20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)

 


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.

కొన్నేళ్ళ క్రితం ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.

హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’

మా ఆవిడా! ఓకేరా!’

ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’

‘..........’

చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’

కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.



(NOTE: Image Courtesy: RotteneCARDS)

 

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

 

“ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక పిచ్చివాడితోనా!
“ఆశ్చర్యంగా వుంది కదూ. నేనే మాట్లాడేది. అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ పొద్దున్నే లేచి నా ఫోటోకి దణ్ణం పెడుతుంటే చూసి ఇక మాట్లాడక తప్పదు అనిపించింది.
“నేను ప్రతి రోజూ పూజలు చేస్తుంటే దేవుడి మండపంలో ఏనాడు దీపం కూడా వెలిగించని నువ్వు ఇలా చేస్తుంటే నాకూ ఆశ్చర్యం అనిపించింది.
“నిన్ను ‘నువ్వు’ అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా. నిజమే! నా జీవితంలో నిన్ను ఏనాడూ ‘నువ్వు’ అని పిలిచి ఎరుగను. ఇప్పుడు జీవితమే లేని ‘జీవితం’ నాది. ఎల్లాగూ దణ్ణం పెడుతున్నావు కాబట్టి ఇక నుంచి నిన్ను నేను నువ్వు అనే అంటాను.
“ఆ రాత్రి నువ్వు అంబులెన్స్ కోసం హడావిడి పడుతూ నా చివరి మాటలు వినే ఛాన్స్ పోగొట్టుకున్నావు. నిజానికి నేనూ మాట్లాడే పరిస్తితి లేదు. ఏదో చెబుదామని నోరు తెరవబోయాను. మాట పెగల్లేదు. అంబులెన్స్, అడ్రసు చెప్పడాలు ఏవేవో మాటలు. అర్ధమయీ కాకుండా.
"మూడేళ్ళుగా చూస్తున్నా నీ పిచ్చిరాతలు. ఇప్పుడు చెబుతున్నా విను.
“నువ్వు నువ్వులా వుండు. వేరేలా వుంటే నాకస్సలు నచ్చదు. బావగారూ, అక్కయ్యలు, మేనకోడళ్ళు పిల్లలు అందరూ ఇదే చెబుతున్నారు, నీకు. వారి మాటే నా మాట కూడా.
“పెళ్లికాకముందు నుంచి నువ్వు ఎలా వుంటే బాగుంటుందో నాకో ఐడియా వుండేది. వేసుకుండే బట్టలు. నడిచే పద్దతి. మాట్లాడే తీరు. మూడోది నీదే, నేను మార్చింది ఏమీ లేదు. గుర్తుందా. మద్రాసు నుంచి ఒక చొక్కా పోస్టులో పంపితే ఇదేం ఫ్యాషను అని వంకలు పెట్టావు. చివరికి అదే ఫ్యాషన్ అయింది. ఈ యావలోనే నేను ఒక పొరబాటు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీ దుస్తుల సైజు నీకు తెలవదు. ఏ ప్యాంటుపై ఏ కలర్ చొక్కా వేసుకోవాలో నేనే చెప్పేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అన్నది నీకే కాదు, నాకూ ప్రశ్నే.
“ఇన్నాళ్ళు ఇంటిని పట్టించుకోకుండా ప్రపంచమే నీ ప్రపంచమని వేళ్ళాడావు. ఇప్పుడు పట్టించుకోవడానికి ఇంట్లో నేనెట్లాగు లేను. మళ్ళీ నీ ప్రపంచంలోకి వెళ్ళిపో. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయిపో. ఇంకో విషయం చెప్పనా! నువ్వు అలా ఉంటేనే నేనిక్కడ సంతోషంగా వుంటాను. మాట వినే మొగుడు నా మొగుడని ముచ్చట పడతాను.
“ఒంటరిగా ఎలా నిభాయించుకుని వస్తావో తెలవదు. అదొక్కటే నా బాధ. కానీ నీ చుట్టూ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటున్న మన వాళ్ళని చూసిన తర్వాత ఆ బాధ క్రమంగా తగ్గిపోతోంది.
“మళ్ళీ చెబుతున్నా విను. ఇదే ఫైనల్. మళ్ళీ నా నోట ‘నువ్వొక పిచ్చివాడివి’ అనిపించకు”


