12, జనవరి 2022, బుధవారం

ఓ పాము కధ – భండారు శ్రీనివాసరావు

 ముందు మీ గోల ఆపి నేచేప్పేది కాస్త వింటారా”

ఇన్నాళ్ళుగా కస్సూబుస్సులు లేకుండా తమ మధ్యనే ఉంటున్న ఆ నాగుపాము పడగవిప్పి, నోరు తెరిచి రెండు నాలుకలతో అలా అనగానే యావన్మందీ నిశ్చేష్టులయ్యారు.

నేను ఇన్నాళ్ళు పుట్టల్లో, గుట్టల్లో తిరుగుతూ నోటికి అందిన పురుగూపుట్రా తింటూ హాయిగా శేష జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ జెర్రి గొడ్డుతో వెర్రిస్నేహం చేసి, దాని మాయ మాటల్లో పడి ఇదిగో ఈ ఊరు చేరుకొని ఒక ఇంటి చూరుపై తల దాచుకున్నాను. ఆ రాత్రి వాళ్ళింట్లో పిల్లాడు పెద్దవాళ్ళు నిద్రపోయిన తరువాత లేచి ‘జంతు ప్రపంచం’ ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. అందులో ఒక పాము కనిపించింది. ఎవరో ఓ తెల్ల పిల్లాడు ఆ నల్లతాచును ఎంచక్కా తన చేతిలో పట్టుకుని ఆడిస్తున్న దృశ్యం కంట పడింది. అది చూసి నాకూ కన్ను కుట్టింది. ఒక్క సారయినా అలా తెరపై కనిపిస్తే జన్మధన్యం అనికూడా అనిపించింది. కొన్నాళ్ళు ‘కాటు’ వేసే బుద్ధి మానుకుంటే ఇలా ఎంచక్కా టీవీలలో చూపెడతారు అనిపించి మర్నాడు తెల్లారగానే ఈ కొత్త అవతారం ఎత్తాను. ముందు నన్ను చూసి జనం భయపడ్డా, వారిలోని భక్తిప్రపత్తులు నన్ను ఒడ్డున పడేశాయి. ప్రాణ భయం లేదని తేలిపోయింది కాబట్టి కొన్నాళ్ళు ఉపాసం వుంటే ఏం పోయిందని నేనూ ఇదే బాగుందని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టే టీవీ వాళ్ళు రంగప్రవేశం చేసారు. ఆ హాలీవుడ్ పాముకు బుల్లితెరకు ఎక్కడానికి ఎంత కాలం పట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ భాగ్యం వెంటనే వెతుక్కుంటూ వచ్చింది. నాలాగే ఆ టీవీ వాళ్ళూ ఇక్కడే మకాం వేసి ఉదయం నుంచి రాత్రి దాకా అలసట లేకుండా లైవ్ టెలికాస్టులు మొదలెట్టారు. వాళ్ళు రాగానే వూళ్ళో వాళ్లకు పూనకాలు పూనాయి. ‘ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్ధరాత్రి వేళకు అందరికీ పుట్టింది’ అన్నట్టు పూనకాలు, పూజలూ పెరిగిపోయి నాకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి. మధ్యలో జంతు ప్రేమికులూ, జీవ కారుణ్య సంఘాల వాళ్ళు వచ్చేసి ‘నాకేదో జరిగి పోతోంది, తమ ప్రాణాలు పణంగా పెట్టయినా సరే నా ప్రాణాన్ని కాపాడతాం’ అంటూ వాదించడం మొదలెట్టారు. ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న తమ ఊరుకు ఇంత వైభోగం తెచ్చిన ఈ పామును వూరు దాటించాలని చూస్తే ఊరుకునేది లేదంటూ అప్పటికప్పుడు నాకు భక్తులు అయిపోయినవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళతో గిల్లీ కజ్జాకు దిగారు. పోలీసులు, అధికారులూ సరేసరి. ఈ మూడువారాల పూజలకే నాకు మతిపోతోంది. మరి తిరుపతి దేవుడు అర్ధరాత్రి దాకా ఈ తాకిడి ఎలా తట్టుకుంటున్నాడో ఏమిటో!

