7, మే 2022, శనివారం

ఈ నగరానికి ఏమైయింది? – భండారు శ్రీనివాసరావు

 1975 వ సంవత్సరం.

రేడియోలో విలేకరి ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు కూడా చేరకముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ కడ్డీలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేరవరకు ద్రాక్ష తోటలు.

నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.

నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను. పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.

ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు. అవీ ప్రభుత్వం వారికి కారు చౌకగా ఇచ్చిన స్థలాల్లో.

హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.

గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. (అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి) ఇప్పుడు అదే తటాకం వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.

ఎండలు మండుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయం కృతం.

కడుపు చించుకుంటే.....భండారు శ్రీనివాసరావు

 పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా, ఆ రంగానికి చెందిన ఒకప్పటి మనిషిగా ఒక్కోసారి కల్పించుకోవాల్సి వస్తోంది.

చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ‘చదవం, చూడం’ అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.

నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. ‘అవి ఏం రాస్తున్నాయి’ అనే దానికంటే, అవి వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు.

నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ కట్టగట్టుకుని ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడం వల్లా రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు తెలుగునాట పురుడు పోసుకుంటున్నాయి. పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి, కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. దాన్ని గురించి ప్రస్తావించాల్సివస్తే పాత్రికేయ మర్యాదలు పాటించేవారు. పేరు పెట్టకుండా ‘ఒక పత్రిక’ అనేవారు. లేదా ‘మా పత్రిక కాదు’ అని రాసుకునే వారు.

కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని తమ పత్రికలో ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.

ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.

ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.

పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.

ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.

ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ ఎదురవుతాయి.

ఎందుకంటే అన్నం తింటున్నది గొంగట్లో కనుక.

NOTE: Courtesy Image Owner




6, మే 2022, శుక్రవారం

పీకే వ్యూహాలు ఫలిస్తాయా! వికటిస్తాయా!

బ్రేకింగ్ న్యూస్! – భండారు శ్రీనివాసరావు

 మీడియా మనిషిని అయివుండి ఆ మీడియా గురించి రాయాల్సి వస్తున్నప్పుడు బాధ వేస్తుంది.

మధ్యాన్నం కెమెరా పట్టుకుని వస్తారు. లేదా ఫోన్ చేసి ఇప్పుడు టీవీ తెరపై వస్తున్న స్క్రోలింగ్ గురించి ఫోన్ ఇన్ అడుగుతారు. నా సందేహం ఒక్కటే, తెరపై దొర్లుతున్న ఆ స్క్రోలింగులో వాస్తవం ఎంత? దాన్ని ఆధారం చేసుకుని నేనెలా వ్యాఖ్యానించగలను? పైగా అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు అది. కాదు, కుదరదు అనే  నా జవాబు వారికి రుచించదని నాకు తెలుసు. కానీ వారి తొందర వారిది. నా నిదానం నాది. వార్తకు ప్రాణం నిబద్ధత అనే విధానం నాది.

వార్త ఒక్కటే. ఒక్కో టీవీలో ఒక్కోరకం స్క్రోలింగ్.

ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా? వుండి వాడుకోవడం లేదా!

ఇరవై నాలుగ్గంటల న్యూస్  ఛానల్స్ చూసేవారికి అనుభవమే. ఉదయం ఒక వార్త స్క్రోలింగ్ రూపంలో గిరగిరా తిరుగుతుంది. మధ్యాన్నం అదే వార్త పూర్తిగా భిన్నమైన రూపంలో దర్శనం ఇస్తుంది. పొద్దున్న పొరబాటు చేసాం, సరిదిద్దుకుని ఈ వార్త ఇప్పుడు  ఇస్తున్నాం అనే ధోరణి శూన్యం. ఉదయం ఇచ్చిన వార్తతో మాకు  సంబంధం లేదు అన్నట్టుగా వుంటుంది. రెండుసార్లు  అదే వార్త విభిన్న రూపాల్లో చూసినవాళ్ళు దేనిని నమ్మాలి. ఆఖరికి అత్యంత ప్రధానమైన కోర్టు తీర్పుల విషయంలో కూడా నిబద్దత పాటిస్తున్న దాఖలా లేదు. ఇంతటి ఉదాసీనతను ఎలా అర్ధం చేసుకోవాలి. పాత్రికేయ ప్రమాణాలకు ఈ వైఖరి ఎంతవరకు పొసుగుతుంది?

