25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఉక్రెయిన్ పై రష్యా వార్.. అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? - LIVE | Russia - ...

24, ఫిబ్రవరి 2022, గురువారం

విజేత మిగలని యుద్ధం – భండారు శ్రీనివాసరావు

 

 పామును చూసి మనిషి భయపడినట్టే, మనిషిని చూసి పాము కూడా భయపడుతుంది. పాము కాటు వేస్తుందేమో అని మనిషి భయం. మనిషి చేతిలో కర్ర చూసి పాముకు భయం.

అణు బాంబులు ఉన్న దేశాలు తలపడ్డప్పుడు  కూడా ఇదే పరిస్థితి. అణుయుద్ధం అంటూ జరిగితే, పరాజితులు వుండరు, విజేతలు మిగలరు.

వాళ్లకు ఆ భయం ఉన్నంత వరకు ఇక ఎవరికీ ఏ భయం అక్కరలేదు, స్టాక్ మార్కెట్ల పతన భయం తప్ప. సాధారణ మనుషులకు   Bear and Bull గొడవే పట్టదు.

(24-02-2022)

యుద్ధాలు మిగిల్చేది ఏమిటి? - భండారు శ్రీనివాసరావు


‘తాతల తండ్రుల చంపుకొనుటకా ఈ భండనంబు కృష్ణా!’

కురుక్షేత్ర రణక్షేత్రంలో మహా భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తెల్లగుర్రముల రధమును తోలే నల్లనయ్యను అప్పటికి అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న అర్జునుడు అడుగుతాడీ ప్రశ్న. తదుపరి కృష్ణుడు గీతార్ధసారం ఎరిగించిన తరువాత ఎరుకనబడిన సవ్యసాచి అన్నదమ్ములతో కలసి సాగించిన ఆ మహా సంగ్రామం అనంతరం కూడా నివృత్తి కాని సందేహం ఇదే.

ఎందుకంటె పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ మహాయుద్ధంలో విజయం సాధించిన యుధిష్టురుడికి మిగిలిందేమిటి? గుట్టలకొద్ది సైనికుల శవాలు. ఆనవాలు పట్టలేని ఆత్మీయుల కళేబరాలు.
కౌరవ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నఅనేక అక్షౌహిణుల సైన్యం నిహతమయింది. శవాల గుట్టల నడుమ, గెలిచినవారి పక్షాన బతికిబట్టగలిగింది ధర్మజ,భీమ,అర్జున,నకుల,సహదేవులు, కృష్ణుడితో కలిపి మరో ఇద్దరు మాత్రమే. ఈ ఇద్దరిలో సాత్యకిని మినహాయిస్తే యుయుత్సుడి విషయం మళ్ళీ అనుమానమే అంటారు చరిత్రకారులు. అంటే విజయలక్ష్మి వరించిన ధర్మజుని పక్షంలో మిగిలింది కేవలం ఏడుగురు మాత్రమే. అటు ఓడిన కౌరవ పక్షంలో ప్రాణాలతో బయటపడింది నలుగురే నలుగురు. అశ్వథామ, కృపాచార్యుడు, కృతవర్మ, కర్ణుడి కుమారుడయిన విశ్వకేతు. ఎవరి కారణంగా ఈ మహారణం చెలరేగిందో ఆ కురుసార్వభౌముడు, దుర్యోధనుడితో పాటు దుశ్శాసనాది అతడి సోదరులందరూ ఈ మహా యుద్ధంలో అసువులు బాశారు.

పదిహేను లక్షల యాభయ్ మూడు వేల తొమ్మిది వందల సైనికులతో కూడిన ఏడు అక్షౌహిణుల పాండవదండుకు సైన్యాధ్యక్షుడు పాంచాల రాజు ద్రుష్టద్యుమ్నుడు కాగా, ఇరవై నాలుగు లక్షల అయిదు వేల ఏడు వందల సైన్యం కలిగిన పదకొండు అక్షౌహిణుల కౌరవసేనకు తొలుదొల్త నాయకత్వం వహించింది భీష్మ పితామహుడు. యుద్ధ పరిసమాప్తి నాటికి ఇరువైపులా మొత్తం సైనికులందరూ తుడిచిపెట్టుకుపోయారు.

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

కేసీఆర్ తో ఎనిమిది గంటలు – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్  మోగింది.

“సీఎం ఆఫీసు నుంచి. శ్రీనివాసరావు గారా!  సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి”  అంది ఓ గొంతు.

ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం లేదు. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం.

“శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి”

కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గర వున్నాను అన్నాడు.

రోజూ మూడున్నరకు నా  మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు.

