16, మే 2021, ఆదివారం

కరెంటులో బల్లి పడింది

 

హైదరాబాదులో మీకు ఒక్కరికే అధికారులు స్పందిస్తారా అని ఒక మిత్రుడు కామెంటు పెట్టారు. ఒక్కోసారి నాకూ ఈ అనుమానం వస్తుంటుంది. జర్నలిస్టు అవతారం చాలించి జనసామాన్యంలో నలుగురితో నారాయణ అంటూ జీవితం ప్రారంభించి కూడా పదహారేళ్ళు దాటిపోయింది. నాకు తెలిసిన అధికారులు కూడా తదనంతర కాలంలో రిటైర్డ్ జాబితాలో చేరిపోయారు. నిజం చెప్పాలంటే చాలామంది ఫోన్ నెంబర్లు కూడా తెలవదు.
మళ్ళీ కరెంటు కోతలు మొదలయినట్టున్నాయే అని పెట్టిన పోస్టుకు ముగ్గురు ఉన్నతాధికారులు స్పందించడం నాకు ముచ్చట అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను వాళ్లకి ఒకటే చెప్పాను. కరెంటు సరఫరా పునరుద్ధరణ అయిన దానికంటే కూడా మీ ప్రతిస్పందన నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.
అందరికీ ఇలా జరుగుతుందా అనేది నిజంగా శేష ప్రశ్నే. నా దగ్గర కూడా జవాబు లేదు.
ఈ పోస్టుకు కూడా ఓ చిన్న నేపధ్యం వుంది.
కొద్ది సేపటి క్రితం ఆనంద్ గారనే పెద్ద మనిషి ఫోన్ చేశారు. ఆయన పెద్ద మనిషే కాదు, విద్యుత్ శాఖలో పెద్ద అధికారి కూడా. (SE).
రాత్రి ఓ బల్లి కారణంగా విద్యుత్ సరఫరాకు కొంత అంతరాయం కలిగిందని చెబితే ఆశ్చర్యపోయాను. చెట్ల కొమ్మల వల్ల అప్పుడప్పుడూ ఇలా జరుగుతుందని తెలుసు. కానీ బల్లిపాటు వల్ల కూడా కరెంటు ట్రిప్ అవుతుందన్న మాట.
సరే! ఈ సంగతి పక్కనపెడితే నేను చెప్పేది ఒక్కటే. స్పందించే అధికారులు, సిబ్బంది వుంటే ప్రజలకు ఓ భరోసా వుంటుంది. చెప్పింది వినే నాధుడు వుంటే సగం సమస్య తీరుతుందంటారు.
(16-05-2021)

15, మే 2021, శనివారం

2017 లో ఒక రోజు

 ఇలా కూడా జరుగుతుంది

పన్నెండు గంటలు కొట్టడానికి ఒక్క నిమిషం మాత్రమే వ్యవధి వుంది.

ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి సిద్ధమై వుంది.

నేను రెడీ’ అన్నాడాయన మేనల్లుడితో. మేనమామ అన్నమాటే ఆ పెద్దరికం ఎన్నడూ చూపించేవాడు కాదు. ఒక స్నేహితుడికంటే ఎక్కువ చనువు ఆయనతో.

పిల్లలు అమెరికాలో వుంటారు. న్యూ యియర్ బెల్స్ మోగుతుండగానే వాళ్ళు ఒకరి వెంబడి మరొకరు వీడియో కాల్స్ చేశారు. చేతిలో గ్లాసుతోనే వాళ్ళని గ్రీట్ చేసాడు. కాసేపు మాటలు, ముచ్చట్లు. అన్నీ విస్కీ సిప్ చేస్తూనే. చేస్తూనే కుర్చీలో ఓ పక్కకి ఒరిగిపోయాడు. ఏం జరిగిందో అందరికీ తెలిసేలోగానే జరగకూడనిది జరిగిపోయింది. పక్క పోర్షన్ లో ఉంటున్న డాక్టర్ వచ్చి చూసి చెప్పిన ఆ సంగతి విని ఇంటిల్లిపాదీ మ్రాన్పడి పోయారు.

అప్పటి దాకా అన్ని కబుర్లు చెప్పిన ఆ మనిషి ఇక లేరు. ‘నేను రెడీ’ అంటే అర్ధం ఇదా!

