13, జులై 2022, బుధవారం

వేతనాల చెల్లింపుల్లో జాప్యం

మరణ రహస్యం – భండారు శ్రీనివాసరావు

 చనిపోయిన తరువాత ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకున్నారు. ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెప్పుకుంటూ వెడుతుంటే అందులో ఒక ఆత్మ రెండో ఆత్మని అడిగింది, ఇంతకీ నువ్వెలా చనిపోయావని.

మొదటి ఆవిడ చెప్పింది, 'బహుశా ఇలాటి చావు నాకు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. చావుకు కాసేపు ముందు వరకు నేను కలల లోకంలో తేలిపోతూనే వున్నాను. అంతే, అరగంటలో చావు ముంచుకు వచ్చింది. భయంతో గడ్డకట్టి చనిపోయాను. ఒక్క భయంతోనే కాదు నిజంగానే గడ్డగట్టిపోయాను. మరి నీ సంగతి?'

'నాదా! నాదో విషాద గాధ. నాకు నా మొగుడి మీద చచ్చేంత అనుమానం. అనుమానం కాదు. అది నిజం. పెద్ద గ్రంధసాంగుడు. నేనలా ఆఫీసు దోవపట్టగానే ఎవత్తనో ఒకత్తిని ఇంట్లోకి తెచ్చి కులికే రకం. అందుకే అతడ్ని హఠాత్తుగా పట్టేసి నలుగుర్లో పెట్టి పంచాయితీ చేయాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. అది ఇన్నాళ్లకు ముడిపడింది. ఆఫీసుకు పోతున్నానని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి పోయాను. ఆయన హాల్లో కూర్చుని తాపీగా టీవీ చూస్తున్నాడు. పడగ్గదిలోకి వెళ్ళి చూసాను. పడక చిందరవందరగా వుంది, కాని ఆ సోకులాడి జాడ లేదు. వంటింట్లోకి వెళ్లాను. పెరట్లోకి పరుగెత్తాను. బాతు రూములో చూసాను. ఇంతట్లోకే ఎటుపోయినట్టు. నాకు ఒళ్ళు మండుతోంది. పిచ్చిపట్టినట్టు మళ్ళీ ఇల్లంతా వెతికాను. పడగ్గది, వంటగది, పెరడు, బాతు రూము, వెతికినచోటే వెతుకుతూ పోయాను. నీరసం వచ్చింది. అలుపు అనిపించింది. ఎక్కడో గుండె పట్టుకున్నట్టు అనిపించింది. వళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు మూసుకుపోయాయి. తెరిచేసరికి ఇదిగో ఇక్కడ నీతో.....'

మొదటి ఆవిడ పైకి అనబోయి తెలివి తెచ్చుకుని మనసులోనే అనుకుంది.

'ఇల్లంతా వెతికింది కాని ఈ మహా ఇల్లాలు, కాస్త ఫ్రిజ్ తెరిచి చూసివుంటే ఇద్దరం బతికిపోయేవాళ్ళం'



(ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

 

నా బాధ ఎవ్వరితో చెప్పుకోను - భండారు శ్రీనివాసరావు

దేశ జనాభా అక్షరాలా నూట ఇరవై ఒక్క కోట్ల ఇరవై లక్షలు

ఇందులో ఇరవై కోట్లమంది రిటైర్ అయి పనీపాటా లేకుండా ఇళ్ళల్లో కూర్చున్నారు.
ముప్పయ్యేడు కోట్లమంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగులు
మరో ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది. (వీళ్ళు పనిచేస్తారంటే ఎవరో కాదు వాళ్ళే నమ్మరు)
కోటిమంది ఐ,టి. రంగంలోవున్నారు. వీళ్ళు పని చేస్తారు కాని మన దేశం కోసం చెయ్యరు.
ఇరవై ఐదు కోట్ల మంది స్కూళ్ళలో చదువుకుంటున్నారు.
కోటిమంది అయిదేళ్ళలోపు వాళ్లు.
పదిహేను కోట్లమంది నిరుద్యోగులు.
కోటీ ఇరవై లక్షలమంది ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు.,99,998 మంది జైళ్ళలో మగ్గుతున్నారు.
ఇక మిగిలింది నువ్వూ, నేనూ.
నువ్వేమో ఇలా తీరి కూర్చుని ఫేస్ బుక్ లో ఆడవారి పోస్టులకు లైకులు కొడుతూనో, కంప్యూటర్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూనో, వచ్చిన వాటిల్లో నచ్చిన వాటిని, నచ్చనివాటిని స్నేహితులకు ఫార్వార్డ్ చేస్తూనో ఎప్పుడూ బిజీగా వుంటావు.
పొతే, మిగిలింది నేనొక్కడిని. ఈ దేశభారం అంతా ఒక్కడినే మోయాలి. వ్చ్! ఖర్మ. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి?
(తోకటపా: ఇన్నిన్ని లెక్కలు అవలీలగా చెప్పాడు అంటే ఎక్కడో లెక్క తప్పినట్టే లెక్క. శ్రమపడి కూడడం మొదలు పెట్టకండి)

12, జులై 2022, మంగళవారం

లాయల్టీ – భండారు శ్రీనివాసరావు

 ‘లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో’ అని వెనక ఓ సినిమాలో  డైలాగ్ వుంది.

అలాగే రేడియో  విలేకరిగా ఓ వెలుగు వెలుగుతున్న ఓ పాత భూతకాలంలో, ఘనత వహించిన ఓ ఎంపీ గారు నన్నొక పని అడిగారు.  తలచుకుంటే ఆయనకది చిటికలో పని. ఆయనకు పని పడింది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి పని. ఆ ఉద్యోగికి జరూరుగా బదిలీ కావాలి. అదీ రాష్ట్రానికి కడగొట్టున వున్న పొరుగు రాష్ట్రపు సరిహద్దు ప్రాంతానికి.

