14, జనవరి 2022, శుక్రవారం
అభినవ కార్తవీర్యార్జునులు - భండారు శ్రీనివాసరావు
13, జనవరి 2022, గురువారం
వితండవాదం – భండారు శ్రీనివాసరావు
శారదక్కయ్య – భండారు శ్రీనివాసరావు
అమ్మలగన్నయమ్మ ‘మా అమ్మ’ అనుకుంటే, మా అమ్మకు రెండో బిడ్డ, మా రెండో అక్కయ్య కొలిపాక శారదక్కయ్య. ‘మంచి అమ్మకు’ మారుపేరు.
మా అమ్మ భండారు
వెంకట్రావమ్మ గారు, 1993 లో తన 84 ఏట మరణించినప్పుడు మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఒక సంస్మరణ సంచిక
ప్రచురించాడు. మా అమ్మకన్న సంతానం మాత్రమే కాకుండా పిల్లల పిల్లలు కూడా అమ్ముమ్మ
గురించిన అనుభవాలను, అనుభూతులను అందులో పంచుకున్నారు. మా శారదక్కయ్య అమ్మను గురించి రాసిందిలా:
“పట్టుమని
పన్నెండేళ్ళు అయినా నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన
ఏడాదికే మా వారు (కొలిపాక రామచంద్ర రావు గారు) దేశ దాస్య విమోచనం కోసం జైలుకు
వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు గారు మా వారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ మా పెద్దక్క
రాధనూ మా అప్ప (నాన్న) మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో
వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా
గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగకట్టె మంట పెట్టి మా అందరికీ వండి పెట్టేది.
మా అప్ప ఊళ్ళోని
దుకాణదారుతో చెప్పాడు “ మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు. అల్లుళ్ళు దేశం కోసం
జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా ఇవ్వు”
మా అమ్మకు
పుట్టింటి వాళ్ళు ఒక గేదెను అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా
చెప్పేది. తాను కోడలిగా ఏనాడు గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ
గేదె పుణ్యమా అని నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా
బీభత్సం చేసేదట. ‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని
వూళ్ళో జనం చెప్పుకునే వారట.
ఆ రోజుల్లో ఏ
కబుర్లు వెంటనే తెలిసేవి కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు
కబురు తెస్తే వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.
చివరికి శంభాయి ఆ
శుభవార్త మోసుకువచ్చాడు.
మేమిద్దరం ముందు
అనుకున్నట్టే, మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం చేశాము”
పెద్ద చదువులు
లేకపోయినా చిన్నప్పటి సంగతులను అంత చక్కగా రాసిన మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు
వున్నట్టే లెక్క.
శారదక్కయ్య
గురించిన ఓ జ్ఞాపకం
అరవై ఏళ్ళ కిందటి మాటే.
అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్
కంచాలు, గ్లాసులు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా
ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి
పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి
పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల జీతం
అన్నమాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ
అదెక్కినంత ఆనందం.
మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు
మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్
ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య
కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.
తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది.
డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు
ఈ విడికంచాల గోల లేదు.
ఈరోజు ఆమె జయంతి
సందర్భంగా నమోవాకాలు.
(13-01-2022)
డి. వెంకమయ్య గారు, నేనూ – భండారు శ్రీనివాసరావు
12, జనవరి 2022, బుధవారం
ఓ పాము కధ – భండారు శ్రీనివాసరావు
“ముందు మీ గోల ఆపి నేచేప్పేది కాస్త వింటారా”
ఇన్నాళ్ళుగా కస్సూబుస్సులు లేకుండా తమ
మధ్యనే ఉంటున్న ఆ నాగుపాము పడగవిప్పి, నోరు
తెరిచి రెండు నాలుకలతో అలా అనగానే యావన్మందీ నిశ్చేష్టులయ్యారు.
