15, మార్చి 2022, మంగళవారం

పెళ్ళికి పూర్వం తర్వాత నేనూ మా ఆవిడ – భండారు శ్రీనివాసరావు

 

పెళ్ళికి పూర్వం తర్వాత నేనూ మా ఆవిడ భండారు శ్రీనివాసరావు  

పెళ్లి కాక ముందు నేను వీర దైవభక్తుడిని కాకపోయినా చిన్నతనం నుంచి దేవుడంటే భయం భక్తీ పుష్కలంగా ఉండేవి. పొద్దున్నే లేచి రాముడు మంచి బాలుడి మాదిరిగా స్నానం వగయిరా ముగించుకుని నుదుటి మీద విభూతి పట్టీ వేసుకుని అలా నడుచుకుంటూ గవర్నర్ పేట చెట్ల బజారులోని శివాలయానికి వెళ్లి ముమ్మారు ప్రదక్షిణలు చేసి, శివలింగం ఎదుట సాష్టాంగనమస్కారం చేసి దైవ దర్శనం అనంతరం కాసేపు గుడి ప్రాంగణంలోనే బాసింపట్టు వేసుకు కూర్చుని తెలిసిన స్త్రోత్రాలను బిగ్గరగా చదివిన తరువాతగానీ మరో పని చేసేవాడిని కాను.

పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు. తలితండ్రులకి ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో ఆమె పెరిగిన తీరే వేరు. ఆడింది ఆటా పాడింది పాటా. అంచేత ఈ భక్తి కాలమ్ ఆమెలో పూర్తిగా సున్నా.

అలాటిది పెళ్ళయిన తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. అన్నీ కనిపెట్టి చూసే భార్య దొరికిందని, ఇక దేవుడి అవసరం ఏముందని ఆయనపై నేను శీతకన్ను వేశాను. ఇలాటి మొగుడ్ని కట్టుకున్న తర్వాత ఆ దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.

ముప్పూటా ఆవిడ పూజలూ, వ్రతాలూ. నేను నా పద్దతిలో మిత్రులతో కలిసి సాయంకాలక్షేపాలు.

ఎవరి గోల వారిదిగా సాగిన మా సంసారం ఇప్పుడు ఏ గోలా లేకుండా సద్దుమణిగింది.



14, మార్చి 2022, సోమవారం

ఆరణాల కూలీ అంజయ్య - భండారు శ్రీనివాసరావు

 

సచివాలయంలో రోజువారీ విలేకరుల సమావేశాలు ముగిసిన తర్వాత నడుచుకుంటూ రేడియోకి వెళ్ళేవాడిని. ఓ రోజు అలా వెడుతూ గోపీ హోటల్ (ఆ రోజుల్లో చాలా ఫేమస్. కామత్ హోటల్ ఎదురుగా ఓ పాత భవనంలో వుండేది) దాకా వచ్చాను. ఇంతలో సైరన్ మోగించుకుంటూ ఓ పోలీసు వాహనం వెళ్ళింది. కాసేపటికి మరో వాహనం నా పక్కగానే వెళ్లి కొంత ముందుకు పోయి ఆగింది. అందులో నుంచి ముఖ్యమంత్రి భద్రతాధికారి బాలాజీ దిగి నా వైపుగా వచ్చాడు. సిఎం గారు కారులో వున్నారు అని చెప్పి ఎక్కించాడు. అది సరాసరి రేడియో స్టేషన్ ఆవరణలోకి వెళ్ళింది. ఈలోగా ముందు వెళ్ళిపోయిన పైలట్ కారు వెనక్కి వచ్చింది. నన్ను దింపేసిన తర్వాత సీఎం కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. చెప్పాపెట్టకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడం చూసి అందరూ నివ్వెర పోయారు.
నడిచి వెడుతున్న నాకు ఆఫీసుదాకా అడగకుండా లిఫ్ట్ ఇచ్చిన ఆ ముఖ్యమంత్రి ఎవరంటే ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు.

