15, ఫిబ్రవరి 2022, మంగళవారం

నా ఓటు సాధారణ ఓటరుకే! - భండారు శ్రీనివాసరావు

 ఎన్నికలు దగ్గర పడగానే సాధారణ ఓటర్లకు సుద్దులు చెప్పే నీతిశతకకారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. డబ్బుకు అమ్ముడు పోవద్దు అంటూ సుమతీ శతకాలు వల్లె వేస్తుంటారు. ఉదాహరణకు 2014 లో జరిగిన ఎన్నికలకు ముందు, విశేష ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ పత్రిక ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఏమని? ఓటు వేసేముందే ఎంచుకునే అభ్యర్ధిని శ్రీరాముడి గుణగణాలతో పోల్చుకుని మరీ ఓటువెయ్యమని. ఓటర్లు ఆ సూచన పాటిస్తే అభ్యర్ధుల జాబితాలో శ్రీరామచంద్రునితో సరితూగగలవాళ్ళు ఒక్కరూ దొరక్కపోవచ్చు. నోటాకే ఓట్లు దండిగా పడొచ్చు.

నిజానికి చదువుకున్న ఓటర్లతో పోలిస్తే నిరక్షరాస్యులయిన ఓటర్లే చాలా నయం.

అందుకే సగటు భారతీయ ఓటరు అంటే నాకు తగని గౌరవం. దీనికి కారణం వుంది.

అనేక దశాబ్దాల నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నాను. కాడిజోడెడ్లు (కాంగ్రెస్) కంకీ కొడవలి (కమ్యూనిస్ట్) ప్రమిదె (జనసంఘం) ఇలా పోలింగు కేంద్రంలో గుర్తులు అతికించిన బ్యాలెట్ డబ్బాలు (నిజంగానే డబ్బాలు, ఖాళీ కిరసనాయిలు డబ్బాలు అనుకుంటాను) పెట్టేవాళ్ళు. ఆయా పార్టీలకి వచ్చిన ఓట్లు విడిగా లెక్కబెట్టి ఫలితాలు ప్రకటించేవాళ్ళు. తరువాత కాలంలో కాంగ్రెస్ గుర్తు ఆవూ దూడా, ఆ పిదప హస్తం ఇలా మారిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. జనసంఘం భారతీయ జనతా పార్తీగా పేరుతో బాటు, గుర్తును కమలంగా మార్చుకుంది. అభ్యర్ధుల పేర్లు లేకుండా గుర్తులతో బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగి యంత్రాలు రంగ ప్రవేశం చేసాయి. చదువుకున్న పోలింగు సిబ్బంది కొంత గందరగోళపడ్డారు కాని నిరక్షరాస్యుడయిన సగటు ఓటరు మాత్రం మార్పుకు తేలిగ్గా అలవాటుపడ్డాడు. మనతోబాటే స్వతంత్రం తెచ్చుకున్న ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు సైనిక పాలనలోకి జారిపోయాయి కాని మనదగ్గర మాత్రం ప్రభుత్వాలు కేవలం ఓటుతోనే మారుతూ వచ్చాయి. అలాటి ఘన చరిత్ర కలిగిన సగటు ఓటరుకు, డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దంటూ నీతులు చెబుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నిజానికి ప్రతిఎన్నికలో చురుగ్గా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేది వాళ్ళే. ఎండయినా వానయినా పోలింగు కేంద్రాల వద్ద క్యూలల్లో వేచి నిలబడి ఓటు వేసేవాళ్ళు వాళ్ళే. చదువుకున్నవాళ్ళలో ఇలాటి చొరవ కనబడదు. ఆసక్తి కనబడదు. పైపెచ్చు డబ్బుకు గడ్డి తిని ఓటేస్తున్నారని మామూలు ఓటర్లని ఎద్దేవా చేస్తుంటారు. ఇది వాళ్లని అవమానించడమే. నిజానికి అధికారానికి భయపడి జనాలు ఓట్లేస్తే ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధి ఓడిపోయేదా ? డబ్బుకు కక్కుర్తి పడి ఓటేస్తే డబ్బున్నఖామందులందరూ గెలుస్తూ వుండేవారు కదా!