“నేను ఇన్నాళ్ళు పుట్టల్లో, గుట్టల్లో తిరుగుతూ నోటికి అందిన
పురుగూపుట్రా తింటూ హాయిగా శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ జెర్రి గొడ్డుతో
వెర్రిస్నేహం చేసి, దాని మాయ మాటల్లో పడి ఇదిగో ఈ ఊరు
చేరుకొని ఒక ఇంటి చూరుపై తల దాచుకున్నాను. ఆ రాత్రి వాళ్ళింట్లో పిల్లాడు పెద్దవాళ్ళు
నిద్రపోయిన తరువాత లేచి ‘జంతు ప్రపంచం’ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. అందులో ఒక పాము
కనిపించింది. ఎవరో ఓ తెల్ల పిల్లాడు ఆ నల్లతాచును ఎంచక్కా తన చేతిలో పట్టుకుని ఆడిస్తున్న దృశ్యం కంట పడింది. అది చూసి నాకూ కన్ను కుట్టింది. ఒక్క సారయినా అలా తెరపై కనిపిస్తే జన్మధన్యం అనికూడా
అనిపించింది. కొన్నాళ్ళు ‘కాటు’ వేసే బుద్ధి
మానుకుంటే ఇలా ఎంచక్కా టీవీలలో చూపెడతారు అనిపించి మర్నాడు తెల్లారగానే ఈ కొత్త
అవతారం ఎత్తాను. ముందు నన్ను చూసి జనం భయపడ్డా, వారిలోని
భక్తిప్రపత్తులు నన్ను ఒడ్డున పడేశాయి. ప్రాణ భయం లేదని తేలిపోయింది కాబట్టి
కొన్నాళ్ళు ఉపాసం వుంటే ఏం పోయిందని నేనూ ఇదే బాగుందని నిర్ణయించుకున్నాను.
అనుకున్నట్టే టీవీ వాళ్ళు రంగప్రవేశం చేసారు. ఆ హాలీవుడ్ పాముకు బుల్లితెరకు
ఎక్కడానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ భాగ్యం వెంటనే
వెతుక్కుంటూ వచ్చింది. నాలాగే ఆ టీవీ వాళ్ళూ ఇక్కడే మకాం వేసి ఉదయం నుంచి రాత్రి
దాకా అలసట లేకుండా లైవ్ టెలికాస్టులు మొదలెట్టారు. వాళ్ళు రాగానే వూళ్ళో వాళ్లకు
పూనకాలు పూనాయి. ‘ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్ధరాత్రి వేళకు అందరికీ పుట్టింది’ అన్నట్టు పూనకాలు, పూజలూ పెరిగిపోయి నాకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. మధ్యలో జంతు
ప్రేమికులూ, జీవ కారుణ్య సంఘాల వాళ్ళు వచ్చేసి
‘నాకేదో జరిగి పోతోంది, తమ ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నా
ప్రాణాన్ని కాపాడతాం’ అంటూ వాదించడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న తమ
ఊరుకు ఇంత వైభోగం తెచ్చిన ఈ పామును వూరు దాటించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ
అప్పటికప్పుడు నాకు భక్తులు అయిపోయినవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళతో గిల్లీ కజ్జాకు దిగారు. పోలీసులు, అధికారులూ సరేసరి. ఈ మూడువారాల పూజలకే నాకు మతిపోతోంది. మరి తిరుపతి దేవుడు
అర్ధరాత్రి దాకా ఈ తాకిడి ఎలా తట్టుకుంటున్నాడో ఏమిటో!
‘మీ అందరికీ చెప్పేది ఏమిటంటే నేను వచ్చిన పని అయిపొయింది. టీవీల్లో కనబడీ
కనబడీ నాకే చిర్రెత్తుతోంది. ఈ విషయంలో ఊళ్లోవాళ్లకు ఉన్న టీవీ కాపీనం కూడా తీరి పోయుంటుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన పూజా ఫలం ఏమో
తెలియదు కానీ నాకూ కొంత మహత్తు వంట్లోకి వచ్చింది. కావున, కాబట్టి నేను ఇంతటితో ఈ కధ ముగించి అంతర్ధానం అయిపోతున్నాను. మళ్ళీ
అడవిలోకి వెళ్లి దొరికిన కప్పనో, చిప్పనో తిని కడుపు నింపుకుంటాను. మీరు కూడా మీ లగేజి సర్దుకుని ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్!’
పాము అలా చెప్పి మాయం అయిపోగానే
అప్పటిదాకా శిలలమాదిరిగా అయిపోయిన జనం మళ్ళీ
తెలివిలోకి వచ్చారు.
వున్నట్టుండి నిశ్శబ్దాన్ని భగ్నం
చేస్తూ ఒకడు గట్టిగా అరిచాడు.
‘ఈ పాము నోరు తెరవడంతో నా తెలివికాస్తా తెల్లారి పోయింది. పాము మాట్లాడుతున్న షాట్ తీయడం మరచిపోయాను’
అతడు ఆ టీవీ కెమెరామన్.
