5, జులై 2020, ఆదివారం
అస్వతంత్రుడైన స్వతంత్రుడు శ్రీ రోశయ్య
1, జులై 2020, బుధవారం
మొన్న బాబు, నిన్న వై.ఎస్. నేడు మోడీ, రేపు జగన్ – భండారు శ్రీనివాసరావు
ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలు లేని రోజులు అవి. కంప్యూటర్ అంటే అదేదో మన దేశానికి సంబంధించిది కాదనుకునే రోజులు. ఆరోజుల్లో పెళ్ళీ పేరంటాళ్ళలో, విందులు వినోదాల్లో నలుగురు చుట్టపక్కాలు కలిసినప్పుడు ఎవరైనా పొరబాటున చంద్రబాబును పల్లెత్తు మాటన్నా ఎవరూ ఊరుకునేవారు కాదు, వెనకేసుకొచ్చేవారు. 2004 లో ఆయన (టీడీపీ) ఓడిపోయినప్పుడు మా కుటుంబంలోనే వనం గీత వంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టారు, ఆ పూట వంటలు వండుకోలేదు.
వై.ఎస్.ఆర్. రెండో మారు పూర్తికాలం
పరిపాలించి వుంటే జనం అలాంటి బాబును కూడా పూర్తిగా మరచిపోయేవారేమో అన్నవాళ్లు వున్నారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ఎంత
గగ్గోలు పెట్టినా ప్రజలు పెడచెవిన పెట్టారు. ఆయన ప్రారంభించిన 108, 104 ఆరోగ్య శ్రీ పధకాలు సామాన్య జనం దృష్టిలో ఆయన్ని చిరంజీవిని చేశాయి.
తరవాత మోడీ శకం. ఆయన గురించి కూడా సామాన్య జనంలో ఇదే భావన. ఆయన ఏది చెప్పినా ప్రజలు వింటూనే వున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు పడిన కష్టాలన్నీ పెద్ద మనసుతో పంటి బిగువన ఓర్చుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కరోనా కష్టాలు వచ్చే నవంబర్ దాకా తప్పవేమో అనే మోడీ మాటను స్వీకరించారు.
ఇక ఈరోజు విజయవాడలో 108, 104 వాహనాలు ఊరేగింపుగా వెడుతున్న దృశ్యాలు టీవీల్లో చూసిన వారికి కూడా అనిపించి వుంటుంది. రేపటి రోజులు జగన్ వే అని.
30, జూన్ 2020, మంగళవారం
వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు
చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి
కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు
ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.
త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి
(అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా
చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల
పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో
నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో
మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో
భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ
బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ
అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం
నాకీ క్రతువులో కనిపించింది.
నవ్వు మొహం చెదిరిపోయింది
నాకు ఎరుక తెలిసే వయసు వచ్చినప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. పైగా మా మేనత్త కూతురు. నాకంటే పదేళ్ళు పెద్ద. అయినా ఇంతవరకు ఆమె అసలు పేరు తెలియదు అంటే నమ్మశక్యం కాని విషయమే. మా చిన్నప్పటి నుంచీ ఆమెను చిట్టెత్తయ్య అనే పిలిచేవాళ్ళం వరస కాకపోయినా. ఈరోజు ఉదయం నల్గొండలో కొలిపాక రత్నావతి (82) మరణించారు అనే విషయం తెలిసినప్పుడు మా చుట్టాల్లో ఎవరో పోయారు అనుకున్నా కానీ ఆ చనిపోయింది మా మేనత్త కూతురు చిట్టెత్తయ్య అనే సంగతి చప్పున స్పురణకు రాలేదు.
గత అరవై ఏళ్ళుగా చూస్తూ వస్తున్నాను. నవ్వు మొహం లేకుండా ఏనాడూ ఆమె నాకు కనపడలేదు. నోరారా నవ్వడం, మనసారా ఆప్యాయంగా ఏరా బాగున్నావా అనడం ఆమె ట్రేడ్ మార్క్.