ప్రచారానికి, ఇతరత్రా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసే  రాజకీయ పార్టీలు, డబ్బున్నవాళ్ల నుంచి డబ్బు తీసుకుని టిక్కెట్లు ఇస్తే అది తప్పుకాదు. వాళ్లు నామినేషన్ వేయడానికి చేసే హడావిడి చూసి ఎవ్వరు మాట్లాడరు. ప్రత్యేక విమానాల్లో, హెలికాఫ్టర్లలో నాయకులు తిరుగుతుంటే ఆ డబ్బెక్కడిది అని అడిగేవాళ్ళు వుండరు. గెలిచివచ్చిన తర్వాత ప్రభుత్వాల ఏర్పాటులో కానీ, ముఖ్యమంత్రుల ఎంపికలో కానీ లక్షలకు లక్షలు డబ్బులు నిస్సిగ్గుగా తీసుకుని ఓటు వేసే ప్రజాప్రతినిధులను డబ్బుకు అమ్ముడుపోతున్నారని ఏ ఒక్కరూ వేలెత్తి చూపరు. సాధారణ  ఓటరు దగ్గరకు వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవాళ్ళే!

ఎన్నికల్లో అభ్యర్ధులు ముట్టచెప్పే డబ్బు తీసుకుంటున్నారేమో కాని ఖచ్చితంగా ఓటు మాత్రం వాళ్లు అమ్ముకోవడం లేదు. వాళ్ళ ఓట్లను అభ్యర్ధులు కొనుక్కుంటున్నారు అని అంటే కొంత అర్ధం వుంది.

ఇది నిష్టూరంగా ధ్వనించే సత్యం.

దయచేసి ఇలా సగటు ఓటర్ని అవమానించవద్దు. ఈ వట్టినీతులు కట్టిపెట్టి, చేతనయితే పోలింగు రోజు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా వెళ్ళి వోటు వేసి అందరికీ ఆదర్శంగా నిలవండి.


కొలిపాక కాందాన్ తిరుపతి యాత్ర

 

నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించు. మిగిలినవి నాకు వదిలెయ్యి’ అన్నాడు నారాయణుడు నరుడితో.

నరుడితో అన్నాడు కానీ నరులతో కాదుకదా అని ఆ గీతావాక్యాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు నాబోటి మానవులు.

అయితే చెవినపెట్టడడమే కాదు చేసి చూపించేవాళ్ళు కూడా వున్నారు. వారే వీరు.

మొత్తం నలభయ్ ఎనిమిదిమంది. నాలుగేళ్ల పిల్లవాడి నుంచి ఎనభయ్ అయిదేళ్ళ వృద్దురాలివరకు ఈ యాత్రలో పాల్గొన్నారు. హాయిగా తిరుపతి వెళ్ళారు. తృప్తిగా దర్శనం చేసుకున్నారు. మొక్కుబళ్ళుతీర్చున్నారు. ఎంచక్కా తిరిగొచ్చారు. ఒక్క పిర్యాదు లేదు. ఒక్క నసుగుడు లేదు. ఎలా! అంటే నారాయణుడు చెప్పినట్టు విన్నారు. చేయాల్సిన మానవ ప్రయత్నం చేశారు. ఫలితం దేవుడికి వదిలేసారు. అక్కడినుంచి ఆయనే చూసుకున్నాడు.

కొలిపాక కాందాన్ వాట్సాప్ గ్రూపులోఒక మెసేజ్ వెళ్ళింది, కొలనరావు నుంచి.

పలానా రోజున బయలుదేరుతున్నాం తిరుపతికి. పలానా రైల్లో. ఆరోజు యాభయ్ అరవై ఖాళీ బెర్తులు వున్నాయి. ఇష్టం వున్నవాళ్ళు, రావాలనుకునే వాళ్ళు వెంటనే కన్ఫర్మ్ చేయండి”

ఆ రోజు ఏ వారం. ఆఫీసులు ఉంటాయా? పిల్లలకు పరీక్షలు ఉంటాయేమో! సవాలక్ష అనుమానాలు. తీర్చుకునే వ్యవధి లేదు.

టిక్కెట్లు బుక్ చేయాలి వెంటనే చెప్పండి’ అనే విన్నపంతో కూడిన హుకుం.

అయిదే అయిదు నిమిషాల్లో నలభయ్ ఎనిమిది మంది కన్ఫర్మ్ చేసారు. ‘వీలుండి పొతేపోతాం. పోలేకపోతే హుండీలో వేశామనుకుందాం’. విడివిడిగా అందరూ అనుకున్న మాట ఇదే.

ప్రయత్నం ఫలించింది. అందరికీ రైలు టిక్కెట్లు దొరికాయి రానూ పోను.

ఇక దర్శనం, కాటేజీ బుకింగ్.

మళ్ళీ మరో మెసేజ్ వెళ్ళింది.

