5, డిసెంబర్ 2020, శనివారం

ఆ ఏడూ వాళ్ళవే – భండారు శ్రీనివాసరావు

 

2018 ఎన్నికలు. ఒక పక్క టీఆర్ఎస్. మరో పక్క మహాకూటమి. రాజకీయంగా ఉత్తర దక్షిణ ధృవాలయిన కాంగ్రెస్, టీడీపీ ఈ ఎన్నికల్లో చేతులు కలపడం ఓ విశేషం. ప్రచారాలు తారా స్థాయిలో సాగుతున్నాయి. ఫలితాలు గురించి అనేకరకాల ఊహాగానాలు.

కొందరు విలేకరులు ఒక పోలీసు ఉన్నతాధికారితో చిట్ చాట్ చేస్తున్నారు.

“మీ అంచనా ఏమిటి” ఓ విలేకరి ఆరా.

ప్రభుత్వ ఉద్యోగి. తెలిసిన సమాచారం అయినా, అలా బాహాటంగా ఎలా పంచుకుంటాడు? అదీ విలేకరులతో.
అందుకే చిన్నగా నవ్వాడు. నవ్వి చెప్పాడు.

“రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అవేవీ నేను చెప్పను కానీ, ఆన్ రికార్డ్ ఒక విషయం నిర్ధారణగా చెప్పగలను. పాత బస్తీలో ఆ ఏడు సీట్లు వాళ్ళవే”

అలాగే జరిగింది.
రెండేళ్ల గడిచాయి.

తాజాగా, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు గురించి వెలువడిన సర్వేలు అన్నీ మటాష్ అయ్యాయి. కాకపొతే, ఒక్క ఎం.ఐ.ఎం. పార్టీ గురించి ఆ సర్వేల్లో వచ్చిన ఫలితాలు మాత్రం వాస్తవ ఫలితాలకు దగ్గరగా వున్నాయి.

ఆ అధికారి చెప్పినట్టుగా, ఆ పార్టీ విజయావకాశాలు గురించి అంచనా వేయడానికి ఏ సర్వేలు అక్కరలేదేమో!
(05-12-2020)

3, డిసెంబర్ 2020, గురువారం

రజనీ రాజకీయ రంగప్రవేశం

రజనీ రంగప్రవేశం - భండారు శ్రీనివాసరావు

‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’ అంటుండే రజనీ కాంత్, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికి వెయ్యిసార్లు చెప్పిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అనేది గత మూడేళ్ళుగా ఆయన అభిమానుల్లో నలుగుతూ వస్తున్న సందేహం. రజనీ తన స్టైల్ లోనే ఒక్క ట్వీట్ తో దీన్ని పటాపంచలు చేశారు. ఈ నెల ముప్పయి ఒకటిన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని రజనీ వెల్లడించడం ఆయన అభిమానులకు ఒకరకంగా నూతన సంవత్సర కానుకే అవుతుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన అభిమాన గణం సంబరాలు చేసుకోవడం మొదలయింది కూడా.

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన దేశంలో తమిళనాడు రాజకీయాల తరహానే వేరు. అక్కడ అనేక సంవత్సరాలుగా రెండే రెండు, డి ఎం కె, ఏ ఐ డి ఎం కె అనే ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తోంది. రెంటికీ ఉమ్మడి పోలిక సినిమా రంగం నేపధ్యం. ఇక ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల పరిస్థితి నామమాత్రం. వనరులు కలిగిన పెద్ద పార్టీలు కాబట్టి ఏదో విధంగా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పంచనే కాలం వెళ్లదీస్తున్నాయి. కాకపొతే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ కేంద్రంలో అధికారం అనే ఒక కారణంతో ఆయా ప్రాంతీయ పార్టీల మీద కొద్దో గొప్పో పెత్తనం చెలాయించగలిగే పరిస్థితిలో వుండడం వాటికో ఊరట.