నిరుడు మా ఆవిడ చనిపోయినప్పుడు ఫోన్ చేసి పరామర్శించింది. గొంతులో ఎక్కడలేని దుఖం తన్నుకు వస్తున్నట్టు, బలవంతంగా ఆపుకుంటున్నట్టు అర్ధం అవుతున్నది. తర్వాత విషయం తెలిసి నిర్ఘాంతపోయాను. అప్పటికే ఆమె భర్త చనిపోయి మూడు రోజులు అవుతోంది. మా ఇంట్లో పరిస్తితి చూసి నాకు ఆ కబురు తెలపలేదు. ఒక పక్క భర్తను పోగొట్టుకుని మరో పక్క భార్య పోయిన నన్ను ఓదార్చిన ఆమె ఔన్నత్యానికి జోహార్లు.
వాళ్ళిద్దరిదీ ఆదర్శ దాంపత్యం. కొన్ని దశాబ్దాలపాటు సాగిన సంసారంలో నిరుడు మొట్ట మొదటి శరాఘాతం తగిలింది కొమర్రాజు మురళీధరరావు గారి ఆకస్మిక మరణం రూపంలో.
ఏడాది తిరగకుండానే మళ్ళీ ఈ కబురు. అదీ లాక్ డౌన్ కాలంలో.
ఆమెకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తూ, ఆ కుటుంబ సభ్యులు అందరికీ నా సానుభూతి.

(30-06-2020)
29, జూన్ 2020, సోమవారం
పీవీనా! మజాకా!
“పెళ్ళయి పదేళ్ళవుతున్నా, పెళ్ళానికి ఇంకా ఆమె పుట్టింటి పేరు మీదే ఉత్తరాలు వస్తున్నాయి అంటే, ఆ మొగుడు ఉత్త నస్మరంతి అన్నమాట అని భాష్యం చెప్పారు ముళ్ళపూడి వెంకట రమణ గారు. నస్మరంతి అనే పదానికి అర్ధం, ‘ఎవరూ తలచుకోనివాడు’ అని వారి తాత్పర్యం.
ఇప్పుడు దాన్ని మొబైల్ ఫోన్లకు వర్తింప చేయలేమో. రోజుకి ఒకసారన్నా తన ఉనికిని చాటుతూ సెల్లు మోగకుండా మూగనోము పట్టిందంటే దాని ఓనరు కూడా నస్మరంతి బాపతే అనుకోవాలి.
ఒకరకంగా సెల్ ఫోన్ కి సంబంధించి నేను ఇదే తరహా మనిషిని. రోజు మొత్తం మీద అయిదారు సార్లు మోగితే అదే ఘనం. అందులో కొన్ని మార్కెటింగు కాల్స్.
అలాంటిది, నిన్నా ఈరోజూ ఓ రెండు గంటల పాటు నేనే బలవంతంగా దాని నోరు కుట్టేయాల్సివచ్చింది అంటే నాకే ఆశ్చర్యంగా వుంది. దీనికి కారణం పీవీ గారు. ఆయన మీద నేను సాక్షిలో రాసిన వ్యాసం చదివిన వాళ్ళు పదేపదే అదేపనిగా ఫోన్లు చేస్తూ ఉండడంతో కాలకృత్యాల కోసం రెండు గంటలు సైలెన్స్ మోడ్ లో పెట్టాల్సి వచ్చింది. బహుశా నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టిన నాటి నుంచి అలా చేయడం ఇదే మొదటి సారి.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఫోన్లు చేసారు. పీవీ గారికి ఇంతమంది అభిమానులు వున్నారా అని ఆశ్చర్యపోతూ ఆనందించిన క్షణాలు ఎలా మరిచిపోగలను?
మచ్చుకి కొన్ని:
‘పీవీ గారికి మా వూళ్ళో శిలావిగ్రహం వేయాలని తీర్మానించాం. ఈరోజు నుంచే ఆ పనిలో ఉంటున్నాం’ – చామర్తి శ్రీధర్, వినుకొండ.
‘పీవీ గారు సీఎం గా వుండగా తీసుకొచ్చిన భూసంస్కరణల చట్టం గురించి అనకాపల్లిలో జడ్జిగా వున్నప్పుడు నేనిచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించాను. దానికోసం వెతుకుతున్నాను. దొరకగానే మీకు పంపుతాను” – నరసింహాచారి, హైదరాబాదు.
“ మా వూళ్ళో ఉంటున్న తెలుగు వాళ్ళం అందరం కలిసి ఈరోజు పీవీ గారి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం” – అవ్వలరాజు కామేశ్వర రావు, ఆస్ట్రేలియా.
