10, మార్చి 2021, బుధవారం

Senior Journalist Bhandaru Srinivasa Rao Clarity On Vizag Steel Plant | ...

9, మార్చి 2021, మంగళవారం

Political snippets

ఇంతకీ ఏం జరిగింది”

“గతంలో తాను చెప్పిన వీడియో క్లిప్పింగ్ మరోసారి వేసుకోండని చెప్పి ప్రెస్  మీట్  ముగించి చక్కాపోయాడు”

 

"....పీకలేక పోయారు"

(రాయలేక చుక్కలు)

టీవీ చర్చల్లో ఇది 'అనుమతించబడిన' పద ప్రయోగం అయిపోయింది.

చింతించి వగచిన ఏమి ఫలము?

 

'పార్టీ ప్రయోజనాలు ప్రధానంకాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని నొక్కి చెబుతూవస్తున్నవారికి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అగ్ని పరీక్ష'

 

 

మహిళా దినోత్సవం ఒక్క రోజన్నా ఆడవారిపై వేధింపుల వార్తలు రాకుండా వుంటే బాగుండు’

దురాశ అని తెలిసీ ఆశ పడడం అంటే ఇదే కాబోలు!

 

 

'ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత రాష్ట్రం ప్రాంతాల వారీగా విడిపోయింది. ఎలాటి పోరాటం అవసరం లేకుండానే ప్రాంతాలు పార్టీల వారీగా విడిపోతున్నాయి.'

 

"ఎన్నికల్లో పోరాటానికి డాలూ, కత్తులూ, మనీ, మద్యం ఈ గోలంతా ఎందుకు? చడీచప్పుడు లేకుండా ప్రత్యర్ధి ఓటు తీయించేస్తే పోలా!"

 

డయల్ చేయగానే

మీకూ నాకూ మధ్య

'కరోనా'

 

8, మార్చి 2021, సోమవారం

అలనాటి రష్యాలో అతివల హవా!

 అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది.

సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతో, ఆమె తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు.

 

బొమ్మను చేసి, ప్రాణము పోసీ....భండారు శ్రీనివాసరావు

 

(మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని)

 

బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని, రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.

'అందం అరవై దోసిళ్ళు' అన్నది సరస్వతి.

అక్షరాలా అరవై దోసిళ్ళు అందం కొలిచి పోశాడు విధాత.

'సౌకుమార్యం పాతిక గుప్పిళ్ళు' అన్నది సరస్వతమ్మ.

'తధాస్తు' అన్నాడు బ్రహ్మలుంగారు.

'అమ్మతనం అరవై, ఆత్మబలం ఆరు, అహంకారం మరో ఆరు. వినయం అయిదు, అణకువ ఆరు, మేధస్సు ముప్పాతిక గుప్పిళ్ళు, మానసిక బలహీనతలు మరో ముప్పాతిక, శారీరకబలం కూరలో లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూ మరో చేత్తో ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.

బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటకగర్భురాణికే మతిపోయింది. ఇంత సౌందర్యం, ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.

భార్య కంగారు చూసి బ్రహ్మ తన బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు నవ్వాడు. నవ్వి చెప్పాడు.

"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే, సరే పోనీలే అనుకున్నాను. “ఎందుకంటావా? శారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అని చెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే, ఈ బొమ్మ బతుకూ అంతే. తెలివితేటలు, బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది. ఈ పుత్తడి బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం ఇదొక్కటే!'

 

(March, 8)

 

7, మార్చి 2021, ఆదివారం

ఏమి సేతురా లింగా - భండారు శ్రీనివాసరావు

 పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.

ఇన్ని ప్రపంచ  భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి  ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా కొంచెం కొంచెం తెలుగు  తెలిసిన   గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.

‘మీరు అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.

‘ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు  వస్తుంది. మీరు ఎన్నిసార్లు  ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని అప్పుడు మీరు  సరిగా అనువాదం చేస్తున్నారో లేదో మావాళ్ళు కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.

అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది.

అందుకా, ‘ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.

సరే! ఆ శకం ముగిసింది.

ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.

ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆదేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో  ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:

His Excellency the President of the Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”       

6, మార్చి 2021, శనివారం

నాది నాది అనుకున్నది నీది కాదురా! – భండారు శ్రీనివాసరావు

 

పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్ళు మారుస్తుందని అంటారు. మేము మా పిల్లలతో కలిసి ఏడిళ్ళకు పైగా మారి ఉంటాము. ఆఖరికి ఇళ్ళ సమస్య లేని మాస్కోలో కూడా రెండు ఫ్లాట్లు మారాము. మాస్కో వెళ్ళేటప్పటికే ఊలిత్స వావిలోవాలోని రేడియో మాస్కో భవనంలో మాకోసం డబల్ రూమ్ ఫ్లాటు సిద్ధంగా వుంచడం, దాంట్లో చేరిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపొరబాటు జరిగింది. దాన్ని అధికారులే గుర్తించి దిద్దుకున్నారు. పిల్లల సంఖ్యను బట్టి ఎన్ని పడక గదులు ఉండాలో నిర్ణయం అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మూడు పడక గదుల ఫ్లాటుకు వెంటనే మార్చారు. మంచాలు, పరుపులతో సహా సమస్తం అమర్చి పెట్టిన ఫ్లాట్ కాబట్టి ఆ అయిదేళ్ళు కాలుమీద కాలువేసుకుని కాలక్షేపం చేశాము.

1975 లో హైదరాబాదు రేడియోలో చేరినప్పుడు 75 రూపాయలకు అశోక్ నగర్ చమన్ దగ్గర ఒక వంటిల్లు, ఒక గదితో మా జీవనయానం మొదలయింది. అక్కడి నుంచి చిక్కడపల్లి సుధా హోటల్ దగ్గర మరో వాటాలో దిగాము. అక్కడే మా ఆవిడ ‘అమ్మ ఒడి ‘పేరుతొ ఒక చైల్డ్ కేర్ సెంటర్ మొదలు పెట్టింది. 1987 లో మాస్కో వెళ్ళేవరకు అదే ఇల్లు. తిరిగొచ్చిన తరువాత మకాం పంజాగుట్ట వైపు మారింది. దుర్గానగర్లో రెండిళ్ళు , తరువాత అమీర్ పేటలో మరో ఇల్లు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో కేటాయించిన ఎర్రమంజిల్ ఐ.ఏ.ఎస్. కాలనీకి మా మకాం మారింది. , సెకండ్ క్లాసు టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న అనుభూతితో అక్కడి క్వార్టర్ లో కొన్నేళ్ళు కాపురం. రిటైర్ కాగానే, తదుపరి ఎల్లారెడ్డి గూడా. ఇదిగో ఇప్పుడు మాధాపూర్. ఇలా మారుతూ, మారుతూ ఊరి చివరకు చేరుతామేమో తెలవదు. ఒకప్పుడు ఇంట్లో ఒంట్లో బాగా వున్నవాళ్ళు ఊరి నడిబొడ్డున వుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళూ ఊరి పొలిమేరలకు చేరి విల్లాలు కట్టుకుంటున్నారు. మా పక్కన పలానా పెద్దమనిషి వుంటున్నాడని మేమూ చెప్పుకునే రోజు వస్తుందేమో. ఇలా ఇళ్ళు మారడంలో ఓ సులువు కూడా వుంది. కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అదే కట్టుకున్న సొంత ఇల్లు అయితే, ఒండుకున్న అమ్మకు ఒకటే కూర సామెత చందం.

ఇలా  రోజులు  గడుపుతున్న రోజుల్లో  ఓ రోజున, మా ఇంటాయన, ఆయన ఢిల్లీలో ఉంటాడో, విశాఖపట్నంలో ఉంటాడో తెలియకుండానే ఈ ఇంట్లో దిగాము, తాలూకు ఒక పెద్ద మనిషి వచ్చి చల్లటి కబురు చెవులో వేసి వెళ్ళాడు, రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయమని.

