18, సెప్టెంబర్ 2022, ఆదివారం

అందరు చేస్తున్నది అదే! - భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha daily today Sunday 18-09-2022)

కీర్తిశేషులు, మాజీ గవర్నర్ జనరల్ శ్రీ సి. రాజగోపాలాచారి ఆంగ్లంలో తిరగరాసిన రాజాజీ మహాభారతంలో కృష్ణ భగవానుడి నోటివెంట వెలువడిన మాటల్లో మంచివాళ్ల మౌనం గురించిన ప్రసక్తి వుంది.
(“Silence is connivance,
Connivance is betrayal,
Betrayal is sin,
Sin is punishable offence”)
స్వేచ్చానువాదం చేస్తే, రాజాజీ రాసిన ఆంగ్ల వాక్యాలకు తెలుగులో భావం దగ్గర దగ్గరగా ఇలా వుంటుంది.
“అవసరమైన సందర్భాలలో మౌనంగా వుండడం అనేది ఒక రకంగా లాలూచీనే.
లాలూచీ అంటే దగా
దగా అంటే పాపం
పాపం శిక్షార్హం”
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ధనుంజయ ధనుర్విముక్త శస్త్రాలతో తీవ్రంగా గాయపడి, మరణం తధ్యమని నిర్ధారించుకున్న పిదప, ఇచ్చామరణం అనే వరం ఉన్న కారణంగా అంపశయ్యపై ఆఖరి రోజులు గడిపిన భీష్ముడు ఎనలేని మనోవేదనతో కుమిలిపోయిన సందర్భాన్ని రాజాజీ ఇలా అభివర్ణిస్తారు.
“తనొక మహావీరుడు. తెలిసి తెలిసీ ఏనాడూ ఎలాంటి దుష్ట కార్యం తలపెట్టలేదు. పొరబాటున కూడా పాపానికి ఒడిగట్టలేదు. ఇతరుల రాజ్యంపై కన్ను వేయలేదు. పరకాంతను చెరబట్టడం సరే కలలో సయితం ఏ కాంత పొందునూ కోరని ఆజన్మ బ్రహ్మచారిని.
“ఇలాంటి నాకేల ఈ దుస్తితి?
“పగలల్లా రణన్నినాదాలు. చతురంగబలాల ప్రళయ భీకర గర్జనలు. పొద్దువాలే సమయంకల్లా నాటి యుద్ధ పరిసమాప్తి. వల్లకాడులా మారిన రణభూమిలో ఎల్లెడలా శవాల గుట్టలు. ఆత్మీయుల ఆక్రందనలు. కొసప్రాణంతో మిగిలిన సైనికులు, తమ ప్రాణాలు కాపాడండంటూ చేసే హృదయ విదారక రోదనలు. అసువులు బాసిన అమరుల పార్ధివ శరీరాలను కడుపారా ఆరగించడానికి ఆకాశంలో గిరికీలు కొట్టే రాబందుల రెక్కల చప్పుళ్ళు. ఆ నిశిరాత్రి సమయంలో చెవులు చిల్లులు పడేలా నక్కల ఊళలు.
ఒళ్ళు జలదరించే ఇటువంటి దారుణ దృశ్యాల నడుమ, నిదురలేని రాత్రులు గడపాల్సిన స్తితి. ఈ దుస్తితి పగవాళ్ళకు కూడా రాకూడదు.
“కురుపాండవ వంశాలకే కాదు, యావత్ కురుసామ్రాజ్యానికి పరిరక్షకుడిగా, సకల శస్త్రాస్త్రవిద్యలలో ఆరితేరినవాడిగా, సమస్త ధర్మశాస్త్రాలు పుణికిపుచ్చుకున్నవాడిగా, త్యాగానికి మారుపేరుగా, ఆడిన మాట తప్పనివాడిగా, శత్రువుకు వెన్ను చూపని వీరాధివీరుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తన కడసారి ఘడియలు ఈ విధంగా గడుస్తాయని ఏనాడూ అనుకోలేదే. ఎందుకిలా జరిగింది? నేను చేసిన పాపం ఏమిటి?”