“పీవీ గారు ప్రధానిగా వున్నప్పుడు బనగానపల్లికి వచ్చారు. అప్పుడు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ని. వారికి సప్లయి చేసిన నీళ్ళ బాటిల్ ని నేను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను” – చిన్న మద్దప్ప నాయుడు, రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్, ధోన్.
“కాశ్మీర్ లో ఎన్నికలు జరిపించి మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా చూడడం అన్నది ఒక్క పీవీగారికే సాధ్యం అయింది, ఏ నాయకుడూ ఆ సాహసం చేయలేకపోయారు” - డాక్టర్ ఎం. జైనుల్లావుద్దీన్, ఎడిటర్, విజ్ఞానసూచిక, నంద్యాల.
“వైజాగ్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ వ్యాసం గురించి చెప్పాడు. మనిషిని పంపించి పేపరు తెప్పించాను. చాలా బాగుంది. ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.
“నవోదయా స్కూల్స్. పీవీ గారి హయాములో మొదలయిన ఈ పధకం చాలా గొప్పది. ప్రతి గ్రామంలో నవోదయా స్కూళ్ళు పెట్టి వుంటే చదువు సంధ్యల నాణ్యత విషయంలో మనకు ప్రపంచంలో పోటీ వుండేది కాదు” – శ్రీమతి మణి ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, దిల్ సుఖ్ నగర్.
“కాకతాళీయం కావచ్చు. అంతకు ముందు రాత్రి మీ అన్నగారు రాసిన నమో నరసింహాయ పుస్తకం బాగా పొద్దు పోయేదాకా చదువుతూ పోయాను. పొద్దున్నే పీవీ గారినోట మీ అన్నగారి ప్రస్తావన వచ్చిన విషయం మీ వ్యాసంలో వుంది” – కే. లక్ష్మీనారాయణ, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్)
ఫోన్లో ఇన్ కమింగ్ కాల్స్ లెక్క పెట్టి చూస్తే ఇప్పటికి రెండు వందల నలభయ్ ఎనిమిది లెక్కతేలాయి. ఫోన్ ఎంగేజ్డ్ గా వుండడం వల్ల మరో పాతిక దాకా నేను రెస్పాండ్ కావాల్సిన కాల్స్ మిగిలి వున్నాయి. ఎస్సెమ్మెస్ లకు జవాబు ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు.
వీటన్నిటి బట్టి నాకు అర్ధం అయింది ఏమిటంటే పీవీ మరణించలేదు, జనం గుండెల్లో బతికే వున్నారని.
(29-06-2020)
28, జూన్ 2020, ఆదివారం
అచ్చమైన భారత రత్నం
26, జూన్ 2020, శుక్రవారం
కరోనా అంటే భయం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు
“నేలతో నీడ అన్నది నను తాకరాదని,
పగటితో రేయి అన్నది నను తాకరాదని,
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది,
నేడు భర్తనే తాకరాదనీ... ఒక భార్య
అన్నది”
(మంచి రోజులు వచ్చాయి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం)
కరోనా అంటే భయం ఎందుకు అంటే ఇందుకే. ఇది అన్ని రోగాలవంటిది కాదు. చావుకు దగ్గర చేసే జబ్బులు దీనికంటే అనేకం వున్నాయి. ఉదాహరణకు కేన్సర్. ఇది వచ్చిన వాళ్ళను శారీరకంగా, ఇంట్లో వారిని ఆర్ధికపరంగా చావగొడుతుంది.ఇల్లూవళ్ళూ గుల్ల చేస్తుంది. రోగి కోలుకునే అవకాశాలు తక్కువ. కుటుంబం చితికి పోవడం మాత్రం ఖాయం.
ఇంత భయంకరమైన రోగం అయినా కానీ కేన్సర్ వచ్చిందంటే సాటివాళ్ళు ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపుతారు. అయ్యో పాపం అనుకుంటారు. ఆసుపత్రిలో వుంటే వెళ్లి చూస్తారు. కర్మకాలి జరగరానిది ఏదైనా జరిగితే చుట్టపక్కాలు అందరూ అంతిమ సంస్కారాల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి చెబుతారు. స్వాంతన కలిగిస్తారు.
