1, జులై 2020, బుధవారం

మొన్న బాబు, నిన్న వై.ఎస్. నేడు మోడీ, రేపు జగన్ – భండారు శ్రీనివాసరావు

ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలు లేని రోజులు అవి. కంప్యూటర్ అంటే అదేదో మన దేశానికి సంబంధించిది కాదనుకునే రోజులు. ఆరోజుల్లో పెళ్ళీ పేరంటాళ్ళలో, విందులు వినోదాల్లో నలుగురు చుట్టపక్కాలు కలిసినప్పుడు ఎవరైనా పొరబాటున చంద్రబాబును పల్లెత్తు మాటన్నా ఎవరూ ఊరుకునేవారు కాదు, వెనకేసుకొచ్చేవారు. 2004 లో ఆయన (టీడీపీ) ఓడిపోయినప్పుడు మా కుటుంబంలోనే వనం గీత వంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టారు, ఆ పూట వంటలు వండుకోలేదు.

వై.ఎస్.ఆర్. రెండో మారు పూర్తికాలం పరిపాలించి వుంటే జనం అలాంటి బాబును కూడా  పూర్తిగా మరచిపోయేవారేమో అన్నవాళ్లు  వున్నారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు పెడచెవిన పెట్టారు. ఆయన ప్రారంభించిన 108, 104 ఆరోగ్య శ్రీ పధకాలు సామాన్య జనం దృష్టిలో ఆయన్ని చిరంజీవిని చేశాయి.

తరవాత మోడీ శకం. ఆయన గురించి కూడా సామాన్య జనంలో ఇదే భావన. ఆయన ఏది చెప్పినా ప్రజలు వింటూనే వున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు పడిన కష్టాలన్నీ పెద్ద మనసుతో పంటి బిగువన ఓర్చుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కరోనా కష్టాలు వచ్చే నవంబర్ దాకా తప్పవేమో అనే మోడీ మాటను స్వీకరించారు.

ఇక ఈరోజు విజయవాడలో 108, 104 వాహనాలు ఊరేగింపుగా వెడుతున్న దృశ్యాలు టీవీల్లో చూసిన వారికి కూడా అనిపించి వుంటుంది. రేపటి రోజులు జగన్ వే అని.       


30, జూన్ 2020, మంగళవారం

వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు

చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.
త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం నాకీ క్రతువులో కనిపించింది.

నవ్వు మొహం చెదిరిపోయింది

 

నాకు ఎరుక తెలిసే వయసు వచ్చినప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. పైగా మా మేనత్త కూతురు. నాకంటే పదేళ్ళు పెద్ద. అయినా ఇంతవరకు ఆమె అసలు  పేరు తెలియదు అంటే నమ్మశక్యం కాని విషయమే. మా చిన్నప్పటి నుంచీ ఆమెను చిట్టెత్తయ్య అనే పిలిచేవాళ్ళం వరస కాకపోయినా. ఈరోజు ఉదయం నల్గొండలో  కొలిపాక రత్నావతి (82) మరణించారు అనే విషయం తెలిసినప్పుడు మా చుట్టాల్లో ఎవరో పోయారు అనుకున్నా కానీ ఆ చనిపోయింది మా మేనత్త కూతురు  చిట్టెత్తయ్య అనే సంగతి చప్పున స్పురణకు  రాలేదు.

గత అరవై ఏళ్ళుగా చూస్తూ వస్తున్నాను. నవ్వు మొహం లేకుండా ఏనాడూ ఆమె నాకు  కనపడలేదు. నోరారా నవ్వడం, మనసారా ఆప్యాయంగా ఏరా బాగున్నావా అనడం ఆమె ట్రేడ్ మార్క్.

నిరుడు మా ఆవిడ చనిపోయినప్పుడు ఫోన్ చేసి పరామర్శించింది. గొంతులో ఎక్కడలేని దుఖం తన్నుకు వస్తున్నట్టు, బలవంతంగా ఆపుకుంటున్నట్టు అర్ధం అవుతున్నది. తర్వాత విషయం తెలిసి నిర్ఘాంతపోయాను. అప్పటికే ఆమె భర్త చనిపోయి మూడు రోజులు అవుతోంది. మా ఇంట్లో పరిస్తితి చూసి నాకు ఆ కబురు తెలపలేదు. ఒక పక్క భర్తను పోగొట్టుకుని మరో పక్క భార్య పోయిన నన్ను ఓదార్చిన ఆమె ఔన్నత్యానికి జోహార్లు.

వాళ్ళిద్దరిదీ ఆదర్శ దాంపత్యం. కొన్ని దశాబ్దాలపాటు సాగిన సంసారంలో నిరుడు మొట్ట మొదటి శరాఘాతం తగిలింది కొమర్రాజు మురళీధరరావు గారి ఆకస్మిక మరణం రూపంలో.