మీ అందరికీ చెప్పేది ఏమిటంటే నేను వచ్చిన పని అయిపొయింది. టీవీల్లో కనబడీ కనబడీ నాకే చిర్రెత్తుతోంది. ఈ విషయంలో ఊళ్లోవాళ్లకు ఉన్న టీవీ కాపీనం కూడా తీరి పోయుంటుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన పూజా ఫలం ఏమో తెలియదు కానీ నాకూ కొంత మహత్తు వంట్లోకి వచ్చింది. కావున, కాబట్టి నేను ఇంతటితో ఈ కధ ముగించి అంతర్ధానం అయిపోతున్నాను. మళ్ళీ అడవిలోకి వెళ్లి దొరికిన కప్పనో, చిప్పనో తిని కడుపు నింపుకుంటాను. మీరు కూడా మీ లగేజి సర్దుకుని ఎవరి ఊళ్లకు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపొండి. శ్రీశ్రీశ్రీ మంగళం మహత్!’

పాము అలా చెప్పి మాయం అయిపోగానే అప్పటిదాకా శిలలమాదిరిగా అయిపోయిన జనం మళ్ళీ తెలివిలోకి వచ్చారు.

వున్నట్టుండి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఒకడు గట్టిగా అరిచాడు.

ఈ పాము నోరు తెరవడంతో నా తెలివికాస్తా తెల్లారి పోయింది. పాము మాట్లాడుతున్న షాట్ తీయడం మరచిపోయాను’

అతడు ఆ టీవీ కెమెరామన్.

ట్యాగ్ లైన్ : మూఢనమ్మకాలు విశ్వసించరాదు, ప్రచారం చేసుకోవచ్చు.

 

10, జనవరి 2022, సోమవారం

ప్రాధాన్యతల ఎంపికలో కాంగ్రెస్ వైఫల్యం – భండారు శ్రీనివాసరావు


(10-01-2022, సోమవారం రాత్రి 9.30 గంటలకు సాక్షి టీవీలో ప్రొడ్యూసర్ సి.ఎన్.ఎస్. యాజులురూపొందించిన    ‘మహాసంగ్రామం’ మేగజైన్ స్టోరీ కార్యక్రమంలో నా కొన్ని మాటలు) 

చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాతొ చెప్పారు. మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు.  ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ విద్యలో మేము ఆరితేరాం  అని. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా  కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ  నిజమే అనిపిస్తోంది .

దీనికి  ఉదాహరణ చండీఘడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు. ఈ మధ్యనే జరిగాయి. అమ్ ఆద్మీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. బీజేపీకి రెండు సీట్లు తక్కువ వచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా చూడాల్సిన కాంగ్రెస్, ఎవరి సలహానో ఏమిటో కాని గైరు హాజరు అయింది. దాంతో బీజేపీ మేయరు పీఠం ఎగరేసుకు పోయింది. ఇలా వుంటాయి ఆ పార్టీ అధిష్టానం కప్పదాట్లు. కాంగ్రెస్ కనుమరుగు అయిపోతోంది అని నలుగురూ అంటుంటే  అనరా మరి.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలహీనత తన ప్రధాన ప్రత్యర్థి ఎవరో అనే విషయంలో ప్రాధాన్యతలు  నిర్ణయించుకోకపోవడం. అదే బీజేపీని  చూడండి. కాంగ్రెస్ ముక్త భారత్ తన ప్రధాన ధ్యేయం అని స్పష్టంగా చెబుతుంది. ఆ దిశగా ఎవరితో అయినా ఇచ్చి పుచ్చుకోవడం అనే విధానం అవలంబిస్తుంది. రాజకీయం అంటే అదీ.

పేరుకు అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ, వీటిల్లో రాజకీయంగా చూస్తే ఉత్తర ప్రదేశ్, పంజాబు రాష్ట్రాలే ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాలు. రైతుల ఆందోళన అంశం ఇంకా పచ్చిపచ్చిగానే వుంది.  పంజాబులో బీజేపీ విజయావకాశాలను ఈ అంశం ప్రభావితం చేయగలదన్న ఆశాభావంతో ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా అమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టుగా వుంది.

పొతే ఉత్తరప్రదేశ్. నా చిన్నప్పటి నుంచీ స్కూలు చదువులు పూర్తయి, కాలేజీకి వచ్చేవరకు  అక్కడ కాంగ్రెస్ పాలనే. పైగా ఆ పార్టీ ముఖ్యమంత్రులు  చాలామంది బ్రాహ్మణులే.  గోవింద వల్లభ పంత్, కమలాపతి త్రిపాఠి, హేమవతి నందన్ బహుగుణ,  ఎన్డీ తివారి, శ్రీపతి మిశ్రా ఇలా అయిదుగురు ముఖ్యమంత్రులు ఆ అగ్రకులానికి చెందినవారే కావడం ఓ విశేషం.  పైగా నెహ్రూ కుటుంబానికి ఈ రాష్ట్రం  పెట్టని కోట. ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ చేతికి చిక్కితే ఎర్రకోటలో పాగా వేసినట్టే అని చెప్పుకునేవారు. అలాంటి చోట ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏమిటి అంటే చిన్న పిల్లాడు కూడా  జవాబు చెబుతాడు.