నెట్ ఫెసిలిటీ ఉన్న అయిదారుగురం అందరి ఆధార్ వివరాలతో ఉదయం ఏడుకల్లా ఒకచోట కలుద్దాం’

మర్నాడే కలిశారు. క్షణం ఆలస్యం చేయకుండా తిరుమల వెబ్ సైట్ ఓపెన్ చేసారు. ఒకేసారి అన్ని వివరాలు దగ్గర ఉంచుకుని ప్రయత్నం చేశారు. నారాయణుడి మాట విన్నారు. మానవ ప్రయత్నం చేసారు.

గీతా వాక్యం నిజమైంది. అనుకున్న దర్శనం టిక్కెట్లు అన్నీ దొరికాయి. అల్లాగే వసతి ఏర్పాట్లు.

ఇక చకా చకా మేసేజిలు అటూ ఇటూ పరిగెత్తాయి. ప్రతి పనికీ ఒకరు బాధ్యత తీసుకున్నారు. ఒకళ్ళు తిండీ తిప్పలు. మరొకళ్ళు చిన్న పిల్లల ఆలనా పాలనా. ఇంకొకళ్ళు పెద్దవాళ్ళ మంచీచెడ్డల బాధ్యత. వేరొకళ్ళు సమన్వయం.

ఘడియ దగ్గర పడింది. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయో లేదో చూడడానికి ముందుగా ఒకళ్ళను పంపారు. కొండకు తీసుకువెళ్ళే మూడు ఏసీ మినీ బస్సుల్ని కుదుర్చుకున్నారు. అన్నీ ఆన్ లైన్ లోనే. అనుకున్న ప్రకారం రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఒకళ్ళు అందరూ వచ్చారా లేదా ఆజా కనుక్కుంటే మరొకళ్ళు లగేజీ చెక్ చేసారు. ముందుగా బుక్ చేసుకోవడం చేత ఒక బోగీలోనే అందరికీ బెర్తులు దొరికాయి. చిరుతిండ్లు ఇళ్ళవద్దనే తయారు చేసుకున్నారు. తినే పేపరు ప్లేట్లు, గ్లాసులు, వాడిన వాటిని ఒకేసారి పారేయడానికి పెద్ద పెద్ద డిస్పోజబుల్ బ్యాగ్స్ అన్నీ రెడీ.

తిరుపతిలో రైలు దిగగానే మినీ బస్సులు ఎక్కారు. కొండపైకి వెళ్ళారు. అందరికీ ఒకే భవనంలో వసతి దొరికింది. సాయంత్రం కాగానే నిర్దేశిత సమయానికి క్యూ కాంప్లెక్స్ కి వెళ్ళారు. గంటల్లో దర్శనం అయింది. వీళ్ళల్లో పెద్దవాళ్ళు కొందరు వయో వృద్ధుల కోసం ఏర్పరచిన సదుపాయం ఉపయోగించుకుని త్వరగా దర్శనం చేసుకున్నారు.

కొండ పైనా కిందా హోటళ్ళలో ఒకేసారి టేబుల్స్ ఇంతమందికి దొరకడం కష్టం. అందుకని ఒకళ్ళిద్దరు ముందుగా వెళ్లి టేబుల్స్ సిద్ధం కాగానే మెసేజ్ పెట్టేవాళ్ళు. ఎక్కువ సమయం వేచి ఉండకుండా భోజన కార్యక్రమం పూర్తయ్యేది.

ఇలానే మంగాపురం. ఇలానే తిరుగు ప్రయాణం. ఇలానే హాయిగా యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాదు తిరిగొచ్చారు.

ఇదంతా జయప్రదం కావడానికి ఈ యాత్రకు వెళ్ళిన వారిలో చాలామంది తమవంతు సాయం చేసిన మాట నిజమే కానీ వాళ్ళు అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఒక్కటే. చెప్పేపేరు ఒక్కటే. కొలనరావు. అంటే మా మేనల్లుడు. ‘వాడు ఒక పధకం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయబట్టే ఇది సాధ్యం అయింద’ని కొలనరావు అన్నయ్య రాంబాబు చెప్పాడు. చెబుతూ ఈ యాత్రా విశేషాలన్నీ నా చెవిన వేసాడు.

ఒక పైరవీ లేదు. ఒక్క సిఫారసు కాగితం లేదు. ఒకళ్ళని ప్రాధేయపడింది లేదు. జరుగుతుందో లేదో అనే భయం లేదు. జరగదేమో అనే ఆందోళన అంతకంటే లేదు. వెళ్ళేటప్పుడు వేరే ఏ ధ్యాసా లేకుండా వెళ్ళాము. వచ్చేటప్పుడు మంచి దర్శనం దొరికిందనే తృప్తితో వచ్చాము’ అన్నాడు రాంబాబు.



