిగితే మరింత దిగులు, బుగులు పుట్టే పరిస్థితులు..
ఇప్పటికి స్వస్తి.
(26-09-2022)

24, సెప్టెంబర్ 2022, శనివారం

సిఫారసు లేని దర్శనం మహా భేషుగ్గా జరిగింది. అయితే....

 


మనం ఎన్ని పాట్లుపడి ముందస్తు ఏర్పాట్లు చేసుకుని తిరుమల వెళ్ళినా మనకు ఎలాంటి  దర్శనం రాసిపెట్టి వుందో అదే  స్వామి అనుగ్రహిస్తాడని పీవీ ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో రాసారు.  అంచేత తిరుపతి విమానం ఎక్కడానికి ముందే దేవుడిని కోరుకుంది అదే సులభతరమైన మంచి దర్శన భాగ్యం కలిగించమని. గత బుధవారం నాడు మిత్రుడు సూర్య కలిసినప్పుడు తిరుపతి అంశం ప్రస్తావనకు వచ్చింది.

మీరు వస్తాను అంటే నేను రెడీ. అయితే ఒకే ఒక్క షరతు.

దర్శనం, వసతి ఇలా ఏ విషయంలోనూ ఎవరి సిఫారసు కోరవద్దు. ఆడవాళ్ళతో ప్రయాణం కాదు కాబట్టి ఎలాగో సర్దుకుపోదాం

ఈ మధ్య ఎవరో చెప్పారు. ఆన్ లైన్లో శ్రీ వాణి ట్రస్టు టిక్కెట్లు కొంటే దర్శనం అకామడేషన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారని.

ఇదేదో బాగుందనుకుని  మర్నాడే చెరి పదివేల అయిదు వందలు, వసతి కోసం వెయ్యి రూపాయలు కాషన్ డిపాజిట్ కింద మరో వెయ్యి చెల్లించి యాత్రకు కావాల్సిన రెండు ప్రధాన అంశాలపై ఎవరి మీద దేనికి ఆధారపడే అవకాశం లేకుండా చూసుకున్నాము.  

శ్రీ వాణి (Sri Venkateswara Aalaya Nirmana) ట్రస్టు టిక్కెట్లు కనుక స్వామివారి మూల విరాట్ వున్న గర్భాలయం గడప వరకు వెళ్లి దర్శనం చేసుకున్నాము. తోపులాటలు, నెట్టడాలు, వగైరాలు లేవు.  విగ్రహం ముందు నిలబెట్టి శఠారి ఇచ్చారు. స్వామి ప్రసాదం అంటూ ఒక పండు చేతిలో పెట్టారు. బయటకి వచ్చి వెలుతురులో చూస్తే అదో చిన్న సైజు  బత్తాయి కాయ. మహా ప్రసాదం అనుకున్నాము. ఆ దేవదేవుడు నా  వేడుకోలు చెవిన పెట్టాడు అని సంతోష పడ్డాను.




సులభంగా చక్కటి దర్శనం అయితే అయింది కానీ, ఆ తర్వాత పట్టపగలే చుక్కలు చూపించారు దేవస్థానం వారు. ఆ ప్రయాస ఇంతా అంతా కాదు. ఆ దెబ్బకు హైదరాబాదు వచ్చిన తర్వాత కూడా రెండు రోజులు మంచానికి అంటుకు పోయాను. కరోనా ముమ్మరంగా ఉన్నరోజుల్లో కూడా జిర్రున చీది ఎరుగని నేను ఈ తిరుపతి యాత్రలో పడిన ప్రయాసకు వడదెబ్బ తగిలి అడ్డం పడ్డాను. అందుకే రోజూ పోస్టుల మీద పోస్టులు పెట్టే వాడిని రెండు మూడు రోజులుగా కంప్యూటర్ ముందు కూచోలేక పోయాను.

“దర్శనం భేషుగ్గా జరిగింది, అయితే....” అని శీర్షిక పెట్టడానికి కారణం ఏమిటన్నది  మరో పోస్టు పెడతాను.

అయితే ఆ చెప్పబోయేది అంతా దేవస్థానం ఉన్నతాధికారుల కోసం. వాళ్ళు చూస్తారా లేదా అనేది నాకు అనవసరం.

“మంచి దర్శనం ఇప్పించు స్వామి” అనే నా మొర ఆ దేవదేవుడే విన్నాడు.  అధికారులు పట్టించుకున్నా లేకపోయినా నేను పట్టించుకోను.