మరి, ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దాటుతోంది కదా! అడక్క వారికీ తప్పదు, ఖాళీ చేయక మాకూ తప్పదు. అంతయు మన మేలునకే అనుకుంటే పోలా.

బాధ అల్లా ఒక్కటే. మిగిలిన చోట్లతో పోలిస్తే, ఈ మాదాపూర్ లో మానవ సంబంధాలు అంతంత మాత్రం. పావురాలు, మొక్కలతోనే అనుబంధం. దాన్ని తెంచుకోవడం ఎల్లా అన్నదే ఒక్క  మనాది.

కొసమెరుపు: భూమి గుండ్రం సామెత మాదిరిగా మళ్ళీ యెల్లారెడ్డి గూడాకే, అదే ఇంటికే మళ్ళీ చేరాం.

పదాలను ఎలా పలకాలి? – భండారు శ్రీనివాసరావు

 ఎలా పలికినా పర్వాలేదు అనుకునే టీవీ యాంఖర్లకు, ఎలా రాసినా ఏమీ కాదు అనుకునే పత్రికారచయితలకు ఏమాత్రం కొరత లేని ఈ రోజుల్లో Suneel Satti ఒక పెద్దమనిషి వ్యక్తుల, ప్రాంతాల పేర్లను ఎలా ఉచ్చరించాలి అని ఫేస్ బుక్ లో అనునిత్యం ప్రయత్నం చేస్తూనే వున్నారు కానీ అది అరణ్య రోదనేమో అనిపిస్తోంది. (ఫేస్ బుక్ లో ఎప్పుడు పోస్టింగ్ పెట్టినా ఆయన పేరు ఇంగ్లీష్ లోనే వుంటుంది. దాంతో ఆయన ఇంటి పేరును (SATTI ని ఎలా రాయాలో తెలియక అంటే, ‘సత్తి’ అనాలా, సట్టి’ అనాలా అనే అయోమయంలో పడి) అలాగే యధాతధంగా ఇంగ్లీష్ లోనే రాశాను. ఎందుకంటే సునీల్ గారు ఉచ్చారణను, స్పెల్లింగులను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అనేక పత్రికల్లో అనుదినం వచ్చే వార్తలలోని విదేశీ, స్వదేశీ వ్యక్తుల పేర్లను పత్రికల వాళ్ళు తెలిసీ తెలియక ఎలా భ్రస్టు పట్టిస్తున్నదీ సోదాహరణంగా వివరించడానికి, పాఠకులకు అవగాహన కలిగించడానికి సునీల్ గారు తీసుకుంటున్న శ్రమదమాదులు అభినందనీయం. అందుకే ఆయన అంటే నాకు అమిత గౌరవం.

వారు ఇస్తున్న కొన్ని ఉదాహరణలను చూస్తుంటే మనం ఇన్నాళ్ళ బట్టి ఇంత అజ్ఞానంతో పదాలను పలుకుతున్నామా, రాస్తున్నామా అనే భావన కలగడం తధ్యం.

ఆలిండియా రేడియోలో జాతీయ, అంతర్జాతీయ వార్తలు చదివే వారికి ఇటువంటి విషయాల్లో చక్కని అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగమే వుంది. ఎందుకంటే మన దేశాన్ని సందర్శించే విదేశీ ప్రముఖుల పేర్లను తప్పుగా ఉచ్చరించడం సరైన పద్దతి కాదు.

సునీల్ గారు రాస్తున్న విషయాలను పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు గమనంలో ఉంచుకోగలిగితే బాగుంటుంది.

తోక టపా:

(ఉచ్చారణలో ‘చ్చా’ కు వత్తు పెట్టి  మహబాగా ఉచ్చరించాం అనుకునేవారు కూడా వున్నారు. నిజానికి ఆ పదంలో ‘వత్తు’ లేదు. వత్తి వత్తి పలకక్కర లేదు, రాయక్కర లేదు)