16, జులై 2021, శుక్రవారం

కాలం చెల్లినవాటికి చెల్లుచీటీ – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhraprabha dated 18-07-2021, SUNDAY)

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చక్కని మాట చెప్పారు.

కాలం చెల్లిన చట్టాలకు ఇకనైనా చెల్లు చీటీ రాయాలని.

భేషైన మాట. అందరి మనసులో వున్న మాట.

భారత శిక్షాస్మృతి లోని 124 -ఏ సెక్షన్ అనేది ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం రానప్పుడు, 1860 లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి శిక్షాస్మృతిని అమల్లోకి తెచ్చింది. మొదట్లో దేశద్రోహ నేరానికి సంబంధించిన ఈ 124 -ఏ సెక్షన్ అనేది భారత శిక్షాస్మృతి (ఐ.పి.సి.) లో లేదు. తర్వాత పదేళ్లకు అంటే 1870లో ఈ నిబంధనను కొత్తగా చేర్చారు. జాతిపిత గాంధీజీ  పుట్టి ఆనాటికి ఏడాది మాత్రమే అయింది. తదనంతర కాలంలో అంటే స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో ఈ సెక్షన్ ను నాటి బ్రిటిష్ పాలకులు దుర్వినియోగం చేస్తున్న తీరుకు కినిసి, మహాత్మా గాంధి సయితం ఈ సెక్షన్ ను గట్టిగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికే దీన్ని రూపొందించారని ఆయన పలుమార్లు విమర్శించారు. గాంధీజీ ఒక్కరే కాదు, స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సయితం, ప్రధాని హోదాలోనే ఈ  125 -ఏ సెక్షన్ ను తప్పుబట్టారు.

”ఇది చాలా చెడ్డది. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది” అని అనేవారు.

నెహ్రూ చనిపోయి ఏండ్లూపూండ్లు గడిచిన తర్వాత కూడా ఏ పాలకులు కూడా ఈ సెక్షన్ గురించి పట్టించుకోకపోవడంతో ఈ బ్రిటిష్ చట్టం 150 ఏళ్ళ నుంచి అమల్లోనే వుంది. ఉపయోగించిన సందర్భాలు, విచారణ జరిగి శిక్షలు పడిన సందర్భాలు తక్కువే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజద్రోహ చట్టం ఏమిటి అనే ప్రశ్నకు సరయిన జవాబు ఇంకా దొరకలేదు.

గతంలో కూడా  124 -ఏ సెక్షన్ న్యాయస్థానాల దృష్టికి రాకపోలేదు. 1958 లోనే అలహాబాదు హైకోర్టు ఈ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని అంటూ దాన్ని కొట్టివేసింది. దరిమిలా పంజాబు హైకోర్టు సయితం కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టు ఒక కేసును విచారిస్తూ ఈ రెండు హైకోర్టుల తీర్పులను పక్కన పెట్టింది. ఈ సెక్షన్ రాజ్యాంగపరంగా చెల్లుతుందని, అయితే అదొక మినహాయింపు మాత్రమేనని పేర్కొంది. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది రాజద్రోహ నేరం కాదని స్పష్టం చేసింది. దాంతో ఈ చట్టానికి మళ్ళీ సంజీవని పుల్ల తాకించినట్టు అయింది.

ఇప్పుడు మళ్ళీ ఎడిటర్స్ గిల్డ్ తో పాటు ఒక మాజీ సైనికాధికారి ఈ అంశంపై వేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం గత గురువారం నాడు విచారణకు స్వీకరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం మళ్ళీ దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రమైన వాడివేడి చర్చలకు కారణమయ్యాయి.

“వలసవాద ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం ఇంకా ఎన్నాళ్ళు? రాజద్రోహం సెక్షన్ ను ఎందుకు రద్దు చేయడం లేదు? స్వాతంత్రోద్యమ కాలంలో గాంధి, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకుల నోళ్ళు నొక్కడానికినాటి ప్రభుత్వం ఈచట్టాన్ని వాడుకుంటే, ఈనాడు అదే చట్టాన్ని అధికారులు ఎడాపెడా వాడేస్తున్నారు” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అని వ్యాఖ్యానించారు.

సుప్రీం తన అభిప్రాయం తెలిపింది. అయితే దీనిమీద కేంద్రం ఏ చర్య తీసుకుంటుందో చూడాల్సివుంది. సుప్రీం సూచనలకు అనుగుణంగా 124 -ఏ సెక్షన్ ను రద్దు చేయాలని నిర్ణయిస్తే ఏ పేచీ వుండదు.