డ్రైవర్ ని ఉండమని చెప్పి అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు. లిఫ్టులోపైకి వెళ్లేసరికి రండి రండి భోజనం చేద్దాం అని ఆహ్వానించారు కేసీఆర్. చేసేవచ్చానని చెబితే, ఇలా మాతో వచ్చి కూర్చోండి అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ.

భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి  డ్రైవర్ డోర్ తీశాడు.

కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన. ఈలోగా ఎవరితోనో  ముచ్చటిస్తున్న సీఎమ్  నా వైపు చూసి ఎక్కండి అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేనేళ్లు. అందుకే ఆశ్చర్యం. పక్కన కూర్చోబెట్టుకున్నారు.

అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ కూడా నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు అని ఆయన చెబుతున్నప్పుడు మతి పోయింది.

సభ ముగిసింది.

తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్. పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు.

ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను.

ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా  దింపి రండి అన్నారు అక్కడ ఎవరితోనో.

ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను.

అప్పటివరకు సెక్యూరిటీ  జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది.

కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎం తో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్.

అయితే నిజమే అన్నమాట.

ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు?

ఈ భేతాళ ప్రశ్నకు జవాబు లేదు, కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడం తప్ప.



(21-02-2022)

        

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

భయం లేదు! స్త్రీ జాతి సంసిద్ధమయింది!! – భండారు శ్రీనివాసరావు

 

‘పొద్దున్నే హైదరాబాదు వచ్చాను. ఆర్మూరులో అంతా బాగే. అపోలోలో చిన్నక్కను చేర్పించారని బావ ఫోను చేశాడు. ఇప్పుడక్కడికే వెడుతున్నా. చూశాక ఎట్లుందీ మళ్ళీ ఫోను చేసి చెబుతా’

ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపించింది.
ఇందులో ఆశ్చర్యం ఏముందంటారా! కరోనా కారణంగా ఇప్పుడు కుదరడం లేదు కానీ, లోగడ ఊబెర్ లో తిరిగేటప్పుడు ఒక్కన్నీ కాకుండా వీలయినప్పుడల్లా పూల్ (షేరింగ్) పద్దతి ఎంచుకునే వాడిని. డబ్బులు సేవ్ చేయడంకోసం కాదు. రకరకాల వ్యక్తుల్ని కలవడానికి వీలుంటుందని.

అలాగని కారులో వుండగా ఎవరితో మాటలు కలపను. డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చుని మనుషుల్ని చదివే ప్రయత్నం చేసేవాడిని. పుటకలతో పుట్టిన బుద్ది కదా! అలాగే, ఆ రోజు ఊబెర్ ఎక్కాను. వెనక సీట్లో ఒకమ్మాయి కూర్చుని వుంది. ఎవరో ఫోను చేస్తే ఆ అమ్మాయి అంటున్న మాటలు ఇవి. నిజానికి నేను విన్నవి కావు, వినపడ్డవి.
ఊరు నుంచి పట్నం వచ్చింది. నిర్భయంగా ఊబెర్ టాక్సీ పిలుచుకుంది. డేరింగుగా షేరింగు పద్దతి ఎంచుకుంది. ఆసుపత్రిలో వున్న అక్కను పరామర్శించడానికి వెడుతోంది. ఈ దేశానికి ఇంతకంటే ఏం కావాలి? చాలా సంతోషం అనిపించింది.

ఒక విషాదం - ఒక విజయం - భండారు శ్రీనివాసరావు

 (20-02-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

సర్జికల్ స్ట్రయిక్స్ అనే పదం మరోసారి మీడియాలో వినపడుతోంది. రాజకీయ విమర్సలు, ఆరోపణల ప్రసక్తి లేకుండా దీని పూర్వాపరాల పునశ్చరణే ఈ వ్యాసాంశం.  

మూడేళ్ల క్రితం అంటే 2019  ఫిబ్రవరి పద్నాలుగో తేదీ. మధ్యాన్నం మూడు గంటలు దాటింది. ఎర్రటి కాశ్మీర్ కుంకుమ పువ్వును విస్తారంగా పండించే పుల్వామా ప్రాంతం ఉగ్రవాదదాడితో మరింత ఎర్రబడింది. విధి నిర్వహణ కోసం రోడ్డుమార్గంలో జమ్మునుంచి కాశ్మీర్ తరలివెడుతున్న భారత సైనిక వాహన శ్రేణిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషె మహ్మద్ కు చెందిన ఆదిల్ అనే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. శక్తివంతమైన పేలుడు పదార్ధాలు కలిగిన మరో వాహనంలో వాహనశ్రేణి వెంట వేగంగా ప్రయాణిస్తూ, తన కారును తానే పేల్చేసుకున్నాడు. ఆ పేలుడు తీవ్రతకు పక్కనే ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ లోని ఒక బస్సు తునాతునకలయింది. ఆ వేడికి కరిగి ఇనుప ముద్దగా మారింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం నలభయ్ మంది భారత సైనికులు ఈ సంఘటనలో విగతజీవులయ్యారు. వారి దేహాలు వంద మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి. మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది క్షతగాత్రులు అయ్యారు. దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయింది.

