2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు

 (Published in SAKSHI daily on 02-09-2022, FRIDAY, today)

సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే వుంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే వుంది. ఆ విషాద ఘడియల్లో దేశవ్యాప్తంగా మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వై.ఎస్.ఆర్. ఆ పేరు ఇక ముందు కూడా వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.
'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.
'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.
అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి.మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వై.ఎస్.ఆర్., అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.
1978 నుంచి ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వై.ఎస్.ఆర్. కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసనసభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.
రాజశేఖరరెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.
ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.
2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టుడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెనవేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, 'రెండు కన్నీటి బొట్లు' రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది.



(02-09-2022)

1, సెప్టెంబర్ 2022, గురువారం

కాకి చెప్పిన భగవద్గీత

 

రాయకపోతే చచ్చిపోతానేమో అనే కసి పుట్టేవరకు కాగితం మీద కలం పెట్టకు, అప్పుడే మంచి కధ రాయగలుగుతావు అని ఎక్కడో, ఎప్పుడో చదివాను. ఈ వాక్యం ఈనాటి సోషల్ మీడియా ఫార్వార్డ్, షేరింగ్ వ్యవహారానికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. ఇది నలుగురూ చదివితే ఎంత బాగుంటుందో అని గట్టిగా అనిపించేవరకు ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం మానుకుంటే మంచి మంచి విషయాలు అందరికీ చేరతాయి. అలా కాకుండా కంటికి కనిపించిన ప్రతిదీ పక్క వాళ్లకు తోసేస్తుంటే వాళ్లకు మిగిలేది నానా చెత్త మాత్రమే. పనిలేక వాటిని పంపిన వారిని మౌనంగా తిట్టుకుంటూ వాటిని పనిపెట్టుకుని డిలిట్ చేస్తూ కూర్చోవడమే.
ఈ అభిప్రాయం నాలో పాతుకుపోయిన కారణంగా నా పోస్టుల్లో ఈ ఫార్వార్డులు, సేకరణలు, ఎత్తిపోతలు చాలా చాలా తక్కువ.
అయితే మానవ మనస్తత్వాలను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కింది పోస్టు నేను నాకై పెట్టుకున్న నియమాన్ని పక్కకు పెట్టేలా చేసింది. అందుకే షేర్ చేస్తున్నాను. అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలు. ఆ పోస్టు ఏమిటంటే:
“నాపేరు "కాకి". నాకది మనుషులు పెట్టిన పేరు. "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.
నాకు నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు నా పక్క చెట్టు మీద ఉండే కోయిల సంతానం. కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం, పెంచడం తెలియదు. కానీ, మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లి కన్న బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.
ఆ రోజు ఆదివారం జోరువాన. బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను.
పిల్లకాకులేమో ఆకలి అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి. ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.
"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా". అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను.
“ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వాన చినుకులు విసిరిన రాళ్ళలా శరీరానికి తూట్లు పెడుతున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను.
“సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ. ముందు పచ్చడి, తరవాత కూర, ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ.
మొత్తం నలుగురు. ఒకతను మాత్రం ముసలివాడు, 70 ఏళ్ళవరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం, ఎర్రటి రంగులో మామిడి పచ్చడి.
"అమ్మా, తాతయ్యకి కూర వేయొచ్చుగా" అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు.
వాడు అలా అనగానే, ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ, "ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను. తిండి పెట్టడమే ఎక్కువ. దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలంట కూరలు. ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ.
ఆమెని అలా చూసి సంబంధం లేని నాకే భయం వేసింది. ఇంక ఆ పిల్లోడెంత.
అక్కడ అంత జరుగుతున్నా ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు,
"ఏవే ఇంకొంచెం సాంబారు పోయి"అని అడిగి పోయించుకుని తింటున్నాడు.
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి, చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు. వాడి ముఖాన్ని వాడు రోజూ అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో, ఏమో!
పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా, త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో. మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటా, కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి, మొఖం ఎర్రగా మారిపోయింది.
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ, అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు . అయ్యో! ఎంత దారుణం, పాపం పెద్దాయన.
వాళ్లు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ మిగిలిన అన్నం పడేసాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి.
"పెద్దాయనా! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని, నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.
సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా, ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా. ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు. కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా! అని అక్కడ వాలాను. ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయనది. ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి.
"అయ్యా! పిండం పెట్టి కాకుల్ని పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ. ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది. నల్లటి నా మొఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నాయి.
వార్నీ! మనుషులు! మీరేం మనుషులురా బాబు! బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా?
పోవడం కోసం శాపనార్ధాలు పెట్టి, చనిపోయిన తర్వాత కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా?
బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతిని, విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా?
ప్రాణం ఉన్నంత కాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచె పెడతారా!
పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు. అసలు వీడ్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి.
వెంటనే గాల్లోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను. అందరూ సరే అన్నారు.
గంటా, రెండు గంటలు. అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది.
బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో! అందుకే ఇప్పుడు తినడానికి కాకులు రావట్లేదు అని ఒకడు, ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు, అని ఇంకొకరు, నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది. తలదించుకుని అలాగే ఉండిపోయాడు. పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్నా చచ్చిపోయినట్టు అనిపించివుంటుంది అతనికి.
నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను.
చివరి మాట : కాకుల శరీరం నలుపు కావచ్చు, కానీ మనసు మాత్రం తెలుపు.