(భండారు నిర్మలాదేవి)


నేనూ అందరిలాగే నిద్రలో అనేక కలలు కంటూ వుంటాను.
లేచిన తర్వాత ఒక్కటీ గుర్తు వుండదు. మరి ఇది ఎలా గుర్తుంది?
కల కాదా! నిజమా!! నా భ్రమా!!!

అందరు చేస్తున్నది అదే! - భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha daily today Sunday 18-09-2022)

కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్ శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగరాసిన రాజాజీ మహాభారతంలో కృష్ణ భగవానుడి నోటివెంట వెలువడిన మాటల్లో మంచివాళ్ల మౌనం గురించిన ప్రసక్తి వుంది.
(“Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence”)
స్వేచ్చానువాదం చేస్తే, రాజాజీ రాసిన ఆంగ్ల వాక్యాలకు తెలుగులో భావం దగ్గర దగ్గరగా ఇలా వుంటుంది.
“అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం అనేది ఒక రకంగా లాలూచీనే.
లాలూచీ అంటే దగా
దగా అంటే పాపం
పాపం శిక్షార్హం”
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధనుంజయ ధనుర్విముక్త శస్త్రాలతో తీవ్రంగా గాయపడి, మరణం తధ్యమని నిర్ధారించుకున్న పిదప, ఇచ్చామరణం అనే వరం ఉన్న కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు గడిపిన భీష్ముడు ఎనలేని మనోవేదనతో కుమిలిపోయిన సందర్భాన్ని రాజాజీ ఇలా అభివర్ణిస్తారు.
“తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
“ఇలాంటి నాకేల ఈ దుస్తితి?
“పగలల్లా రణన్నినాదాలు. చతురంగబలాల ప్రళయ భీకర గర్జనలు. పొద్దువాలే సమయంకల్లా నాటి యుద్ధ పరిసమాప్తి. వల్లకాడులా మారిన రణభూమిలో ఎల్లెడలా శవాల గుట్టలు. ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు, తమ ప్రాణాలు కాపాడండంటూ చేసే హృదయ విదారక రోదనలు. అసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు చిల్లులు పడేలా నక్కల ఊళలు.
ఒళ్ళు జలదరించే ఇటువంటి దారుణ దృశ్యాల నడుమ, నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
“కురుపాండవ వంశాలకే కాదు, యావత్ కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా, శత్రువుకు వెన్ను చూపని వీరాధివీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను చేసిన పాపం ఏమిటి?”
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే పైన రాసిన వాక్యాలు.
“ధృతరాష్ట్రుడి నిండుకొలువులో దుర్యోధనాదులు పాంచాలిని వివస్త్రను చేసే సందర్భంలో, తనను కాపాడమని ఆ అబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా! భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే మీరు సర్వధర్మాలను ఎరిగిన వారు. ఏది మంచిదో, ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వశక్తిమంతులు కూడా. అప్పటి ఆనాటి మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
