3, నవంబర్ 2021, బుధవారం

పతి ప్రేమకు పరీక్ష – భండారు శ్రీనివాసరావు

 

ఒక అపార్ట్ మెంటులో ఆడవాళ్ళ కిట్టీ పార్టీ జరుగుతోంది. మాటల మధ్యలో మొగుళ్ళూ, ప్రేమలూ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. భార్య పట్ల మొగుడికి యెంత ప్రేమ వుందో తెలుసుకోవడానికి అక్కడ వున్నవాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
‘ఏమండీ మీరంటే నాకెంతో ఇదీ, సాయంత్రం పెందరాడే ఇంటికి రండి’ అంటూ ఎవరి మొగుళ్ళకు వాళ్ళు విడివిడిగా ఎస్ ఎం ఎస్ లు పంపారు. వచ్చిన జవాబుల్లో ఒక దానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని కూడా అనుకున్నారు. అనుకున్నట్టే వాళ్ళ భర్తల నుంచి వెంటనే తిరుగు ఎస్ ఎం ఎస్ లు వాళ్ళ సెల్ ఫోన్లకు వచ్చాయి. అవి ఇలా వున్నాయి.
“హలో స్వీటీ నీ ఒంట్లో బాగుంది కదా!”
“ఇవ్వాళ కూడా హోటల్ కూడేనా కొంపతీసి”
“ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బులు అప్పుడే అయిపోయాయా”
“ఏవిటి సంగతి, ఇలా గారాలు పోతున్నావు”
“నువ్వా నేనా కల కంటున్నది. ఇది నిజమేనా”
“పక్కావిడ కొనుక్కున కొత్త చీర అంతనచ్చిందా”
“ఆఫీసరు ముండావాడితో వేగలేక ఇక్కడ చస్తుంటే, బుర్ర లేకుండా ఏవిటీ వెకిలి జోకులు,”
“ఎన్ని సార్లు చెప్పాను, నీకు ఆ వెధవ సీరియల్స్ చూడొద్దని”
“గెరేజ్ లో కారు తీసి మళ్ళీ ఏ గోడకో గుద్దావా ఏమిటి, నయగారాలు పోతున్నావు”
“సాయంత్రం స్కూలు నుంచి పిల్లల్ని నేనే తీసుకు రావాలన్న మాట. అర్ధమయింది, తప్పుతుందా”
చివరికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏ మెసేజ్ కి వచ్చిందంటే:
“ఎవడ్రా నువ్వు! మా ఆవిడ మొబైల్ నుంచి మెసేజులు పెడుతున్నావు?”
(వాట్స్ అప్ లో గిరికీలు కొడుతున్న ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

2, నవంబర్ 2021, మంగళవారం

రూపాయి నోటుపై సంతకం

“మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”

కౌంటర్ లోని వ్యక్తి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.

తవ్వి తీసిన ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 సీ.జీ.హెచ్.ఎస్.

కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది రిటైర్డ్ సిబ్బందికీ సుపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గగవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)

1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి 1989లో సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు తేల్చారు. సరే! మా ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కనుకా, విదేశాల్లో ఉద్యోగం కాబట్టి ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాదు కనుకా అప్పటికి ఆ అంకాన్ని అలా ముగించాము. ఆ తరువాత ఆమెకే మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీ ఉద్యోగిని. 2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు ఎన్నడూ దొరకలేదు. డీడీ లో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని, ఇచ్చిన కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న గర్వంతో బయట పడ్డాను.

కొసమెరుపు: ఇందులో ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే అప్పటికే ఏడుపదులకు దగ్గర పడిన నేను మరో 80 ఏళ్ళకు పైగా ఈ కార్డు వాడుకోవచ్చు అన్నమాట.

ఆరోగ్య సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని సరిపెట్టుకున్నాను.

 