కింది ఫోటో: నాటి ముఖ్యమంత్రి అంజయ్య గారితో నేనూ, నా టేప్ రికార్డరు





చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

 చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను. ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు. నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం ’ అన్నారు.

నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, 'మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా' అన్నాను. ఆయన నవ్వుతూ, 'అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను' అన్నారు మర్యాదగా.

సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా, ఇందరు ముఖ్యమంత్రులు మారినా  అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే ఒక రోజున ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి    ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు, అప్పుడు  క్లబ్ కార్యదర్శిగా ఉన్న నేను,  మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. (అప్పటికి  మెట్రో రైలు నిర్మాణం జరగలేదు)  కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు




(14-03-2017)

13, మార్చి 2022, ఆదివారం

అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు - భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు ఆదివారం 13-03-2022 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

పత్రికలకి, మీడియాకి మాత్రమే కాదు, అసెంబ్లీకి కూడా రిపోర్టర్లు వుంటారు. కాకపొతే ఇది ప్రభుత్వ ఉద్యోగం.

అసెంబ్లీ సమావేశ మందిరంలో స్పీకర్ స్థానానికి ముందు వరసలో అర్ధ చంద్రాకారంగా ఉన్న కుర్చీల వరుసలో శాసన సభ కార్యదర్శి, ఉన్నతోద్యోగులతో పాటు మరికొందరు ఉద్యోగులు కూర్చుని, సభ్యులు మాట్లాడే సంగతులను షార్ట్ హాండ్ లో రాసుకుంటూ వుంటారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వారి స్థానంలో మరికొందరు వచ్చి సభావ్యవహారాలను నోట్ చేస్తుంటారు. బయటకి వెళ్ళిన వాళ్ళు తాము అంతవరకూ షార్ట్ హాండ్ లో రాసుకున్న వివరాలను వివరంగా టైప్ చేసి వాటిని యధాతధంగా  సభ రికార్డులలోకి ఎక్కిస్తుంటారు. రేడియో ప్రతినిధిగా సందేహ నివృత్తి కోసం నేను కూడా అనేక సార్లు అసెంబ్లీ రిపోర్టర్లను సంప్రదించిన సందర్భాలు వున్నాయి.

సభలో ఏదైనా గందరగోళం జరిగి, ఏ సభ్యుడైనా సభా మర్యాదకు భంగం కలిగించే విధంగా మాట్లాడితే, సభాపతి అక్కడికక్కడే రికార్డుల తొలగించినట్టు ప్రకటిస్తారు. లేదా ఏదైనా సందేహం వుంటే రికార్డులను పరిశీలించి తొలగిస్తామని హామీ ఇచ్చి సభికులను సంతృప్తి పరుస్తుంటారు. రికార్డుల నుంచి తొలగించిన విషయాలను ఏ పత్రిక అయినా తొందరపడి ప్రచురిస్తే ఆ పత్రిక సంపాదకుడిపై సభాహక్కుల నిబంధనల కింద చర్య తీసుకునే అధికారం స్పీకర్ కు వుంటుంది.

పొతే, రికార్డులకి ఎక్కిన వివరాలను తరువాత ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రించి వాటిని సభ్యులకు పంపిణీ చేసి, కొన్నింటిని అసెంబ్లీ గ్రంథాలయంలో భద్రపరుస్తారు. ఇదంతా ఒకప్పటి కధ. ఇప్పుడు కూడా అదే విధానం వుంది. కానీ వాటిని కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాయి. వాటి పూర్వాపరాలు తెలియచేయడానికే ఈ ప్రయత్నం.