ఏ చట్టాన్ని  అయినా దాన్ని రద్దు చేసేంతవరకు అది చట్టం దృష్టిలో చెల్లుబాటు అయ్యే చట్టమే అని కొందరు న్యాయ కోవిదులు అంటున్నారు.

లోగడ కృష్ణయ్యర్ గారని ఓ న్యాయాధిపతి వుండేవారు. ఆయనది ఓ కొత్తదారి. పేరుకు ముందు జస్టిస్ అని తగిలించకపోయినా ఏమీ అనుకునేవారు కాదు. జడ్జీలకు, న్యాయవాదులకు మధ్య సాంప్రదాయ గౌరవవాచకాలు ఆయనకు గిట్టేవి కావు. న్యాయమూర్తులు  పొడుగుపాటి గౌన్లు, రోబ్స్ ధరించాలనే సాంప్రదాయాలు ఆయనకు నచ్చేవి కావు. అంతే కాదు, న్యాయ పీఠం మీద కూర్చున్న న్యాయమూర్తికి, కోర్టులో వాదించే న్యాయవాదులకు నడుమ దూరం పాటించడం, జడ్జీలు తమ ఆసనాలపై  కూర్చునేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు  బంట్రోతులు వారు ఆసీనులు కావడానికి, లేవడానికి  వీలుగా వారి ఆసనాలను వెనక్కీ ముందుకు జరపడం అసలు ఇష్టపడేవారు కాదు. ‘లీగల్లీ స్పీకింగ్’  అనే పేరుతొ రాసిన పుస్తకంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఈ అంశాలను పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి సమూల సంస్కరణలు రావాలని ఆయన కోరుకున్నారు కానీ ఆయన జీవిత కాలంలో నెరవేరలేదు.

ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు గురించిన మాటలు వినబడుతున్నాయి. మంచిదే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా పలుసందర్భాలలో ఈ విషయం ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక అడుగు అంటూ ముందుకు పడితే అది భారీ సంస్కరణలకు దోహదపడే అవకాశం వుంటుంది.

అచ్చంగా ఇలాంటిది కాకపోయినా కాలం చెల్లిన తర్వాత కూడా చెల్లుబాటులో ఉన్న కొన్ని అంశాలు మనకు చరిత్రలో దొరుకుతాయి.

వాటిల్లో కొన్ని.

ఉద్యోగం వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!

మనలో చాలామంది హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు సందర్శించే వుంటారు. రేడియో కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ ఇత్తడి గంట కనిపిస్తుంది.

రేడియో స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే ఆలోచన నిత్యం  నన్ను వేధిస్తూ వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)

విచారించగా తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో  కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని  తెలిసింది.  మూడు దశాబ్దాల నా ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి పదిలంగా కాపాడడానికి  ప్రత్యేకంగా ఓ ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.

ఒకానొకకాలంలో, బహుశా స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను,  భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో, అలాంటి ప్రాంతాల్లో  ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి ఏర్పాటు వుండేది. ఒక బండి, అది సర్కారు వాహనం కాబట్టి  జత ఎడ్లు,  వాటికి  గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్ మాదిరిగా ఒక పనివాడు, ఈ తతంగం అంతా నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు  ఇలా సాగిపోయేది.

కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ విల్స్  జీపులు రంగ ప్రవేశం చేయడంతో, ఎడ్లబండ్ల అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారికి మనుషులకు  వైద్యం చేసే  దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు విషయం బయట పడింది.

మనలో చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు.  పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.

తరవాత్తరవాత విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం కొనసాగింది.

మన దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే  ఉద్యిగి కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం, మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలు  పాతపడి పేర్లు మారిపోయి వుంటాయి.

‘ఒక గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం” ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.

(EOM)

15, జులై 2021, గురువారం

డాక్టర్ కె.ఎల్. రావు రోడ్డు - భండారు శ్రీనివాసరావు

(జులై,15, డాక్టర్ కె.ఎల్.రావు జయంతి)

హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ కీర్తిశేషులు శ్రీ ఆర్. జే. రాజేంద్రప్రసాద్ గారు హైదరాబాదు రాకముందు నుంచి కూడా నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు.
ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.
సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.
పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.
మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.
ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.
అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.
మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము.
ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు.
ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి.
కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.
అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.
దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.
తోకటపా: ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు.
(15-07-2021)

13, జులై 2021, మంగళవారం

గుర్తింపుకో కార్డు

 రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ కార్డు తీసి ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మన కార్డు తీసి పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.   

జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ నందులు  ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన వారికి.

పుట్టి కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు  బర్త్ సర్టిఫికేట్.  స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు,  ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం. ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు, వీసా,  బ్యాంక్ క్రెడిట్ కార్డు  ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.

పాతికేళ్ళు వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.

హైదరాబాదులో ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ పంచదార కోసం. అందరిలాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక తప్పలేదు.  వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి వెళ్ళారు.

తరువాత కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.

అమెరికా వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న ఉద్యోగం చలవే.

బ్యాంకు కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్ కార్డు లేకపోతె  బహుశా నాకు జీవితంలో బీపీ రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.

ఆధార్ కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు,  కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు  తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో decomposed dead body లాగా వుందని, ఇంటి నుంచి కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.

విధిగా తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు  వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు, స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.   మూడు కూడా పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.

ఇక వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత నలభయ్ ఆరేళ్లుగా. దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు కార్డు, రాష్ట్రంలో  ఎక్కడికైనా మూడో వంతు టిక్కెట్టు ధరతో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను.

వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు.  ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి. 

పొతే, సగంధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.

మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది.

విచిత్రం ఏమిటంటే నేను సుదీర్ఘ కాలం పనిచేసిన రేడియో, దూరదర్సన్ లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.

రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.

మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.

జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ అదేమిటో విచిత్రం చాలా  ప్రాంతాలు తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు.

ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.    


తాజా మాజీ

 'హలో నమస్కారం'

'నమస్కారం. చెప్పండి '

'మనం కలవక చాలా రోజులయింది'

'అవునండీ'

'ఈ సాయంత్రం ఎలా వున్నారు? వీలుంటే బంజారా హోటల్లో కలుద్దామా!'

'ఎందుకండీ అంత ఖర్చు. హాయిగా మన ప్రెస్ క్లబ్ వుంది కదా'

'ప్రైవసీ వుండదేమో'

'హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ప్రైవసీ ఎందుకండీ?'

'అదీ నిజమే అనుకోండి'

క్లబ్బులో రెండు మూడు గంటలు గడిపిన తరువాత.....

'నేను వస్తానండీ'

'అప్పుడేనా?'

'చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడయితే ఏదో ఒక ఆటో దొరుకుతుంది. ఆలస్యం అయిన కొద్దీ వాళ్ళతో తంటా. రోజూ వుండే తద్దినమే అయినా పొద్దున్నే వార్తల టయిముకి ఆఫీసుకి చేరాలి కదా!'

'వుండండి నా కారులో దింపేసి వెడతాను'

'భలే వాళ్ళే! మీరు వుండేది ఉత్తరం, నేను ఉండేది దక్షిణం. బోలెడు దూరం తిరిగెళ్లి వెళ్ళాలి. వద్దు లెండి'

'నేనేమన్నా మిమ్మల్ని మోసుకుంటూ వెడతానా ఏమిటి? కారే కదా. పైగా డ్రైవర్ కూడా వున్నాడు, పదండి'

'సరే పదండి'

ఇంటి దగ్గర దిగే ముందు -

'నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకోండి. నాకు ఇది ప్రిస్టేజ్ ఇష్యూ'

ఏళ్ళు గడిచిపోయాయి.

అప్పటి జర్నలిష్టు ఇప్పుడు మాజీ జర్నలిష్టు.

ప్రెస్ క్లబ్ లో మళ్ళీ కలిశారు అదే ఇద్దరు.

'ఏమండీ బాగున్నారా?'

'బాగున్నాను, మీరెలా వున్నారు?'