అంటూ కుమిలిపోతున్న భీష్ముడి అంతరంగ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానమే పైన రాసిన వాక్యాలు.
“ధృతరాష్ట్రుడి నిండుకొలువులో దుర్యోధనాదులు పాంచాలిని వివస్త్రను చేసే సందర్భంలో, తనను కాపాడమని ఆ అబల కోరినదెవరినో గుర్తున్నది కదా గాంగేయా! భీష్మ, ద్రోణ, అశ్వద్ధామ, కృపాచార్యులను. ఎందుకంటే మీరు సర్వధర్మాలను ఎరిగిన వారు. ఏది మంచిదో, ఏది చెడో నిర్భయంగా చెప్పగలిగిన సమర్ధులు. సర్వశక్తిమంతులు కూడా. అప్పటి ఆనాటి మీ మౌనం ఎంతటి అనర్ధానికి కారణం అయిందో ఇప్పటికయినా తెలిసి వచ్చిందా!”
సరే! ఇది మహాభారత కాలం నాటి కృష్ణ ఉవాచ.
ఈనాడు కూడా సమాజంలోని అనేక వర్గాల్లో ఈ విషయంపై విస్తృత చర్చే జరుగుతోంది. ప్రస్తుతం జాతి జనులు అనుభవిస్తున్న అనేకానేక కష్ట నష్టాలకు, వాటిల్లుతున్న అనర్ధాలకు మంచివాళ్ళ మౌనమే కారణం అన్న వాదన మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో సాగుతోంది.
సమాజంలో మంచివాళ్ళు, ముఖ్యంగా మేధావులు అనే బుద్ధిజీవులు (మంచివాళ్ళందరూ మేధావులు కారు, మేధావులందరూ మంచివాళ్ళు కారు అని వాదించే వర్గం ఒకటుంది. అది వేరే సంగతి) మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఈ వర్గాలు నోరు మెదిపి దిశానిర్దేశం చేయగలిగితే, ప్రజలను సరైన ఆలోచనాపధంలో పెట్టగలిగితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఈ వాదనల సారాంశం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ అవినీతి పట్ల స్పందించాల్సిన విధంగా మేధావులు వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు అవినీతి, లంచగొండితనం వంటి సాంఘిక రుగ్మతల పట్ల నిర్లిప్తంగా ఉంటున్నారని ఆ సారాంశంలో దాగున్న భావం.
అనేకానేక రాజకీయ అవినీతులు, అధికార దుర్వినియోగాల విషయాల్లో, విశ్లేషకులు, మేధావులు తగు విధంగా స్పందించక పోవడం వల్ల, సాధారణ ప్రజల్లో కూడా అవినీతి ఒక చర్చనీయాంశం లేదా ఒక ప్రాధాన్యత కలిగిన విషయం కాకుండా పోతోందని వాదించే వారు సమాజంలో చాలామంది కనబడతారు. దానికి కారణం ఒక్కటే. ఆ విమర్శలు చేసేవారికి కూడా తగిన నైతిక బలం లేకపోవడమే. ఎక్కువ, తక్కువ అనే తేడాను మినహాయిస్తే, అవినీతికి ఎవరూ అతీతులు కాకపోవడమే. అందువల్లనే సాధారణ ప్రజల్లో సయితం 'అవకాశం దొరికితే అందరూ అందరే ' అన్న భావం నానాటికీ ప్రబలుతోంది. 'బర్రెలు తినే వాడికంటే గొర్రెలు తినేవాడు మేలుకదా' అంటే అది వేరే సంగతి.