నాకది చాలా చిన్న పని అనిపించింది. చూస్తూ చూస్తూ అంత దూరం బదిలీ కోరేవారు ఎవరుంటారు? కాబట్టి అడగాలే కాని ఎవరైనా చేస్తారు అని ఏకంగా ఆ సంబంధిత మంత్రి దగ్గరికే వెళ్లి చీటీ ఇచ్చాను. ఆయనతో నాకు చాలా కాలంగా మంచి స్నేహమే వుంది. అడగక అడగక  అడిగాను కాబట్టి వెంటనే పని అవుతుంది అనుకున్నా.

నేరుగా సచివాలయానికి వెళ్లి అడిగా.

‘ఈ ఉద్యోగి నీకు తెలుసా!’ అని మంత్రి అడిగారు.

‘నాకు అతడి ముక్కూ మొగం తెలియదు. కానీ మీ వంటి సన్నిహితుడే నన్ను ఈ ఫేవర్ అడిగారు. అందుకనే వచ్చాను

‘సరే! నీ స్కూటర్ ఇక్కడే పెట్టు. రేపు తీసుకు పోదువు కానీ. ఈరోజు నాతొ రా. మళ్ళీ నా కార్లో నిన్ను ఇంట్లో దింపుతాను’

ఆయన కార్లోనే ఆయన ఇంటికి వెళ్లాను. మంత్రిగారు లోపలకి వెళ్లి తయారై వచ్చారు. ఇద్దరం ఆయన పోర్టికో పైన వున్న బాల్కానీ వంటి దానిపై వేసిన కుర్చీల్లో కూర్చున్నాము.

అప్పుడు ఆయన నాకు చేసిన పొలిటికల్ లాయల్టీ అనే భగవద్గీత ఇది.

‘శ్రీనివాస్. నీకు అర్ధం కాదు కానీ మాకు లాయల్టీ చాలా ముఖ్యం. ఏదైనా పనిచేస్తే డబ్బు తీసుకుని పనులు చేస్తామనే నింద మాపై వుంది. అది పూర్తిగా నిజం కాదు, అలాగని అబద్ధం కాదు. నువ్వు అడిగిన బదిలీకి లక్షకు  తక్కువ కాదు. నీకు అతడి ముక్కూ మొహం తెలియదు. ఇతడి గురించి నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు లెటర్లు ఇచ్చారు. నువ్వు చెప్పిన ఎంపీ కూడా వారిలో వున్నాడు.  ఎంక్వైరీ చేస్తే అతడు మంచి సంపాదనపరుడు అని తెలిసింది.  హైదరాబాదు నుంచి ఆదిలాబాదు జిల్లా చివరకి ఎవరూ బదిలీ కోరుకోరు. బార్డర్ ఏరియాలో వారి సంపాదన రోజుకు వేలల్లో వుంటుంది.  అదంతా వారికి దక్కదు. కింద నుంచి పై దాకా పంపకాలు వుంటాయి. అంచేత  మా ఎమ్మెల్యేలు చెప్పినా నేను పట్టించుకోలేదు.

‘ఈ సంగతులు ఏవీ నీకు తెలియదన్నసంగతి నాకు సాయంత్రమే అర్ధం అయింది. అందుకే మాట్లాడడానికి ఇంటికి రమ్మన్నాను.

‘ఇప్పుడు అసలు విషయం చెబుతా విను. అంతమంది చెప్పినా నేను చేయలేదు కదా!  అందుకే నిన్ను పట్టుకున్నాడు, అదీ వేరే వారి ద్వారా. నువ్వు ఇన్నేళ్ళ పరిచయంలో ఎన్నడూ ఏదీ అడగలేదు. అందుకే ఆ ఫైల్ కూడా తీసుకువచ్చాను. నువ్వు నేను చెప్పిన దానికి  అవును అంటే అతడిని అతడు అడిగిన చోటుకు బదిలీ చేస్తూ ఇప్పుడే ఇక్కడే సంతకం చేస్తాను. రేపే ఆర్డర్ ఇస్తాను. కానీ ముందు ఒక మాట చెప్పు. నా మాట ఒకటి విను. రేపటి నుంచి అతగాడు అందరితో చెబుతాడు. మంత్రి కాదన్నా నా పని నేను చేసుకోగలిగాను. ఆయన నాకో లెక్కా అన్నట్టు తోటివారితో చెబుతాడు. డిపార్ట్ మెంటులో క్రమశిక్షణ దెబ్బతింటుంది. పోనీ నీకన్నా లాయల్ గా ఉంటాడా అంటే అదీ లేదు. అతడెవరో కూడా  నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం

నాకు విషయం పూర్తిగా అర్ధం అయింది.

వెంటనే చెప్పాను.

‘ముందా ఫైల్  మీ ముందు నుంచి తీసేయండి. వేరే విషయాలు ఏవైనా మాట్లాడుకుందాం!’

కాసేపు సాయంకాలక్షేపం చేసి ఆయన కారులో ఇంటికి చేరాను.

వచ్చిన తర్వాత ఆయన అన్న ఒక మాట అర్ధం బోధ పడలేదు.

‘నీకైనా లాయల్ గా ఉంటాడా!’

లాయల్ గా వుండడం అంటే ఏమిటి!

ఏమిటైతే నాకెందుకు! నాకు అవసరం లేని వ్యవహారం.

(12-07-2022)

వైసీపీ నుంచి వై.ఎస్. విజయమ్మ నిష్క్రమణ

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు అంటే

కేసీఆర్ తో హెలికాప్టర్ లో