18, ఫిబ్రవరి 2022, శుక్రవారం
ఏడుకొండల వాడా ! – భండారు శ్రీనివాసరావు
అధికారులూ ! గొడ్డలి దాకా తేవద్దు!! – భండారు శ్రీనివాసరావు
మా చిన్నప్పుడు పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు వచ్చేవి.
“అందాల సినిమా తార ఇలా చెబుతోంది.
”నా చర్మ సౌందర్యం కోసం నేనెప్పుడూ పలానా టాయిలెట్
సోప్ నే వాడతాను”
ఆ మాటలు నమ్మి ఆ
సబ్బు వాడేవారు ఎంతోమంది.
చర్మ సౌందర్యం బాగుపడక పోయినా ఓ రెండు రూపాయలతో ఆ
ఆసక్తి ఆ అనురక్తి తీరిపోయేది.
ఇవ్వాళ
ఫేస్ బుక్ లో ఒక ప్రకటన చూశాను. ఇన్ఫోసిస్ సంస్థ స్థాపకుల్లో ఒకరైన నందన్
నీలేకని ఇంటర్వ్యూ ఆ వీడియోలో వుంది (అయితే ఆయన వాయిస్ లేదు) .
ఆయన చెప్పినట్టు రాసిన మాటల సారాంశం ఏమిటంటే
పద్దెనిమిది వేలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది రాత్రికి రాత్రి పిల్లల్ని
పెడుతుందని. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మడి చేత డబ్బు బదిలీ చేయించి అది ఎలా
పెరుగుతుందో ప్రత్యక్షంగా చెప్పించారు, ఆవిడ చేతే.
ముందు చెప్పిన సినిమా తార ఆ సబ్బు పొరబాటున కూడా
వాడివుండదు. అంతటి అందాల తార స్వయంగా చెప్పింది కదా అని సామాన్యులు అదే సబ్బు
కొంటారు.
ఇప్పుడు నీలేకని గారి ఇంటర్వ్యూ పేరుతొ వచ్చిన ఈ
లింక్ టెక్స్టు చూసినప్పుడు ఆ సినీ తార
ప్రకటన గుర్తుకు వచ్చింది.
పైగా దీన్ని ప్రచురించింది ఇండియన్ ఎక్స్ ప్రెస్
పత్రిక. (న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కాదు, అయితే హైదరాబాదులోని న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్
బాధ్యులతో మాట్లాడితే, అది
ఫేక్! దానికి పత్రికతో సంబంధం లేదు అని
చెప్పేశారు)
ఇది మోసం కాకపోవచ్చు. నిజంగానే పెట్టుబడులు
ఇబ్బడి ముబ్బడిగా పెరగవచ్చు. కొట్టేయలేము. కానీ, భవిష్యత్తులో ఏదైనా స్కాం రూపం ధరిస్తే మాత్రం దీన్ని మించిన
స్కాం మరోటి వుండదు.
అందుకే అధికారులూ! గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా
తేవద్దు అని విజ్ఞప్తి చేసేది. జనం మోసపోయి ఫిర్యాదులు చేయకముందే మేలుకోమని
చెప్పేది.
(18-02-2022)
LINK:
కళ్ళల్లో నీళ్లె౦దుకు వున్నాయి? ఇందుకే కాబోలు
17, ఫిబ్రవరి 2022, గురువారం
తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్ – భండారు శ్రీనివాసరావు
16, ఫిబ్రవరి 2022, బుధవారం
మాధవుడు ఏక పదమా! సమాసమా!! – భండారు శ్రీనివాసరావు
“దేవుడు మనిషికి రెండు చెవులు ఇచ్చింది ఎక్కువ వినడానికి, ఒక్క నోరే ఇచ్చింది తక్కువ మాట్లాడడానికి” అని వాక్రుచ్చాడు ఓ మితభాషి.
నిజమే! వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ
చెప్పేవాడు ఓ విజ్ఞాన ఖని అయితే మన పంట పండినట్టే.
ఈ ఉదయం వచ్చిన అనేకానేక ఫోన్లలో కోమాండోరి
(ఇంటిపేరు విని రాసింది కనుక తప్పయితే క్షంతవ్యుడను) శేషాచారి గారిది ఒకటి. మాటల నడుమ తెలిసింది వారి వయసు తొంభయ్ అని.
కొద్దిగా వణుకు వున్నా, మాట స్పుటంగా
వుంది. ఉస్మానియాలో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారుట. చైతన్యపురిలో
నివాసం.