సరే! ఇది మహాభారత కాలం నాటి కృష్ణ ఉవాచ.
ఈనాడు కూడా సమాజంలోని అనేక వర్గాల్లో ఈ విషయంపై విస్తృత చర్చే జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ముఖ్యంగా మేధావులు అనే బుద్ధిజీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించక పోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే వారు సమాజంలో చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ విమర్శలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం అధికారులకు, సిబ్బందికి సమకూర్చే ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
తప్పును తప్పు అని చెప్పాలి అంటే అలాంటి తప్పు చేయనివాడు అయివుంటేనే ఆ చెప్పినదానికి సాధికారికత, విశ్వసనీయత వుంటాయి. అందరూ అవే తప్పులు చేసేవారే అయితే ఇక తప్పొప్పులు చెప్పేదెవరు?
గతంలో పత్రికలు కొంతవరకు ఈ తీర్పరి పాత్ర పోషించేవి. సంపాదకీయ వ్యాఖ్యలకు చాలా విలువ వుండేది. ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు సయితం పత్రికల వార్తలకు, సలహాలకు, సూచనలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చేవారు.
మీడియా రంగప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్తలకు కూడా రంగూ రుచీ వాసనా వచ్చేసాయి.
వార్తకు ప్రాణం పొయ్యడం కంటే తమ మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు, మీడియా ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు, స్వేచ్చకు అర్ధమే పూర్తిగా మారిపోతుంది. అదే జరుగుతోంది.
మేధావులు, బుద్ధిజీవులు, మంచివాళ్ళు ఏ పేరుతో పిలిస్తేనేమి, అయితేనేం, వాళ్ళు వర్తమాన సామాజిక అంశాల పట్ల తగు విధంగా స్పందించకపోవడానికి ప్రధాన కారణం వారిలో ఎంతోకొంత నైతిక బలం కొరవడడం ఒక కారణం అయితే, మంచి చెప్పి మాటలు పడడం కంటే, నాడు కురుసభలో భీష్మాదుల మాదిరిగా మౌనాన్ని ఆశ్రయించడం మంచిదనే భావన ప్రబలడం మరో కారణం.
ఉపశృతి:
పక్కవారు చేస్తేనే దుర్వినియోగం అనడానికి ఓ చిన్న జోక్ చెప్పుకుందాం.
గుండె గుభిల్లుమనేలా ఫోను బిల్లు వచ్చింది. నెలనెలా పెరిగిపోతున్న ఫోను బిల్లు గురించి మాట్లాడడానికి ఇంట్లోవున్న నలుగుర్నీ పిలిచాడు ఇంటి యజమాని.
తండ్రి: ఇంతంత బిల్లులు వస్తే ఎలా? నన్ను చూడండి. నేను ఆఫీసులో ఫోను తప్ప ఇంట్లో ఫోనే వాడను. మరి ఇది ఎవరి పని?
భార్య: పగలల్లా నేనూ ఆఫీసులోనే కదా వుండేది. నేనూ మీలాగే అక్కడకిపోయే ఫోన్లు చేస్తుంటాను.
కొడుకు: ఇంటి ఫోను ముట్టుకునే అవసరం నాకేమిటి? నాకు కంపెనీ ఇచ్చిన మొబైల్ వుంది.
పనిపిల్ల: అందరం చేస్తున్నది అదే కదా. ఇక గొడవెందుకు?
(పనిపిల్లకు పనిచేసే ఇల్లే ఆఫీసు కదా!)