చాలా ఏళ్ళ క్రితం,

అటు పార్లమెంట్ సమావేశాలు కానీ, ఇటు శాసనసభ సమావేశాలు కానీ ప్రారంభం అయ్యే తరుణంలో ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఒక రోజుముందు, 'యిస్యూస్ బిఫోర్ ది హవుస్' (చట్టసభలో చర్చకు రానున్న అంశాలు) అనే శీర్షికతో పేరెన్నికగన్న జర్నలిస్టులతో కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. దరిమిలా జరిగే చట్టసభల సమావేశాల్లోని చర్చల్లో, ఈ నిపుణుల అభిప్రాయాల ప్రభావం స్పష్టంగా కనబడేది. అలాగే సమావేశాలు జరిగినన్నాళ్ళు, ప్రతిరోజూ రాత్రి పదిహేను నిమిషాలపాటు జర్నలిస్టులతో రాయించిన సమీక్షలు రేడియోలో ప్రసారమయ్యేవి. ఆకాశవాణి వార్తావిభాగం సిబ్బందికి అసిధారావ్రతం లాంటి కార్యక్రమం ఇది. జర్నలిస్టులు రాసుకొచ్చిన సమీక్షను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తరవాత కానీ ప్రసారం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏమాత్రం తభావతు వచ్చినా 'సభాహక్కుల ఉల్లంఘన' కిందికి వస్తుందన్న భయం అనండి, ఇంకేదన్నా అనండి, అన్ని జాగ్రత్తలు తీసుకునేలా వారిని జాగరూకులను చేసేది. రేడియోలో ప్రసారం అయ్యే ఈ సమీక్షలను శాసన సభ్యులు నివసించే ప్రాంగణాల్లో మైకుల ద్వారా వినిపించేవాళ్ళు. వినే శ్రోతలకు కరవు వుండేది కాదు. స్తానిక సమస్యలను శాసన సభలో, తాము లేవనెత్తిన వయినం గురించి తమ నియోజక వర్గాలలోని జనాలకు తెలియడానికి బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం చాలామంది సభ్యులలో ఉండడంవల్లనొ ఏమో గానీ వారు కూడా ఈ కార్యక్రమం పట్ల యెంతో ఆసక్తి చూపడం ఆనాటి రేడియో విలేకరిగా నా స్వానుభవం. విమర్శలు, ప్రతి విమర్శలు ఒక స్తాయికి మించి ప్రసారం చేయకపోవడం వల్ల, ఛలోక్తులకు తగిన స్తానం కల్పించడంవల్లా ఈ కార్యక్రమ ప్రభావం సభలో ప్రతిఫలించేది.  శాసన సభ జరిగే  రోజుల్లో ఇప్పటికీ ఈ కార్యక్రమం ప్రసారం చేస్తూనే వున్నారు.

ఇక ప్రస్తుతానికి వస్తే,

ఉమ్మడి రాష్ట్రంలో  శాసన సభ మాజీ స్పీకర్, ప్రస్తుతం నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు అయిన శ్రీ యనమల రామకృష్ణుడు చట్ట సభల బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీ స్పీకర్ కు ఒక లేఖ రాస్తూ మండలి సమావేశాలను సయితం ప్రత్యక్ష ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమంజసమైన కోరికే. పైగా ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావించి ఆయన హయాములోనే వీటిని ప్రారంభించిన చరిత్ర కలిగిన  రాజకీయ నాయకుడిగా ఆయనకు ఈ విషయాల్లో సంపూర్ణ అవగాహన వుండి వుంటుంది. ఆ రోజుల్లో ఈ ప్రత్యక్ష ప్రసారాలకు చాలా ప్రజాదరణ వుండేది. ప్రభుత్వ పక్షంతో పాటు, ప్రతిపక్షాల వాణికి కూడా సముచిత ప్రాధాన్యం ఇచ్చేవారు. అంచేత సభలో జరిగే వాదోపవాదాలు, కొండొకచో గీత దాటినట్టు అనిపించినా, మొత్తం మీద ప్రేక్షకులను బాగా అలరించేవి. తమ రిపోర్టర్లు తెచ్చే వార్తలను సరిచూసుకోవడానికి డెస్క్ లో వున్న సీనియర్ జర్నలిస్టులు కూడా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేవారు.  ఈ ఖ్యాతి యనమల రామకృష్ణుడిదే అని చెప్పాలి. కాకపొతే, ప్రసారాలను ఎడిట్ చేయకుండా యధాతధంగా చూపించాలని కూడా ఆయన కోరారు. ఈ సూచన చేసే ముందు, గతంలో తాము అధికారంలో వున్నప్పుడు ఇదే విధానాన్ని అమలు చేసారా లేదా  అన్న విషయాన్ని రామకృష్ణుడు నిర్ధారణ చేసుకున్నారో లేదో తెలవదు.