షరా మామూలుగా నమస్తే తెలంగాణా లోని నా వ్యాసం
గురించి ప్రస్తావించారు. నా పట్ల వారి ప్రశంసలు
ఇక్కడ అప్రస్తుతం.
ప్రతిరోజూ అనేక పత్రికలు చదివే అలవాటు వారికి
వుందట. అలా నా వ్యాసం కూడా చదివారు. అందులో నెంబరు వుండడం చేత ఫోన్ చేశారు.
మాటల మధ్యలో శేషాచార్యుల వారు అనేక అంశాలు
ప్రస్తావించారు. తొమ్మిది పదుల వయసులో ఆయన ధారణ శక్తి అద్భుతం అనిపించింది. వారు
చెప్పిందే ఈవ్యాసం శీర్షికలో పేర్కొన్న ‘మాధవుడు
ఏక పదమా! సమాసమా!’
మాధవుడు అంటే శ్రీమన్నారాయణుడు. వినగానే ఏకపదం
అనిపిస్తుంది. ఉత్పత్తి అర్ధం తీసుకుంటే మా అంటే అమ్మ. అమ్మ అంటే అమ్మవారు,
జగజ్జనని. అంటే శ్రీ మహావిష్ణువు సతీమణి. ధవుడు అంటే భర్త. అమ్మవారి భర్త
శ్రీమన్నారాయణుడు అంటారు శేషాచార్యుల వారు.
మధ్యలో ఏదో అనుమానం కలిగి అడిగారు, మీరు
ఫ్రీగా వున్నారా! అని.
‘పరవాలేదు, నేను 24 X 7 ఫ్రీ మనిషిని. పైగా మీ మాటలు వింటుంటే
రాసుకోవడానికి నాకు ముడి సరుకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నా స్వార్ధం కూడా
వుంది,
చెప్పండి’ అన్నాను
వారితో.
‘ఒకసారి అంటే ఇప్పుడు కాదులెండి చాలా దశాబ్దాలు
గడిచిపోయాయి. సారస్వత పరిషత్ లో జరిగిన ఓ సభకు ప్రముఖ కవి జాషువా గారు,
కవిసామ్రాట్ విశ్వనాధ గారు వచ్చారు. నేనూ వెళ్లాను.
‘జాషువా గారు సాత్వికులు. విశ్వనాధ వారి సంగతి
లోక విదితం. ప్రధమ కోపం అంటారు.
‘జాషువాగారు నాలుగు పద్యాలు చదివారు. తర్వాత ఆయన
ఇలా అన్నారు, నా
పద్యాలకు అర్ధం అడక్కండి, కానీ
రాయడానికి కారణాలు అడగండి చెబుతాను అంటూ జాషువాగారు తన గబ్బిలం పుస్తకం గురించి
చెబుతుంటే సభలో అందరూ ఆయన కవితాభినివేశానికి మ్రాన్పడి పోయారు. అంతసేపూ వేదిక మీద
ఉన్న విశ్వనాధవారు తనకు వేసిన గులాబీ పూలదండను
చేతితో నలుపుతున్నట్టు అనిపించి కొంత భయపడ్డారు కూడా.
ఇంతలో జాషువాగారి ప్రసంగం ముగిసింది. సభికుల
హర్షధ్వానాల నడుమ విశ్వనాధ లేచి నిలబడ్డారు. అప్పటివరకు పూలదండ నుంచి తెంచిన
గులాబీ రేకులను దోసిట్లోకి తీసుకుని జాషువా శిరస్సుపై అభిషేకిస్తున్నట్టు
వెదజల్లారు.
రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ జాషువాను
పుంభావసరస్వతి అని కీర్తించారు.
శేషాచార్యుల వారు ఈ వృత్తాంతం చెబుతూ కొద్ది సేపు
మౌనంగా వుండి గతకాలపు జ్ఞాపకాలను తలచుకున్నారు.
తర్వాత నేనే చొరవ తీసుకుని వారి వివరాలు అడిగి
తీసుకున్నాను. లోగడ అంటే నేను రేడియోలో చేరక పూర్వమే శేషాచార్యులవారు ఆకాశవాణిలో సంస్కృత
కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అధర్వణ వేదాన్ని విశదీకరిస్తూ అనేక ప్రసంగాలు
చేశారట.
ఇటువంటి విలువకట్టలేని నిక్షేపాలు ఆకాశవాణి వద్ద
అనేకం ఉండేవి. ఉండేవి అని ఎందుకు అంటున్నాను అంటే తదనంతర కాలంలో వాటి విలువ తెలియని వాళ్ళు వాటిని పదిలంగా
భద్రపరచి వుంటారనే నమ్మకం లేదు కనుక.