ఒకప్పుడు ఆ రాష్ట్రంలో చక్రం తిప్పిన మాయావతి పార్టీ, బీ ఎస్ పీ పరిస్థితి  కాంగ్రెస్ కన్నాకొంత  మెరుగే కాని ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీని కలుపుకు పోయే పార్టీ కూడా ప్రస్తుతానికి కనుచూపు మేరలో కనబడడం లేదు. ఒకానొక కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు శాతం  జనాభా ఉన్న  బ్రాహ్మణులు, అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీలు కలిస్తే అధికారం తధ్యమనే భావనతో బీ ఎస్పీ ఆ ప్రయోగం సైతం చేసింది. గెలుపొందింది కూడా. ప్రస్తుతం  వస్తున్న మీడియా సమాచారం ప్రకారం మాయావతి ప్రభావం రానున్న ఎన్నికలలో  అంతగా లేనట్టుగా అనిపిస్తోంది.

ఇక సమాజ్ వాదీ పార్టీ. దాని నాయకుడు  అఖిలేష్ యాదవ్ యువకుడు. ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు కూడా.   ఎన్నికల రంగంలో బీజేపీకి బాగా పోటీ ఇచ్చేట్టు కనబడుతున్నాడు. ఆ మధ్య ఆ పార్టీ వాళ్ళు పరశురాముడి విగ్రహం వేయించారు. రాముడి పేరుతొ ఒకరు, పరశురాముడి పేరుతొ మరొకరు అన్నమాట.  పరశురాముడి పేరుతొ  బ్రాహ్మణుల ఓట్లపై పట్టు సాధించాలని సమాజ్ వాదీ  ప్రయత్నిస్తున్నట్టుగా వుంది. అయితే, మతం, కులం ఇవి మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తాయి అని చెప్పడం ఉత్ప్రేక్ష. కానీ ఈనాటి  మారిన రాజకీయ పరిస్థితుల్లో గెలవడానికి అవసరమైన వనరుల జాబితాలో ఈ రెండూ వుండాలి.



(10-01-2022)


ఊహించని సత్కారం – భండారు శ్రీనివాసరావు

 “రేపు సాయంత్రం మన ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ. మాజీ కార్యదర్శిగా మీరు వుంటే బాగుంటుంది. తప్పకుండా రండి” అన్నారు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఉ.. అనాలా? ఉహు అనాలా? అనే సందిగ్ధంలో ఉండగానే  ఆ వెంటనే మరో ఫోను కార్యదర్శి రాజమౌళి చారి గారి నుంచి. అదే ఆహ్వానం.

వెళ్లాను. చాలామంది పాత స్నేహితులు కలిసారు. దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ అల్లం నారాయణ,  హిందూ రవికాంత్ రెడ్డి, సీ.ఎం. పి.ఆర్.ఓ హజారే,  దూరదర్సన్ మాజీ డైరెక్టర్ భగవాన్,  షరీఫ్, నందిరాజు రాధాకృష్ణ, జాగర్లమూడి, అనిల్ కుమార్, ఈనాడు ఉండ్రు నరసింహారావు,  మెట్రో టీవీ జయప్రసాద్, సత్యమూర్తి, వనజ అలా జాబితా రాసుకుంటూ పొతే చాలా పెద్డది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఉమాదేవి కలిసింది. క్లబ్ కార్యవర్గ సభ్యురాలు. మూడేళ్ల క్రితం వరకు దాదాపు వారానికి మూడు సార్లు మా ఇంటికి వచ్చేది, టీవీ 5 కోసం  బైట్లు రికార్డు చేయడానికి. మా ఆవిడతో మంచి దోస్తీ.  రికార్డింగ్ టైము అయిదు నిమిషాలు. వాళ్ళిద్దరి ముచ్చట్లు కాఫీ తాగుతూ పావుగంట.

డైరీ ఆవిష్కరణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. తర్వాత  ఊహించని విధంగా నన్ను స్టేజ్ మీదికి పిలిచారు. ముఖ్య  అతిధుల చేతుల మీదుగా శాలువా కప్పి ఓ పూల మొక్క అందించారు. ఎందుకు అంటే లోగడ కార్యదర్శిగా ప్రెస్ క్లబ్ కోసం పనిచేసినందుకు అని చెప్పారు.