NOTE: Courtesy Image Owner




NOTE: Courtesy Image Owner

31, ఆగస్టు 2022, బుధవారం

మిహాయిల్ గోర్భచెవ్ ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

 


తారాజువ్వలా దూసుకుపోయి చాలా తక్కువ సమయంలో విశ్వవ్యాప్త ప్రచారం పొందడంలోనూ, అలాగే నేలకు రాలిపోయి, జీవించి వుండగానే దుర్భరమైన నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యే దారుణ పరిస్తితికి చేరుకునే విషయంలోనూ మాజీ సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గీవిచ్ గోర్భచేవ్ తో పోల్చదగిన మరో రాజకీయవేత్త ఇటీవలి కాలంలో మరొకరు కానరారు.
1985 లో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరి గా నియమితులయినప్పుడు నుదిటికి కొంచెం ఎగువన లేత ఊదా రంగు పుట్టుమచ్చ కలిగిన ఈ బట్టతల పెద్ద మనిషి ఎవరన్న సందేహాలు స్వదేశంలోనే తలెత్తాయి. అప్పటికి ఆయన వయసు యాభయ్ నాలుగు సంవత్సరాలు మాత్రమె. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయనకు పూర్వం ఈ పదవిని అలంకరించిన వయసుడిగిన నాయకులతో పోలిస్తే ఆయన చాలా చిన్నవయసులోనే ఈ అత్యున్నత పదవికి చేరుకున్నట్టు లెక్క. పొలిటిబ్యూరోలో గోర్భచేవ్ తో అతి సన్నిహితంగా మెలిగే తలనెరిసిన పెద్ద తలకాయలు ఎవ్వరూ రానున్న ఆరేళ్ళ కాలంలో సోవియట్ యూనియన్ భవితవ్యం ఆయన నాయకత్వంలో ఊహాతీతమైన మార్పులకు గురవుతుందని పసికట్టలేకపోయారు. పదవిలోకి వచ్చీరాగానే ఏమాత్రం కాలయాపన చేయకుండా వరసగా అనేక సంస్కరణలకు గోర్భచేవ్ శ్రీకారం చుట్టారు. మానవతాకోణం కలిగిన సోషలిజం నిర్మాణం దిశగా, పాశ్చాత్య ప్రపంచంతో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, ప్రచ్చన్నయుద్ధానికి ముగింపు పలుకుతూ విశ్వశాంతి లక్ష్యంగా తలపెట్టిన ఆ సంస్కరణల వేగం చూసి సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులే ముక్కున వేలేసుకునే పరిస్తితి. ఒక్క నికితా కృశ్చెవ్ హయాములో మినహాయిస్తే, సోవియట్ యూనియన్ కి ఇది సరి కొత్త అనుభవం.
తాను తలపెట్టిన సమూల సంస్కరణలకు మరింత ఊతం కల్పించే ఉద్దేశ్యంతో గోర్భచేవ్ ‘పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), గ్లాస్ నోస్త్ (దాపరికం లేని పాలన)’ అనే ముద్దు పేర్లతో రెండు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఆనతి కాలంలోనే ఇవి రెండూ అత్యంత ప్రజాదరణకు నోచుకున్నాయి. గోర్భచేవ్ భావించినట్టే ఆయన ఈ వ్యూహం మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చింది.
వాటిని గురించి దేశ వ్యాప్తంగా గోర్భచేవ్ ఇస్తూవచ్చిన ప్రసంగాల టేపులకు అపరిమితమైన గిరాకీ ఏర్పడింది. వాటిని నల్లబజారులో అధిక ధరలకు, అంటే అయిదువందల రూబుళ్ళు పెట్టి విరగబడి కొనే పరిస్తితులు జనంలో నానాటికీ పెరుగుతున్న అభిమానానికి కొలమానాలుగా మారాయి అని గోర్భచేవ్ జీవిత చరిత్ర రాసిన విలియం టాబ్ మాన్ పేర్కొన్నారు.
నేను 1987 నుంచి వరకు దాదాపు అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేశాను. ఆ రోజుల్లో మిహాయిల్ గోర్భచేవ్ పేరు మొత్తం సోవియట్ యూనియన్ లోనే కాదు యావత్ ప్రపంచదేశాల్లో మారుమోగుతూ వుండేది. అప్పటికి రెండేళ్ళ క్రితమే లో గోర్భచేవ్ సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అంటే ఆ దేశంలో తిరుగులేని అధికారాన్ని చెలాయించగలిగే అధికారం ఉన్న ఏకైక పదవి. అంతటి ఎదురులేని అధికారం గుప్పెట్లో ఉందనే ధైర్యమే కాబోలు వారి చేత ఎక్కువ మాట్లాడిస్తుంది. ఈ విషయంలో గోర్భచేవ్ ఒక నాలుగాకులు ఎక్కువ చదివారని