కానీ కరోనా అలా కాదే. శారీరకంగా అది పెట్టే బాధ అంత లెక్కలోనిది కాదు. కానీ మానసికంగా పెట్టే బాధకు లెక్కే లేదు. సొంత కుటుంబంలోని వాళ్ళే, బాగా దగ్గర వాళ్ళే దూరం అవుతారు. ‘ఎవరూ రారూ నీకోసం’ అంటూ ఏదో ఆసుపత్రిలో రేయింబవళ్ళూ ఒంటరిగా కుమిలిపోవాలి. చికిత్సకు లొంగి కరోనా అనే రోగం శరీరాన్ని వదిలినా దాని తాలూకు ‘అంటరానితనం’ అనే అవలక్షణం ఇంగువ కట్టిన గుడ్డలా అంత తేలిగ్గా వదలదు. అపార్ట్ మెంటు వాళ్ళు, కాలనీ వాళ్ళ చూపుల్లో తొంగిచూసే అనుమానం రోగిని సెల వేసినట్టు బాధ పడుతుంది. తానేమీ ఎయిడ్స్ రోగి కాదే! మరెందుకీ శిక్ష అనే బాధ మనసులో తొలుస్తుంటుంది. సొంత మనుషులు కూడా రోగం నయమై వచ్చిన రోగిని తాకడానికి సందేహిస్తున్నారు అనే కధనాలు వింటున్నప్పుడు ఈ బాధ ఎన్నాళ్ళో అనే బాధ ఎక్కువ అవుతుంది.
ఇక ఖర్మ కాలి కరోనాకు బలయితే ఇక ఆ కష్టాలు చెప్పతరం కాదు. అయినవాళ్ళు రాలేరు. చితికి నిప్పు పెట్టాల్సిన వాళ్ళు కూడా రాలేని పరిస్తితి. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అనిపించే మరణం. దిక్కుమాలిన చావు అంటారే అది.
ప్రజల్ని మరింత భీతావహుల్ని చేసేందుకు ఇదంతా రాయడం లేదు. ఈ రోగం పట్ల సమాజంలో ఆవరించివున్న అనుమానాలను తొలగించకపోతే పరిస్తితి నిజంగా ఇలాగే తయారవుతుంది.
ఇదొక కొత్త జబ్బు. ఎవరికీ దీని గురించి పూర్తిగా తెలియదు. మిడిమిడిజ్ఞానంతో చెప్పే కబుర్లు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఈ విషయంలో సమాజాన్ని, ప్రజలను జాగృతం చేయాల్సిన మాధ్యమాలు రాజకీయాలు అనే కరోనాను మించిన రోగంతో కునారిల్లుతున్నాయి. నిన్ననే అనుకుంటా మురళీకృష్ణ గారు ఫోన్ చేశారు, మీడియా ద్వారా ఏమైనా చేయొచ్చా అని. దావానలంలా వ్యాపిస్తున్న కరోనా అని రాస్తే టీఆర్పీ రేటింగులు పెరుగుతాయేమో కాని, సామాజిక బాధ్యత తీసుకుని ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయగల తీరిక వున్నవాళ్ళు కలికానికి కూడా కానరావడం లేదంటే నిజంగా బాధపడాల్సిన, కాదు కాదు, సిగ్గుపడాల్సిన విషయమే.
ఈ జబ్బుకు ఈ స్థాయిలో సాంఘిక బహిష్కరణ అవసరమా కాదా అన్నది సరయిన వైద్య నిపుణుల ద్వారా సేకరించి ప్రజలను చైతన్యం చేయకపోతే ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో!
కింది ఫోటో మిత్రుడు జగన్ మోహన్ పోస్ట్ చేసారు. ఒక కరోనా రోగికి ఓ స్టార్ హాస్పిటల్ లో వేసిన బిల్లు. అక్షరాలా మూడు లక్షల నలభయ్ వేల రూపాయలు. నిజానికి హోం క్వారంటైన్ లో ఈ చికిత్స తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న అపార్ట్ మెంట్లలో నివసించేవారి పరిస్తితి ఏమిటి? రోగం వచ్చిందని తెలియగానే ముందు ఇల్లు ఖాళీ చేయాలనే వొత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో పెద్ద సంఖ్యలో రోగులకు వసతి కల్పించడం కూడా అసాధ్యమే. అందరూ స్టార్ ఆస్పత్రుల ఖర్చు భరించలేరు.
కిం కర్తవ్యమ్?