టీవీ చానళ్ళ విస్తృతి, వాటిమధ్య పోటీల నీలినీడలు శాసన సభల పని తీరుపై ముసురుకుంటున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో, ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. శాసనసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయినప్పుడు, ప్రజాస్వామ్య ప్రియులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వాణి జనాలకు వినపడుతుందని ఆశపడ్డారు. అర్ధవంతమయిన చర్చలను ఆస్వాదించే అవకాశం లభించిందని సంబరపడ్డారు. కానీ, సంచలనం ఒక్కటే ఈ ప్రసారాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం వుందని ఊహించలేకపోయారు. ఈ ప్రసారాల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న ఒక జర్నలిష్టు మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య సమంజసమనిపించేదిగా వుంది. సభ సజావుగా జరుగుతోందన్న అభిప్రాయం లేశ మాత్రంగా కలిగినాసరే,  ప్రత్యక్ష ప్రసారాన్ని తక్షణం నిలిపివేసి,  టీవీ యాంకర్ మరో అంశానికి మారిపోతాడట. టీవీల కోణం నుంచి చూస్తే ఇందులో అసహజమయినది ఏమీ వుండదు. ఎందుకంటె సంచలనం లేకుండా చూపిస్తే, చూసేవాళ్ళు వుండరన్నది వారి అభిప్రాయం అయివుండవచ్చు. కానీ దీని ప్రభావం సభ జరిగే తీరుపై పడుతోందన్నది కూడా కాదనలేని నిజం. వీక్షకులు కూడా సంచలనాన్నే కోరుకున్న పక్షంలో ఇక ఈ విషవలయం నుంచి బయటపడడం కష్టం. అయితే ఈ విషయం నిర్ధారణ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదన్నది సయితం అంగీకరించాల్సిన అంశం.

చట్ట సభల సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఆశించిన సానుకూల ఫలితాలు ఒనగూరాయా అన్న విషయంపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది. సానుకూల ఫలితాల సంగతి సరే, ప్రతికూల ఫలితాలు గురించి కూడా దృష్టి సారించాలి. అయితే ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చట్టసభల్లో తాము ఎన్నుకున్న సభ్యుల ప్రవర్తన ఏవిధంగా వుందో గమనించుకోవడానికి ఓటర్లకు వున్న ఒకే ఒక అవకాశం ఈ ప్రత్యక్ష ప్రసారాలే అన్న అంశాన్ని మరువకూడదు.

అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దే సించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం సభలో లభించాలి. అయితే విమర్సల పేరుతో పస లేని ఆరోపణలు చేస్తూ  సభాసమయం వృధా చేయని తత్వాన్ని అవి అలవరచుకోవాలి. అదే సమయంలో, సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాధ్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి, కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్యసౌధ పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.

తోక టపా:

వై ఎస్ ఆర్ చెప్పిన గానుగెద్దు కధ

2004 జులై 21 న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక కధ చెప్పారు.

బాగా చదువుకున్న పండితుడు ఒకాయన నూనె గానుగ వద్దకు వెళ్ళాడు. అక్కడ గుండ్రంగా తిరుగుతున్న ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ ఎద్దు మెడలోని గంటల చప్పుడు తప్ప ఏ అలికిడీ లేదు. పండితుడు గానుగ మనిషిని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు. ఆ పిలుపు విని అతడు బయటకు వచ్చాడు.

నూనె కొన్న తరువాత పండితుడు అడిగాడు.

ఎప్పుడు వచ్చినా నువ్వుండవు. గానుగ పని మాత్రం నడుస్తూనే వుంటుంది. ఎలా’ అని.