తమిళనాట సినీ ప్రభావం ఎక్కువ కావడం చేత చాలామంది సినీ హీరోలు తమ అదృష్టాన్ని రాజకీయ రంగంలో పరీ క్షించుకోవడం మొదలు పెట్టారు. ఈ జాబితా కూడా పెద్దదే. ఈ కారణం వల్ల కాబోలు ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య భారీగా వుంది. నిరుడు జరిగిన లోక సభ ఎన్నికలలోముప్పై మూడు పార్టీలు పోటీ చేసాయి. ఫలితాలు మాత్రం బాగా నిరాశ కలిగించాయి. అయినా కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే వున్నాయి. తమిళనాడు రాజకీయాలను క్రీగంట శాసించిన జయలలిత, కరుణానిధి ఇద్దరూ కాలం చెయ్యడం వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యత కూడా మరో కారణం.

రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను, వీరిద్దరూ జీవించి ఉండగానే ఎప్పుడో 2017లోనే రజనీ కాంత్ వ్యక్తం చేశారు. వారు మరణించి చాలాకాలం అవుతున్నా ఆ ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చకపోవడంతో, రాజకీయాల పట్ల రజనీకాంత్ అంత ఆసక్తిగా లేరని జనం అనుకునేవరకు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవి ముదిరి పాకానపడ్డప్పుడల్లా రజనీ మధ్య మధ్య ఏవో ప్రకటనలు చేస్తూ వాటికి తెర దించుతూ వచ్చారు. ఓ వారం క్రితం రజనీకాంత్ మరోసారి తన అభిమాన సంఘాల వారిని పిలిపించుకుని ఓ సమావేశం పెట్టడంతో ఈసారి ఖచ్చితమైన ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. కానీ షరా మామూలుగా కొత్త విషయం ఏమీ రజనీ నోటివెంట రాలేదు. దానితో మరోరకమైన వదంతులు వ్యాపించాయి. ఆయన తటపటాయింపుకు కారణం అనారోగ్య సమస్యలు కాదుకదా అనేంత వరకూ అవి సాగాయి. ఇక వీటికి అడ్డుకట్ట వేయడం అవసరం అనుకున్నారేమో, రజనీ కాంత్ హఠాత్తుగా ఈ ట్వీట్ దెబ్బతీశారు.

షెడ్యూలు ప్రకారం 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. జనవరిలో పార్టీ పేరు ప్రకటిస్తే అప్పటికి కేవలం అయిదు నెలల వ్యవధానం మాత్రమే వుంటుంది. ఈలోగా ఎన్నికల కమిషన్ లో పార్టీని రిజిస్టర్ చేయించుకోవడం, పార్టీ గుర్తును ఎంచుకుని దానికి అనుమతి తెచ్చుకోవడం మొదలయిన ముఖ్యమైన కార్యాలు నెరవేర్చుకోవాల్సి వుంటుంది. ఇవన్నీ ఒక పద్దతిగా చక్కబెట్టగల యంత్రాంగం కూడా అవసరం. వ్యవధి తక్కువ కావడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం వుంటుంది. ఒకవేళ పార్టీని ఈ ఎన్నికలలో విజయపథంలో నడిపించి అధికారంలోకి తీసుకురాగలిగితే, తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై నిలబెట్టిన ఒకనాటి ఎన్టీఆర్ రికార్డును అధిగమించినట్టు అవుతుంది.

రాజకీయ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క అభిమాన సంఘాల అభిమానం ఒక్కటే సరిపోదు. అభిమానులను కార్యకర్తలుగా రూపొందించుకోవాలి. పొతే, పెద్ద హీరోలు కొత్త పార్టీ పెట్టినప్పుడు వారికి ఎదురయ్యే పెద్ద సవాలుఏమిటంటే, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లేదా ఎవరినైనా కలుపుకు పోవాలా! అనే సందిగ్ధత. ఈ ప్రశ్నకు జవాబు అంత తేలికకాదు. అభిమానులు తమ హీరోని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. అంతేకానీ మరో పార్టీని అధికారంలోకి తేవడానికి వారు ఇచ్చగించరు.