మొన్న రాత్రి విందు భోజనం సందర్భంలో ఆ మేనల్లుడు చెప్పిన కధనం ఇది.

Yes. Truth is stranger than fiction.

 

14, మే 2021, శుక్రవారం

నేరము శిక్ష పత్రికలు

 

ఇది జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం.
అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రియుడి ఉద్దేశ్యం వేరు. ఆడవాళ్ళను వాడుకుని వదిలేసే రకం.
ఈ విషయం భర్తకు తెలుస్తుంది. అధికార రీత్యా ప్రభుత్వం అతడికి సమకూర్చిన రివాల్వర్ తీసుకుని భార్యను లోబరుచుకున్న వ్యక్తి ఇంటికి వెడతాడు. నా భార్యను పెళ్లి చేసుకుని, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నేరుగా అడిగేస్తాడు. ‘నాతొ కాలక్షేపం చేసిన ప్రతి అమ్మాయిని పెళ్ళాడాలంటే నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవాలని అతడు ఎకసెక్కంగా మాట్లాడుతాడు. భర్తకు పట్టలేని ఆగ్రహం కలిగి పిస్టల్ తో కాలుస్తాడు. భార్య ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. అతడు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోతాడు. కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. జ్యూరీ అతడ్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. కానీ సెషన్స్ జడ్జి జ్యూరీ నిర్ణయాన్ని కాదని కేసును హై కోర్టుకు పంపుతాడు. అక్కడ అతడికి జీవిత ఖైదు విధిస్తారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధ్రువ పరుస్తుంది.
ఇక్కడ కధ మరో మలుపు తిరుగుతుంది.
ఇప్పుడు పేర్లూ వివరాలు చెప్పుకుందాం. అతడి పేరు నానావతి. నేవీ కమాండర్. స్నేహితుడి పేరు ప్రేమ్ ఆహూజా. బాగా డబ్బున్నవాడు. విలాసపురుషుడు.
కధలో మలుపుకు కారణం ఓ పత్రిక. ఒకానొక రోజుల్లో విపరీతమైన పాఠకాదరణ కలిగిన ఇంగ్లీష్ వారపత్రిక బ్లిట్జ్. ఆ పత్రిక ఎడిటర్ ఆర్కే కరంజియా.
ఆ పత్రిక ముద్దాయిని భుజాలకు ఎత్తుకుంటుంది. ధారావాహిక కధనాలు అతడికి మద్దతుగా ప్రచురిస్తుంది. దానితో ప్రజలందరూ ఆ కేసు గురించే మాట్టాడుకోవడం మొదలవుతుంది. పాతిక పైసల పత్రికను రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని చదివేవారు. నానావతి పేరుతొ పిల్లలు ఆడుకునే బొమ్మ పిస్తోల్లు, ఆహూజా పేరుతొ టీ షర్ట్లులు అమ్మడం మొదలైంది. నానావతికి నైతిక మద్దతు తెలుపుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా నానావతి కేసు ఓ సంచలనంగా మారుతుంది.
చివరికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష పెట్టి అతడి యావజ్జీవ శిక్షను రద్దు చేయడంతో కధ సుఖాంతమవుతుంది.
కేసు నుంచి బయట పడిన నానావతి తన కుటుంబాన్ని తీసుకుని కెనడా వెళ్లి అక్కడే సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో అతడి కధ ముగుస్తుంది.
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. బ్లిట్జ్ పత్రిక యజమాని, సంపాదకుడు ఆర్కే కరంజియా పార్సీ. ముద్దాయి నానావతి కూడా పార్సీ.
1959లో కాబోలు ఇది జరిగింది. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక వాళ్ళు దీన్ని ఓ సీరియల్ గా ప్రచురించేవారు. బ్లిట్జ్ పత్రిక ఏమి రాసిందో తెలియదు కానీ అంధ్రపత్రిక మాత్రం ఆసక్తికరమైన వార్తా కధనాలను వండి వార్చేది.
కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం మీద ఆ రోజుల్లో జనాలకు చాలా ఆసక్తి వుండేది. ప్రాసిక్యూషన్ తరపున రాం జెట్ మలానీ వాదిస్తే, ముద్దాయి నానావతి తరపున ఖండాలావాలా ఈ కేసు వాదించారు.
ఇరవై నాలుగు గంటల టీవీ చానళ్ళ కాలంలో జరిగివుంటే పండగే పండగ.
(14-05-2021)

ఈద్ ముబారక్!