నీతికీ, అవినీతికీ నడుమ పైకి కనబడని చిన్న గీత మాత్రమే విభజనరేఖ. ఓ మోస్తరు దుర్వినియోగం కొందరి దృష్టిలో నీతి బాహ్యం కాదు. ప్రభుత్వం అధికారులకు, సిబ్బందికి సమకూర్చే ఫోన్లూ, కార్లూ ఇందుకు ఉదాహరణ.
ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
తప్పును తప్పు అని చెప్పాలి అంటే అలాంటి తప్పు చేయనివాడు అయివుంటేనే ఆ చెప్పినదానికి సాధికారికత, విశ్వసనీయత వుంటాయి. అందరూ అవే తప్పులు చేసేవారే అయితే ఇక తప్పొప్పులు చెప్పేదెవరు?
గతంలో పత్రికలు కొంతవరకు ఈ తీర్పరి పాత్ర పోషించేవి. సంపాదకీయ వ్యాఖ్యలకు చాలా విలువ వుండేది. ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు సయితం పత్రికల వార్తలకు, సలహాలకు, సూచనలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చేవారు.
మీడియా రంగప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వార్తలకు కూడా రంగూ రుచీ వాసనా వచ్చేసాయి.
వార్తకు ప్రాణం పొయ్యడం కంటే తమ మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు, మీడియా ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు, స్వేచ్చకు అర్ధమే పూర్తిగా మారిపోతుంది. అదే జరుగుతోంది.
మేధావులు, బుద్ధిజీవులు, మంచివాళ్ళు ఏ పేరుతో పిలిస్తేనేమి, అయితేనేం, వాళ్ళు వర్తమాన సామాజిక అంశాల పట్ల తగు విధంగా స్పందించకపోవడానికి ప్రధాన కారణం వారిలో ఎంతోకొంత నైతిక బలం కొరవడడం ఒక కారణం అయితే, మంచి చెప్పి మాటలు పడడం కంటే, నాడు కురుసభలో భీష్మాదుల మాదిరిగా మౌనాన్ని ఆశ్రయించడం మంచిదనే భావన ప్రబలడం మరో కారణం.
ఉపశృతి:
పక్కవారు చేస్తేనే దుర్వినియోగం అనడానికి ఓ చిన్న జోక్ చెప్పుకుందాం.
గుండె గుభిల్లుమనేలా ఫోను బిల్లు వచ్చింది. నెలనెలా పెరిగిపోతున్న ఫోను బిల్లు గురించి మాట్లాడడానికి ఇంట్లోవున్న నలుగుర్నీ పిలిచాడు ఇంటి యజమాని.
తండ్రి: ఇంతంత బిల్లులు వస్తే ఎలా? నన్ను చూడండి. నేను ఆఫీసులో ఫోను తప్ప ఇంట్లో ఫోనే వాడను. మరి ఇది ఎవరి పని?
భార్య: పగలల్లా నేనూ ఆఫీసులోనే కదా వుండేది. నేనూ మీలాగే అక్కడకిపోయే ఫోన్లు చేస్తుంటాను.
కొడుకు: ఇంటి ఫోను ముట్టుకునే అవసరం నాకేమిటి? నాకు కంపెనీ ఇచ్చిన మొబైల్ వుంది.
పనిపిల్ల: అందరం చేస్తున్నది అదే కదా. ఇక గొడవెందుకు?
(పనిపిల్లకు పనిచేసే ఇల్లే ఆఫీసు కదా!)