ఏడాది తిరగకుండానే మళ్ళీ ఈ కబురు. అదీ లాక్ డౌన్ కాలంలో.

ఆమెకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తూ, ఆ కుటుంబ సభ్యులు అందరికీ నా సానుభూతి.

Image may contain: Prema Prasad, outdoor, text that says 'శివైక్యం చేందినారు'

(30-06-2020)    


29, జూన్ 2020, సోమవారం

పీవీనా! మజాకా!

“పెళ్ళయి పదేళ్ళవుతున్నా, పెళ్ళానికి ఇంకా ఆమె పుట్టింటి పేరు మీదే ఉత్తరాలు వస్తున్నాయి అంటే, ఆ మొగుడు ఉత్త నస్మరంతి అన్నమాట అని భాష్యం చెప్పారు ముళ్ళపూడి వెంకట రమణ గారు. నస్మరంతి అనే పదానికి  అర్ధం, ‘ఎవరూ  తలచుకోనివాడు’ అని వారి తాత్పర్యం.

ఇప్పుడు దాన్ని మొబైల్ ఫోన్లకు వర్తింప చేయలేమో. రోజుకి ఒకసారన్నా తన ఉనికిని చాటుతూ సెల్లు మోగకుండా మూగనోము పట్టిందంటే దాని ఓనరు కూడా నస్మరంతి బాపతే అనుకోవాలి.

ఒకరకంగా సెల్ ఫోన్ కి సంబంధించి నేను ఇదే తరహా మనిషిని. రోజు మొత్తం మీద అయిదారు సార్లు మోగితే అదే ఘనం. అందులో కొన్ని మార్కెటింగు కాల్స్.

అలాంటిది, నిన్నా ఈరోజూ ఓ రెండు గంటల పాటు నేనే బలవంతంగా దాని నోరు కుట్టేయాల్సివచ్చింది అంటే నాకే ఆశ్చర్యంగా వుంది. దీనికి కారణం పీవీ గారు. ఆయన మీద నేను సాక్షిలో రాసిన వ్యాసం చదివిన వాళ్ళు పదేపదే అదేపనిగా ఫోన్లు చేస్తూ ఉండడంతో కాలకృత్యాల కోసం రెండు గంటలు సైలెన్స్ మోడ్ లో పెట్టాల్సి వచ్చింది. బహుశా నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టిన నాటి నుంచి అలా చేయడం ఇదే మొదటి సారి.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఫోన్లు చేసారు. పీవీ గారికి ఇంతమంది అభిమానులు వున్నారా అని ఆశ్చర్యపోతూ ఆనందించిన క్షణాలు ఎలా మరిచిపోగలను?

మచ్చుకి కొన్ని:

‘పీవీ గారికి మా వూళ్ళో శిలావిగ్రహం వేయాలని తీర్మానించాం. ఈరోజు నుంచే ఆ పనిలో ఉంటున్నాం’ – చామర్తి శ్రీధర్, వినుకొండ.

‘పీవీ గారు సీఎం గా వుండగా తీసుకొచ్చిన భూసంస్కరణల చట్టం గురించి అనకాపల్లిలో జడ్జిగా వున్నప్పుడు నేనిచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించాను. దానికోసం వెతుకుతున్నాను. దొరకగానే మీకు పంపుతాను” – నరసింహాచారి, హైదరాబాదు.

“ మా వూళ్ళో ఉంటున్న తెలుగు వాళ్ళం అందరం కలిసి ఈరోజు పీవీ గారి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం” – అవ్వలరాజు కామేశ్వర రావు, ఆస్ట్రేలియా.

“పీవీ గారు ప్రధానిగా వున్నప్పుడు బనగానపల్లికి వచ్చారు. అప్పుడు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ని. వారికి సప్లయి చేసిన నీళ్ళ బాటిల్ ని నేను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను” – చిన్న మద్దప్ప నాయుడు, రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్, ధోన్.

“కాశ్మీర్ లో ఎన్నికలు జరిపించి మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా చూడడం అన్నది ఒక్క పీవీగారికే సాధ్యం అయింది, ఏ నాయకుడూ ఆ సాహసం చేయలేకపోయారు” - డాక్టర్ ఎం. జైనుల్లావుద్దీన్, ఎడిటర్, విజ్ఞానసూచిక, నంద్యాల.  

“వైజాగ్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ వ్యాసం గురించి చెప్పాడు. మనిషిని పంపించి పేపరు తెప్పించాను. చాలా బాగుంది. ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.   

“నవోదయా స్కూల్స్. పీవీ గారి హయాములో మొదలయిన ఈ పధకం చాలా గొప్పది. ప్రతి గ్రామంలో నవోదయా స్కూళ్ళు పెట్టి వుంటే చదువు సంధ్యల నాణ్యత విషయంలో మనకు ప్రపంచంలో పోటీ వుండేది కాదు” – శ్రీమతి మణి ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, దిల్ సుఖ్ నగర్.  