అనుకోవచ్చు. మాస్కోలోనే కాదు, యావత్ దేశంలో ఏ మూల టీవీ పెట్టినా, రేడియో పెట్టినా ఆయన ఏదో మాట్లాడుతూ కనిపించేవారు. గంటలు గంటలు ప్రసంగించినా సోవియట్ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వుండేది. ఆయనకు కూడా పత్రికలంటే ప్రాణం. ఏం చేసినా ఏం మాట్లాడినా అది నలుగురికీ తెలియడం అవసరమనే భావన ఆయనది. అధికారం పోయిన తర్వాత కూడా గోర్భచేవ్ ఈ అలవాటును వదులుకోలేదని అయన తర్వాత అధికార పగ్గాలు స్వీకరించిన బోరిస్ ఎల్త్ సిన్ దగ్గర ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన వ్యాచెస్లావ్ కోస్తికొవ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు.
కోమ్సమాలొస్కయా ప్రావ్దా అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్భచెవ్ ఒకసారి బోరిస్ ఎల్త్సిన్ విధానాలను తూర్పారబట్టారు. ఆ ఇంటర్వ్యూ చేసింది దిమిత్రీ మురతోవ్. ఆ విలేకరి అంటే గోర్భచెవ్ కు చాలా ఇష్టం. సోవియట్ అధినేతగా రాజీనామా చేసిన తర్వాత గోర్భచెవ్ మురతోవ్ కి ఫోన్ చేసి ఆ పత్రికలో తాను కూడా నెలకోమారు ఒక ఫీచర్ రాస్తానని అడిగారు. అప్పటికే ఆ పత్రిక యాజమాన్య బృందం గ్రూపులుగా విడిపోయి, వాళ్ళలో వాళ్ళు విబేధించుకుంటూ వుండడం వల్ల గోర్భచెవ్ కోరిక నెరవేరలేదు. గోర్భచెవ్ ఆ పత్రికను ఎంచుకోవడానికి కారణం దానికి పాఠకుల్లో ఉన్న ఆదరణ. 1990 ప్రాంతాల్లోనే ఆ పత్రిక సర్క్యులేషన్ రెండుకోట్ల ముప్పయి లక్షలు. అయినా ఆ పత్రికలో పనిచేసేవారిలో ఏర్పడ్డ లుకలుకల కారణంగా క్రమంగా మురతోవ్ వంటి జర్నలిస్టులు ఆ పత్రికను వదిలేశారు. వదిలేసి నొవయా గజేత (న్యూ గెజిట్) అనే పేరుతొ ఒక కొత్త పత్రికను ప్రారంభించారు. పత్రిక అయితే పెట్టారు కానీ దాన్ని నిలబెట్టే ఆర్ధిక స్థోమత వారికి లేదు. సాయం చేసే వారికోసం వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న సమయమది.
అధ్యక్ష పదవిని వీడిన తర్వాత, గోర్భచెవ్ తన ప్రసంగాలు, రచనల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముతో ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గోర్భచెవ్ కు ఆయన స్వదేశంలో మాట ఎలా వున్నా అంతర్జాతీయంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. 1991లో ఆయనకు నోబుల్ శాంతి పురస్కారం లభించింది. ఆయన తన అనుభవాలతో రాసిన ఒక గ్రంధం దాదాపు ఎనభై ప్రపంచ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. కోట్ల సంఖ్యలో ఆ పుస్తకాలు అమ్ముడు పోయాయి. అమెరికాకి పోటీగా నిలచిన సోవియట్ యూనియన్ ఆయన హయాములోనే అంగవంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నం కావడం, రెండు జర్మనీల ఏకీకరణ జరగడం, అణ్వాయుధాల సంఖ్యను భారిగా కుదించడంలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేకానేక కారణాల వల్ల గోర్భచెవ్ కు విశ్వ విఖ్యాతి లభించింది. అంచేత ఆయన అధికారం చేజారిపోయినా భార్య రైసాతో కలసి నిరాడంబరంగా జీవిస్తూ, విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేస్తూ, రచనావ్యాసంగం సాగిస్తూ కాలక్షేపం చేస్తున్న రోజులవి. అయినా ఏదో విధంగా మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలనే కాంక్ష ఆయనలో చావలేదని, అందుకే టీవీలు, పత్రికల ద్వారా (ప్రభుత్వ నిర్వహణలో నుంచి రష్యన్ టెలివిజన్, రేడియోలు బయట పడ్డాయి) తనకు జనంలో ఉన్న ఆదరణను మరింత పెంచుకుని మరోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలనే కోరిక ఆయనలో పాతుకుపోయి వుందని, అందువల్లే పత్రికలను ప్రోత్సహించే పని పెట్టుకున్నారని కూడా గోర్భచెవ్ మీద అపనిందలు వచ్చాయి.