(18-09-2022)

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఇదో కళ.....

 ఇందులో నిష్ణాతులకు ఆస్కార్ ఇవ్వాలి. ఒకరు రాసినదానిని తమ పేరుతొ తిరిగి పోస్ట్ చేసుకోవడం ఒక తీరయితే, తమ భావాలకు పెద్దల పేరు తగిలించి వారి కొటేషన్లుగా పోస్ట్ చేయడం ఇంకో తంతు.

దీనికి పేరడీ ఈ కింది చిత్రం. అబ్రహంలింకన్ కాలం నాటికి ఇంటర్నెట్ లేదు. అయినా దాన్ని గురించి ఆయన గారు చెప్పారంటూ ఒక కొటేషన్ ఇవ్వడం నేటి పెడ ధోరణులకు అద్దం పడుతోంది. దీన్ని చూసయినా 'కాపీ, పేస్టు, ఫార్వార్డ్ ' బాపతు వాళ్ళ తీరు మారుతుందా అంటే అనుమానమే.



 

చెయ్యి తీస్తాను అన్ననోటితో క్షమాపణ చెప్పిన రోశయ్య

 

 

ఉప్పూ కారం తినే వాడికి కోపం రావడం సహజం. అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి వాడు అలిగితే ఏమి జరుగుతుందో కృష్ణుడు ఒక పద్యంలో చెప్పాడు. అలాగే ఒకసారి రోశయ్య గారెకి కూడా కోపం వచ్చింది. అదీ నిండు శాసన సభలో. ఎప్పుడూ చమత్కారాలు రాలుతుండే ఆయన నోటి వెంట పరుష పదజాలాలు దొర్లడం చూసి ప్రెస్ గేలరీలో ఉన్న పాత్రికేయులు సయితం అవాక్కయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీడీపీ సభ్యుడు శ్రీ గాలి ముద్దు కృష్ణమ నాయుడి వైఖరి పట్ల .రోశయ్య గారెకి అసహనం కలిగింది. అది ఆగ్రహంగా మారింది. తీవ్ర పదజాలం వాడారు. బహుశా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శ్రీ రోశయ్య సంయమనం కోల్పోయి మాట్లాడడం ఇదే ప్రధమం కావచ్చు. ఆ రోజు సభలో ముద్దుకృష్ణమ నాయుడిని ఉద్దేశించి ఆవేశంతో ఊగిపోతూ ఆయన ఇలా అన్నారు:

“ఏమిటా గద్దింపులు? నువ్వు పెద్ద మగాడివా!  ఏమిటా చెయ్యి? చెయ్యి తీస్తాను జాగ్రత్త! ఏమనుకుంటున్నావో!”

తర్వాత తాను అన్న మాటలకు ఆయనే సభలో క్షమాపణ చెప్పారు.

“నా కారణంగా ప్రజాధనం లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయిపోతుందని, ఈ సభ గౌరవం తగ్గిపోతుందని నాక్కూడా భావన కలిగింది. నేను ఇరవై ఎనిమిదో తారీకున మాట్లాడుతూ, గౌరవనీయులు శ్రీ ముద్దు కృష్ణమ నాయుడు గారి గురించి కఠినంగా మాట్లాడినటువంటి మాట నేను విత్ డ్రా చేసుకుంటున్నాను. నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను”      

ఒకప్పుడు ఇలా ఉండేవి శాసన సభలు


శ్రీ రోశయ్యతో రచయిత)


(15-09-2022)

 

Video LINK:

https://youtu.be/hC9GdIctEKE

 


12, సెప్టెంబర్ 2022, సోమవారం

యాదాద్రి నిర్మాణం ఓ అద్భుతం

 ఆధునిక హంగులతో పురాతన నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న యాదాద్రి దేవాలయం నిజంగా ఒక అద్భుతం.

పునర్నిర్మించిన ఈ గుడి గురించి పత్రికల్లో చదవడం, టీవీల్లో చూడడం తప్పిస్తే కళ్ళారా చూసింది లేదు. గతంలో ఎన్నోసార్లు దర్శించుకున్న యాదగిరిగుట్ట దేవాలయమే మనసులో ముద్ర పడిపోయిన కారణం కావచ్చు,  ఈరోజు ఆ దేవళం  ముందు నిలబడి చూస్తుంటే ఇంత గొప్ప గుడిని ఇంత స్వల్ప కాలంలో ఎలా కట్టారా అని ఆశ్చర్యం వేసింది.

మా మనుమరాలు జీవిక పుట్టు వెంట్రులకు తీయించడం కోసం ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట  వెళ్ళాము. మిత్రుడు జ్వాలా మాట సాయం బాగా అక్కరకు వచ్చింది. ఏ గుడికి పోయేవారు అయినా మనసులో  బలంగా కోరుకునే మంచి దైవ  దర్శనం లభించింది. ఈ విషయంలో సహకరించిన దేవాలయం అధికారులు శ్రీయుతులు రాజు, రామప్రసాదరెడ్డి, మహేష్, శంకర్ లకు ధన్యవాదాలు.   