ఎద్దు మెడలో గంట కట్టిందే అందుకోసం. గంట చప్పుడు వినబడుతున్నదీ అంటే ఎద్దు తిరుగుతున్నట్టే లెక్క. తిరగడం మానేస్తే గంట చప్పుడు వినబడదు. నేను ఏ పనిలో వున్నా బయటకు వచ్చి ఎద్దుకు మేత వేస్తాను. నీళ్ళు పెడతాను. మళ్ళీ దాని పని మొదలు. నాపనిలో నేనుంటాను’ గానుగవాడు చెప్పాడు.

పండితుడు కదా! అనుమానాలు ఎక్కువ.

అలా అయితే ఎద్దు ఒకచోటనే నిలబడి తల ఊపుతుంటే గంటల శబ్దం వినబడుతుంది. కాని పని సాగదు. అప్పుడెలా?’ అడిగాడు.

నా ఎద్దు అలా చేయదు’ అన్నాడు గానుగ మనిషి.

అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు?’ అని గుచ్చి అడిగాడు పండితుడు.

ఎందుకంటే, నా ఎద్దు మీలా చదువుకోలేదు కాబట్టి’

ఆ జవాబుతో పండితుడి కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి.”



12, మార్చి 2022, శనివారం

శభాష్ ప్రకాష్! – భండారు శ్రీనివాసరావు

 

"సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్‌" అన్న గురజాడ వారి మాటను ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు ఈ ప్రకాష్.
ఇంతకీ ఈ ప్రకాష్ ఎవరంటే!
ముందు ఓ కధ చెప్పుకోవాలి.
ఒకాయన ఒక రోజు స్కూటరు మీద వెడుతుంటే టైరులో గాలి తగ్గినట్టు అనిపించి రోడ్డుపక్కన ఓ టైర్ పంక్చర్ షాపు ముందు ఆగాడు. ఈ ఒకాయన్ని చూడగానే ఆ మెకానిక్కు లేచివచ్చి, ‘మీరలా ఆ స్టూలు మీద కూర్చోండి, నిమిషంలో మీ బండి పని నేను చూస్తాను’ అన్నాడు మర్యాదగా.
ఎందుకో ఏమిటో కానీ, నాలుగయిదు చిన్న రోడ్లు పెద్దరోడ్డులో కలిసే ఆ చౌరాస్తాలో వున్నట్టుండి ట్రాఫిక్ జామ్ అయింది. కార్లూ, స్కూటర్లూ, మోటారు సైకిళ్ళు, సిటీ బస్సులు నడిపేవాళ్ళు ఎవరికి వాళ్ళు ముందుకు పోవాలని తొందర పడడంతో అవన్నీ ఎక్కడికి అక్కడ అడ్డదిడ్డంగా నిలిచి పోయి, ఆ ప్రాంతం అంతా హారన్లతో మారుమోగుతోంది. ఆ ఒకాయన అటు నుంచి ఇటు చూపు మరల్చి చూస్తే, ‘ఒక్క నిమిషం’ అన్న ఆ మెకానిక్కు పత్తాలేడు. ఆ ఒకాయనకు కోపం ముక్కు మీద నుంచి నోటివరకు వచ్చి, ఆ నోరు ఆయొక్క మెకానిక్కును నానా మాటలు అనడానికి సిద్ధం అయ్యేలోగా ఒక దృశ్యం అతగాడి కంటబడింది. అది చూస్తూనే తెరుచుకోబోతున్న అతడి నోరు టక్కున మూసుకుంది. ఆ వెంటనే ఆశ్చర్యంతో మళ్ళీ తెరుచుకుంది. ఇంతకీ ఆ దృశ్యం ఏమిటంటే ...