“ఏం చెయ్యాలి, పత్రికను ఎలా నడపాలి అని మేము మల్లగుల్లాలు పడుతున్న సమయంలో 20 IBM 286-x కంప్యూటర్లు మా ఆఫీసుకు వచ్చాయి” అని చెప్పాడు మురతోవ్ ఆనందంగా. 1993 నాటికి ఆ కంప్యూటర్లు అత్యంత ఆధునికమైనవి. గోర్భచెవ్ పంపిన ఆ కంప్యూటర్లతోనే మేము పత్రికను నడపడం ప్రారంభించాము. అంతేకాదు, గోర్భచెవ్ స్వయంగా నొవయ గజిత పత్రికలో మూడు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టారు”అని మురతోవ్ చెప్పారు. అలాగే మరోసారి డబ్బు అవసరం పడ్డప్పుడు లక్ష డాలర్లు మా పత్రిక బ్యాంకు ఖాతాకు జమ చేసారని కూడా ఆయన వెల్లడించారు.
“1995లో రష్యాలో సెల్ ఫోన్లు చాలా అరుదు. ఒకసారి గోర్భచెవ్ దంపతులను కలవడానికి వారింటికి వెళ్లాను. మాటామంతీ అయిన తర్వాత రైసా గోర్భచెవా ఒక అందమైన పెట్టెను నా చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే అందులో మొబైల్ ఫోను వుంది. అవసరమైన సందర్భాలలో లాండ్ లైన్ కి ఫోను చేసి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటోందని అంచేత మొబైల్ ఫోను వుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని గోర్భచెవ్ మీతో చెప్పమన్నారు” అందావిడ నాతొ. నాపట్ల ఆయన చూపించిన వాత్సల్యం మరవలేను” అని చెప్పుకొచ్చారు మురతోవ్.
“ఇప్పటికీ ఆ మొబైల్ ఫోను మా పత్రికాఫీసులో మ్యూజియంలో వుంది” అన్నారాయన.
“పత్రికల్లో పనిచేసేవారన్నా కూడా గోర్భచెవ్ ఎంతో ఆదరణ చూపేవారు. ఒక రిపోర్టర్ ఆఉపత్రిలొ వుంటేయాభయ్ వేల డాలర్లు ఆర్ధిక సయం చేసి ఆదుకున్నారు. ఆయన ఇలాంటి సాయాలు జర్నలిస్టులకి అనేకం చేస్తుండేవారు” అని మురతోవ్ చెప్పారు కృతజ్ఞతగా.
గోర్భచెవ్ అరెస్టు
1991, ఆగస్టు 18.
క్రిమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్ వ్లాదిమిర్ కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. వెంటనే ఒకనాటి సోవియట్ అధినేత నికితా కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్ యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త ఒప్పందంపై ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్న బృందం ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆరోజు ప్రెసిడెంట్ గోర్భచెవ్ వేసవి విడిదిలో ఏమి జరిగింది అనే విషయంలో కూడా విభిన్న కధనాలు వున్నాయి. తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్ కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం. అయితే అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమిత పడ్డట్టు కనిపించింది. ఆ తరువాత వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత ఫోరొస్ విడిదిలోనే గోర్భచేవ్ దంపతులు గృహ నిర్బంధంలో వుండిపోయారు. తరువాత రైసా గోర్భచేవ్ మరణించారు. గృహంలో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా బాహ్యం భయంగా రోజులు గడిపారు. ఏది తిందామన్నా భయమే. దేంట్లో విషం కలిపారో తెలవదు ని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు , ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం, చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆ రోజు ఆ విడిది లో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అలా అనేక ఉద్దానపతనాలు చూసిన మిహాయిల్ గోర్భచేవ్, ప్రచ్చన్న యుద్ధ శకానికి చరమగీతం పాడిన తుట్టతుది సోవియట్ నాయకుడు మిహాయిల్ గోర్భచేవ్ తన తొంభయి ఒకటవ ఏట రాత్రి కన్ను మూశారు. (31-08-2022)