ఎనిమిది నెలల పిల్లకు వెంట్రుకలు తీయించడం ఎలా అని మధన పడిన మాట వాస్తవం. అయితే దేవస్థానం వారి క్షురకుడు ఎంతో నైపుణ్యంగా ఆ పని ఇట్టే పూర్తి చేశాడు. ఏడ్చి గోల చేస్తుందేమో అనుకుంటే ఆ యావత్తు కార్యక్రమాన్ని జీవిక ఆనందంగా ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించింది.

పీవీఆర్కే గారు అన్నట్టు నాహం కర్తా. అంతా ఆ భగవంతుడి లీలావిలాసం.   














(12-09-2022)

11, సెప్టెంబర్ 2022, ఆదివారం

అమెరికా ఉలిక్కిపడ్డ రోజు – భండారు శ్రీనివాసరావు

 

(Published in Mana Telangana today 11-09-2022, Sunday)


భయపెట్టడమే తప్ప భయమంటే ఏమిటో తెలియని అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటిసారి ఉలిక్కి పడింది 2001 సెప్టెంబర్ పదకొండవ తేదీన, భయంతో బివ్వేరపోవడం యావత్ ప్రపంచం తొలిసారిగా ఆశ్చర్యపోతూ గమనించింది. 

అమెరికా గడ్డమీద ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వలస వచ్చిన వారికీ, నేటివ్ రెడ్ ఇండియన్లకు నడుమ జరిగిన పోరాటాలు మినహాయిస్తే అభివృద్ధి చెందిన దేశంగా, అన్ని దేశాల్లో తలమానికంగా రూపొందిన తర్వాత అక్కడ యుద్ధాలు జరిగింది లేదు. ఆ దేశంపై ఒక దాడి జరిగిందీ లేదు. అమెరికన్ సైన్యాలు ఎక్కడో సుదూరంగా ఉన్న వియత్నాం, కొరియావంటి చిన్న దేశాలపై జరిగిన దాడుల్లో పాల్గొన్నాయి కానీ, ఆ దేశం మీద దండెత్తిన దేశం అంటూ లేదు, ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధంలోనో, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలోనో అరుదుగా జరిగిన సంఘటనలు తప్ప.

అలాంటి దేశంపై ఇటీవలి కాలంలో మొట్టమొదటి విదేశీ దాడి రెండువేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ పదకొండో తేదీన జరిగింది. అమెరికాకు గర్వకారణంగా నిలచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆకాశ హర్మ్యాల జంటను విమానాలతో డీకొట్టి కూల్చివేయడం ఒక్కటే అయితే దాడి అనలేము కానీ, అమెరికా రక్షణ శాఖకు చెందిన ప్రతిష్టాత్మక కార్యాలయం ‘పెంటగాన్’ పై జరిగిన దాడితో కలిపి చూస్తే ఇది నిస్సంశయంగా అమెరికా దేశంపై శత్రు మూకల దాడిగానే పరిగణించాలి. 

ఈ దాడితో బెంబేలెత్తిపోయిన అగ్రదేశం ఇటువంటివి పునరావృతం కాకుండా అనేక భద్రతా చర్యలు తీసుకుంది. ఫలితంగా స్వేచ్చా ప్రియులయిన అమెరికన్ పౌరులు భద్రత పేరుతొ తీసుకుంటున్న అనేక చర్యలతో విసుగెత్తి పోతున్నారు కూడా.

కాగా, అమెరికన్ ప్రభుత్వం తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది. దాడికి కారకుడయిన ఉగ్రవాద నాయకుడు లాడెన్ ను మట్టుబెట్టేంత వరకు నిద్రపోలేదు. పాకీస్తాన్ లో తలదాచుకున్న లాడెన్ ఆచూకీ పట్టుకుని అతడ్ని కాల్చి చంపడమే కాకుండా లాడెన్ భౌతిక కాయాన్ని సముద్ర జలాల్లో ముంచేసి, అతడి శవాన్ని జలచరాలకు ఆహారంగా చేసింది. లాడెన్ ను అమెరికన్ సీక్రెట్ పోలీసులు వేటాడి వధిస్తున్న దృశ్యాలను ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ లో కూర్చుని చూడడం జరిగిందంటే తనపై జరిగిన దాడికి ఆ దేశం ఎంతగా కక్ష పెంచుకున్నదో అర్ధం అవుతుంది.