గాలి పంపు పక్కన పడేసి, చేతిలో ఒక బెత్తం లాంటిది పట్టుకుని ఆ మెకానిక్కు, పద్మ వ్యూహంలో చొరపడ్డ అభిమన్యుడిలా, చిక్కుముడిలా చిక్కుపడ్డ ఆ వాహనాల మధ్యకు దూరిపోయి, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత భుజానికి ఎత్తుకున్నాడు. పది ట్రాఫిక్ సిగ్నల్స్, పదిమంది ట్రాఫిక్ పోలీసులు చేసే పని అతడు చిటికెలో చేసి, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ ను చక్కదిద్ది, మళ్ళీ వచ్చి తన పనిలో మునిగిపోయాడు.
తొందరగానే పని ముగిసినందుకు సంతోషపడుతూ ఆ ఒకాయన తనలో తను అనుకున్నాడు.
“ఇంకా నయం! తొందరపడి ఈ ‘పెద్దమనిషి’ పై మాట తూలాను కాదు.
చూసారా! మంచితనం మనుషుల్ని ఎలా పెద్దవాళ్ళను చేస్తుందో.
‘నమస్తే! తెలంగాణా’లో ఈ ప్రకాష్ గురించి ‘శభాష్ ప్రకాష్’ అనే కధనం (పిల్ల పత్రికలో, సిటీ ఎడిషన్ కు తెలుగు అనువాదం అన్నమాట) వచ్చింది.
మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాటివారితో పక్కన నిలబడి సెల్ఫీలు దిగడం అనే మోజు లేని నేను, ఈ ప్రకాష్ పక్కన ఒక ఫోటో తీయించుకుంటే ఎలా వుంటుంది అని మనసు పడ్డ మాట మాత్రం నిజం.
ఇలాటి రోడ్డు సైడు హీరోల గురించి రాసిన ‘నమస్తే! తెలంగాణా’ పత్రిక్కి ధన్యవాదాలు.
పొతే మనలో మాటగా ఇంకో మాట. కవులు, కళాకారులు, ఇలా అనేక రంగాల్లో వారిని గుర్తించి వారిలోని ప్రతిభకు గుర్తింపుగా పురస్కారాలు అందించే ప్రభుత్వాలు, ఇటువంటి వారిని కూడా ఏదో ఒక పేరుతొ పౌర పురస్కారం అందిస్తే యెంత బాగుంటుంది?
అత్యాశ అయితే కాదు కదా!
తోకటపా: ప్రతి రోజూ సాయంత్రం మా ఇంటి పక్కనే ఉన్న చౌరాస్తాలో (ఛే రాస్తా అనాలేమో, అంత గందరగోళంగా వుంటుంది) ఈ దృశ్యం నాకంట పడుతూనే వుంటుంది. ట్రాఫిక్ సర్దుబాటు చేయడానికి అపసోపాలు పడే పోలీసులు ప్రకాష్ స్వచ్చంద సేవకు ముచ్చట పడి, రాత్రి వేళల్లో ఎరుపు, పచ్చ రంగులు స్పుటంగా కనబడే ఓ రేడియం చేతి కర్ర లాంటిది అతడికి బహుకరించారు కూడా)