పుట్టిన తేదీ అంటే అధికారికంగా పదో తరగతి పాసు సర్టిఫికేట్ లో వున్న తేదీనే. అంచేత ఆ సర్టిఫికేట్ కు అదనపు విలువ.
ఆ రోజుల్లో నేను చదువుకున్న ఖమ్మం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వుండేది. ఆ సర్టిఫికేట్ కోసం నేను మొదటిసారి హైదరాబాదు వచ్చాను.
హిమాయత్ నగర్ బస్ స్టాప్ లో బస్సెక్కితే సీదా యూనివర్సిటీకి వెడుతుంది అని మా చుట్టం ఒకాయన చెప్పిన మాట ప్రకారం సిటీ బస్సు ఎక్కాను, నాకు గుర్తు ఉన్నంత వరకు మూడో నెంబరు అనుకుంటా. ఒక స్టాపు దాటిన తర్వాత కండక్టర్ టికెట్ టికెట్ అంటూ వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఒక టికెట్ అంటే అతడు ఉర్దూలో నవ్వాడు. అంటే నవ్వుతూ ఉర్దూలో ఏదో అన్నాడు. నాకు అర్ధం కాలేదని తెలిసి, వచ్చే స్టాపులో దిగిపోయి ఎదురుగా వచ్చే ఇదే నెంబరు బస్సు ఎక్కమని చెప్పాడు. ఆ రోజుల్లో రోడ్ డివైడర్లు ఉండేవి కావు. బస్సు దిగి రోడ్డు అవతలకు వెళ్లి మళ్ళీ అదే నెంబరు బస్సు పట్టుకుని యూనివర్సిటీ చేరుకున్నాను. రోడ్డుకు రెండు వైపులా పచ్చని చెట్లు. ఎటు చూసినా పచ్చిక మైదానాలు. నున్నటి రహదారులు. అక్కడక్కడా వాటి నడుమ, చెట్ల చాటున కానవచ్చే భవనాలు. నా కళ్ళకు అది మరో నగరం మాదిరిగా అనిపించింది. ఖమ్మంలో నేను చదువుకున్న రికాబ్ బజార్ స్కూలు ఓ పెంకుటింట్లో వుండేది. అలాగే ఎస్సారార్ అండ్ బీజీఎన్నార్ కాలేజీ ఫుడ్ కార్పొరేషన్ రేకు గిడ్డంగులలో వుండేది. అక్కడ చదువుకున్న నాకు ఉస్మానియా వైభవం చూసి కళ్ళు తిరిగిపోయాయి.
వాళ్ళనీ వీళ్ళనీ అడిగి అడ్మినిస్ట్రేటివ్ భవనం చేరుకున్నాను. తల ఎత్తి చూస్తేనే కానీ ముఖ ద్వారం పైఅంచు కనబడేలా లేదు. ఎత్తైన మెట్ల వరుస మీదుగా వెడుతుంటే ఏదో రాజ భవనంలోకి వెడుతున్న అనుభూతి.
సంబంధించిన క్లర్క్ ను కలిసి వచ్చిన పని చెప్పాను. నేను అడిగే సర్టిఫికేట్ రెండేళ్ల పాతది. అప్పుడు కంప్యూటర్లు లేవు. పాత దస్త్రాలు తీసి వెతికి ఇవ్వాలి. కానీ ఆ గుమాస్తా, నేను బయట ఊరు నుంచి వచ్చానని అర్ధం చేసుకుని ఎంతో ఓపిగ్గా గాలించి ఆ దస్త్రం పట్టుకున్నాడు. సర్టిఫికేట్ చేతిలో పెట్టాడు. అతడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. చేతులు జోడించి షుక్రియా సాబ్ అన్నాను. అతడు నవ్వి, చలో భాయ్ చాయ్ తాగుదామని బయటకు తీసుకు వచ్చాడు. డబ్బులు అడుగుతాడేమో అనే సందేహం కలిగింది. కానీ అతడే పైసలు ఇచ్చి ఉస్మానియా బిస్కెట్లతో చాయ్ తాపించి, పాన్ తినిపించి భుజం మీద తట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమన్నాడు.
ఆ విధంగా ఇద్దరు (కండక్టర్, క్లర్క్) హైదరాబాదు ముస్లింలతో నా తొలి పరిచయం సుహృద్భావంగా జరిగింది.
ఆ తర్వాత నా వృత్తి జీవితమే హైదరాబాదుకు మారింది. ఇన్నేళ్ళలో ఎంతోమంది ముస్లిం స్నేహితులు. ఒకరా ఇద్దరా ఎంతోమంది స్నేహంలో ఉన్న మధురిమను నాకు చూపించారు.
వారందరికీ, ఫేస్ బుక్ లో పరిచయం అయిన ముస్లిం సోదరులు అందరికీ “ఈద్ ముబారక్”
(14-05-2021)