అప్పటిదాకా ప్రపంచంలో అన్ని దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదభూతం ఎంత ప్రమాదకరమో అన్నది అమెరికాకు కూడా తెలిసివచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నలిపివేస్తామని ప్రకటనలు చేసే దేశాల జాబితాలో అమెరికా చేరిపోయింది. 

అయితే ఇవన్నీ షరా మామూలు ప్రకటనలుగా మిగిలిపోకూడదు. ఉగ్రవాదం ఒక దేశాన్ని బలహీన పరచడం తమకు రాజకీయంగా మంచిదే అని అనేక దేశాలు తలపోస్తూ వుండడం అంత గోప్యమేమీ కాదు. తమ ప్రత్యర్ధి దేశం ఉగ్రవాదపు కబంధ హస్తాలలో నలిగిపోవడం కొందరికి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పెంచి పోషించే ఉగ్రవాద భూతానికి కృతజ్ఞత ఉంటుందని ఆశించడం అత్యాశే అని అనేక దేశాల విషయంలో పలుమార్లు రుజువయింది. ఎందుకంటే ఉగ్రవాద ఉన్మాదులకు వివేచన పూజ్యం. వారికి తలకెక్కిన తలతిక్క మినహా మరేదీ తలకెక్కదు. నాశనం, వినాశనం అనే రెండు పదాలే తప్ప వారికి శాంతి వచనాలు తెలవ్వు. ‘చంపు, లేదా చచ్చిపో’ అనే రెండే రెండు పదాలు వంటబట్టించుకున్న మరమనుషుల వంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు.

ఈ ఉగ్రవాదుల బలం అవతలి వాళ్ళలోని చావు భయం. చావు భయం లేకపోవడం ఉగ్రవాదులకు ఉన్న మరో బలం. సంఖ్యాబలం రీత్యా చూస్తే అత్యంత బలహీనులయిన వీరు ఇంతగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం, వారిని ఎదురించాల్సిన శక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం. అధిక సంఖ్యలో వున్న మంచివారి మౌనమే అల్పసంఖ్యలో వున్న ఉగ్రవాదుల బలం.

ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు జెడలు విదిల్చినా వీరందరూ గళం కలిపి చెప్పే మాట ఒక్కటే. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని. కానీ కార్యాచరణ శూన్యం.

కలిసికట్టుగా అందరూ కృషి చేస్తే ఉగ్రవాద భూతాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అంత అసాధ్యమేమీ కాదు. కానీ ఈ విషయంలో ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి స్వార్ధాలు వారివి.

వీటి నుంచి ప్రపంచ దేశాలు బయట పడనంత వరకు ఉగ్రవాదులు తోకలు ఝాడిస్తూనే వుంటారు




తలకెక్కని చరిత్ర పాఠాలు – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Jyothi today, 11-09-2022, SUNDAY)


9-11

తొమ్మిదో నెల, పదకొండో తేదీని సూచించే ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే  రెండు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా 2001 సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచి పోలేకుండా వున్నారు. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు ఈనాటికీ కదలాడుతూనేవున్నాయి. 

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబసభ్యులు, ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి, తమనే కబళించడానికి వచ్చిన తరువాత కానీ ఆ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కానీ ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే వుంది. ఉగ్రవాద భూతపు వికృత పోకడలు అడ్డుకట్ట లేకుండా అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే వున్నాయి. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.

సెప్టెంబర్ దాడి గురించి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని తాను ప్రయాణిస్తున్న విమానంతోనే డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. 1968 సెప్టెంబర్ లో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి బహుశా ఆ నెలలోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు. 