అలాగే ఒక సాధారణ రాజకీయ నాయకుడు పార్టీ పెడితే గెలుపోటములు లెక్కలోకి రావు. కానీ కోట్లాది అభిమానులను కలిగిన ఓ సినీ హీరో అలా ఛాన్స్ తీసుకోవడం కష్టం. ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా ఆ హీరో పరిగణించకపోయినా, అతడి అభిమానులు అలా అనుకోరు. తేలిగ్గా తీసుకోరు. ఒక సినిమా ఆడకపోయినా పెద్ద హీరోలకు మరో సినిమా అవకాశం వస్తుంది కానీ, రాజకీయాల్లో ఈ లెక్కలు వేరుగా వుంటాయి.

సినీ రంగంలో రజనీ స్నేహితుడు తోటి సూపర్ స్టార్ కమల్ హసన్ ఈ విషయంలో ఒక అడుగు ముందే వున్నారు. కానీ, నిరుడు జరిగిన లోక సభ ఎన్నికల రణ క్షేత్రంలో ఆయన వేసిన తొలి అడుగే తడబడింది. ఆయన చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పైగా దారుణమైన నిరాశను కలిగించేవిగా వున్నాయి. పోటీ చేసిన స్థానాల్లో ఆయన నిలబెట్టిన అభ్యర్ధులకు ధరావత్తులు కూడా దక్కలేదు. అభ్యర్ధుల ఎన్నికల వ్యయ నిబంధనలకు లోబడి ఖర్చు చేయడం, ప్రత్యర్థి పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటివి తమ MNM పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పుకొస్తూ, ఈ ఓటమి వల్ల తాను ఏమీ చింతించడం లేదని, రాజకీయాల్లో నైతికవిలువలను కాపాడడమే ధ్యేయంగా పెట్టుకునే వారికి గెలుపు ఓటములు ప్రధానం కాదనీ వివరణ ఇచ్చుకున్నారు.

మరో రకంగా పరిశీలిస్తే కమల్ సాధించింది తక్కువేమీ కాదనిపిస్తుంది. కమల్ హసన్ పార్టీ మొత్తం 38 సీట్లలో 13
చోట్ల కమల్ హసన్ పార్టీ మూడో స్థానంలో వుంది. చెన్నై లో 10 శాతం ఓటు షేర్ తెచ్చుకుంది. పారిశ్రామిక వాడల్లో ఇది పదిహేను శాతం దాకా వుంది. ఆ ఎన్నికల్లో కమల్ పార్టీకి మొత్తంగా పదిహేను లక్షల ఓట్లు పోలయ్యాయి. పార్టీ స్థాపించిన పద్నాలుగు నెలల్లో ఈ స్థాయిలో ఓట్లు రావడం అంటే అసాధారణమే అని అన్నవాళ్లు కూడా వున్నారు.

2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం ముప్పయి మూడు పార్టీలు పోటీ పడ్డాయి. మూడు కూటములుగా ఏర్పడ్డాయి. ఏడు పార్టీలతో జయలలిత నాయకత్వంలోని ఏ ఐ డి ఎం కె కూటమి ఒకటి కాగా, కరుణానిధి నేతృత్వంలోని ఎనిమిది పార్టీల డి ఎం కె కూటమి రెండోది. ఏ ఐ డి ఎం కె కూటమిలోని పార్టీలు అన్నీ ఒకే గుర్తు, అంటే ఏ ఐ డి ఎం కె సింబల్ రెండు ఆకుల గుర్తుతోనే పోటీ చేయడం విశేషం. ఒక చిన్న స్థాయి ప్రాంతీయ పార్టీని కలుపుకుని బీజేపీ కూడా రంగంలో దిగింది. ఏ కూటమిలో కలవకుండా 10 ప్రాంతీయ పార్టీలు విడిగా పోటీ చేసాయి. ప్రధాన కూటముల నాయకులు జయలలిత, కరుణానిధికి ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు. 2016లో గెలిచి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన జయలలిత తీవ్రమైన అనారోగ్యం పాలయి డెబ్బయి అయిదు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి అదే ఏడాది డిసెంబరులో కన్నుమూసారు. ఆ ఎన్నికల్లో త్రుటిలో విజయావకాశాలను చేజార్చుకుని ఓటమి పాలయిన కరుణానిధి 2018లో వృద్ధాప్యంతో మరణించారు.