'బాగానే వున్నాను. కంపెనీ టర్నోవర్ అయిదు కోట్లు దాటింది. దాంతో పాటే పని కూడా బాగా పెరిగిపోయింది. స్టాఫ్ పెరిగారు. అన్నీ ఒక కంట కనిపెట్టి చూసుకోవాలి. పైగా ఢిల్లీ బాంబే తిరుగుళ్ళు. మునపటిలా ఎవర్నీ తీరిగ్గా కలవలేకపోతున్నాను. సారీ అండీ. అయినా కాసేపు మాట్లాడుకుందాం రండి'

'లేదండీ. ఇప్పటికే చాలా సేపు అయింది. మీకు తెలుసు కదా! చాలా దూరం వెళ్ళాలి. పైగా అప్పుడూ ఇప్పుడూ అదే సమస్య. ఆటో'

'మరే. నేనూ అదే అనుకుంటున్నాను. ఈరోజు వేరే ఫ్రెండ్స్ వస్తామన్నారు. మరో రోజు తీరిగ్గా కలుద్దాం లెండి. గుడ్ నైట్ అండీ'

'గుడ్ నైట్'

 

12, జులై 2021, సోమవారం

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ....

 నా రాశి ఫలాల్లో పుస్తక లాభం అని రాసివుంటుందేమో. నేను చూడను కనుక తెలియదు. ఉదయం ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఫోన్ చేసి నాయింటి అడ్రసు వాకబు చేసారు. చెప్పిన సమయానికే వచ్చారు. దాదాపు మూడుగంటలు. ఇంకా ఎక్కువే కావచ్చు. నాకయితే టైము తెలియలేదు. అన్ని ముచ్చట్లు. ఎన్నెన్నో విషయాలు. అవన్నీ రాయాలంటే వంద పేజీల పుస్తకం అవుతుంది. రాయడం తెలిసిన రాజకీయ నాయకుడు కనుక ఆయనే రాస్తే బాగుంటుంది. అదే ఆయనతో చెప్పాను. చూద్దాం రాస్తారేమో.

మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగారు. భోజనం చేసి వెళ్ళండి అంటే  ఇల్లు తెలిసింది కదా మరో మారు అన్నారు. మా ఇద్దరితో కలిసి ఒక ఫోటో దిగారు.



ఇప్పుడు ఆ పుస్తకాలు, నేనూ ఆ  ఫోటో మిగిలాము ఇంట్లో. సరిగ్గా రెండు నెలల తర్వాత 'భోంచేసి వెళ్ళండి' అని అడిగే మా ఆవిడ లేకుండా పోయింది.

(12-07-2020)

పేరు కోసం – భండారు శ్రీనివాసరావు

 ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.

కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆరోజు మావాడి నుంచి నేర్చుకున్నాను.

ఆరోజు గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసివున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది.

టీవీలో సినిమా వస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’ బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి చేయించిన నగలు వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.

ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ.

పధకాల క్రెడిట్ తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఆయా పార్టీలు పడుతున్న తాపత్రయం నేపధ్యంలో చూస్తే వీటికి ఉన్న సంబంధం బోధపడుతుంది.

ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు నిజానికి ఆయా పాలక పార్టీలది కాదు, పన్నులు కడుతున్న ప్రజలది.

ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!

 

11, జులై 2021, ఆదివారం

“ఒరేయ్! నేను రాష్ట్రపతిని రా!”

 

1932 లో పుట్టారు అంటే ఇప్పుడు ఆయన వయసు 88. నిజామాబాదు జిల్లా ఆర్మూరులో పుట్టిన జి.ఎస్.వరదాచారి గారు నాకు తెలిసినంత వరకు అత్యంత వయోధికుడైన పాత్రికేయులు. ఈనాటి జర్నలిస్టులకు దిక్కూ, దిక్సూచి ఆయనే. ఆ వయసులో ఆయన చురుకుదనం చూసి వయసే సిగ్గుతో పక్కకు తప్పుకుంది. డెబ్బయ్ అయిదేళ్ళు వచ్చిన తరువాత కాబోలు అయన కంప్యూటర్ మీద తెలుగు టైప్ చేయడం అభ్యసించి ’జ్ఞాపకాల వరద’ అనే పేరుతొ తన జీవితానుభవాలను గ్రంధస్తం చేశారు. నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘానికి ఫౌండర్ ప్రెసిడెంట్. ఆయన జ్ఞాపకాల సమాహారం నుంచి వెలికి తీసిన వాడని సుమమే ఈ పోస్టు.