ఈ దాడికి పూనుకుంది తామే అని మసూద్ ఆజాద్ నాయకత్వంలోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ మాట్లాడిన దృశ్యాలతో కూడిన వీడియోను సంఘటన జరిగిన కొద్ది సేపటిలోనే ఈ సంస్థ విడుదల చేసింది. ‘దీన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూసే సమయానికి తాను స్వర్గం(దేవుని వద్దకు) చేరుకుంటాన’ని ఆదిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన నమ్మకం పట్ల తనకున్న నమ్మకం అతడ్ని అన్నిరకాల మానవ సంబంధాలనుంచి దూరం చేసిందని ఈ వీడియోని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ఆ మాటకు వస్తే,  ప్రపంచంలోని ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ప్రబోధించదు. ఏమాత్రం సమర్థించదు. అయితే, ఈ మానవేతిహాసంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

మతాన్ని మీరు రక్షిస్తే, ఆ మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పర మతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు.

టూత్ పేస్టు  ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ హననం కాదు, కాసింత సహనం.

'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి. కానీ దాన్ని బోధించేవారే కానీ పాటించేవారు కరువయ్యారు.

మోడీ సర్కారు  పుల్వామా సంఘటనపై తీవ్రంగా స్పందించింది. వీర సైనికుల త్యాగాలను వృధా కానివ్వం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ తో సహా అన్ని ప్రతిపక్షాలు ఉగ్రవాద చర్యను ఆ నాడు తీవ్రంగా గర్హించాయి.

అంతకు ముందు మూడేళ్ల  క్రితం 2016 సెప్టెంబరు 18 వ తేదీన కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లా ఉరీలోని భారత సైనిక శిబిరంలోకి ఉగ్రవాదులు చొరబడి పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడంతో సమానమే. పార్లమెంటుపై దాడికి తెగించినవారిపై తక్షణమే గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో కలిగింది.

ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పది రోజులకే అంటే సెప్టెంబరు  28 వ తేదీన భారత సైనికులు మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఉరీ సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనే పద ప్రయోగం కూడా అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడం ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సర్జికల్ స్ట్రయిక్స్ లో కొన్ని  ప్రత్యేక లక్షణాలు వున్నాయి.

ఈ మెరుపుదాడుల వల్ల అక్కడి సాధారణ పౌరులకు హాని జరగకూడదు. కేవలం లక్ష్యఛేధనే గురిగా ఎంచుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి తగిన శిక్షణ పొందిన, అనుభవం కలిగిన కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా శత్రువు స్థావరాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే శత్రు బలగాలకు తమ ఉనికి, కదలికలు గురించి  గురించి ఎలాంటి అనుమానాలు కలగకుండా గమ్యాన్ని చేరుకోవడం ఈ మెరుపు దాడుల్లో అతి ప్రధానం. ఈ విషయంలో భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే, అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.

నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో ప్రాణాంతక వ్యాధికి కారణమైన ‘కణం’ ఎక్కడ వున్నా, మిగిలిన శరీర భాగాలకు ఇసుమంత హాని జరగకుండా, శస్త్రచికిత్స ద్వారా ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా అలాంటిదే.

మహాభారతం సౌప్తిక  పర్వంలో కూడా ఇటువంటి అస్త్రశస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని, పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ,  పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ధృష్టద్యుమ్యుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం ముఖాముఖి జరిగిన యుద్ధంలో అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉపసంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా, బ్రహ్మ శిరోనామాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్ర లక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భవిచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.

సమరము సేయరే బలము సాలిన......అనే పద్యం తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందింది. శక్తి వుంటే సంగరానికి దిగి అమీతుమీ తేల్చుకోవాలి. దొంగ దెబ్బలు తీయడం వీరుల లక్షణం కాదు. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ కు ఉన్న ప్రధమ,  అధమ లక్షణమే ఇది కావడం ప్రపంచ దౌర్భాగ్యం.



19, ఫిబ్రవరి 2022, శనివారం

కాశీనాధుని విశ్వనాధ్, కొన్ని జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు వారి పుట్టినరోజు)

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్ వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు) సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!
మరోసారి 2017లో... సినిమాహాలు కాదది, దేవాలయం
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకీ రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని ఇటీవలి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది. శంకరాభరణం గురించి కూడా చెప్పారు. “ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం అంటే ఇదే కాబోలు” చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు.

(19-02-2022)