ధర్మారెడ్డి గారు! ఓసారి నాతొ వస్తారా అక్కడ పరిస్త్తితులు ఎలా వున్నాయో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఆ పోస్టు ద్వారా.

(24-09-2022)  

   

      

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)

 


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.

కొన్నేళ్ళ క్రితం ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.

హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’

మా ఆవిడా! ఓకేరా!’

ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’

‘..........’

చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’

కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.



(NOTE: Image Courtesy: RotteneCARDS)

 

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

 

“ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక పిచ్చివాడితోనా!
“ఆశ్చర్యంగా వుంది కదూ. నేనే మాట్లాడేది. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ పొద్దున్నే లేచి నా ఫోటోకి దణ్ణం పెడుతుంటే చూసి ఇక మాట్లాడక తప్పదు అనిపించింది.
“నేను ప్రతి రోజూ పూజలు చేస్తుంటే దేవుడి మండపంలో ఏనాడు దీపం కూడా వెలిగించని నువ్వు ఇలా చేస్తుంటే నాకూ ఆశ్చర్యం అనిపించింది.
“నిన్ను ‘నువ్వు’ అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా. నిజమే! నా జీవితంలో నిన్ను ఏనాడూ ‘నువ్వు’ అని పిలిచి ఎరుగను. ఇప్పుడు జీవితమే లేని ‘జీవితం’ నాది. ఎల్లాగూ దణ్ణం పెడుతున్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను నేను నువ్వు అనే అంటాను.
“ఆ రాత్రి నువ్వు అంబులెన్స్ కోసం హడావిడి పడుతూ నా చివరి మాటలు వినే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నిజానికి నేనూ మాట్లాడే పరిస్తితి లేదు. ఏదో చెబుదామని నోరు తెరవబోయాను. మాట పెగల్లేదు. అంబులెన్స్, అడ్రసు చెప్పడాలు ఏవేవో మాటలు. అర్ధమయీ కాకుండా.
"మూడేళ్ళుగా చూస్తున్నా నీ పిచ్చిరాతలు. ఇప్పుడు చెబుతున్నా విను.
“నువ్వు నువ్వులా వుండు. వేరేలా వుంటే నాకస్సలు నచ్చదు. బావగారూ, అక్కయ్యలు, మేనకోడళ్ళు పిల్లలు అందరూ ఇదే చెబుతున్నారు, నీకు. వారి మాటే నా మాట కూడా.
“పెళ్లికాకముందు నుంచి నువ్వు ఎలా వుంటే బాగుంటుందో నాకో ఐడియా వుండేది. వేసుకుండే బట్టలు. నడిచే పద్దతి. మాట్లాడే తీరు. మూడోది నీదే, నేను మార్చింది ఏమీ లేదు. గుర్తుందా. మద్రాసు నుంచి ఒక చొక్కా పోస్టులో పంపితే ఇదేం ఫ్యాషను అని వంకలు పెట్టావు. చివరికి అదే ఫ్యాషన్ అయింది. ఈ యావలోనే నేను ఒక పొరబాటు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ దుస్తుల సైజు నీకు తెలవదు. ఏ ప్యాంటుపై ఏ కలర్ చొక్కా వేసుకోవాలో నేనే చెప్పేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అన్నది నీకే కాదు, నాకూ ప్రశ్నే.
“ఇన్నాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ప్రపంచమే నీ ప్రపంచమని వేళ్ళాడావు. ఇప్పుడు పట్టించుకోవడానికి ఇంట్లో నేనెట్లాగు లేను. మళ్ళీ నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయిపో. ఇంకో విషయం చెప్పనా! నువ్వు అలా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా వుంటాను. మాట వినే మొగుడు నా మొగుడని ముచ్చట పడతాను.
“ఒంటరిగా ఎలా నిభాయించుకుని వస్తావో తెలవదు. అదొక్కటే నా బాధ. కానీ నీ చుట్టూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్న మన వాళ్ళని చూసిన తర్వాత ఆ బాధ క్రమంగా తగ్గిపోతోంది.
“మళ్ళీ చెబుతున్నా విను. ఇదే ఫైనల్. మళ్ళీ నా నోట ‘నువ్వొక పిచ్చివాడివి’ అనిపించకు”


(భండారు నిర్మలాదేవి)


నేనూ అందరిలాగే నిద్రలో అనేక కలలు కంటూ వుంటాను.
లేచిన తర్వాత ఒక్కటీ గుర్తు వుండదు. మరి ఇది ఎలా గుర్తుంది?
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!