తమిళనాట మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు కులాలవారీగా రాజకీయ పార్టీలు వున్నాయి. వీటివల్ల ఓట్లలో చీలిక అనివార్యం.

మచ్చలేని మంచివాడనే గొప్ప పేరు రజనీ కాంత్ కు పుష్కలంగా వుంది. ఆ పేరుకు తగ్గట్టుగా అతి గొప్ప శ్రమ తోడయితేనే రజనీకాంత్ రాజకీయ ప్రయోగం విజయవంతమయే అవకాశాలు వుంటాయి.

ఏడు పదుల వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం సరయినదా కాదా అనేది మరి కొద్ది నెలల్లో తమిళనాడు ఓటర్లు నిర్ణయిస్తారు. (03-12-2020)





1, డిసెంబర్ 2020, మంగళవారం

హాయిగా, ఇంకెంతో....

 ఓటు వేయడానికి ఇంట్లో బయలుదేరివెళ్లి మళ్ళీ ఐదో నిమిషంలో ఇంట్లో వున్నాను.

ఇంత తేలిగ్గా, ఇంత హాయిగా, ఇంత త్వరగా ఓటు వేసిన సందర్భం ఇదే.

GHMC ఓటరు స్లిప్ ప్రకారం చూస్తే పోలింగు బూతు మా ఇంటికి దగ్గరలోనే వుంది. గూగుల్ మ్యాప్ ప్రకారం నడిచి వెడితే రెండు నిమిషాలు. ఈరోజు రోడ్డు కూడా ఖాళీగా వుంది. అంచేత ఇంకా త్వరగానే చేరుకున్నాను. 


వరుస నెంబరు 888  రూము నెంబరు  4. అంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్టుగా వాతావరణం. ఓటరు ఐ.డి. చూసి ఎడమ చేతి చూపుడు వేలు మీద పొడుగ్గా నామం దిద్ది సంతకం పెట్టించుకుని బ్యాలెట్ పత్రం చేతికి ఇచ్చారు. చాలా కాలం తర్వాత బ్యాలెట్ ఓటు కొత్తగా అనిపించింది.

ఓటు వేసి వస్తుంటే అక్కడ కుర్చీలో కూర్చున్న పోలీసు లేచి వచ్చి  నాతొ ఎందుకు చెప్పాడో తెలవదు. ‘అంతా బాగానే వుంది. మాకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టారు. ఇప్పుడే లంచ్ కూడా ఇచ్చారు. మాకయితే, పెద్ద పనిలేదు, ఇప్పటిదాకా అన్నాడు. కాస్త ఎక్కువ ఫీజులు వసూలు చేసే ఒక ప్రైవేటు  స్కూల్లో ఈ పోలింగు కేంద్రాన్ని ఇచ్చారు. ప్రతి గదిలో ఏసీలు, మంచి వసతిగా, చక్కగా వుంది. వెయిట్ చేయడానికి బయట  పెద్ద అందమైన షామియానా వేశారు. వెయిట్ చేసేవాళ్ళే లేరు.

తిరిగి వస్తుంటే దోవలో రోడ్డు పక్కన కుర్చీ బెంచీలు వేసుకుని ఓటరు స్లిప్పులు ఇచ్చే ఆయా  పార్టీల వాళ్ళు  ‘మన దగ్గరకు రాకుండానే ఓటేసి వెడుతున్నాడు’ అన్నట్టు ఓ చూపు చూసారు.

మొత్తం మీద నేను సైతం.......     

నోముల నరసింహయ్య ఇక లేరు

 

అసెంబ్లీ అనగానే గుర్తు వచ్చే పేరు నోముల నరసింహయ్య. ఆయన సభలో మాట్లాడుతుంటే ఆయన నోటి వెంట సామెతలు  అలవోకగా జారుతుండేవి. వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు చాలామంది మంచి వక్తలు కూడా అయివుండే అవకాశం ఎక్కువ. ఆ విధంగా నరసింహయ్య గారు మాట్లాడుతున్నారు అంటే  ప్రెస్ గేలరీలో విలేకరులు శ్రద్ధగా వినేవారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో వున్నప్పుడు, తర్వాత టీఆర్ఎస్ లో చేరిన పిదప కూడా ఆయనతో కలిసి అనేక సార్లు టీవీ చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. మనిషి నిరాడంబరంగా వుండేవారు. మాట కూడా అంతే!