ట్యాగ్ లైన్ : మూఢనమ్మకాలు
విశ్వసించరాదు, ప్రచారం చేసుకోవచ్చు.
10, జనవరి 2022, సోమవారం
ప్రాధాన్యతల ఎంపికలో కాంగ్రెస్ వైఫల్యం – భండారు శ్రీనివాసరావు
(10-01-2022,
సోమవారం
రాత్రి 9.30 గంటలకు
సాక్షి టీవీలో ప్రొడ్యూసర్ సి.ఎన్.ఎస్. యాజులురూపొందించిన ‘మహాసంగ్రామం’ మేగజైన్ స్టోరీ కార్యక్రమంలో నా
కొన్ని మాటలు)
చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు
నాతొ చెప్పారు. మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ
విద్యలో మేము ఆరితేరాం అని. ఇన్నేళ్ళు గడిచిన
తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన
చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది .
దీనికి
ఉదాహరణ చండీఘడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు. ఈ మధ్యనే జరిగాయి.
అమ్ ఆద్మీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. బీజేపీకి రెండు సీట్లు
తక్కువ వచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా చూడాల్సిన
కాంగ్రెస్, ఎవరి
సలహానో ఏమిటో కాని గైరు హాజరు అయింది. దాంతో బీజేపీ మేయరు పీఠం ఎగరేసుకు పోయింది.
ఇలా వుంటాయి ఆ పార్టీ అధిష్టానం కప్పదాట్లు. కాంగ్రెస్ కనుమరుగు అయిపోతోంది అని నలుగురూ
అంటుంటే అనరా మరి.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన
బలహీనత తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో అనే విషయంలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోకపోవడం. అదే బీజేపీని చూడండి. కాంగ్రెస్ ముక్త భారత్ తన ప్రధాన ధ్యేయం
అని స్పష్టంగా చెబుతుంది. ఆ దిశగా ఎవరితో అయినా ఇచ్చి పుచ్చుకోవడం అనే విధానం
అవలంబిస్తుంది. రాజకీయం అంటే అదీ.
పేరుకు అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు
జరగబోతున్నప్పటికీ, వీటిల్లో రాజకీయంగా చూస్తే ఉత్తర ప్రదేశ్, పంజాబు
రాష్ట్రాలే ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాలు. రైతుల ఆందోళన అంశం ఇంకా పచ్చిపచ్చిగానే
వుంది. పంజాబులో బీజేపీ విజయావకాశాలను ఈ
అంశం ప్రభావితం చేయగలదన్న ఆశాభావంతో ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా అమ్ ఆద్మీ,
కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టుగా వుంది.
పొతే ఉత్తరప్రదేశ్. నా చిన్నప్పటి నుంచీ స్కూలు
చదువులు పూర్తయి,
కాలేజీకి వచ్చేవరకు అక్కడ కాంగ్రెస్
పాలనే. పైగా ఆ పార్టీ ముఖ్యమంత్రులు చాలామంది బ్రాహ్మణులే. గోవింద వల్లభ పంత్,
కమలాపతి త్రిపాఠి,
హేమవతి నందన్ బహుగుణ, ఎన్డీ తివారి, శ్రీపతి మిశ్రా ఇలా అయిదుగురు
ముఖ్యమంత్రులు ఆ అగ్రకులానికి చెందినవారే కావడం ఓ విశేషం. పైగా నెహ్రూ కుటుంబానికి ఈ రాష్ట్రం పెట్టని కోట. ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉన్న
ఉత్తరప్రదేశ్ చేతికి చిక్కితే ఎర్రకోటలో పాగా వేసినట్టే అని చెప్పుకునేవారు.
అలాంటి చోట ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏమిటి అంటే చిన్న పిల్లాడు కూడా జవాబు చెబుతాడు.
ఒకప్పుడు ఆ రాష్ట్రంలో చక్రం తిప్పిన మాయావతి
పార్టీ, బీ ఎస్ పీ పరిస్థితి కాంగ్రెస్
కన్నాకొంత మెరుగే కాని ఒంటరిగా అధికారంలోకి
వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీని కలుపుకు పోయే పార్టీ కూడా ప్రస్తుతానికి కనుచూపు
మేరలో కనబడడం లేదు. ఒకానొక కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు శాతం జనాభా ఉన్న బ్రాహ్మణులు, అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీలు కలిస్తే అధికారం తధ్యమనే
భావనతో బీ ఎస్పీ ఆ ప్రయోగం సైతం చేసింది. గెలుపొందింది కూడా. ప్రస్తుతం వస్తున్న మీడియా సమాచారం ప్రకారం మాయావతి
ప్రభావం రానున్న ఎన్నికలలో అంతగా
లేనట్టుగా అనిపిస్తోంది.