ఏం చెప్పను? ఏమని చెప్పను? (కధానిక) – భండారు శ్రీనివాసరావు

ఆ వృద్ధాశ్రమంలో పదేళ్లుగా పనిచేస్తూ ఇరవైలోనే అరవై ఏళ్ళు పైపడ్డ వాడిగా తయారయ్యాను. ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నవ్వు మొహంతో వున్నవారెవ్వరూ నాకు ఆ ఆశ్రమంలో తారస పడలేదు. ఎవరిని కదిలించినా కన్నీటి కధలే. అన్నీ వుండి కూడా ఏమీ లేని వారి వ్యధలే. తల్లీ తండ్రీ లేని అనాధను కనుక ఆ వృద్ధులు పడే వేదనలు, ఆవేదనలు మొదట్లో నాకేమీ అర్ధం అయ్యేవి కావు. ఇక్కడ రూమ్ బాయ్ గా చేరినప్పటినుంచి వయసు మీద పడ్డ వారి బాధలేమిటో, వారి సమస్యలేమిటో కొద్ది కొద్దిగా అవగతం కావడం మొదలయింది..
ఆశ్రమం అన్న మాటే కానీ వున్న దానికీ, తిన్న దానికీ అణా పైసలతో సహా వసూలు చేస్తారు. ఆ డబ్బులు కట్టడానికి వచ్చే వారి పిల్లల మొహాల్లో కూడా ఏ ఒక్కనాడు నాకు సంతోషం అన్నది కానవచ్చేది కాదు. తలితండ్రుల్ని అలా చూడాల్సి వచ్చినందుకు కాదు వారి బాధ, కన్న వారి బాధ్యతలు ఇలా ఇంకా ఎన్నాళ్ళు మోయాలో అన్నదే వారి అసహనానికి కారణం అని మెల్లమెల్లగా బోధపడుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో -
ఒక రోజు ఓ పెద్దాయన ఆశ్రమంలో చేరాడు. అతడొచ్చినప్పుడు నేనే డ్యూటీ లో వున్నాను. వయస్సు తొంభై అని రిజిస్టర్లో రాసివున్న ఆయన వివరాలను బట్టి తెలుసుకున్నాను. పైకి చూస్తే అన్నేళ్ళ వాడిగా అనిపించలేదు. బోసినోరే అయినా అతడి నవ్వులో ఒకరకమైన ఆకర్షణ. చూడగానే లేచి నిలబడాలని అనిపించే పెద్దరికం. ఎలాటి దిగులూ దైన్యం కనిపించని ఆయన వదనం నాకు కొత్తగా, గమ్మత్తుగా అనిపించింది.
మరోసారి వివరాలు చూసాను. పెద్ద ఉద్యోగం చేసాడు. పెద్ద పెద్ద హోదాలు అనుభవించాడు. భార్య ఏడాది క్రితమే కన్ను మూసింది. లంకంత కొంపలో ఒకే ఒక్కడు. ఇద్దరు కొడుకులూ, ముగ్గురు అమ్మాయిలూ అందరూ కట్టుకున్నవాళ్ళతో, పుట్టిన సంతానంతో కలసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్లు రమ్మంటారు. ఈయన పోనంటారు. తలచుకుంటే ఇంత కంటే మంచి సౌకర్యాలు వున్న ఓల్డ్ ఏజ్ హోంలో దర్జాగా చేరగల స్తోమత వున్నట్టే వుంది. దీన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలవదు.
ఆయన వుండబోయే గది ఎలావుంటుందో నాకు తెలుసు. ఆ గదిలో మొన్న మొన్నటి వరకు వున్న వృద్ధురాలు మొన్నీమధ్యనే కాలం చేసింది. చిన్న గది. ఓ మేజా. ఓ పక్కగా కిటికీ. దానికి వేలాడుతూ పాత కర్టెన్. దాన్నిమార్చండి బాబూ అని పోరు పెడుతూనే ఆ వృద్ధురాలు ఏమారి పోయింది. తెలియని లోకాలకు తరలిపోయింది. ఎందుకయినా మంచిదని ఆయన వుండబోయే గది తీరుతెన్నులు గురించి ముందే చెవిలో వేసాను. బదులుగా ఆయన చిన్నగా నవ్వాడు.
గది చూపించడానికి నేను ముందు నడిచాను. చేతి కర్రను ఊతంగా తీసుకుని ఆయన నా వెంట నడిచాడు.
గదిని చూసి ఆయన నిరాశ పడతాడనుకున్నాను. అదేమిటో విచిత్రం! పదేళ్ళ పిల్లాడు ఆటబొమ్మ చేతిలో పెడితే మురిసిపోయినట్టు ఆనందంగా చుట్టూ చూస్తూ ‘బాగుంది. నాకిది బాగా నచ్చింది’ అన్నాడు.