14, ఫిబ్రవరి 2022, సోమవారం

నిశ్శబ్దం రాజ్యమేలిన ముఖ్యమంత్రి సంజీవయ్య సభ - భండారు శ్రీనివాసరావు

 (ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య గారి జయంతి)


ఈ విషయం చెప్పే ముందు దీంతో సంబంధం ఉన్న మరో విషయంతో మొదలు పెడతాను.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ స్థాయికి చేరడానికి ముందు ఎక్కిన అనేకానేక నిచ్చెన మెట్లలో నెలకు పాతిక రూపాయల ‘విలేకరి కొలువు’ కూడా వుంది.
ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. రామ్మోహనరావు గారు ఆ కాలేజీలో లెక్చరర్. వారి నాన్నగారికి పత్రికల ఏజెన్సీ కూడా వుంది. అప్పట్లో ఆ ఏజెంట్లే పత్రికా విలేకరుల పాత్ర కూడా పోషించేవారు. మా అన్నయ్యకు తెలుగులో ఉన్న ప్రావీణ్యం గమనించి ‘నెలకు ఓ పాతిక ఇస్తాను, నీకు పాకెట్ మనీగా పనికి వస్తుంది, నువ్వు ఆంద్రజ్యోతి పత్రికకు వార్తలు రాస్తుండు. వాళ్ళు వేస్తె వేస్తారు, లేకపోతే లేదు, కానీ నీకు మంచి కాలక్షేపంగా వుంటుంది’ అని ప్రోత్సహించడంతో మా అన్నయ్య ఒప్పుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తాను.
నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు అయింది. అప్పటికే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ రెండు వర్గాలుగా విడిపోయివున్నారు. జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి వంటి అతిరధులు కలిగిన ప్రధాన వర్గం అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ రెడ్డికి అనుకూలం. మరో వర్గం సంజీవయ్య వైపు. దీనికి మాకు బాబాయి వరుస అయిన బొమ్మకంటి సత్యనారాయణ నాయకులు. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు ఆయన ముఖ్యమంత్రి సంజీవయ్యకు కుడి భుజం. సంజీవయ్యకు సంఘీభావం తెలిపేందుకు గోకినేపల్లిలో జిల్లా దళిత మహా సభ ఏర్పాటు చేశారు. ఈ సభను కవర్ చేయడానికి పాతిక రూపాయల విలేకరి అయిన మా అన్నయ్యను పురమాయించారు రామ్మోహన రావు గారు.
సభ బాగా జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగించడానికి మైకు ముందు నిలబడ్డారు. సంజీవయ్య స్వతహాగా మంచి వక్త. ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.
‘నన్ను బాధ పెడుతున్న, నా మనసును కలచి వేస్తున్న ఓ విషయాన్ని మీకు చెప్పదలచుకున్నాను. ఇక్కడ పైనా కిందా కూర్చున్న మనుషులం అందరం ఒకే తీరున ఉన్నాము. ఒంట్లో పారే రక్తం రంగు అందరికీ ఎరుపే. కానీ మనలో చాలామందిమి సాటి మనిషిని మనిషిగా చూస్తున్నామా అంటే అనుమానమే. డబ్బున్న ఖామందులు పెంపుడు బొచ్చు కుక్క పిల్లల్ని తమ పక్కలపై పడుకోబెట్టుకుంటారు. ముద్దు చేస్తారు. అదే సాటి మనిషిని తాకడానికి కూడా వారికి అస్పృశ్యత అనే అనాచారం అడ్డం వస్తుంది. కుక్కలపాటి చేయరా ఈ మనుషులు? ఎందుకీ వ్యత్యాసం? ఎందుకీ వివక్ష?’
రెండు చేతులూ గట్టిగా గాలిలో ఊపుతూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్వరం బొంగురుపోయింది. పైకిలేపిన చేతులను అలాగే వుంచి ఆయన కాసేపు మౌనంగా వుండిపోయారు.
సభకు హాజరై ప్రసంగం వింటున్న యావన్మంది చేష్టలు ఉడిగి వుండిపోయారు. అంతటా నీరవ నిశ్శబ్దం.
సరే! ఆ రోజు సభ ముగిసింది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి దామోదరం సంజీవయ్య అంబాసిడర్ కారు ఎక్కారు. ఆయన పక్కనే మా బాబాయి బొమ్మకంటి సత్యనారాయణ. ముందొక పోలీసు జీపు, వెనక మరో జీపు. అదీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోజుల్లో.
మా అన్నయ్య ఖమ్మం చేరుకున్న వెంటనే తన రిపోర్ట్ రాసి మర్నాడు పోస్టులో పంపారు. ఆ మరునాడు అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
‘ముఖ్యమంత్రి దళిత సభలో రాజ్యమేలిన నిశ్శబ్దం’.
వార్తతో పాటు మా అన్నయ్య పెట్టిన హెడ్డింగ్ కూడా యధాతధంగా పత్రికలో రావడం కొసమెరుపు.


( కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య)


ప్రేమంటే ఇదిరా! -భండారు శ్రీనివాసరావు

 పత్రికలకి కొన్ని వార్తలు పట్టవు. అయినా అలాటి వార్త ఒకటి నా కంట పడింది. ఏదో పత్రికలో కాదు, యాధాలాపంగా రిమోట్ తో టీవీ ఛానళ్లు మారుస్తుంటే.

పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఆయనకు కొత్త కాదు. కాని ఎప్పుడు మాట్లాడినా వినేవాళ్ళకు కొత్తగానే వుంటుంది.

ఆయన తీసుకున్న అంశం కొత్తగానే కాదు కాస్త విచిత్రంగా కూడా వుంది.

వేలంటైన్స్ డే. ప్రేమికుల దినం. దాన్ని గురించి మాట్లాడడమే కాదు, ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం రోజున దాన్ని హైదరాబాదులో నిర్వహించారు కూడా.

ఇక ఈ ‘కూడా’లు కాస్త పక్కనబెట్టి అసలు విషయం చెప్పుకుందాం.

స్వామివారు ఏమిటి? ప్రేమికుల దినోత్సవం జరపడం ఏమిటి? దాన్ని గురించి మాట్లాడ్డం ఏమిటి అనే ప్రశ్నలకు తమ అనుగ్రహ భాషణంలో ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.

వేలంటైన్స్ డే' ప్రాశస్త్యం గురించి చెప్పారు. దాని ఆవిర్భావం గురించి వివరించారు. ఒక యువకుడు, ఒక యువతి ప్రేమించుకోవడం ఒక్కటే ప్రేమ అనుకోరాదన్నారు.

అది కూడా ప్రేమే. కాదనను. కానీ పిల్లలపట్ల తల్లి చూపే ప్రేమ, తల్లి పట్ల పిల్లలు చూపే ప్రేమ, తండ్రి పట్ల పిల్లలు, పిల్లల పట్ల తండ్రులు ప్రదర్శించే ప్రేమ, భగవంతుడి పట్ల భక్తుడి ప్రేమ, భక్తుడి విషయంలో భగవంతుడు చూపే ప్రేమ, అన్నింటికీ మించి దేశం పట్ల, హనుమంతప్ప వంటి వీరుల పట్ల జాతి ప్రజలు చూపాల్సిన ప్రేమ, ఇలా సాగే ఈ ప్రేమలు అన్నింటినీ, వాటి వైశిష్ట్యాన్ని ఎత్తి చూపాల్సిన దినం, ప్రేమికుల దినం’ అంటూ చక్కని సరికొత్త నిర్వచనం ఇచ్చారు పరిపూర్ణానంద స్వామి వారు. యెంత చక్కటి తాత్వికత! యెంత గొప్ప ఆలోచన.