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు. విడుదల అవుతానన్న ఆశ ఏకోశానా లేకుండా ఇజ్రాయెల్ జైల్లో మగ్గుతున్న అత్తా, అమెరికా పూనిక కారణంగానే విడుదల అయ్యాడు. అలా బయట పడ్డవాడే తదనంతర కాలంలో అమెరికా కలలో ఊహించని విధ్వంసానికి కారకుడయ్యాడు. చరిత్రలో అప్పుడప్పుడూ ఇలాటి విడ్డూరాలు నమోదవుతూవుంటాయి. 

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

2001లో అమెరికాలో ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు ఆ దేశంతో పాటు, ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ వ్యవధిలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

గతంలో హైదరాబాదులో, ముంబైలో, ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతోనే సరిపుచ్చుకోరు.

సెప్టెంబరు తొమ్మిదో తేదీని గుర్తుంచుకుని ఆ దుర్ఘటనను తలచుకోవడం ఒక్కటే కాదు, మళ్ళీ అలాంటి దుర్దినాలు పునరావృతం కాకుండా ఏం చేయాలో కూడా ఆలోచించుకుంటారు.

అటువంటి రాజకీయ నాయకులు ఈనాడు క్రమంగా కనుమరుగవుతున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను అంటూ తొడగొట్టేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది మరో విషాదం




ఎట్టకేలకు జనం మధ్యకు రాహుల్ గాంధి

 (Published in Andhra Prabha today. 11-09-2022, Sunday)

 

‘ఈ యాత్ర వల్ల రాహుల్ గాంధీకి వ్యక్తిగతమైన లబ్ది చేకూరుతుందా?’

ఒక టీవీ విలేకరి నన్ను ఇంటర్వ్యూలో అడిగిన ఈ ప్రశ్న కొంత ఆలోచింప చేసింది. ఇలాంటి పాదయాత్రల వల్ల ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చి లాభపడిన సందర్భాలు గతంలో వున్నాయి. అయితే వ్యక్తిగతంగా ఒక నాయకుడికి  లభించే లాభం ఏమిటి?

సాధారణంగా కష్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేది వాడుక. అయితే, ఈ రాహుల్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు. అంటే ఏమిటన్న మాట. కింది నుంచి పైకి.

జాతీయ పార్టీ  కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం చాలా దిగజారివుంది.  ఆ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధి ప్రతిష్ఠ కూడా అధమాధమంగానే  వుందని వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. అనడమే కాదు, గులాం నబి ఆజాద్ వంటి సీనియర్లు కూడా పార్టీ విడిచి వెడుతూ కొంత  బురదను రాహుల్ గాంధీపై చల్లి వెడుతున్నారు. అందుకే కాబోలు అడుగంటుతున్న వ్యక్తిగత ప్రతిష్టను అట్టడుగునుంచి పైకి తెచ్చుకుంటున్నసంగతి తెలియచెప్పే సంకేతంలా కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు ఈ యాత్ర తలపెట్టారని అనుకోవాలి. యాత్రాఫలం సిద్ధిస్తే అది రాహుల్ కు వ్యక్తిగత లబ్ది కిందికే వస్తుంది కదా!  యాత్రాఫలం అంటే కేంద్రంలో అధికార అందలం దక్కడం అనే అర్ధం కాదు. ఒక నాయకుడిగా తన ప్రతిష్టను పెంచుకోవడం, సమర్థతను నిరూపించుకోవడం.  

కాంగ్రెస్ పార్టీలో మేధావులకు కొరత లేదు. వాళ్ళ మేధాశక్తి పట్ల సందేహాలు పెట్టుకోనక్కరలేదు కానీ వారికి  అట్టడుగు గ్రామ స్థాయిలో పరిస్థితులు, వాస్తవాలు తెలియవన్న సంగతి ఇప్పటికే అనేకసార్లు రుజువయింది. అయితే ఈ భారత్ జోడో యాత్ర అనే ఆయుధాన్ని రాహుల్ చేతిలో పెట్ట్డడం మాత్రం వారి మేధస్సుకు మచ్చుతునక అనే  చెప్పాలి.