ఇంకా ఈరోజుల్లో ‘గుర్తుపెట్టుకోవడాలు’ ఇంకా మిగిలే వున్నందుకు సంతోషపడాలి కదా! పడ్డాను.

ఒకరోజు ఆలస్యం అయినా గుర్తు పెట్టుకుని ఫోటోలు షేర్  చేసిన క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భూపాల్ రెడ్డికి ధన్యవాదాలు.   



   

మన్ కీ బాత్ – భండారు శ్రీనివాసరావు

 

పార్టీ మారినా మనసు మాత్రం మాతృపక్షం మీదనే అంటూ ఇప్పుడే ఓ టీవీలో ప్రోగ్రాం వచ్చింది. ఇది చూసినప్పుడు  వెనుకటి  విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం ఒక టీవీ ఛానల్ చర్చలో పాల్గొంటూ బీజేపీ ప్రతినిధి వింత ప్రకటన చేసారు. తాను కాసేపు తన పార్టీ విషయం మరచిపోయి, వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతానని చెప్పి చర్చలో పాల్గొంటున్న మిగిలినవారినందర్నీ  ఆశ్చర్య పరిచారు. టీడీపీ, బీజేపీ తగాదా తాత్కాలికమే అని, ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ రెండూ మిత్ర పక్షాలు అవుతాయని, ప్రస్తుత కీచులాటలతో ప్రజల్ని మభ్యపెట్టి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాయని అన్నారు.

సరే! ఈ వ్యాఖ్య చర్చలో కాస్త వినోదం పంచిన మాట నిజమే.

ఇదే విధంగా అన్ని పార్టీల వాళ్ళు పరకాయ ప్రవేశం చేస్తూ తమ మనసులోని మాట బయట పెడుతుంటే ప్రజల్లో అయోమయాన్ని కాస్త తగ్గించిన వాళ్ళవుతారని,  అప్పుడు ఆ చర్చలో పాల్గొంటున్న నాకూ అనిపించింది. ఆ మాట పైకే చెప్పాను కూడా.

కొసమెరుపు ఏమిటంటే ఎన్నికల తర్వాత ఆయన చెప్పినట్టు బీజేపీ, టీడీపీ మళ్ళీ మునపటిలా మిత్రపక్షాలుగా కలిసిపోలేదు కానీ, ఈ మాట చెప్పిన పెద్దమనిషి మాత్రం వైసీపీ అధికార ప్రతినిధిగా అధికారికంగా మారిపోయారు.

మనవి: ఎవరీ మనిషి అని ఊహాగానాలు అనవసరం. నాకు తెలిసి గత పదేళ్ళ కాలంలో మూడు, నాలుగు సార్లు పార్టీలు మారిన అధికార ప్రతినిధులు వున్నారు. అధికార ప్రతినిధులుగా కొత్త అవతారం దాల్చిన విశ్లేషకులూ వున్నారు. మారనిదల్లా ఆయా పార్టీల అభిమానులే.

Note: Courtesy Cartoonist 




 

పాత సచివాలయం ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 1975 లో నేను ఆకాశవాణి విలేకరిగా చేరినప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు. ఆయన దగ్గర పనిచేసే సిబ్బందిని కూడా వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఈనాటి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే ఓ సగటు అధికారి పేషీలో  ఇంకా ఎక్కువమంది సిబ్బంది పనిచేస్తున్నారు అనేది నిజం.

ముఖ్యమంత్రి వెంగళరావురావు గారి దగ్గర పనిచేసిన వారిలో రావు సాహెబ్ కృష్ణ స్వామి గారు ఒక్కరే ఐఏఎస్ అధికారి. మిగిలిన వారందరూ ఓమోస్తరు సాధారణ  ఉద్యోగులే. ప్రకాశరావు గారు వ్యక్తిగత కార్యదర్శి. మరో ఇద్దరు పీఎలు వుండేవారు. డీఎస్పీ స్థాయి కలిగిన పోలీసు అధికారి సీతాపతి గారు సీఎం ప్రధాన భద్రతాధికారి. ఒకళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు బాడీ గార్డులు. లోకయ్య అనే నాలుగో తరగతి ఉద్యోగి ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడు. ప్రతేకంగా పీఆర్ఓ అంటూ ఎవరూ వుండేవారు కాదు. సమాచారశాఖలో పనిచేసే ఓ స్థాయి అధికారి పీ ఆర్ వొ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తూ వుండేవారు.