నిజమే కదా! ప్రేమ్ దివస్ అంటే ప్రేమికుల రోజు కాదు, ప్రేమ మహత్తును అందులోని మత్తును జగత్తుకు తెలపాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కళ్ళు చెదిరే విన్యాసాలు లేవు కానీ, కళ్ళు చమర్చే అంశాలు వున్నాయి. ప్రేమికుల రోజునే దీన్ని నిర్వహించడం ద్వారా స్వామి, నేటి తరానికి కొత్త సందేశం ఇచ్చారు. అంతే కాదు, ప్రేమ అంటే ఏమిటో, అది ఎన్ని రకాలుగా తన రూపాలను విస్తరిస్తుందో ఈ కార్యక్రమంలో ఎత్తి చూపారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఒక మాతృమూర్తిని తీసుకువచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఆమె కడుపున పడ్డ బిడ్డడు భూమిన  పడ్డాడు కాని, అప్పటి నుంచి ఇప్పటివరకు మానసిక ఎదుగుదల లేదు. ‘అమ్మా’ అనిపించుకోని ఆడజన్మ నిరర్ధకం అంటారు. పాపడు పుట్టి ముప్పయి రెండేళ్ళు అవుతున్నాయి. కాని ఏనాడు నోరు తెరిచి ‘అమ్మా’ అని పిలవలేని నిర్భాగ్య దామోదరుడు అతడయితే, పిలిపించుకోలేని దౌర్భాగ్యం ఈ కన్న తల్లిది. తల్లిప్రేమ తూచగలిగిన తరాజు ఈలోకంలో లేదు. ఏమీ లేకపోయినా అన్నింటికీ మించిన అమ్మతనం ఆమె సొంతం. ఆ బిడ్డడి పట్ల కన్నతల్లి ప్రేమ చూపడంలో ఆ పేదరాలు ‘పేదది’ అనిపించుకోలేదు. ఇన్నేళ్ళు వచ్చినా ఆ పాపడికి పసితనపు ‘తెలియనితనం’ పోలేదు. ఇప్పటికీ దైహిక సంబంధమైన ప్రాకృతిక పనులన్నీ ఆ తల్లి ఒడిలోనే. అయినా, అసహ్యించు కూకుండా, ఏవగించుకోకుండా ప్రేమతో  సేవలు చేస్తూనే వస్తోంది. అన్నేళ్ళు వచ్చినా ఆ పాపడు ఆ తల్లికి ఇంకా ఒడిలోని బిడ్డే. అందుకే, ఈ కార్యక్రమ నిర్వాహకులు ‘ తల్లి ప్రేమలో కల్తీ వుండదు’ అని నిరూపించిన ఆ మాతృమూర్తిని సగౌరవంగా వేదిక మీదకు తోడ్కొని వచ్చి సన్మానం చేసారు. ముఖ్య అతిధిగా వచ్చిన అప్పటి తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ శ్రీ మధుసూధనాచారి, ఆమె పరిస్తితి చూసి విచలితులై తన జేబులో వున్న కరెన్సీ నోట్లు అన్నింటినీ, ఎన్ని వున్నాయో లెక్కపెట్టుకోకుండా ఆ అమ్మ చేతిలో పెట్టి దణ్ణం పెట్టారు.

అలాగే, స్వామి కన్నుపడిన మరో అదృష్టవంతుడు, పుట్టుకతో దురదృష్టవంతుడు అయిన కనుచూపు లేని సంగీత కళాకారుడు మోహన కృష్ణ. చిన్నతనంలో అంతంతగా వున్నా కనుచూపు ఒక వయసు రాకముందే పూర్తిగా పోయింది. కన్నతల్లి లాలనలో పెరిగిన కళ్ళు లేని మోహన కృష్ణ ఇంతేనా ఈ జీవితం అని నిరుత్సాహపడకుండా సంగీతాన్నే తన జీవితం చేసుకున్నారు. సంగీత ప్రపంచంలోనే పెరిగిపెరిగి, వయస్సులోనే కాకుండా సంగీతంలో కూడా చాలా పెద్దవాడయాడు. సంగీతాన్ని అంతగా ప్రేమించిన వాడు కనుకనే సంగీత సరస్వతి అతడిని అంతగా కరుణించింది. ఈ వేడుకలో సన్మానం పొందినవారిలో మోహన కృష్ణ ఒకడు కావడానికి ఈ ప్రేమే కారణం.

పత్రికలు చదివే వారికి వరంగల్ ‘ప్రణీత’ గుర్తుండేవుంటుంది. రౌడీలు చిమ్మిన యాసిడ్ మొహాన పడి అందవికారిగా మారిన ప్రణీత, పట్టుదలతో చదువు కొనసాగించి, బీటెక్ పూర్తిచేసి ఇంజినీర్ కాగలిగింది. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం మిన్న అని నమ్మిన ఓ యువకుడు, ఆమె గురించి విని, అమెరికా నుంచి వచ్చి ఏరికోరి మరీ ఆమెను పెళ్ళాడాడు. ఈ వేదిక మీద ఆమెను చూసిన వారు చప్పున గుర్తుపట్టి వుండరు. ఎందుకంటె ఆత్మబలం ఇచ్చిన దమ్మూ ధైర్యం ఆమె మొహం మీది మరకలను కనబడకుండా కప్పివేశాయి. ఈ నిజమైన ప్రేమకు కూడా ఈ వేదికపై ఘనమైన  సత్కారం జరిగింది.