రేడియో, అంటే ఆకాశవాణి సుమా, వార్తలు చదివే న్యూస్ రీడర్లు, పొరబాటున ఏదైనా  తప్పు దొర్లితే,  వెంటనే క్షమించాలి అని శ్రోతలను అభ్యర్ధించి ఆ వార్తను మళ్ళీ సరిగా చదివేవారు. ఇది గుర్తున్నవారికి ఈనాడు టీవీల్లో కనబడుతున్న ఈ ధోరణి వింతగా, విడ్డూరంగా కనబడితే ఆశ్చర్యం ఏముంది.

ఈనాటి టీవీ ఛానల్స్ లో పనిచేసేవారు కాలంతో సమానంగా పరిగెత్తాలి. తప్పదు. నిజం కూడా. కానీ ఆ తొందరలో తప్పులు తొక్కుకుంటూ పోవడం ఏరకంగా సమర్థనీయం?

నిజంగా ఇవి తప్పులా! లేక కావాలనే చేస్తున్నారా అని సామాన్యుడికి సందేహం కలిగితే మీరెలా తప్పు పట్టగలరు? చెప్పండి!

చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. ఆ రోజుల్లో రేడియోకి ఆ గౌరవం వుండేది. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం నా విధి. అది నేను పాటించాను. తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.

ఇలా ఉండేవి ఆ రోజులు. నిజంగా ఆ రోజులే వేరు.

ఆ రోజులు వేరే కానీ, అసలు ఏ తప్పూ చేయకుండా నా రేడియో రోజులు గడవ లేదు. నేనూ, నా వల్ల నా సహచరులు కొన్ని అలాంటి పొరబాట్లు చేశాము.

ఢిల్లీలో బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది. మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, జగ్ జీవన్ రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో బెజవాడ రేడియో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత వచ్చే ఏడూ అయిదు ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల ఇంగ్లీష్  జాతీయ వార్తల్లోనూ ఈ మరణవార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం ఎంపీ శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ప్రశ్న రూపంలో పార్లమెంటులో  లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో దేశంలో ఏడు రేడియో స్టేషన్లు ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.

ఏది ఏమైనా ఈ ఉదంతంతో, మరణ వార్తల ప్రసారం విషయంలో రేడియో వార్తావిభాగం అధికారులు అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.

తరువాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు (పీ.టి.ఐ., యు.ఎన్.ఐ.) సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త ‘లేట్ న్యూస్’ రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.

కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. ఢిల్లీ విలేకరి వార్తను ధ్రువపరచాలి. ఆ సమయంలో ఎవరూ దొరకలేదు. కానీ చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.

మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. హైదరాబాదు నుంచి వార్త ఇచ్చినా, ఢిల్లీ విలేకరి ద్రువపరచాలి అనే నిబంధన పేరుతొ తీసుకోలేదు.

తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరా’ అంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.

ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త కూడా ఇదే మాదిరి. ధ్రువపరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక కరచుకోవడం జరిగింది.

ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి వుంది. నాకైతే తెలియదు.

Courtesy Image Owner





(06-05-2022)

4, మే 2022, బుధవారం

టీవీ ప్రసారాల్లో అవాంచిత సంఘటనలు

అమెరికన్ నేషనల్ ఛానల్ లో నా మనుమరాలు సఖి


మహిళల హక్కులకోసం పోరాటాలు, ఆందోళనలు అమెరికాలో కూడా జరుగుతున్నాయి. అటువంటి నిరసన  ర్యాలీ ఒకటి లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ లో జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి కొంత అదుపు తప్పింది. ర్యాలీలో పాల్గొన్న  మా మనుమరాలు (నా పెద్ద కుమారుడు సందీప్ కుమార్తె) సఖి  ఈ విషయంపై అమెరికన్ నేషనల్ ఛానల్ CBS NEWS  LIVE INTERVIEW లో ఛానల్  విలేకరి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది.  




https://youtu.be/8Ee8XIoGCLA