ఈ యాత్ర సందర్భంగా రాహుల్ 3570 కిలోమీటర్లు నడుస్తారు. పన్నెండు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో  రాహుల్ కాలినడకన తిరుగుతారు. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలని కలుసుకుంటారు. ఈ నెల ఏడో తేదీన కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర   సుమారు అయిదు మాసాలు కొనసాగుతుందని చెబుతున్నారు. అన్ని రోజులు దేశంలోని ఆయా ప్రాంతాల్లో రాహుల్ వార్తల లోని వ్యక్తిగా వుంటారు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి  ఒక రకంగా ఇది రాజకీయంగా లాభదాయకమే.

కాంగ్రెస్ పార్టీది అనువంశిక పాలన అనేది ప్రత్యర్థులు చేసే ప్రధాన అభియోగం. అలాగే నెహ్రూ గాంధి వారసులుగా దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి  ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీని ఒక పావులా వాడుకుంటోందని అంటుంటారు. అయితే సోనియా, రాహుల్ వీరిద్దరికీ తీరని అధికారదాహం ఉందనే  ఆరోపణలు నిజానికి నిజం కావు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని పదవిని సోనియా వదులుకున్నారు. అవకాశం రాకపోయినా, అవకాశం కల్పించుకుని  ప్రధాని పదవి చేపట్టడానికి అన్ని అవకాశాలు సిద్ధాన్నంలా ఎదురుగా ఉన్నప్పటికీ  రాహుల్ అప్పట్లో అందుకు సుముఖత చూపలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఆయనది అదే తీరు. వచ్చే అక్టోబరులో కాంగ్రెస్ అధక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయన సుదీర్ఘంగా సాగే ఈ యాత్ర తలపెట్టడం ద్వారా, పార్టీ అధ్యక్ష పదవిపై తనకు మక్కువ లేదని  మరోసారి పరోక్షంగా చెప్పదలచుకున్నారేమో తెలియదు. లేదా సమర్ధత నిరూపించుకున్న తర్వాతనే పదవిని కోరుకోవాలనే బలమైన పట్టుదల ఆయన చేత ఈ యాత్ర చేయిస్తున్నదేమో తెలియదు.      

సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే,  చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది. 


ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. యువకుడు కాబట్టి కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించగలుగుతారని భావించవచ్చు. 

ఈ పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. 

ప్రజల ఇబ్బందులను, కడగండ్లను దగ్గరనుంచి కళ్ళారా చూడగలిగే అరుదైన  అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే యాత్రా ఫలసిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. 

2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు పూర్వం చంద్రబాబు ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి శ్ర్రీకాకుళం జిల్లా ‘ఇచ్చాపురం’లోనే ముగిసింది. ఆ ఊరు పేరుకు తగ్గట్టే, మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ‘ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం,  ఏ పేరుతొ అయితేనేం, నాయకులు తమ  రమ్య హర్మ్య భవనాలు  ఒదిలి, కొద్ది కాలం అయినా సాధారణ ప్రజలతో మమేకం అయ్యే వీలు వీటితో  ఏర్పడింది.

రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. ప్రజలు అల్పసంతోషులు కదా!


ఉపశృతి:

‘పులి పులే. మేక మేకే. అయితే..’ ఆగాడు  ఏకాంబరం.

‘ఈ మాట చెప్పడానికి,  అయితే అంటూ ఆ సన్నాయినొక్కులు ఎందుకు? పులి పులే కదా!’ అన్నాడు పీతాంబరం. 

‘తొందరపడకు పీతాంబరం. కొన్ని సందర్భాలలో ఇలా అంటే కుదరదు. పులి మేకలకు నాయకత్వం వహించాలి అంటే మేకలకు ముందు నడవాలి. మేకలను ఎత్తుకుపోదామని చూసేవాళ్ళు పులిని చూసి బెదిరి పారిపోతారు. అదే పులి మేకలకు వెనక నడిస్తే, ఆ మేకల మందను చూసి ఎవరూ భయపడరు. కాబట్టి నాయకుడు అన్నవాడు పులి మాదిరిగా అనుచరులకు ముందు నడవాలి. ముందుండి నడపాలి.  వెనక వుంటానంటే కుదరదు. వెనక వుంటే పులి కూడా మేక మాదిరే.’