1, నవంబర్ 2021, సోమవారం

ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి….భండారు శ్రీనివాసరావు


నిప్పు ఉప్పులాంటి ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు టీవీ తెరలపై చాలాకాలంగా ఒకరిపై ఒకరు, ఒకరి పార్టీపై మరొకరు నిప్పులు చెరుగుతూ విమర్శలు చేసుకునేవారు.
కొంతకాలం తర్వాత, సరైన సమయం చూసుకుని పార్టీలు కూడా మారిపోయారు. పైగా ఆయన ఈ పార్టీలో, ఈయన ఆ పార్టీలో.
ఇన్నేళ్ళుగా వినిపించిన వారి వాదనలు కూడా చిత్రంగా మారిపోయాయి. అప్పటివరకు తాము ప్రాతినిధ్యం వహించిన పార్టీని చీల్చి చెండాడం, తమ నోటితో దూషించిన పార్టీని నెత్తికెత్తుకుని నాలుక మడతేసి మాట్లాడడం చూస్తూ నివ్వెరపోయిన ఓ విశ్లేషకుడు తేనీటి విరామ సమయంలో తన సందేహాన్ని బయట పెట్టాడు, ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు అని.
దానికి వారు వేర్వేరుగా జవాబు ఇచ్చినప్పటికీ సారాంశం మాత్రం ఒక్కటే.
“ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?
“మీరు ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు చూశారా! వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా నటించిన రక్త సంబంధం సినిమా కూడా చూసే వుంటారు. నాయకీ నాయకులుగా ప్రేమ సన్నివేశాల్లో ఎంత తాదాత్మ్యంగా నటించి ప్రేక్షకులను ఎలా మెప్పించారో, ఏకోదరులైన అన్నా చెల్లెళ్లుగా అదే స్థాయిలో అనురాగం, ఆత్మీయత కురిపించి, ప్రేక్షకులను ఒప్పించారు. అలాగే మేము. వాదించే విధానాన్ని బట్టే మాకు డిమాండ్ వుంటుంది. ఇంకా అర్ధం కాకపొతే ఎప్పటికీ మీకు అర్ధం కాదు”
ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక అర్ధం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి!
(01-11-2021)

పాత్రికేయ దిగ్గజం పొత్తూరివారికి జీవన సాఫల్య పురస్కారం

(ఏపీ ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు కీర్తిశేషులు పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన మరణానంతరం వారి కుమారులకు అందించిన సందర్భంలో వారి యాదిలో...)
‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు.
తెలంగాణా ముఖ్యమంత్రి సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ కలిసి నాలుగేళ్ల క్రితం పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు.
‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే, ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు.
ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే, రాయే సాయి, నమ్మనివారు తొక్కితే, అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
“నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు.

(01-11-2021) 





అమ్మకు వందనం


శ్రావణ మాసం అనగానే మా అందరికీ నువ్వే గుర్తుకు వస్తావు. జరిగి దాదాపు ముప్పయ్యేళ్ళు కావస్తున్నా ఆ రోజు మా అందరికీ ఇంకా బాగా జ్ఞాపకం వుంది. శుక్రవారం నోముకు అంతా సిద్ధం చేసుకున్న నలుగురు కోడళ్ళు, ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో నీ పిల్లలం నలుగురం.
కోడళ్ళని కన్న కూతుళ్ళుగా చూసుకున్న నువ్వు వారి నోముకు అడ్డం ఎలా వస్తావు. పూజలు పూర్తయి, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వడం అయిపోయిన తరువాత కానీ నువ్వు దాటిపోలేదంటే అది నీ అవ్యాజ ప్రేమకు నిదర్శనం. ఆ రుణంతీర్చుకోలేనిది.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యావత్ కుటుంబం కాశీ వెళ్లి అంతిమ సంస్కారాల క్రతువు ముగించడం అన్నది నీ ఒక్క విషయంలోనే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు నీ ఆబ్దీకం అనేది చుట్టపక్కాలు అందరికీ ఒకచోట కలుసుకునే సందర్భంగా మారిపోయింది. మన ఇంట నలుగురూ కలిసి జరుపుకునే పర్వదినంగా పవిత్రతను సంతరించుకుంది.
నువ్వు ధన్యజీవివి. నీ కడుపునపుట్టి మేము కూడా ధన్యులమయ్యాం.
ఈరోజు నీ పుట్టిన రోజున నిన్ను స్మరించుకుంటూ...



30, అక్టోబర్ 2021, శనివారం

నాకు తెలిసింది సున్నా! – భండారు శ్రీనివాసరావు


చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు' అని. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని.
కొన్నేళ్ళ క్రితం ఇంటింటి సర్వే వాళ్ళు వచ్చి అడిగారు, 'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ. నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను రూడిగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు మిడిమిడి జ్ఞానం బాపతు. అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే మనలో నిండి నిబిడీకృతంగా వున్న అజ్ఞాతిమిరం చాలావరకు అంధకారంలోనే వుండిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర ఖండనముండనలు, హర్షాతిరేక ప్రకటనలు, ప్రగాఢ సంతాపసందేశాలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారివారి నొసటిరాత ప్రకారం మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' నా ముందు కూర్చుని వున్న ఈ ఎంపీ ఆ నియోజకవర్గపు ప్రస్తుత ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డు అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటె ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే ఇప్పుడు మాజీ. 'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో చిన్న అక్షరాలలో ముద్రించారు. అది చూసి 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకునేనే సమాధాన పడ్డాను.
ఆ విధంగా నా అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల, ఇదిగో ఇప్పుడిలా, కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను. కానీ, ముందే చెప్పినట్టు, 'నాకు బాగా తెలుసు, నాకు తెలిసింది సున్నా' అని.
తోక టపా: రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి, రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.