ప్రస్తుతం పంజాగుట్ట చట్నీస్ దగ్గర (కొత్తగా అక్కడ ఓ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది) హైదరాబాదులో మొట్టమొదటి జర్నలిస్టుల కాలనీ నిర్మాణం అయింది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ స్థలాన్ని మార్కెట్ రేటు ప్రకారం గజం అయిదు రూపాయల వెల నిర్ణయించి ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నలభయ్ రెండు ప్లాట్లు. విస్తీర్ణాన్నిబట్టి ఒక్కొక్కరు 1750 నుంచి 2000 వేల రూపాయలు కట్టాలి. అంత మొత్తం ఒకేసారి చెల్లించే స్తోమత చాలామందికి లేదు. మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తక తప్పలేదు. పన్నెండు అర్ధ సంవత్సర వాయిదాలలో కట్టడానికి అంగీకరించింది. (అయినా కాలనీలో మూడు ప్లాట్లు మిగిలాయి. గోరాశాస్త్రిని అడిగితే ‘ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓనింగ్ ప్రాపర్టీ’ అన్నారు. గండూరి కృష్ణ ప్రవేశ రుసుము కట్టే పరిస్తితి లేదంటే సొసైటీ ఆయనకు కొంత ఋణం కూడా ఇచ్చింది. చివరకు ఆయన ఇల్లు కట్టుకోలేక ప్లాటును వాపసు ఇచ్చారు).

1968 ఏప్రిల్ మూడో తేదీన బ్రహ్మానందరెడ్డి వచ్చి శంకుస్థాపన చేసారు.

జర్నలిస్టులు ఒక సహకార సంఘంగా ఏర్పడి నిర్మించుకున్న మొట్టమొదటి కాలనీ పూర్తయింది. ఇక ప్రారంభోత్సవం తరువాయి.

ప్రతి సంవత్సరం వచ్చినట్టే నాటి రాష్ట్రపతి వీవీ గిరి గారు శీతాకాలపు విడిది కోసం హైదరాబాదు వచ్చి వున్నారు. ఆయన చేత కాలనీ ప్రారంభోత్సవం చేయిస్తే ఎలా ఉంటుందని అందరం అనుకున్నాము. కట్టగట్టుకుని బొలారం వెళ్ళాము. రాష్ట్రపతి మేనల్లుడు అయిన సింహం, పూర్తిపేరు దిగుమర్తి నరసింహారావు కూడా సొసైటీ సభ్యుడు. ఈ కాలనీలో ఆయనకు ప్లాటు లేదు. ఐనా, నేను మాట్లాడి పెడతానన్నాడు. అలాగే ప్రస్తావించాడు. అప్పుడు గిరి అన్న మాటలలో ధ్వనించిన ఆప్యాయత నేను మరచిపోలేను.

ఒరేయ్! నేను రాష్ట్రపతిని రా! నా కార్యక్రమాలన్నీ మూడు నెలల ముందే నిర్ణయమైపోతాయి. నా చేతులలో వుండదు. ఇప్పుడు కుదరదు. జర్నలిస్టు కాలనీ అంటున్నారు. నేను మళ్ళీ వస్తాను. తప్పక ప్రారంభిస్తాను” అన్నారాయన.

కొన్నాళ్ళ తరవాత కొంతమంది సైనికాధికారులు వచ్చి కాలనీ వున్న ప్రదేశాన్ని పరిశీలించి వెళ్ళారు. మరికొన్నాళ్లకు రాష్ట్రపతి 1971 ఏప్రిల్ ఆరో తేదీన ప్రారంభిస్తారని వర్తమానం అందింది. అప్పుడు సొసైటీకి పొత్తూరు వెంకటేశ్వర రావు అధ్యక్షుడు. ఆర్. శ్రీనివాసన్ కార్యదర్శి. కాలనీకి సుప్రసిద్ధ సంపాదకుడు కోటంరాజు రామారావు పేరు పెట్టాలని నిర్ణయించాము.

అనుకున్నవిధంగానే రాష్ట్రపతి వచ్చి కాలనీని ప్రారంభించారు. జర్నలిస్టులకు కొన్ని పట్టణాలలో ప్రభుత్వ గృహాలు కేటాయించిన దృష్టాంతాలు ఉన్నాయి. కానీ వారే ఒక సొసైటీగా ఏర్పడి నిర్మించుకున్న మొదటి కాలనీ ఇదే అని రాష్ట్రపతి అభినందించారు.

సభ ముగియగానే రాష్ట్రపతి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహారానికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, రెవెన్యూ మంత్రి వీబీ రాజు, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు”

(జ్ఞాపకాల వరద, రచన” డాక్టర్ జీ.ఎస్. వరదాచారి, ఎమెస్కో ప్రచురణ, వెల: Rs.150/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్)