భారతీయతకు కుటుంబ వ్యవస్థ వెన్నెముక. కాలక్రమంలో కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని గ్రహించిన ఓ కుటుంబం, మనకు మాత్రమే  సొంతం అయిన ఈ ‘కుటుంబ వ్యవస్థను’ రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుతోంది. ఆ కుటుంబం మన మహబూబ్ నగర్ జిల్లాలోనే వుంది. మొత్తం అరవై రెండు మంది సభ్యులు వున్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కు నానోజీ మహాశయులు. అత్తలు, కోడళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఒదినెలు, మరదళ్ళు, కోడళ్ళు, ఆడపడుచులు, మనుమలు, మనుమరాళ్ళు, మునిమనుమలు ఇలా అందరూ ఒక్క గూడు కిందనే కలసికట్టుగా వుంటున్నారు. ఒక చూరు కిందనే కలిసి వండుకుంటారు. కలిసి తింటారు. ‘పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, పొరపొచ్చాలు లేని మంచి కుటుంబం’గా అందరు మెచ్చే విధంగా జీవిస్తున్నారు. కుటుంబ ప్రేమకు ఉదాహరణగా నిలచిన ఆ కుటుంబానికి కూడా ఈ వేదికమీద సన్మానం జరిగింది.

ఇప్పుడు చెప్పండి ఇది వినూత్నంగా నిర్వహించిన ప్రేమికుల దినమా కాదా! ప్రేమ్ దివస్ అవునా కాదా!

దీన్ని నిర్వహించిన భారత్ టుడే టీవీ ఛానల్ నిర్వాహకులకు

అభినందనలు

తెలపాలా లేదా!

మొత్తం ఈ కార్యక్రమానికి ఇంతటి ఉద్దీపన కలిగించిన మాన్యులు పరిపూర్ణానంద స్వామి వారికి సాష్టాంగనమస్కారం నమస్కారం చేయాలా వద్దా!

నేనయితే మరో మాట లేకుండా, మరో ఆలోచన రాకుండా ఆ రెండూ ఇంట్లోనుంచే  చేసేసాను.



 

గమనిక: రేళ్ల కిందట 2016 లో ప్రేమికుల దినోత్సవం నాడు రాసింది. ఇప్పుడు ఈ స్వామి గారు కూడా ఒక రాజకీయ పార్టీలో చేరారు. ఇక ఆయన ఏం చెప్పబోయినా అందులో మంచికంటే రాజకీయమే జనాలకు ముందు కనబడుతుంది. మనకున్న దురదృష్టాల్లో ఇదొకటి.

(14-02-2022)

12, ఫిబ్రవరి 2022, శనివారం

సీతమ్మ జాడ – భండారు శ్రీనివాసరావు

 స్నేహమేరా జీవితం అన్నారు. కానీ జీవితమే స్నేహం కాదు. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలకి వర్తించే నేటి వాస్తవం ఇది. రాజకీయులు కలుస్తుంటారు, విడిపోతుంటారు. వారిని కలిపినా విడగొట్టినా ఒకటే కారణం. అది రాజకీయ అవసరం.