13, మే 2021, గురువారం

ఆవకాయ కారాల సీజన్

 

“కాయ రూపాయ్ అయ్ పొతే, ఆవకాయను పెట్టుటెలా!
కూరనార లేనిరోజున బడికి పిల్లల పంపుటెలా!”

అప్పుడెప్పుడో 1975లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రాసిన రోజువారీ వాక్టూన్లలో ఒక పంక్తి ఇది.

2018లో, కారణం తెలవదు, ఎప్పుడూ ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టే అలవాటు బొత్తిగా లేని నేను మొట్టమొదటిసారి ఆవకాయ కారాల కార్యక్రమంలో చేయి పెట్టడమే కాదు, యావత్తు బాధ్యతను నేనే నెత్తిన వేసుకున్నాను. ఏడాది తర్వాత మీకెట్టాగు తప్పదులే అనుకుందో ఏమో, మా ఆవిడ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తాను పక్కన కూర్చుని సూచనలు చేస్తుంటే నేను ఆ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాను. (వెనుకటి రోజుల్లో అంటే మాతండ్రి, తాతల కాలంలో మొగవాళ్ళే ఈ బాధ్యత నిర్వర్తించేవారని విన్నాను)
కారాలు కలుపుతున్న చేతులు కాబట్టి నేను ఫోటో తీయలేకపోయాను. ఫోటోలు అంటే ఇష్టపడదు కనుక తను తియ్యలేదు. ఏతావాతా జరిగింది ఏమిటంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఇంటి పనుల్లో మా ఆవిడకు సాయం చేశాను అనే దానికి ఒకే ఒక్క రుజువు అంటూ లేకుండా పోయింది. అది నిజంగా నా దురదృష్టం. అమూల్యమైన, అపురూపమైన ఇటువంటి జ్ఞాపకాలు మనసులోనే దాచుకోవాలని రాసిపెట్టి వుంటే ఏం చేస్తాము చెప్పండి.

ఇక ప్రస్తుతానికి వస్తే, మొన్నీమధ్య మా మేనల్లుడు కొమరగిరి రామచంద్రం భార్య శ్రీమతి కరుణ ఓ సీసాలో మామిడికాయ కారం పెట్టి పంపింది. ఆవిడ వంటలు, పిండి వంటల్లో అందెవేసిన చేయి. ‘బాగుంది! ఎలా పెట్టారని ఆరా తీస్తూ, రాసి పంపితే నలుగురికీ పనికి వస్తుందన్నాను. అదన్న మాట ఇది:

ఆవకాయ కారం ఎలా పెట్టాలి? – శ్రీమతి కొమరగిరి కరుణ
ఓ చిన్న కుటుంబానికి పాతిక కాయలు ఎక్కీతక్కీ.
చిన్న రసాలు కానీ, తెల్ల గులాబీ రకం కానీ తీసుకోవాలి.
ఇరవై అయిదు కాయల కారానికి కావాల్సినవి:
కిలో కారం, నాలుగు కిలోల పప్పు నూనె, ముప్పావు కేజీ ఆవపిండి, దంచిన ఉప్పు ముప్పావు కేజీ, మంచి శనగలు వంద గ్రాములు.
ముందుగా పచ్చి మామిడి కాయలను బకెట్ నీళ్ళలో వేసి బాగా కడిగి తడి లేకుండా తుడిచి వాటిని టెంకె ఉండేలాగా ముక్కలుగా కొట్టించుకోవాలి. తర్వాత మళ్ళీ వాటిని శుభ్రంగా తుడిచి, జీడి, పొర తీసివేయాలి.
తరువాత ఓ లీటరు వేడి నీళ్ళు మరగబెట్టి, చల్లార్చి వుంచుకోవాలి. ఒక బేసిన్ తీసుకుని ఆవపిండి మొత్తం వేసి చల్లారిన నీళ్ళతో ఆవపిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. (కొన్ని ప్రాంతాలలో నీళ్ళు కాకుండా ఏకంగా పప్పు నూనెతోనే ఆవపిండిని కలిపే ఆచారం వుంది)
ఎంత ఎక్కువసేపు కలిపితే అంత ఘాటు వస్తుంది. ఓ పది నిమిషాలు ఆగి, అందులో కారం, ఉప్పు కొద్దిగా తగ్గించి వేసి కలపాలి. ఒక లీటరు నూనెను, శనగలను ఆ మిశ్రమంలో వేసి కలపాలి. తడి లేకుండా తుడిచిన జాడీని దగ్గర పెట్టుకుని ముక్కలకు ఆ పిండి బాగా అంటేలా చూసుకుంటూ జాడీలో వేసుకోవాలి. జాడీ నిండిన తర్వాత ఆ మొత్తం పచ్చడిని చేతులతో అదిమి పెట్టాలి. జాడీ పైన తెల్లటి శుభ్రమైన వస్త్రంతో వాసిన కట్టాలి.
మూడు రోజులు అలా ఉంచేసి, పెద్ద బేసిన్ లో జాడీలోని మొత్తం ముక్కల కారాన్ని వేసి అందులో మిగిలిన నూనె మొత్తం వేసి బాగా కలపాలి. రుచి చూసి, ఉప్పు అవసరం అనుకుంటే కలపాలి. తర్వాత ఆవకాయ కారం మొత్తం జాడీలోకి ఎక్కించి మూత పెట్టి, ఏమాత్రం తడి తగలకుండా భద్రం చేసుకోవాలి.
రోజువారీ అవసరాలకోసం కొద్దికొద్దిగా జాడీ నుంచి తీసి చిన్న చిన్న గాజు సీసాల్లో వుంచుకోవాలి. వాటిని ఫ్రిజ్ లో ఉంచితే ఆవకాయ ఘాటు, రంగు కొన్ని నెలల పాటు అలాగే వుంటుంది.

వెల్లిపాయ కారం

కారానికి కూడా చిన్న రసాలు, కానీ తెల్ల గులాబీ రకం మామిడికాయలు కానీ బాగుంటాయి.

కావాల్సినవి:

మామిడికాయలు పాతిక, (ముక్కలు చేసి జీడి, పొర తీసి పొడిగా వుంచుకోవాలి), ఎర్ర కారం: ఒక కిలో, మెంతులు: పావు కేజీ, ఉప్పు: ముప్పావు కేజీ, ఆవపిండి: పావు కేజీ, ఎండలో వుంచి  పొట్టు వలిచిన వెల్లిపాయలు : అర కేజీ, పప్పు నూనె: మూడు కేజీలు

ముందుగా మెంతులను, నూనె లేకుండా ఎర్రగా వేయించు కోవాలి. కమ్మటి వాసన వస్తే బాగా వేగినట్టు గుర్తు. అవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. వెల్లిపాయల్లో కొంత అంటే ఓ చిన్నగ్లాసుడు విడిగా తీసి గ్రైండర్ లో వేసి నీళ్ళు కలపకుండా పేస్టుగా చేసుకోవాలి.

ఒక బేసిన్ తీసుకుని అందులో  కారం, మెంతి పిండి, ఆవ పిండి, వేసి కలపాలి. సిద్ధంగా ఉంచుకున్న ఉప్పులో సగం మాత్రమే ఈ మిశ్రమంలో కలపాలి. అందులో వెల్లుల్లి పేస్టుతో పాటు మిగిలిన వెల్లుల్లి రెబ్బలను వేసి, ఒక లీటరు నూనె వేసి కలపాలి. అందులో మామిడికాయ ముక్కల్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండి ముక్కలకు బాగా అంటేలా కలిపి జాడీలోకి తీసుకోవాలి. గట్టిగా అదిమిపెట్టి వుంచి తర్వాత ఆ జాడీకి తెల్లటి గుడ్డతో వాసెన కట్టాలి. మూడు రోజులు అలాగే వుంచి తర్వాత జాడీలోని  మొత్తం కారాన్ని ఓ బేసిన్ లోకి తీసుకుని తిరగ కలపాలి. కనపడకుండా జాడీలో నూనె నింపాలి. అప్పుడు ఉప్పు రుచి అవసరం అనుకుంటే వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకుని పచ్చడి కనపడకుండా నూనె నింపి వాసెన కట్టి భద్రపరచుకోవాలి.   