(18-09-2022)

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఇదో కళ.....

 ఇందులో నిష్ణాతులకు ఆస్కార్ ఇవ్వాలి. ఒకరు రాసినదానిని తమ పేరుతొ తిరిగి పోస్ట్ చేసుకోవడం ఒక తీరయితే, తమ భావాలకు పెద్దల పేరు తగిలించి వారి కొటేషన్లుగా పోస్ట్ చేయడం ఇంకో తంతు.

దీనికి పేరడీ ఈ కింది చిత్రం. అబ్రహంలింకన్ కాలం నాటికి ఇంటర్నెట్ లేదు. అయినా దాన్ని గురించి ఆయన గారు చెప్పారంటూ ఒక కొటేషన్ ఇవ్వడం నేటి పెడ ధోరణులకు అద్దం పడుతోంది. దీన్ని చూసయినా 'కాపీ, పేస్టు, ఫార్వార్డ్ ' బాపతు వాళ్ళ తీరు మారుతుందా అంటే అనుమానమే.



 

చెయ్యి తీస్తాను అన్ననోటితో క్షమాపణ చెప్పిన రోశయ్య

 

 

ఉప్పూ కారం తినే వాడికి కోపం రావడం సహజం. అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి వాడు అలిగితే ఏమి జరుగుతుందో కృష్ణుడు ఒక పద్యంలో చెప్పాడు. అలాగే ఒకసారి రోశయ్య గారెకి కూడా కోపం వచ్చింది. అదీ నిండు శాసన సభలో. ఎప్పుడూ చమత్కారాలు రాలుతుండే ఆయన నోటి వెంట పరుష పదజాలాలు దొర్లడం చూసి ప్రెస్ గేలరీలో ఉన్న పాత్రికేయులు సయితం అవాక్కయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీడీపీ సభ్యుడు శ్రీ గాలి ముద్దు కృష్ణమ నాయుడి వైఖరి పట్ల .రోశయ్య గారెకి అసహనం కలిగింది. అది ఆగ్రహంగా మారింది. తీవ్ర పదజాలం వాడారు. బహుశా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శ్రీ రోశయ్య సంయమనం కోల్పోయి మాట్లాడడం ఇదే ప్రధమం కావచ్చు. ఆ రోజు సభలో ముద్దుకృష్ణమ నాయుడిని ఉద్దేశించి ఆవేశంతో ఊగిపోతూ ఆయన ఇలా అన్నారు:

“ఏమిటా గద్దింపులు? నువ్వు పెద్ద మగాడివా!  ఏమిటా చెయ్యి? చెయ్యి తీస్తాను జాగ్రత్త! ఏమనుకుంటున్నావో!”

తర్వాత తాను అన్న మాటలకు ఆయనే సభలో క్షమాపణ చెప్పారు.

“నా కారణంగా ప్రజాధనం లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయిపోతుందని, ఈ సభ గౌరవం తగ్గిపోతుందని నాక్కూడా భావన కలిగింది. నేను ఇరవై ఎనిమిదో తారీకున మాట్లాడుతూ, గౌరవనీయులు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు గారి గురించి కఠినంగా మాట్లాడినటువంటి మాట నేను విత్ డ్రా చేసుకుంటున్నాను. నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను”      

ఒకప్పుడు ఇలా ఉండేవి శాసన సభలు


శ్రీ రోశయ్యతో రచయిత)


(15-09-2022)

 

Video LINK:

https://youtu.be/hC9GdIctEKE

 


12, సెప్టెంబర్ 2022, సోమవారం

యాదాద్రి నిర్మాణం ఓ అద్భుతం

 ఆధునిక హంగులతో పురాతన నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న యాదాద్రి దేవాలయం నిజంగా ఒక అద్భుతం.

పునర్నిర్మించిన ఈ గుడి గురించి పత్రికల్లో చదవడం, టీవీల్లో చూడడం తప్పిస్తే కళ్ళారా చూసింది లేదు. గతంలో ఎన్నోసార్లు దర్శించుకున్న యాదగిరిగుట్ట దేవాలయమే మనసులో ముద్ర పడిపోయిన కారణం కావచ్చు,  ఈరోజు ఆ దేవళం  ముందు నిలబడి చూస్తుంటే ఇంత గొప్ప గుడిని ఇంత స్వల్ప కాలంలో ఎలా కట్టారా అని ఆశ్చర్యం వేసింది.

మా మనుమరాలు జీవిక పుట్టు వెంట్రులకు తీయించడం కోసం ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట  వెళ్ళాము. మిత్రుడు జ్వాలా మాట సాయం బాగా అక్కరకు వచ్చింది. ఏ గుడికి పోయేవారు అయినా మనసులో  బలంగా కోరుకునే మంచి దైవ  దర్శనం లభించింది. ఈ విషయంలో సహకరించిన దేవాలయం అధికారులు శ్రీయుతులు రాజు, రామప్రసాదరెడ్డి, మహేష్, శంకర్ లకు ధన్యవాదాలు.   

ఎనిమిది నెలల పిల్లకు వెంట్రుకలు తీయించడం ఎలా అని మధన పడిన మాట వాస్తవం. అయితే దేవస్థానం వారి క్షురకుడు ఎంతో నైపుణ్యంగా ఆ పని ఇట్టే పూర్తి చేశాడు. ఏడ్చి గోల చేస్తుందేమో అనుకుంటే ఆ యావత్తు కార్యక్రమాన్ని జీవిక ఆనందంగా ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించింది.