రాముడు, ఆంజనేయుడు ఇద్దరూ పురాణ పురుషులు. వీరిలో ఒకడు దేవుడు, మరొకడు ఆ దేవదేవుడికి పరమ వీరాగ్రేశ్వర భక్తుడు. కానీ చేసిన ప్రతిన కోసం ఒకరు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మరొకరు యుద్ధ భూమిలో తారసపడ్డట్టు లోగడ రామాంజనేయ యుద్ధం పేరుతో నాటకాలు ఆడారు. సినిమా కూడా వచ్చింది.
కదనరంగంలో ఎదురయిన శ్రీరాముడికి ఆంజనేయుడు ధర్మం గురించి చెప్పబోతాడు. శ్రీరాముడు తృణీకరిస్తాడు. అంతేకాదు కఠినంగా మాట్లాడి పవనసుతుడ్ని చిన్నబుచ్చుతాడు. ’ధర్మము, ధర్మమటంచు వితండ వితర్కము లాడదీవు’ అంటూ, ‘మీ కోతి లక్షణం ఎక్కడికి పోతుంద’ని శ్రీరాముడంతటివాడు కూడా మాట తూలతాడు. తన జాతిని చులకన చేయడంతో స్వామిభక్తిని కూడా మరచిపోయి ఆంజనేయుడు రెచ్చిపోతాడు.
‘కోతి కోతి’ అంటూ మా వానర జాతిని చిన్నబుచ్చడం తగదు. ఆ కోతే లేకపోతే మీరెక్కడ. మీరనే ఆ కోతే, సీతమ్మ జాడ కనుగొనక పోయివుంటే అసలు రామాయణమే లేదు, కోతులు సేతు నిర్మాణం చేయకపోతే రామరావణ యుద్ధమే లేదు, నేను సంజీవని తేకపోతే లక్ష్మణుడు స్వర్గంలో వుండేవాడు, లంకకు చేరడానికి మా సాయమే లేకపోతే రావణుడు ఇప్పటి వరకు రాజ్యంచేస్తూ వుండేవాడు’ అని ఎదురు ఎద్దేవా చేస్తాడు.
రామాంజనేయ యుద్ధం నాటకంలోని ఈ దృశ్యాన్ని దశాబ్దాల క్రితం ఊరూరా ప్రదర్శిస్తుంటే జనాలు నోళ్ళు తెరుచుకుని చూస్తుండేవాళ్ళు. ఆంజనేయ పాత్రధారి టంకసాల శ్రీరాములు, ‘సీతమ్మ జాడ మీ చెవి వేయమైతిమా నాటితో రామాయణంబు సున్న’ అంటూ తోకఝాడిస్తూ రంగస్థలంమీద గంతులు వేస్తూ పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు ఊగిపోయేవాళ్ళు.
గతకొద్ది రోజులుగా, దేశ రాజకీయాల్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు విసురుకుంటున్న ఎత్తిపొడుపులు చూసేవారికీ, వినేవారికి ఇప్పుడీ ఈ ప్రస్తావన ఎందుకన్నది తేలిగ్గా అర్ధం అవుతుంది.
ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. విమర్శలు ఎంత ఘాటుగా వున్నా, ఔచిత్యం పాటించకపోతే అభిమానులు కూడా హర్షించరు. మాట తూలిన సంగతి ఒప్పుకుంటే పోయేదేమీ లేదు. పైగా హుందాతనంగా ఉంటుందని అదే నోటితో మెచ్చుకుంటారు.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం అని నేననుకోను.
‘ఎందుకలా కావాలని పేడ మీద కాలు వేశావు’ అంటే, అదే కాలుతో ఇల్లంతా రొచ్చు చేసే రోజుల్లో జీవిస్తున్నాం.


(12-02-2022)

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

రేడియో టాకధాన్

 ఆకాశవాణి గురించి ఆకాశవాణి చెప్పబోతోంది

ఈ నెల పదమూడో తేదీ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక భారీ కార్యక్రమానికి ఆకాశవాణి హైదరాబాదు (ఏ) కేంద్రం నడుం కట్టింది.

అసలు రేడియో పుట్టుక ఏమిటి? మనదేశంలో రేడియో ఆవిర్భావం ఎలా జరిగింది? ఎఫ్.ఎం ప్రసారాలు ఎలా మొదలయ్యాయి? కోవిడ్ సమయంలో ఆకాశవాణి నిర్వహించిన పాత్ర ఏమిటి? ప్రకృతి వైపరీత్యాల సమయంలో రేడియో అందించే సేవలు, రేడియో వార్తలు- విశ్వసనీయత మొదలైన అనేక అంశాలపై హైదరాబాదు కేంద్రం పదమూడో తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి ఆ రోజు సాయంత్రం అయిదు గంటల నలభయ్ అయిదు నిమిషాల వరకు అనేక చర్చాకార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిరవధికంగా ప్రసారం చేస్తుందని, కేంద్రం డైరెక్టర్ శ్రీ ఉదయ శంకర్ తెలియచేసారు. అయితే  ఆ రోజు మధ్యాన్నం మూడున్నర నుంచి అయిదు గంటల వరకు హైదరాబాదులో రాష్ట్రపతి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్సనపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

లోగడ ప్రసార భారతి సీ.ఈ.ఓ. గా పనిచేసిన సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి కంభంపాటి సుబ్రమణ్య శర్మ గారితో సహా రేడియోలో గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీయుతులు నాగసూరి వేణుగోపాల్, వై.బుచ్చిబాబు, సుమనస్పతి రెడ్డి  డాక్టర్ కె.విజయ ప్రభ్రుతులు ఈ కార్యక్రమాల్లో అనేక అంశాలపై తమ అభిప్రాయాలు తెలియచేస్తారు.

రేడియో వార్తలు – విశ్వసనీయత అనే అంశంపై సమ్మెట  నాగమల్లేశ్వరరావు నాతొ చేసిన ఇంటర్వ్యూ పదమూడో తేదీ మధ్యాన్నం పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు ప్రసారం అవుతుంది.

For Program details sheet:

radio day programmes.pdf



(11-02-2022)