21, జులై 2022, గురువారం

బ్రిటన్ అధికార పీఠంపై భారత రిషి ?

తెలంగాణ బియ్యం సేకరణలో తప్పెవరిది?

మీడియాకు మరో పనేమీ లేదా!


‘మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు  రికార్డింగ్ కి’ 
కెమెరా మాన్ తో కలిసి పరికరాలు సర్దుకుంటూ అడిగాడు అనీంద్ర అనే ఆ రెడ్ టీవీ జర్నలిస్ట్.
‘ఇదిగో ఈరోజు చేసారు కదా! ఈ ఇంటర్వ్యూని ఎడిట్ చేయకుండా అప్ లోడ్ చేసిన తర్వాత తప్పకుండా కలుద్దాం. ఆరోజు మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని, ఇంత ధైర్యంగా చూపించిన మీ యాజమాన్యాన్ని అభినందించడానికి  నేనే మీ స్టూడియోకి వస్తాను’
అనీంద్ర నా మాటలు సీరియస్ గా తీసుకున్నాడు. కానీ అతడు పనిచేసేది ఓ ప్రైవేట్ ఛానల్ లో. అతడి ఇబ్బందులు అతడికి వుంటాయి. సవాళ్లు విసిరే వయసు నాది కాదు, వాటిని స్వీకరించే వృత్తి వయసు అతడిది కాదు.
అంచేత ఆ విషయం అంతటితో మరచిపోయాను.
మళ్ళీ ఈ ఉదయం ఫోన్ అతడి నుండి.
‘రేపు రమ్మంటారా! ఏ టైముకు రాను?’
నేను జవాబు చెప్పీ లోగా అతడే అన్నాడు.
‘మీరు చెప్పిన వీడియో లింక్ పంపుతున్నాను. ఎడిట్ చేయకుండా మా వాళ్ళు దాన్ని అప్ లోడ్ చేశారు. ఒకసారి చూడండి”
అన్నట్టే కొద్దిసేపటి తర్వాత లింక్ పంపాడు.
చూశాను. వెంటనే ఫోన్ చేసి చెప్పాను.
‘నేనే వస్తున్నాను మీ స్టూడియోకి. లొకేషన్ పంపండి. ఎప్పుడు ఏ రోజు అనేది మీకే వదిలేస్తున్నాను’
ఇంతకీ ఆ వీడియోలో ఏమి వుందంటే.
ఈ వెబ్ ఛానల్స్ గురించి, మీడియా గురించి నా మనసులో, కాదు కాదు, చాలామంది మనసుల్లో వున్న మాటే ఆరోజు బయటకు కక్కేసాను. ఎట్లాగు దీన్ని చూపించరు అనుకున్నా. 
కానీ అనీంద్ర గట్టివాడు లాగా వున్నాడు, మొత్తం మీద ఎడిట్ చేయకుండా నేను మాట్లాడినది మొత్తం అందులో వుంది.
అదే ఈ వీడియో, దాని  LINK:
https://www.youtube.com/watch?v=Ladz9I2Z5hk&feature=youtu.be
(21-07-2022)


కూర్చుని చదవాల్సిన పుస్తకం జీవన గానం – భండారు శ్రీనివాసరావు

  

ఈ పుస్తకం ఇంటికి చేరి అనేక రోజులు గడిచిపోయాయి. అయినా పూర్తి చేయడం ఒక పట్టాన కుదరలేదంటే దీనికి ప్రధాన కారణం నా సహజ బద్ధకం. దానికో కారణం వుంది. అదే  ద్వితీయ ప్రధాన కారణం. ఇది కూర్చుని చదవాల్సిన పుస్తకం. అంటే ఇది చదవాలి అంటే వ్యాసపీఠం కావాలి. అంత పెద్ద పుస్తకం అన్నమాట.

పడుకునో, జారగిలబడో చదువుకోవాలి అనిపిస్తే కుదరదు. అంచేత ఈ కసరత్తు చేయడానికి కొంత వ్యవధానం పట్టింది. 

ఈలోపల మరో ఇబ్బంది వచ్చి పడింది. ఈ పుస్తకం నా వద్ద వుందని తెలియగానే మా చుట్టపక్కాలు చాలామంది ఫోన్లు చేసి, ఒకసారి చదివి ఇస్తాం ఇస్తారా అని అడగడం మొదలు పెట్టారు. అల్లా బయటకు పొతే ఇక చదవడం అనేది అసాధ్యం అనిపించి వ్యాసపీఠం లేకుండానే చదవడం మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఆ పుస్తకమే నన్ను చివరికంటా చదివించింది.

రచయిత గోపాలకృష్ణ గారు  నాకు రేడియోలో సహోద్యోగి. అంతకు మించి మితృలు. 

ఈయన ఎస్పీ గారి జీవిత చరిత్ర రాసారా లేక బాల సుబ్రహ్మణ్యం గారే స్వయంగా తన జీవిత కధాగానం  చేసారా అనిపించేలా కధనం సాగింది. పీ ఎస్. గోపాల కృష్ణ కలం బలం నాకు తెలిసిన విషయమే అయినా, ఆయనకు పరకాయ ప్రవేశ విద్య తెలుసు అన్న విషయం ఈ పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. అంతగా బాలు గారితో  మమేకం అయి, బాలు గారి జీవిత విశేషాలను, సంఘటనలను హృద్యంగా, రమ్యంగా, నిజాయితీగా చాలా గొప్పగా అక్షరబద్ధం చేశారు. తనకు ఒప్పచేప్పిన బాధ్యతకు నూటికి నూటొక్క పాళ్ళు న్యాయం చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో  వదాన్యులు వరప్రసాదరెడ్డి గారు చెప్పినట్టు, ఒక్క గోపాల కృష్ణ గారే ఈ రచన చేయగలరు. చేసి చూపించారు కూడా.  

బంగారు పిచిక సినిమా రిలీజ్ సమయంలో బాపూ రమణలు పత్రికలకు ఇచ్చిన చిన్నపాటి ప్రకటనల్లో ఇలా పేర్కొనేవారు.

‘ఇందులో కళ్ళు మిరుమిట్లు కొలిపే సెట్టింగులు లేవు. భారీ తారాగణం లేదు’

అలాగే ఈ నాలుగువందల యాభయ్  పైచిలుకు పేజీల పుస్తకంలో ఉత్ప్రేక్షలు లేవు, రంగులద్దిన కల్పనలు లేవు, నిజాలు దాచడం లేదు, నిజాల పేరుతొ సంచలనాలు లేవు.

అలా హాయిగా, తీయగా  బాలుగారి పాటలా సాగిపోతుంది రచన.

అంచేతనే,  బాలుగారి ఈ జీవన గానాన్ని గోపాల కృష్ణ గారిచే రాయించారు కాబోలు.




శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జీవన గానం,  రచన: డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ, ప్రచురణకర్త: డాక్టర్ కె.ఈ. వరప్రసాదరెడ్డి, హాసం ప్రచురణలు, ధర: Rs. 500/-, For copies: Navodaya Book House, Kachiguda, Hyderabad – 500049, PHONE: 040- 23047638

20, జులై 2022, బుధవారం

తెలుగు రాష్ట్రాలు శ్రీ లంక అవుతాయా !

ఖజానాకు చేరే పన్నులు ఎన్ని?

అప్పులు ఒప్పా! తప్పా! చెప్పేది ఎవరు?