కరోనాను జయించిన  మనిషి  గుండె పోటుకు గురయి మరణించడం విషాదం. ఆయనది మరీ పెద్ద వయసు కూడా కాదు.

రెండేళ్ల క్రితం టీ న్యూస్ చర్చలో నోముల నరసింహయ్య గారితో...  


 

30, నవంబర్ 2020, సోమవారం

కార్తీక దీపం – భండారు శ్రీనివాసరావు

 

“వచ్చిన వారు సీదా గుళ్ళోకి వెళ్ళకుండా ఇక్కడిక్కడే తిరుగుతుంటే అప్పుడే అనుకున్నా” అందావిడ ఏమనుకున్నదో నాతొ చెప్పకుండా, ఆవిడ ఏమనుకున్నదో మాత్రం నాకు తెలిసేలా.

ఇందిరా పార్కు దగ్గర వున్న శ్రీ విజయ గణపతి ఆలయంలో భక్తులు కిటకిట లాడడం లేదు, కానీ బాగానే వున్నారు. అందరూ  మాస్కులతోనే  కనిపించారు. గుడి ద్వారం దగ్గరే  ఒకావిడ కూర్చుని వచ్చిన వారి చేతులను    సానిటైజ్ చేస్తోంది. వెనక ప్రతి గుళ్ళో కాళ్ళు కడుక్కోవడానికి ఏర్పాట్లు ఉండేవి. ఇప్పుడు కరోనా పుణ్యాన చేతులు వాళ్ళే కడుగుతున్నారు. గుడి మూసివేసే సమయానికి వెళ్ళడం వల్ల కాబోలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించిన దీపాలతో చలి పక్కనే వున్న పార్కులోకి పారి పోయినట్టుంది. అక్కడ నన్ను ఆకర్షించింది ఒక పెద్ద సైజు బూడిద గుమ్మడి కాయ. నిజానికి అది గుమ్మడి కాయ కాదు. ఆ సైజులో వత్తులతో తయారుచేసిన కార్తీక దీపం. ఆ దీపాన్ని వెలిగించడానికి ముందు కొబ్బరి కాయ కొడుతున్న దంపతులను అడిగాను, ఇందులో ఎన్ని వత్తులు వుంటాయి అని. 



“వన్ కరోర్” అంది నిండా ముప్పయ్యేళ్లు కూడా లేని భార్య,  ఆ దీపం వెలిగించే ఏర్పాట్లలో పక్కకి వెడుతూ.

“కోటి వత్తులా!” ఆశ్చర్యపోవడం నా వంతయింది.

 పిల్లను ఎత్తుకుని ఉన్న అతడిని అడిగాను ఇది ఎంత ఖరీదు అని. 

“ I don’t know. You ask my wife” అన్నాడతను.

అదే ప్రశ్న ఆవిడను అడిగాను. దూరంగా ఒక ఆడ మనిషిని చూపించి అక్కడ అడగండి అంది. నేను ఆమె దగ్గరికి వెళ్లి అడిగాను ఖరీదు ఎంత. ఎక్కడ దొరుకుతుంది అని.

“మిమ్మల్ని చూసి అప్పుడే అనుకున్నాను” అని అప్పుడు అన్నమాట అదన్నమాట. నాలో ఉత్సుకతను కనుక్కుందని అర్ధం అయింది.

“మూడువేలు. మళ్ళీ పోయి అడగకండి. మొగుడికి వెయ్యి అనిచెప్పింది. నాకు మూడు వేలు ఇచ్చింది. మీకూ కావాలా! ఈ నెలంతా వీటికి బాగా డిమాండ్”

ఇందిరా పార్కు ప్రహరీకి ఆనుకుని వున్న గణపతి గుడి చిన్నదే అయినా చుట్టుపక్కల చాలా పెద్ద పేరుంది. అలాంటి గుడిలో భక్తులు, మాస్కులు కట్టుకుని ఈ కరోనా సమయంలో వెలిగిస్తున్న కార్తీక దీపాలు చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. 