నాన్ ఏసీ అంబాసిడర్ కారు సీ ఎం అధికారిక వాహనం. ముందో పైలట్, వెనకో ఎస్కార్ట్ వాహనం. అంతే! సీ ఎం కాన్వాయ్.

సచివాలయంలో ఆయన కార్యాలయం కూడా చాలా చిన్నదిగా వుండేది. ఓ గదిలో ముఖ్యమంత్రి. పక్క గదిలో ఆయన సిబ్బంది. ముఖ్యమంత్రి కుర్చీతో  సహా ఓ పది పేము కుర్చీలు వుండేవి. తనను కలుసుకోవడానికి వచ్చేవారితోనే కాదు, చివరకు విలేకరులతో కూడా ఫైళ్ళు చూస్తూనే మాట్లాడుతుండేవారు. సమయపాలనకు బాగా విలువ ఇచ్చేవారు. చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పేసి, 'మంచిది వెళ్ళి రండి' అనేవారు.

ఇప్పుడు కూలగొట్టిన పాత సచివాలయం లోని ఓ పాత భవనం మొదటి అంతస్తులో సీఎం పేషీ వుండేది. ఆ భవనాన్ని నిజాం బకింగ్ హాం ప్యాలెస్ నమూనాలో నిర్మించారని చెబుతారు. పక్కనే ఆల్విన్ కంపెనీ తయారుచేసిన విశాలమైన లిఫ్ట్ వుండేది. మొదటి అంతస్తు చేరుకోవడానికి వున్న చెక్క మెట్ల వరుస, ఎర్ర తివాచీ కూడా రాజభవనాన్ని గుర్తుకు తెచ్చే విధంగా వుండేది. దాని రెయిలింగుకు వాడిన కలప ఎంతో ఖరీదయినది. 'మహోగని' అనే అరుదయిన వృక్షజాతికి చెందిన ఆ కలప బంగారం కంటే విలువయినదని చెబుతారు. ఫలక్ నామా ప్రాసాదంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, అతి పొడవైన భోజనాల బల్ల కూడా ఆ కలపతో తయారైనదే.

 

ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయనకూ సచివాలయ ఉద్యోగులకూ నడుమ ఏదో పేచీ వచ్చి అందరూ ఆయన కార్యాలయంపై విరుచుకు పడ్డారు. ఆ సందర్భంలో మెట్లకు అమర్చిన రెయిలింగు దెబ్బతిన్నది. సచివాలయంలో పనిచేసే ఓ పాతకాలపు వడ్రంగి అది చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 'అయ్యో అది బంగారం కంటే ఖరీదు, వీళ్ళెవ్వరికీ తెలిసినట్టు లేదు' అని వాపోయాడు.

కింది ఫోటో: శిధిల సచివాలయం. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఛాంబర్ ఈ భవనంలోనే వుండేది. ఇప్పుడు లేదు. కొత్త సచివాలయం నిర్మాణంలో వుంది.



9, జనవరి 2022, ఆదివారం

దశలవారీ సంపూర్ణ మద్యనిషేధం అను సారా పురాణం – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 09-01-2022, Sunday, today)

తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తన వాహనాన్ని పోలీసులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల, అది వానకు తడిసి, ఎండకు ఎండి పాడై పోతోందని, అంచేత  దాన్ని తనకు అప్పగించాలని ఆ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. మద్యనిషేధం చట్టం అమల్లో వున్నప్పుడు ఇది జరిగిందని, కానీ ప్రస్తుతం ఆ చట్టాన్ని ఎత్తి వేసినందువల్ల, తన వాహనం ఇంకా పోలీసుల స్వాధీనంలో వుండడం చెల్లదని కూడా అతడు వాదించాడు. కోర్టు అతడి వాదనను  సమర్ధించి వాహనాన్ని విడుదల చేస్తూ తీర్పు చెప్పింది.

మద్య నిషేధం అమల్లో వున్నప్పుడు, ఎత్తివేసినప్పుడు ఇలాంటి కధలు లెక్కకు మిక్కిలి.

అయాచితంగా లభించే ఎక్సైజ్ ఆదాయాన్ని ఏ పార్టీ అధికారంలో వున్నా, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా ఓ పట్టాన వదులుకోవు. అయితే మద్య నిషేధం అనేది ఎన్నికలకు ముందు ప్రజలను ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి  ఎలా పనికి వస్తుందో,  అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడపడానికి  ఇక దానితో అవసరం లేదన్న ఎరుక కూడా రాజకీయ పార్టీలకి బోధపడుతుంది.  అందుకే నెమ్మదిగా   మద్యనిషేధం అమలుకు తూట్లు పొడవడం మొదలవుతుంది. ఎందుకంటే ప్రజాసంక్షేమ పధకాలు సరిగ్గా అమలు జరగాలంటే మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే వాటికి శరణ్యం. కాబట్టి అన్ని పార్టీలకి అధికారంలోకి రావడానికి మద్యనిషేధం అనే నినాదం, దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దాన్ని గురించి పట్టించుకోకపోవడం ఒక అలవాటుగా మారింది. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదని గతమే చెబుతోంది. 

కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన శ్రీ పీవీ ఆర్కే ప్రసాద్ గారు రాసుకున్న అనుభవాలే ఇందుకు రుజువు. అదేమిటో చూద్దాం.

“సర్! ఈ సారా, లిక్కర్ అమ్మటం నా అలవాట్లకు విరుద్ధం. దయచేసి ఈ పోస్టులో మరెవరినైనా వేయండి” అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వేడుకున్నారు ప్రసాద్ గారు.

“బ్రదర్, లిక్కర్ మా అలవాట్లకు కూడా భిన్నమే. కానీ రెవెన్యూ తెచ్చే వారుణి వాహిని పధకం పకడ్బందీగా అమలు జరగాలంటే మీ వంటి వాళ్ళు వుండాలి. ఇది ఉద్యోగ ధర్మం. ఆబ్కారీ వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి. లేకపోతే కిలో రెండు రూపాయల పధకానికి వందలాది కోట్లు ఎక్కడనుంచి తెస్తాం? ” అన్నారు ముఖ్యమంత్రి రామారావు గారు. 

‘అసలేం జరిగిందంటే ..’ అనే పేరుతొ ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో ఇలాంటి  కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.

“(ఈ కొత్త ఉద్యోగంలో) నాకు ఎదురైన మొదటి సవాల్ సారా పాటల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఎలా అని.

“ప్యాకింగు లేని సారాని కల్తీ చేయకుండా నిరోధించడానికి నాటు సారాని కూడా బ్రాందీ, విస్కీల మాదిరిగా సీలు వేసిన సీసాల్లో  సరఫరా చేస్తే... ఈ ఆలోచన అమలు చేయడానికి ప్రభుత్వమే ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అనే సంస్ట కి నేను చైర్మన్ ని. సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన దువ్వూరి సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్. ఈ పోస్టులో వేయగానే నా దగ్గరకు వచ్చి తలపట్టుకుని కూర్చున్నాడు. ‘నాకు ఆ సారా వాసనే పడదు. నన్నీ పోస్టులో ఇరికించారేమిటి?” అన్నాడు.

“రైట్  కొస్చెన్ టు రాంగ్ పర్సన్ (Right question to wrong person)  సుబ్బారావ్. ఏం చేద్దాం. తప్పో రైటో ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు” 

“అంతే! ఇద్దరం పనిలో దిగిపోయాం. ఊబిలో దిగిపోతున్నాం అనే సంగతి అప్పటికి తెలియదు.

“బాట్లింగ్ ప్లాంట్ల కోసం జిల్లాల్లో స్థలాలు సేకరించాం. బాట్లింగ్ యంత్రాలు కొన్నాం. సీసాలు కొన్నాం. వాటిని సరఫరా చేయడానికి క్రేట్లు కొన్నాం. చాలా బాగా చేశావయ్యా సుబ్బారావ్ అని అభినందించాను. సుబ్బారావు విచిత్రమైన నవ్వు నవ్వాడు. అతడి కవి హృదయం అర్ధం అయింది.

“కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.

“సరఫరా చేసిన సీసాలన్నీ బాట్లింగ్ ప్లాంట్లకు తిరిగి రావాలి. దుమ్ముకొట్టుకు పోయిన వాటిని శుభ్రం చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ జరిగినా ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం. (ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని తాగేవారి  క్షేమం గురించి ఆలోచించడం చిత్రంగా లేదూ)

“ఈ ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే పాలిథిన్ సంచుల్లో సారా సరఫరా. ఈ ఆలోచనని ముఖ్యమంత్రి ముందు వుంచాం. రామారావు గారికి బాగా నచ్చింది. ‘అద్భుతం. అలాగే చేయండి అన్నారు.

“ఈ పధకానికి ఓ మంచి పేరుకోసం ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. చివరికి మన పురాణాల్లో మద్యానికి అభిమాన దేవత, ఆదిశేషుని భార్య    వారుణి పేరు బాగుందన్నారు. ఆ వారుణిని ఇప్పుడు ప్రజల్లోకి ఏరుల్లాగా ప్రవహింప చేయాలి కాబట్టి వారుణి వాహిని అని నామకరణం చేశారు.