ఇక సమాజ్ వాదీ పార్టీ. దాని నాయకుడు అఖిలేష్ యాదవ్ యువకుడు. ఒకసారి ముఖ్యమంత్రి
చేశాడు కూడా. ఎన్నికల రంగంలో బీజేపీకి బాగా పోటీ ఇచ్చేట్టు
కనబడుతున్నాడు. ఆ మధ్య ఆ పార్టీ వాళ్ళు పరశురాముడి విగ్రహం వేయించారు. రాముడి
పేరుతొ ఒకరు, పరశురాముడి పేరుతొ మరొకరు అన్నమాట.
పరశురాముడి పేరుతొ బ్రాహ్మణుల ఓట్లపై
పట్టు సాధించాలని సమాజ్ వాదీ ప్రయత్నిస్తున్నట్టుగా
వుంది. అయితే, మతం, కులం
ఇవి మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తాయి అని చెప్పడం ఉత్ప్రేక్ష. కానీ ఈనాటి మారిన రాజకీయ పరిస్థితుల్లో గెలవడానికి అవసరమైన
వనరుల జాబితాలో ఈ రెండూ వుండాలి.
(10-01-2022)
ఊహించని సత్కారం – భండారు శ్రీనివాసరావు
“రేపు సాయంత్రం మన ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ. మాజీ కార్యదర్శిగా మీరు వుంటే బాగుంటుంది. తప్పకుండా రండి” అన్నారు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఉ.. అనాలా? ఉహు అనాలా? అనే సందిగ్ధంలో ఉండగానే ఆ వెంటనే మరో ఫోను కార్యదర్శి రాజమౌళి చారి గారి నుంచి. అదే ఆహ్వానం.
వెళ్లాను. చాలామంది పాత స్నేహితులు కలిసారు.
దేవులపల్లి అమర్,
ప్రెస్ అకాడమీ అల్లం నారాయణ, హిందూ
రవికాంత్ రెడ్డి,
సీ.ఎం. పి.ఆర్.ఓ హజారే, దూరదర్సన్ మాజీ డైరెక్టర్ భగవాన్, షరీఫ్, నందిరాజు రాధాకృష్ణ, జాగర్లమూడి, అనిల్
కుమార్, ఈనాడు
ఉండ్రు నరసింహారావు, మెట్రో టీవీ జయప్రసాద్, సత్యమూర్తి,
వనజ అలా జాబితా రాసుకుంటూ పొతే చాలా పెద్డది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఉమాదేవి కలిసింది.
క్లబ్ కార్యవర్గ సభ్యురాలు. మూడేళ్ల క్రితం వరకు దాదాపు వారానికి మూడు సార్లు మా
ఇంటికి వచ్చేది, టీవీ 5 కోసం బైట్లు రికార్డు చేయడానికి. మా ఆవిడతో మంచి
దోస్తీ. రికార్డింగ్ టైము అయిదు నిమిషాలు. వాళ్ళిద్దరి
ముచ్చట్లు కాఫీ తాగుతూ పావుగంట.
డైరీ ఆవిష్కరణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ
సంతోష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. తర్వాత ఊహించని విధంగా నన్ను స్టేజ్ మీదికి పిలిచారు.
ముఖ్య అతిధుల చేతుల మీదుగా శాలువా కప్పి ఓ
పూల మొక్క అందించారు. ఎందుకు అంటే లోగడ కార్యదర్శిగా ప్రెస్ క్లబ్ కోసం పనిచేసినందుకు
అని చెప్పారు.
ఇంకా ఈరోజుల్లో ‘గుర్తుపెట్టుకోవడాలు’ ఇంకా
మిగిలే వున్నందుకు సంతోషపడాలి కదా! పడ్డాను.
ఒకరోజు ఆలస్యం అయినా గుర్తు పెట్టుకుని ఫోటోలు షేర్
చేసిన క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భూపాల్
రెడ్డికి ధన్యవాదాలు.