పీవీఆర్కే గారు అన్నట్టు నాహం కర్తా. అంతా ఆ భగవంతుడి లీలావిలాసం.   














(12-09-2022)

11, సెప్టెంబర్ 2022, ఆదివారం

అమెరికా ఉలిక్కిపడ్డ రోజు – భండారు శ్రీనివాసరావు

 

(Published in Mana Telangana today 11-09-2022, Sunday)


భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001 సెప్టెంబర్ పదకొండవ తేదీన, భయంతో బివ్వేరపోవడం యావత్ ప్రపంచం తొలిసారిగా ఆశ్చర్యపోతూ గమనించింది. 

అమెరికా గడ్డమీద ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్ ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధి చెందిన దేశంగా, అన్ని దేశాల్లో తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి జరిగిందీ లేదు. అమెరికన్ సైన్యాలు ఎక్కడో సుదూరంగా ఉన్న వియత్నాం, కొరియావంటి చిన్న దేశాలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నాయి కానీ, ఆ దేశం మీద దండెత్తిన దేశం అంటూ లేదు, ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధంలోనో, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలోనో అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప.

అలాంటి దేశంపై ఇటీవలి కాలంలో మొట్టమొదటి విదేశీ దాడి రెండువేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన జరిగింది. అమెరికాకు గర్వకారణంగా నిలచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆకాశ హర్మ్యాల జంటను విమానాలతో డీకొట్టి కూల్చివేయడం ఒక్కటే అయితే దాడి అనలేము కానీ, అమెరికా రక్షణ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక కార్యాలయం ‘పెంటగాన్’ పై జరిగిన దాడితో కలిపి చూస్తే ఇది నిస్సంశయంగా అమెరికా దేశంపై శత్రు మూకల దాడిగానే పరిగణించాలి. 

ఈ దాడితో బెంబేలెత్తిపోయిన అగ్రదేశం ఇటువంటివి పునరావృతం కాకుండా అనేక భద్రతా చర్యలు తీసుకుంది. ఫలితంగా స్వేచ్చా ప్రియులయిన అమెరికన్ పౌరులు భద్రత పేరుతొ తీసుకుంటున్న అనేక చర్యలతో విసుగెత్తి పోతున్నారు కూడా.

కాగా, అమెరికన్ ప్రభుత్వం తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారకుడయిన ఉగ్రవాద నాయకుడు లాడెన్ ను మట్టుబెట్టేంత వరకు నిద్రపోలేదు. పాకీస్తాన్ లో తలదాచుకున్న లాడెన్ ఆచూకీ పట్టుకుని అతడ్ని కాల్చి చంపడమే కాకుండా లాడెన్ భౌతిక కాయాన్ని సముద్ర జలాల్లో ముంచేసి, అతడి శవాన్ని జలచరాలకు ఆహారంగా చేసింది. లాడెన్ ను అమెరికన్ సీక్రెట్ పోలీసులు వేటాడి వధిస్తున్న దృశ్యాలను ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ లో కూర్చుని చూడడం జరిగిందంటే తనపై జరిగిన దాడికి ఆ దేశం ఎంతగా కక్ష పెంచుకున్నదో అర్ధం అవుతుంది.

అప్పటిదాకా ప్రపంచంలో అన్ని దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదభూతం ఎంత ప్రమాదకరమో అన్నది అమెరికాకు కూడా తెలిసివచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నలిపివేస్తామని ప్రకటనలు చేసే దేశాల జాబితాలో అమెరికా చేరిపోయింది. 

అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంత గోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేక దేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం, వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. ‘చంపు, లేదా చచ్చిపో’ అనే రెండే రెండు పదాలు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.

ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం ఉగ్రవాదులకు ఉన్న మరో బలం. సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం. అధిక సంఖ్యలో వున్న మంచివారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం.

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.

కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.

వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు తోకలు ఝాడిస్తూనే వుంటారు