“ఇలా రకరకాలుగా పన్నిన వ్యూహాలు ఫలించి వేలం పాటల్లో ఆబ్కారీ ఆదాయం ఒక్కసారిగా 180 కోట్ల రూపాయలకు అదనంగా పెరిగింది.

“రామారావు గారి ఆనందానికి అవధులు లేవు. మా అదృష్టం బాగుండి నిజాయితీపరుడు అయిన అశోక్ గజపతి రాజు గారు ఎక్సైజ్ మంత్రి కావడంతో ఆ ఏడాది కాంట్రాక్టర్లు అందరికీ కల్తీ సారా శక్తుల నుంచి రక్షణ కల్పించగలిగాము. అలాగే వాళ్ళని మా ఎక్సైజ్ సిబ్బంది పీక్కు తినకుండా అడ్డుపడగలిగాం.

“అప్పటివరకు సారా తాగడం ఒక దుర్వ్యసనమనీ, ఇది నలుగురు చూస్తుండగా చేసేది, ఎక్కడబడితే అక్కడ చేసేదీ కాదన్న దురభిప్రాయంలో ఉన్న ప్రజలకి మేం చాలా ప్రోత్సాహం అందించాం. ఇందుకోసం కింది స్థాయిలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పల్లెల్లో పట్టణాల్లో ప్రతి వీధికి తిరిగి ప్రచారం చేసిన సందేశం ఒక్కటే.

“వా.వా. సారాని దుకాణం దగ్గరే తాగనక్కరలేదు. ప్యాకెట్ కొనుక్కుని జేబులో పెట్టుకుని తీసుకుపోవచ్చు. ఎక్కడైనా చాటుగా తాగొచ్చు”

“అంతే! రిక్షాలు లాగేవాళ్ళు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు, వా.వా. సారా ప్యాకెట్లు జేబుల్లో కుక్కుకుని తిరిగారు. ‘త్రాగడం ఎంత సులభం అని ఆఖరికి స్టూడెంట్లు సైతం.

“సారా వేలం పాటలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు”

ఇక ప్రస్తుతానికి వస్తే..

తెలంగాణలో అంటే ఒకప్పటి నైజాం సంస్థానంలో అసలు ఎన్నడూ  మద్య నిషేధం అనేది లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ సారా, మద్యం గురించి రాజకీయ వివాదాలు లేవు. 1956 లో హైదరాబాదు సంస్థానాన్ని  ఆంధ్రప్రాంతంతో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేనాటికి ఆ నాటి ఆంధ్ర ప్రాంతంలో మద్య నిషేధం అమల్లో వుండేది. ఇది 1969 అక్టోబర్ ముప్పయి వరకు కొనసాగింది. ఆ ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి ఆ ప్రాంతంలో కూడా మద్యనిషేధం చట్టాన్ని ఎత్తి వేశారు. అప్పటి నుంచి 1995 ఫిబ్రవరి ఇరవై వరకు ఉమ్మడి రాష్ట్రంలో మద్యసేవనం, అమ్మకాలపై ఎలాంటి నిషేధం వుండేది కాదు.  ఆ ఏడాది అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ నేతృత్వం లోని టీడీపీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడంతో తెలంగాణా ప్రాంతంలో కూడా మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. విప్లవాత్మకమైన ఈ నిర్ణయం వల్ల టీడీపీ ప్రభుత్వానికి మొదట్లో మంచి పేరు వచ్చినప్పటికీ, క్రమంగా పెరుగుతూ వస్తున్న మద్యం అక్రమ రవాణా వ్యాపారం ఆ పార్టీకి ముప్పుగా తయారైంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మద్యం దొరుకుతూ వుండడం ఒక కారణం అయితే, అక్రమంగా తరలించే మద్యంతో రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్న మాఫియా మరొక కారణం. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధం ఎత్తి వేయడానికి చాలా సంకోచించాల్సి వచ్చింది.

