మే 30 వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు అవుతుంది.
రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ మోహన రెడ్డి గారు ఏమి సాధించారు?
జగన్ మోహన రెడ్డి గారి రెండేళ్ల పరిపాలన ఎలా
వుంది ?
వినడానికి రెండు ప్రశ్నలు ఒకే మాదిరిగా వున్నా
రెండింటిలో స్థూలమైన తేడా ఒకటి వుంది.
మొదటి దానికి జవాబు ఒక్క వాక్యంలో కూడా
చెప్పవచ్చు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబాడీ ఆడమన్నట్టు వుంది ఆయన పరిస్థితి.
శాసనసభలో అతి ఘనమైన మెజారిటీ వుంది. ఏ నిర్ణయం
తీసుకున్నా కాదనే వారు లేరు. కానీ గత రెండేళ్లుగా పరిస్థితులను గమనిస్తుంటే వాటిని
అమలు చేయడం ఆయన ఒక్కరి చేతిలో లేదని అర్ధం అవుతోంది. ఏ అడుగు వేసినా అది న్యాయ
సమీక్షకు వెడుతోంది. నాకు తెలిసి గత కొన్ని దశాబ్దాల కాలంలో ఒక ప్రభుత్వ నిర్ణయాలు
ఈ స్థాయిలో కోర్టుల పరిధిలో తిరస్కరణకు గురి కావడం ఎన్నడూ చూడలేదు. నిర్ణయాలలో
లోపం అయినా వుండాలి. వాటిని న్యాయ సూత్రాలకు అన్వయించడంలో పొరబాటు అయినా జరిగి
వుండాలి. అయితే,
దీనిని త్వరితగతిన సరిదిద్దుకోవాల్సిన బాధ్యత, అవసరం కూడా ప్రభుత్వానికే వుంది.
ఇక రెండో ప్రశ్నకు జవాబు ఎక్కడో నగరాల్లో వుండి
చెబితే కుదరదు. ఆయన పాలన వల్ల మంచో చెడో ఆ ఫలితాలను అనుభవించిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అధిక
సంఖ్యలో వుండేది నగరాల్లో కాదు, పల్లెల్లో. నిజానికి జగన్ మోహన్ రెడ్డి గారు
అమలుచేస్తున్న నవ రత్నాలలో అధికభాగం వారి సంక్షేమానికి సంబంధించినవే కావడం వల్ల
ఈ ప్రశ్నకు జవాబు గ్రామాల్లో ఒక మాదిరిగా,
నగరాల్లో మరో మాదిరిగా వచ్చే అవకాశం వుంది. అభివృద్ధి ఫలాలను నేరుగా రుచి చూసిన
వారి అభిప్రాయమే నిఖార్సయినది. నగరాల్లో కొందరు దీనితో ఏకీవభించకపోవచ్చు.
అభివృద్ధికి వారు చెప్పే భాష్యం వేరేగా వుంది. దానికి జవాబు ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి ఈ మధ్య జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో చెప్పినట్టున్నారు.
అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాల
నిర్మాణం కాదు,
పేదవాడి కనీస అవసరాలు తీర్చడం కూడా అభివృద్దే అని.
ఇదలా ఉంచితే,
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే
ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత
చప్పున ఔనని చెప్పడం కష్టం.
అయితే ఈ
రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా
కష్టమే.
చంద్రబాబునాయుడు
నవ్యాంధ్రప్రదేశ్ ప్రధమ ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళ కాలంలో, తన సమయంలో చాలావరకు అధికారుల సమీక్షా సమావేశాల్లో గడిపేవారనే మాట వినబడేది.
అందువల్ల పరిపాలన చేయాల్సిన అధికారుల విలువైన సమయం కొంత వృధా అయ్యేది. గంటల తరబడి
సాగే ఈ సమీక్షల కారణంగా అధికారులు, సిబ్బంది అసహనానికి
గురయ్యేవారు కూడా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తగ్గుతాయని
అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా సమీక్షల బాట
పట్టడం ఆశ్చర్యంతో పాటు, అసహనాన్ని కూడా
పెంచుతోంది. నిజానికి ఈ సమీక్షలు కొత్తవేమీ కాదు. ప్రతి ముఖ్యమంత్రి అనుసరించిన
విధానమే ఇది. కాకపొతే దాన్ని అమలుచేయడంలో తేడాలు ఉండేవి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి
ముఖ్యమంత్రి అయినప్పుడు సమీక్షలు జరిగేవి కానీ అవి చాలా సంక్షిప్తంగా సాగేవి.