నిన్న ఆదివారం మా ఏడో అక్కగారు తుర్లపాటి భారతీ దేవికి సహస్ర చంద్ర దర్శనం ఉత్సవ సందర్భంగా వేదోక్తంగా  కన్న సంతానం  కనకాభిషేకం చేశారు.  మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, విమల వదిన గార్లతో  కలిసి అక్కడికి  వెళ్లి తిరిగివస్తూ దోవలో  ఆ గుడికి వెళ్ళాము.

దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత మొదటిసారి దేవాలయ దర్శనం.  

‘కోటి వత్తులు ఎలా లెక్క పెడతారు?’

ఇంటికి తిరిగివస్తున్నంత సేపు నా మనసులో ఈ ప్రశ్న సుళ్ళు తిరుగుతూనే వుంది.

“నమ్మకం” అన్నాడు మా అన్నయ్య, నా ఆలోచన గ్రహించినట్టుగా. 

(30-11-2020)

మా భారతి అక్కయ్య - భండారు శ్రీనివాసరావు

 

పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.

రేడియో డ్యూటీ మీద బెజవాడ వెళ్ళినప్పుడు,   గాంధీ నగరం లోని వాళ్ళింట్లోనే వారాల తరబడి నా ఆల్ మకాం.

 పొద్దున్నే రేడియో స్టేషన్ కారు వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట. పక్కనే మా బావగారి పూజా రూము. అప్పటికే ఆమె  లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి  నాకు కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో  సంభాలించేది. 

ఈ  బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు. 

కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ పదానికి ఆమెకు అర్ధం తెలుసని అనుకోవడం లేదు. కానీ దానికి నిలువెత్తు నిదర్శనం మాత్రం  ఇదిగో ఈ కుర్చీలో కూర్చున్న మా అక్కయ్యే.







భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. 

దానికి గుర్తింపే ఇదిగో ఈ ఉత్సవం. ఈ పండగ. 

ఈ అదృష్టం ప్రతి తల్లికీ లభించాలంటే  రమేష్, సురేష్, పరేష్, సతీష్, రాజేష్ వంటి కుమారులు,  పద్మ, , స్వర్ణ , విజయలక్ష్మి,  సౌజన్య,  నీరజ వంటి కోడళ్ళు కావాలి. అదంత సులభం కాదు. 

ఈ శుభసందర్భంలో మా అక్కయ్యకు పాద నమస్కారాలు. అందరికీ అభినందనలు. పిల్లలకు ఆశీస్సులు.

నాకు సంబంధించి ఒక్కటే లోటు. మా ఆవిడ వున్నట్టయితే ఇదంతా చూసి ఆమె ఆనందానికి అవధులు వుండేవి కావు. (29-11-2020)

“హమే తుమ్సే ప్యార్ కిత్ నా......”

 నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ.

మా పెద్దవాడు సందీప్ పెళ్ళికి రాంచీ నుంచి ఆడపెళ్లి వాళ్ళు తరలివచ్చారు. రవిగారు, విజయ శ్రీనగర్ కాలనీలో తాము కొనుక్కున్న కొత్తఫ్లాటును వాళ్లకి బసగా ఇచ్చారు. శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది వచ్చారు.

1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు.

ఈ పెళ్ళికి అరుణ, శేఖర రెడ్డి దంపతులు మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును మా అధీనంలో ఉంచారు. అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు.

ఆరోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు.

బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన హనుమంతరావు బావ పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏక కాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా.

అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము.

అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది.

“హమే తుమ్సే ప్యార్ కిత్ నా......”

అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు.

ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటి) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

భావన, సందీప్ మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రియ, రాజేష్ లకు ముందస్తు శుభాశీస్సులు.

పైన రాసిన ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g