29, ఆగస్టు 2022, సోమవారం

హక్కులకు సైతం హద్దులు వుండాలి – భండారు శ్రీనివాసరావు

 

“పత్రికలు చదవను. టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం” అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.
భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్థల ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.
“విద్యాసంస్థలు బంద్ అని టీవీల్లో స్క్రోలింగులు కనబడగానే మా అమ్మాయి బడికి వెళ్ళకుండా ఇంట్లో వుండిపోతుంది. యెంత చెప్పినా వినదు. ఇక స్కూళ్ళు కూడా అలాగే మూసేస్తున్నారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్నభయాందోళనల వల్లే”.
ఈ మాటలు అన్నది సాక్షాత్తూ ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ అంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజంగా నిజం.
అప్పుడు నగరంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయల్ దేశాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. “ఆ దేశంలో యెంత పెద్ద హింసాత్మక సంఘటన జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని లోపలి పేజీల్లో ప్రచురిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని ప్రముఖంగా మొదటి పేజీల్లో వేస్తుంది. మన దగ్గర మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. స్తానికంగా పరిమితమయిన సంఘటనలను సార్వత్రికం చేసి వార్తలు ప్రచారం చేయడం వల్ల లేనిపోని అనర్ధాలు జరుగుతున్నాయి.”
ఇతరుల హక్కులకు భంగం కలగకుండా ఉద్యమాలను నిర్వహించుకోవాలని హితవు పలికారు.
“రోడ్ల మీద భైఠాయించి ఇతరుల హక్కులకు భంగం కలిగించే స్వేచ్చ ఆందోళనకారులకు ఎక్కడిద”ని నిలదీశారు.
ఖాన్ గారి ఈ భావజాలంతో ఏకీభవించాల్సిన అవసరం వుందని కాదు కానీ, ఈ అంశాన్ని గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయిందని మాత్రం చెప్పవచ్చు.

‘చేతులు బార్లా జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతివేలి కొనభాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఆ స్వేచ్చ’ అని ఓ ఆంగ్ల సామెత వుంది. అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.