(ఇంకో రోజు మరో కారం గురించి)

ఓ కలెక్టర్ కధ!

 ఒకానొక కాలంలో జిల్లా మొత్తాన్ని తమ కనుసన్నల్లో శాసించే జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్ పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.

అలాటి కాలంలో, ఒకానొక జిల్లాలో, కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు. కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ గారి దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్ వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు. కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక తాసిల్దారు టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని సర్పంచు నుంచి ఓ అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది. అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు. అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.

ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు. కానీ ఆ గూడెం ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.

 

12, మే 2021, బుధవారం

మనసే ఒక న్యాయస్థానం

సైకిల్ పైనా, సిటీ బస్సుల్లోను తిరిగే ఏకాంబరానికి చిన్న ఉద్యోగం వచ్చింది. జనాలకు  యేవో చిన్న చిన్నపనులు చేసిపెట్టి చిన్నగా పోగేసిన డబ్బులతో  ఓ స్కూటరు కొనుక్కున్నాడు. అందులో సుఖం తెలిసివచ్చింది. ఆ హాయిని నిలుపుకోవడానికి కొంత అదనపు ఆదాయం కావాల్సి వచ్చింది. అందుకోసం అవకాశాలు వెతుక్కున్నాడు. ఆ అవకాశాల పేరే ఆమ్మామ్యా! అదే లంచం!

ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. కారు కొనుక్కున్నాడు. ఆ సుఖమయ జీవితాన్ని మరింత పదిలం చేసుకునేందుకుఅవకాశాలు’ పెంచుకున్నాడు.

జీతం పెరిగింది, జీవితమూ పెరిగింది. ‘అవకాశాలూ’ పెరిగాయి. దాంతో పట్టుబడే అవకాశాలు పెరిగాయి. పట్టుబడిపోతాననే భయమూ పెరిగింది. పట్టుబడకుండా ఏం చేయాలనే ఆలోచనలూ పెరిగాయి.

ఉద్యోగం ఒదిలేసాడు. కంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. లంచాలు తీసుకున్న చేతులతోనే లంచాలు మేపాడు. కోట్లకు పడగలెత్తాడు. అయినా పడగనీడన బతికే బతుకులో సుఖం లేదనిపించింది.

డబ్బు డబ్బు డబ్బు.  ఎటు చూసినా డబ్బు. ఏం  చేసుకోవాలో తెలియనంత డబ్బు.

సినిమాలు తీసాడు. అక్కడా డబ్బే పిల్లలు పెడుతూ పోయింది. సినిమాల్లో వేషాలు మొదలుపెట్టాడు. కను ముక్కు తీరు బాగా లేకపోయినా హస్త రేఖలు బాగున్నాయి కాబట్టి బాగా ఆడాయి. పెద్ద హీరో అయ్యాడు. పెద్ద పేరు తెచ్చుకున్నాడు.  ఎన్ని పేరు ప్రఖ్యాతులు వుంటే ఏం లాభం. ఎంతో ఖర్చు పెట్టి  ఏర్పాట్లు చేసుకున్న  ఓ అవుట్ డోర్ షూటింగ్ ఓ చిన్న పోలీసు అధికారి కారణంగా ఆగిపోయింది.

కిటుకు డబ్బులో లేదని తేలిపోయింది. అధికారంలో  వుందని అర్ధం అయింది. ఆ రక్షణ కవచం కావాలనుకున్నాడు. సంపాదించిన సొమ్మునే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ప్రవేశించాడు. అధికార పదవులు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ‘అవకాశాలు’ మరింత పెరిగాయి. జీవితంలో స్థాయి కూడా ఎంతో పెరిగింది. పట్టుపడతాననే భయం తగ్గిపోయింది. ఎందుకంటే పట్టుకునేవారే ఇప్పుడు తన గుప్పిట్లో వున్నారు.

అయినా సరే! ఏదో ఆందోళన! ఏదో భయం. ఇలా ఎన్నాళ్ళు ? పైకి చెప్పుకోలేడు.

ఒకప్పటి స్థాయిని గుర్తు తెచ్చుకోలేడు. ఇప్పుడున్న స్థాయిని వదులుకోలేడు.