పాదాభివందనాలు శేషాచార్యుల వారూ. పరగడుపునే
పరమాన్నం తినిపించారు.
(16-02-2022)
“లచ్చన్నా! ఢిల్లీ పోదాం” అన్నారు ముఖ్యమంత్రి ఎన్టీఆర్”
పొద్దున్నే
ఫోన్ మోగింది.
“పదిహేనేళ్లు
పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ నమస్తే తెలంగాణా పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టుకోలేక
వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న.
ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి
లక్ష్మన్నే ఆయనకు అధికారిక కారు డ్రైవర్. లక్ష్మన్న
ఇంట్లో పెళ్లి జరిగితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో డ్రైవర్ ఇంటికి వెళ్లి రావడం ఆ రోజుల్లో ఓ
సంచలనం.
“ఎన్టీఆర్
గారు నన్ను ఎప్పుడూ లచ్చన్నా అని ఆప్యాయంగా పిలిచేవారు. అసలు నన్నిలా మొదటి సారి
పిలిచింది ఆయన గారి భార్య బసవ తారకం గారు. ఓసారి జూబ్లీ హాలులో ఏదో అధికారిక విందు
వుంటే, ముఖ్యమంత్రి
గారినీ, వారి భార్య
బసవతారకం గారినీ కారులో తీసుకు వెడుతున్నాను. అమ్మగారు కారులో కూర్చోగానే నాపేరు
అడిగారు. లక్ష్మన్న అని చెప్పాను. ఆవిడ నవ్వుతూ ‘సరిపోయింది, రాముడికి లక్ష్మణుడు దొరికాడు” అని
అంటూ ‘అంతేనా లచ్చన్నా’ అన్నారు. అంతే అప్పటి నుంచి నాపేరు లచ్చన్న అయిపోయింది”
లక్ష్మన్న
మంచి ఉద్వేగంలో వుండి అనేక సంగతులు చెప్పుకొచ్చాడు.
“చివరిసారి
ముఖ్యమంత్రి అయినప్పుడు ఓసారి కారులో వెడుతుంటే “ఈసారి ఢిల్లీ వెడదాం పద. నువ్వూ
వద్దువు కాని. దేశాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే గట్టి లాస్ (చట్టాలు) కావాలి.
ఇప్పుడున్నవి సరిపోవు. మనం వెళ్లి ఆ పని చేయాలి” అన్నారు. దురదృష్టం! ఆ తర్వాత
కొన్ని నెలలకే ఆయన ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు”
“ప్రతిపక్షంలో
వున్నప్పుడు సభలో లేని సారుని కూడా సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి సారు అసెంబ్లీ
గుమ్మం తొక్కలేదు. నేనూ బయటకు వచ్చేశాను.
సెలవు పెట్టి ఆయన గారి వద్దనే పనిచేశాను. మళ్ళీ సారు ముఖ్యమంత్రి కాగానే నన్ను తిరిగి తీసుకున్నారు.
ఆ తర్వాత కొద్ది రోజులకి సీఎం గారు, రామచంద్రరావు (పీఆర్వో) గారిని పిలిచి ‘లచ్చన్న
ఉద్యోగం మళ్ళీ రెగ్యులరైజ్ చేయించండి. ఆ ఆర్డరు కాపీ తెప్పించి లచ్చన్నకు ఇవ్వండి’
అని చెప్పారు. అన్నట్టే నా ఉద్యోగం రెగ్యులర్ అయింది. నాలుగు ఇంక్రిమెంట్లు కూడా
ఇచ్చారు.
“మీ
అన్నగారు (పర్వతాలరావు గారు, రామచంద్రరావు గారికి ముందు సీఎం పీఆర్వో) దేవుడు. లిఫ్ట్
బాయి దగ్గర నుంచి డ్రైవర్లని, జవానులని చిన్నా పెద్దా తారతమ్యం
లేకుండా అందర్నీ రోజూ పలకరించి యోగక్షేమాలు అడిగేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు.
చేయదగిన,
చేతనైన సాయం చేసేవారు,
మరోసారి అడిగే పని లేకుండా.
“మీ
గురించి చాలా ఏళ్ళుగా వాకబు చేస్తున్నా. టీవీల్లో కనబడేవారు. కానీ ప్రయత్నించినా
మీ నెంబరు దొరకలేదు. చివరికి ఈరోజు నమస్తే తెలంగాణా పత్రికలో దొరికింది”
చెప్పాడు
లచ్చన్న ఉరఫ్ లక్ష్మన్న.
(16-02-2022)
దటీజ్ కేసీఆర్ - భండారు శ్రీనివాసరావు