ఏదైనా కార్యక్రమం లేదా పధకం లేదా ప్రాజెక్టు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఆలస్యం
అవుతోంది అనుకున్నప్పుడు వై.ఎస్. ఇటువంటి
సమావేశాలు నిర్వహించేవారు. విభిన్న శాఖల అభ్యంతరాలు, వాటికి పరిష్కారాలు ఆ సమావేశంలో అక్కడికక్కడే
కనుగొనేవారు. దానివల్ల చాలా సమయం ఆదా అయ్యేది. సమస్యకు సానుకూల పరిష్కారం
లభించింది అని తెలియగానే వై.ఎస్.
సమావేశాన్ని ముగించి వెళ్ళిపోయేవారు. ఇటువంటి పద్దతులను జగన్ మోహన రెడ్డి అనుసరిస్తే
ఆయన తలపెట్టిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత వేగం పుంజుకునే
అవకాశం వుంటుంది.
గత రెండేళ్ల
కాలంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన మీద ప్రతిపక్షాలు, అనేక మీడియా సంస్థలే కాకుండా సోషల్ మీడియాలో సైతం వినవస్తున్న విమర్శ
ప్రధానంగా ఒకటి వుంది. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం
సంక్షేమ పధకాల మీదనే ప్రజాధనం ఖర్చుచేస్తూ
ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తున్నారు
అన్నదే ఆ విమర్శ. ఇదే లెక్కన రాబోయే
మూడేళ్లు వ్యవహరిస్తే రాష్ట్రం అప్పుల
ఊబిలో కూరుకు పోతుందని వాళ్ళ అంచనా.
ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై చేస్తున్న విమర్శలు, ఆరోపణలను జగన్
మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్న దాఖలా కనబడడం లేదు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు
ఇచ్చిన మాటకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ
పోతున్నారు. ‘మా విమర్శలకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు?’ అంటూ టీవీ వేదికల మీద ప్రతిపక్ష నాయకులు చేస్తున్న
ప్రకటనలే ఇందుకు నిదర్శనం.
ప్రతిపక్షాల విమర్శలను,
మీడియా సలహాలను జగన్ మోహన రెడ్డి ఖాతరు చేయడం లేదు అనే అభిప్రాయం జనంలో ఉన్నమాట
మిజమే. జగన్ పాలనను నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన ఓ విశ్లేషకుడు ఇలా అన్నారు.
“రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మహా కోలాహలంగా
వుంటుంది. వచ్చే పోయే ప్రయాణీకులు, తినుబండారాలు అమ్మేవారి కేకలు, రైళ్ళ
కూతలు,
పోర్టర్ల హంగామా. వీటన్నిటి నడుమ ఒక వ్యక్తి ఏమీ పట్టించుకోకుండా, బయటి
గందరగోళాన్ని చెవిన పెట్టకుండా దీక్షగా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అతడే
స్టేషన్ మాస్టరు.
జగన్ మోహన రెడ్డి వ్యవహారశైలి దూరం నుంచి
పరిశీలిస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది ఈ స్టేషన్ మాస్టరే!”
అయితే, ఈ
విషయంలో జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం
వేరుగా వుంది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు తన మాటలు నమ్మి తన చేతికి అధికార
పగ్గాలు అప్పగించారని, అంచేత తన
పార్టీ ఎన్నికల ప్రణాళికే తనకు భగవద్గీత,
బైబిల్ ఖురాన్ అని, ప్రజలకు ఇచ్చిన మాటే తనకు వేదమని సందర్భం వచ్చిన ప్రతి చోటా ఆయన చెబుతూ వస్తున్నారు.
ఇందులో వాస్తవం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో
వైసీపే ఘన విజయానికి దోహదం చేసిన అనేక కారణాల్లో, వైసీపీ అధినేత
వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు’ పేరిట రూపుదిద్దుకున్న పధకం కూడా
వుంది. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని
ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, ఆ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన
విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై
యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.
సంక్షేమం
గురించి జనం స్పందనలు విభిన్నంగా వుంటాయి అనడానికి ఓ ఉదాహరణ.
పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్
మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు.
అప్పటివరకు రైలు బోగీల్లో రెండో తరగతి
ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో
రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
దానితో రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద
ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది.
ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని
గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి
ఇదో ఉదాహరణ.
(28-05-2021)