అర్ధం కానట్టు పెట్టిన నా మొహాన్ని, అందులోని భావాలను గమనించి ఆయన మెల్లగా చెప్పాడు.
‘గదిలో ఫర్నిచర్ ఎలావుంది? ఫాన్ వుందా? ఏసీ వుందా? అన్న వాటిని బట్టి చూస్తే, నిజమే ఈ గది అంత బావోలేదు. ఇలాగే వుండాలని నేను వచ్చేముందు అనుకోలేదు. అందువల్లనే నాకు నచ్చింది. ఇలా వుండాలి అని ముందు అనుకుని అలా లేకపోతే తరువాత మిగిలేది నైరాశ్యమే.’
ముసలాళ్ళు ధోరణిలో పడితే యెలా మాట్లాడుతారో నాకు తెలుసు. అందుకే నేనేమీ కల్పించుకోకుండా మౌనంగా వుండిపోయాను.
కానీ ఆయన మాటలు కొనసాగించాడు. ముందు అంతగా పట్టించుకోకపోయినా ఆయన మాటల్లోని ఆకర్షణ శక్తి నన్ను కట్టిపడేసింది.
‘భార్య చనిపోయిన తరువాత కొన్నాళ్ళ పాటు ఈ లోకం శూన్యం అనిపించింది. ఆవిడతో పాటే నేనూ పోయి వుంటే యెంత బాగుండేదో అనుకునే వాడిని. కానీ క్రమంగా మళ్ళీ నలుగురిలో పడ్డాను. ఈ లోకానికి నేను చేయగలిగినదేమయినా వున్నదా అని ఆలోచించాను. పిల్లలు వాళ్ల మానాన వాళ్లు స్తిరపడ్డారు. ఒక్కడికీ అంత ఇల్లు అనవసరం అనిపించింది. చిన్న పిల్లలకు ఉచితంగా చదువు చెప్పే ఓ సంస్తకు రాసిచ్చాను. అనాధ బాలలను పెంచి పోషించే మరో సంస్తకు వున్న డబ్బంతా ఇచ్చేసాను. సంపాదించిన దానికి సార్ధకత లభించింది. సంపాదన మళ్ళీ మొదలు పెట్టాలి. కాకపొతే అది డబ్బుసంపాదన కాదు. నలుగురితో మంచిగా వుండడడం, మంచి అనిపించుకోవడం. నిజానికి ఇది డబ్బు సంపాదించడం కన్నా కష్టం.
‘చిన్నదో పెద్దదో ఆ మంచంలో పడుకుంటాను. నా వొంట్లో ఏ అవయవం సరిగ్గా పనిచేయడం లేదో, దానివల్ల పడాల్సిన బాధలేమిటో ఆ మంచంలో పడుకుని ఆలోచిస్తాను. పొద్దున్న లేచిన తరువాత అవయవాలన్నీ సరిగ్గా వుంటే వాటిని అలా సక్రమంగా పనిచేయిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఓ దణ్ణం పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది నా ఆరోగ్యం. మరొకరికి భారంగా మార్చే అనారోగ్యాన్ని దూరంగా వుంచడం. ఇది నా చేతిలో వుందనుకోను. అయినా మానవ ప్రయత్నం చేయాలి కదా.
‘ప్రతి ఉదయం, ప్రతి ఉషోదయం నాకు అదనంగా దేవుడిచ్చిన వరమనే భావిస్తాను. పొద్దున్నే లేచి లోకాన్ని మళ్ళీ చూడగలగడం కంటే ఈ వయస్సులో కావాల్సింది ఏముంటుంది? అలా వచ్చిన ఆ కొత్త రోజుకు స్వాగతం చెబుతాను. నా జీవిత కాలంలో నాకు సొంతమయిన మధుర క్షణాలనన్నింటినీ మరో సారి మననం చేసుకునే మహత్తర అవకాశం దొరికిందని ఆనందిస్తాను.
‘ వృద్ధాప్యం బ్యాంక్ ఎక్కౌంట్ లాంటిది. జీవన యానంలో సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని అందులో డిపాజిట్ చేసుకోవచ్చు. జీవితం చరమాంకంలో తిరిగి తీసుకోవచ్చు. అది డబ్బే కానక్కర లేదు సుమా! నీవంటివారి నుంచి పొందే వాత్సల్యం కూడా అలాటిదే.
‘ఈ రోజున ఇలా తారసపడి నీ ప్రేమాభిమానాలతో నా బ్యాంక్ ఖాతాను పెంచుతున్నావు. అంటే నేను తిరిగి తీసుకునే ఆనందాన్ని మరింతగా పెంచుతున్నావన్న మాట. అందుకు నేను నీకు సదా రుణపడివుంటాను.’
ఆ వృద్ధుడి మాటలు వింటుంటే నాకు నోట మాట రాకుండా అయిపోయింది.