ప్రచారం ద్వారా ముందు ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం, తర్వాత నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెద్దగా వ్యతిరేకత రాదు అనేది ఆయన నమ్మకం. సబ్సిడీ బియ్యం రేటు పెంచే విషయంలో, మద్య నిషేధం సడలించే విషయంలో కూడా ఆయన అదే పద్దతి అనుసరించారు. అంచేత మద్య నిషేధాన్ని పాక్షికంగా తొలగించే విషయంలో ముందు పత్రికా సంపాదకులు, ఇతర ప్రముఖులతో  సమావేశం అయ్యారు. అందులో ఊహించని ఓ ప్రశ్న ఎదురయింది. అప్పటికే డాక్టర్ల పర్మిట్లపై మాత్రమే  మద్యం కొనుగోలు చేసే  విధానం అమల్లో వుంది. కొందరు ఎడిటర్లు దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దాంతో ఆయన ఈ విధానాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఏ రూపంలోనూ మద్యం లభ్యం కాని పరిస్థితి ఏర్పడడంతో మద్యపాన ప్రియులు తల్లడిల్లిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దొంగతనంగా రవాణా చేసి అధిక ధరలకు విక్రయించే మాఫియా రెక్కలు తొడిగింది. కొన్ని పత్రికల్లో ఈ వార్తలు ప్రముఖంగా చోటు చేసుకునేవి. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండబోదని నిర్ధారణకు వచ్చిన ముఖ్యమంత్రి మధ్యేమార్గంగా కొంత సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు. మహిళా సంఘాల నాయకులు విమర్శించారు కాని అది ప్రతిఘటన స్థాయికి చేరుకోలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలో తీసుకున్న అతి కష్టమైన క్లిష్టమైన  నిర్ణయాల్లో ఇదొకటి.

మద్యం మాఫియాకి తోడు మద్యం వల్ల వచ్చే ఆదాయం కోల్పోవడం వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడడంతో, టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజునే   నెరవేర్చిన ఒక ప్రధానమైన ఎన్నికల వాగ్దానానికి తొలి ఏడాదిలోనే  చెల్లు చీటీ రాయాల్సి వచ్చింది. ఖజానా మళ్ళీ కళకళలాడం మొదలయింది. ఆ తర్వాత వచ్చిన వై.ఎస్.ఆర్ ప్రభుత్వం కూడా మద్య నిషేధం జోలికి పోలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు అంతే!

2014లో  రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లోని  ఆయా పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశంపై హామీలను బెల్టు షాపుల వరకే పరిమితం చేసుకున్నాయి. అయితే 2019 లో జరిగిన  ఎన్నికల్లో జగన్ మోహన రెడ్డి నాయకత్వంలోని వైసీపీ,  మద్యనిషేధం నినాదాన్ని  ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది. అధికార పీఠం ఎక్కిన తర్వాత కానీ వాళ్లకి కూడా  తత్వం బోధ పడలేదు. నవరత్నాల భారం అలవికి మించి పెరిగిపోతూ ఉండడంతో మద్యం ధరలు పెంచడం ద్వారా కొంత మేరకు లోటు పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యనిషేధం హామీని  దశలవారీ మద్యనిషేధం అమలుకు తగ్గించి, అశ్వద్ధామ హతః కుంజర అనుకుని పాలన సాగిస్తున్నారు. ఎన్నికల హామీని వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రతిపక్షాలు అనుదినం చేస్తున్న విమర్శలను పంటి బిగువున భరిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ అన్నట్టుగానే, నవరత్నాల హామీల  అమలుకు వీరికీ  డబ్బు కావాలి కదా! అది ఆకాశం నుంచి ఊడిపడదు కదా! ఎవరు ఏమనుకున్నా  మద్యం మీద వచ్చే ఆదాయమే  ప్రభుత్వాలకు పెద్ద దిక్కు. (రాజకీయ పార్టీల మనుగడకు కూడా అదే ప్రధాన వనరు అనేవాళ్ళు లేకపోలేదు)

ఏడాది ఆఖర్లో, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒకే ఒక్కరోజున  మద్యం అమ్మకాలు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే మాటలా మరి.

కాబట్టి, కావున, చివరాఖర్లో చెప్పేది ఏమిటంటే మద్యనిషేధం నినాదం అనేది అధికారంలోకి రావడానికి రాజకీయులకి  ప్రధమ సోపానం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే పట్టుకు వేళ్ళాడ్డం అంటే వారికి కుదరని పని.

‘మీరు అదే చేశారు, మేమూ మీరు చేసిందే చేస్తున్నాం’ అని సమర్ధించుకోవడం ఒక్కటే మిగిలిన మార్గం. అదే చేస్తారు. చేస్తున్నారు.

తప్పా అంటే నైతికంగా తప్పున్నర. రాజకీయంగా కాకపోవచ్చు. 

ఎందుకంటే రాజకీయం, అధికారం ఇచ్చే మత్తు ఏ మద్యం ఇవ్వలేదు.



(EOM)