మేధావులమని అనుకుంటున్నవాళ్ళు గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్థలన్నీ ఈ ఏడుదశాబ్దాల పైచిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్థానాల్లో , చట్టసభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు, పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ,
వ్యాపారకళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి. పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్థలు, కాలక్రమేణా ప్రత్యర్ధులపై పైచేయి కోసం కత్తులు దూస్తున్నాయి.
పత్రికలను, మీడియాను అడ్డంపెట్టుకుంటూ, సంస్థలకు, వ్యవస్థలకు నాయకులమని సాకుగా చూపుతూ ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.
తాము ప్రాతినిధ్యం వహించే సంస్థల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ, తమ రాతలతో, చేతలతో, చేష్టలతో, రెచ్చగొట్టే మాటలతో, వ్యాఖ్యలతో, ప్రవర్తనతో సమాజానికి సంకటంగా తయారయిన వారు, వారు ఎవరయినా సరే, ఆ వ్యక్తి -
గ్రామస్థాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు, బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు, ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు, రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే అధినేత కావచ్చు, పార్ట్ టైం విలేకరి కావచ్చు, ప్రధాన సంపాదకుడు కావచ్చు,
ఏ స్తాయిలో వున్నా, ఏ హోదాలో వున్నా సరే! ఖండనకు అర్హులే. విమర్శకు పాత్రులే!
ఏదో ఒక పేరుతొ, ఏదో ఒక సాకుతో అలాటివారిని కాపాడాలని అనుకోవడం, వెన్ను కాయాలని తలపోయడం కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది.

(ఘాటుగా ఉందా! ఏమో అలా రాయాలని అనిపించింది)

28, ఆగస్టు 2022, ఆదివారం

నాకు పరిచయం అయిన మొదటి జర్నలిస్టు

 కూచి గోపాల కృష్ణ.

పెద్ద పెద్ద మీసాలు. ఎవర్నీ లెక్కచేయనితనం. వాడెంత వీడెంత అనే మాటలు. ఆ గుబురు  మీసాల మాటున మందహాసం. లెక్కచేయని తనం చాటున మొక్కవోని ఆత్మ విశ్వాసం. అహంకారపు మాటల వెనక అతి సున్నితత్వం. ఇవన్నీ కలబోస్తే కూచి గోపాల కృష్ణ.

ఆయనతో యాభయ్ ఏళ్ళ పైచిలుకు పరిచయం. బెజవాడ గాంధి నగరం జింఖాన క్లబ్ దగ్గర నివాసం ఆయనది. పెద్ద పెద్ద సీనియర్ రిపోర్తర్లకి కూడా లేని సైకిల్ వైభోగం. బీటు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐ.పి.ఎస్. అధికారి వరకు పరిచయాలు. కరకుతనం, భోళాతనం కలగలిపిన గొప్ప పీఆర్ వ్యక్తిత్వం.

ఒక జర్నలిస్టు సంఘంలో మంచి జర్నలిస్టు అనిపించుకున్నాడు అంటే దాని వెనుక అతడి కుటుంబ సభ్యుల మంచితనం కూడా వుంటుంది. కూచి గోపాల కృష్ణకు దక్కిన అదృష్టం అది. పిల్లలు ప్రయోజకులు అయ్యారు. వారిని కట్టుకున్న వాళ్ళు మరింత ప్రయోజకులు అయ్యారు.

నిన్న శనివారం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో కూచి గోపాలకృష్ణ ప్రధమ వర్ధంతి  సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. వల్లీశ్వర్, నందిరాజు రాధాకృష్ణ, రెంటాల జయదేవ్ మరికొందరు జర్నలిస్టు మితృలు కూచి గోపాలకృష్ణతో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కుటుంబ సభ్యులు మధు, శోభ, జీవీ రాము, తురగా ఫౌండేషన్ సభ్యులు శారద, రాధిక  కార్యక్రమంలో పాల్గొన్నారు.






(28-08-2022)

 

రసరమ్య పుస్తకం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today, 28-08-2022, Sunday)


చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ, పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే  పాతసంగతులు గుర్తుచేసుకునే చాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నావాటిని  విన్న జనం మొహానే నవ్వుతారు. అయితే,   చిన్నతనంలో ఏ గాలి  తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ,  సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే, చిన్నప్పటి చిల్లర జీవితానికి కూడా  ‘గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే  వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకుంటే అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా, రివ్యూలు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. కాకపొతే, ఈ మధ్య  వీటిని కూడా “రాయించి, వేయించు కోవాల్సి” వస్తోందని కొందరు గిట్టనివాళ్ళంటున్నారు. అందుకే ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత కధలూ లేదా బయోగ్రఫీలూ, ఆటోబయోగ్రఫీలు, అనబడే, కొద్దోగొప్పో ఇచ్చి రాయించుకునే ‘జీవిత చరిత్రల’కు  ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా  ముచ్చటపడే రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టి , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ, పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు కాదు కాబట్టీ, వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే, అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో రసరమ్య ఘట్టాలు’ వుండే వుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను  తమ కల్పనాచాతుర్యంతో  సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ  సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతేకాదు, ఆ సన్నివేశాలకు తగిన మసాలాను  దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను  గ్రంధ ప్రచురణకు ముందుగానే, ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి,  పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు. 

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు  కూడా విస్తరిస్తున్నాయి. 

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి  టోనీ బ్లెయిర్, తన జీవితంలోని కొన్ని ఘట్టాలతో “ప్రయాణం” పేరుతొ  ఒక పుస్తకం రాసారు. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని  ‘సన్’ పత్రిక ప్రారంభించింది.  ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక  ఆసక్తికరమయిన  విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు, బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో,  ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై  మరులుపెంచుకున్న టోనీకి  ఆ వ్యామోహంనుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

“ఆలోచించడం మానుకో, ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు, భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి  ప్రధానమంత్రి కాగలడని  ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

‘సన్’ పత్రికలో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం,  మొత్తానికి ఈ చిట్కా పనిచేసింది.

 ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం  హాటు కేకుల్లా ఎగరేసుకు పోయారుట. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని  ప్రేమాయణం కాబట్టి  పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ ప్రయాణం  పుస్తకాన్ని ఫ్రెంచి భాషలో సయితం  ప్రచురించారు.

 ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా! యిరవై నాలుగు పౌండ్లు మీవి  కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది.  

“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984, అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసివచ్చింది (ట) దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!) 

ఇవన్నీ అక్షర సత్యాలు అవునో కాదో తెలియదు. కానీ ఈ సంగతులన్నీ, శ్రీమతి గాంధి అంతరంగికుడు  ఎం.ఎల్ ఫోతేదార్ రాసిన ఒక పుస్తకంలో అక్షరబద్ధం అయ్యాయి.

పెద్ద పెద్ద వ్యక్తులు రాసే ఆత్మకధలు అటుంచి, వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు రాసే పుస్తకాల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. అంచేతే పుస్తక ప్రచురణకర్తలు కూడా ఇటువంటి వారు రాసే ఆత్మకధలకు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురిస్తున్నారు. వాటిల్లో ఇటువంటి కొన్ని సంచలన విషయాలకు మీడియా ద్వారా ముందుగానే  ప్రాచుర్యం కల్పించి సొంత పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు కూడా వారిపై వుంది. 

ప్రముఖులు జీవించి వున్నకాలంలో, వారితో సన్నిహితంగా మెలిగేవారికి ఆ ప్రసిద్దుల జీవితాల్లో, జనాలకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలను గమనించగలిగే అవకాశం వుంటుంది. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని, వారు మరణించిన తరువాత వారికి సంబంధించిన విషయాలను ఇలా ఆత్మకధల ద్వారా బయట పెట్టడంలో నైతికత ఏమిటన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం ఉండడంలేదు.

ఉపశృతి: జీవిత చరిత్రల నుంచి నేర్చుకునే విషయాలు వుండాలి. అంతేకాని, అమ్మకాలు పెంచుకోవడం కోసమే రాస్తే వాటిపై జనాలకు నమ్మకాలు తగ్గిపోతాయి. 






(28-08-2022)

24, ఆగస్టు 2022, బుధవారం

గాయత్రి మంత్రంలో చెప్పిందే నాసా కనుక్కున్నదా!



గాయత్రి మంత్రం అంతరార్ధం - భండారు శ్రీనివాసరావు 
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.
ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. 
గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి. 
ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. 
ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.
మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.
• ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)
ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.
గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. 
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా 
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. 
అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.
ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.
తత్స వితుర్వరేణ్యం
తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.
ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. 
ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.
ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే. 
గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. 
భర్గో దేవస్య ధీమహి 
భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. 
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.
దియోయోనః ప్రచోదయాత్
ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.
ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.
భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు. 
కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద 
(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)