 “కాకతాళీయం కావచ్చు. అంతకు ముందు రాత్రి మీ అన్నగారు రాసిన నమో నరసింహాయ పుస్తకం బాగా పొద్దు పోయేదాకా చదువుతూ పోయాను. పొద్దున్నే పీవీ గారినోట మీ అన్నగారి ప్రస్తావన వచ్చిన విషయం మీ వ్యాసంలో వుంది” – కే. లక్ష్మీనారాయణ, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్)  

ఫోన్లో ఇన్ కమింగ్ కాల్స్ లెక్క పెట్టి చూస్తే ఇప్పటికి రెండు వందల నలభయ్ ఎనిమిది లెక్కతేలాయి. ఫోన్ ఎంగేజ్డ్ గా వుండడం వల్ల మరో పాతిక దాకా నేను రెస్పాండ్ కావాల్సిన కాల్స్ మిగిలి వున్నాయి. ఎస్సెమ్మెస్ లకు జవాబు ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు.

వీటన్నిటి బట్టి నాకు అర్ధం అయింది ఏమిటంటే పీవీ మరణించలేదు, జనం గుండెల్లో బతికే వున్నారని.

(29-06-2020)



(భార్య శ్రీమతి సత్యమ్మ గారితో పీవీ గారు)




28, జూన్ 2020, ఆదివారం

అచ్చమైన భారత రత్నం




(జూన్ 28 న  పీవీ శతజయంతి ఉత్సవాలు మొదలవుతున్న సందర్భంగా సాక్షి దినపత్రిక ప్రచురించిన నా వ్యాసం)

ఈరోజు అంటే జూన్ ఇరవై ఎనిమిది మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు జయంతి. ఇప్పటినుంచి  మొదలు పెట్టి ఒక ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ముదావహం. 
అత్యంత అదృష్టవంతుడు, బహు దురదృష్టవంతుడు అయిన  రాజకీయనాయకుడు ఎవరయ్యా అంటే చప్పున తట్టే పేరు  పీవీ నరసింహారావు.
ఆయన  ప్రధానిగా వున్నంతకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు.
పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన
సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా
వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై వుంచిన
‘అపర చాణక్యుడ’ని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయి, పదవి
నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయన్ని  తెగడడం
ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం
కాగానే వాళ్ళూ దూరం జరిగారు. పోనీ  ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన
వ్యక్తి సీతారాం కేసరికి పీవీని  మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ
‘పదవే’ సర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  ‘కేసరి భజనే’ సర్వస్వమయిపోయింది.
మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి మొదలుపెట్టిన కాంగ్రెస్  పార్టీ
‘పత్తిత్తులకు’ ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు.

అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన
‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’
నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ
తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’  మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాములో
జరిగిన తప్పులనో, పొరబాట్లనో  సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు.
రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’  అనే పదాలకి  తావు లేకుండా పోయిందన్న
విషయాన్ని విశదం చేయడానికే ఈ వివరణ. గాంధీ, నెహ్రూల కుటుంబానికి చెందని ఒక కాంగ్రెస్ నాయకుడు  భారత ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో, మేధస్సుతో పూర్తికాలం అయిదేళ్ళు నడపడమే కాదు, అప్పటికే ఆర్ధికంగా కునారిల్లుతున్న దేశాన్ని ఒడ్డున పడేసిన కృతజ్ఞత కూడా ఆయనకు తన సొంత పార్టీ నుంచి లభించలేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీలో కృతజ్ఞతకు వున్న స్థానం. ఇదీ ఆ పార్టీలో విధేయతకు లభించే ప్రాధాన్యం. 
ఒక సాధారణ నాయకుడు చనిపోయినా అతడి పార్దివదేహాన్ని  పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు దర్శించి  కడపటి వీడ్కోలు ఇచ్చేందుకు వీలుగా పార్టీ ఆఫీసులో కొంత సేపు వుంచడం అనేది అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పట్ల ఆ మాత్రం కనీస మర్యాద చూపాలన్న సోయికూడా  లేకుండాపోయింది.      


పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ప్రతి ఏటా  బేగంపేటలోని
ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు.
ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి
దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన
హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...'
అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు
అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో  అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా వుండిపోయింది.
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని
హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ
దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన
చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ
మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు.
ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
మాజీ ప్రధానిగా పీవీ  రాజభవన్ లో వున్నప్పుడు, నేనూ , ఆకాశవాణిలో నా
సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం
వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత,  రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా
తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు
మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము.  ‘పీవీ
గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాదికారిని  అడిగాము.
అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే
లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని
టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న
ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను
మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య
పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది.
ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు,
రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు
ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు  ముఖ్యమంత్రిగా
ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం
ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ
పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు
‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది,  కొన్నేళ్ళ
క్రితంవరకు దేశాన్ని వొంటిచేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం
వల్ల  కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య
గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి
ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా
తాజాగానే వుంది.
మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో
మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత
ఉచ్ఛస్థానంలో వున్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా
నీరవ నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి
వీలుంటుందా' అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది
చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు.
ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు
ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో
భావాలు ఏమీ తెలియకుండా.
‘మాస్కో ఎందుకయ్యా! వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం.
పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా
మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు
ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
కనీసం ఆయన శతజయంతి సంవత్సరంలో అయినా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారత రత్న ప్రకటిస్తే, ఆ అత్యున్నత పురస్కారానికే శోభస్కరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా  ఆ మహనీయుడికి జాతి యావత్తూ కృతజ్ఞత తెలిపినట్టవుతుంది కూడా.     

26, జూన్ 2020, శుక్రవారం

కరోనా అంటే భయం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు

 

“నేలతో నీడ అన్నది నను తాకరాదని,

పగటితో రేయి అన్నది నను తాకరాదని,

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది,

నేడు భర్తనే తాకరాదనీ... ఒక భార్య అన్నది”

(మంచి రోజులు వచ్చాయి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం)

కరోనా అంటే భయం ఎందుకు అంటే ఇందుకే.  ఇది అన్ని రోగాలవంటిది కాదు. చావుకు దగ్గర చేసే జబ్బులు దీనికంటే అనేకం వున్నాయి. ఉదాహరణకు కేన్సర్. ఇది వచ్చిన వాళ్ళను శారీరకంగా, ఇంట్లో వారిని ఆర్ధికపరంగా చావగొడుతుంది.ఇల్లూవళ్ళూ గుల్ల చేస్తుంది. రోగి కోలుకునే అవకాశాలు తక్కువ. కుటుంబం చితికి పోవడం మాత్రం ఖాయం.

ఇంత భయంకరమైన రోగం అయినా కానీ కేన్సర్ వచ్చిందంటే సాటివాళ్ళు ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపుతారు. అయ్యో పాపం అనుకుంటారు.  ఆసుపత్రిలో వుంటే వెళ్లి చూస్తారు. కర్మకాలి జరగరానిది ఏదైనా జరిగితే చుట్టపక్కాలు అందరూ అంతిమ సంస్కారాల్లో పాల్గొని  కుటుంబ సభ్యులకు సానుభూతి చెబుతారు. స్వాంతన కలిగిస్తారు.

కానీ కరోనా అలా కాదే.  శారీరకంగా అది పెట్టే బాధ అంత లెక్కలోనిది కాదు. కానీ మానసికంగా పెట్టే బాధకు లెక్కే లేదు. సొంత కుటుంబంలోని వాళ్ళే, బాగా  దగ్గర వాళ్ళే దూరం అవుతారు. ‘ఎవరూ రారూ నీకోసం’ అంటూ ఏదో ఆసుపత్రిలో రేయింబవళ్ళూ ఒంటరిగా కుమిలిపోవాలి. చికిత్సకు లొంగి కరోనా అనే రోగం శరీరాన్ని వదిలినా దాని తాలూకు ‘అంటరానితనం’ అనే అవలక్షణం ఇంగువ కట్టిన గుడ్డలా అంత తేలిగ్గా వదలదు. అపార్ట్ మెంటు వాళ్ళు, కాలనీ వాళ్ళ చూపుల్లో తొంగిచూసే అనుమానం రోగిని సెల వేసినట్టు బాధ పడుతుంది. తానేమీ ఎయిడ్స్ రోగి కాదే! మరెందుకీ శిక్ష అనే బాధ మనసులో తొలుస్తుంటుంది. సొంత మనుషులు కూడా రోగం నయమై వచ్చిన రోగిని తాకడానికి సందేహిస్తున్నారు అనే కధనాలు వింటున్నప్పుడు ఈ బాధ ఎన్నాళ్ళో అనే బాధ ఎక్కువ అవుతుంది.

ఇక ఖర్మ కాలి కరోనాకు బలయితే ఇక ఆ కష్టాలు చెప్పతరం కాదు. అయినవాళ్ళు రాలేరు. చితికి నిప్పు పెట్టాల్సిన వాళ్ళు కూడా రాలేని పరిస్తితి. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అనిపించే మరణం. దిక్కుమాలిన చావు అంటారే అది.

ప్రజల్ని మరింత భీతావహుల్ని చేసేందుకు ఇదంతా రాయడం లేదు. ఈ రోగం పట్ల సమాజంలో ఆవరించివున్న అనుమానాలను తొలగించకపోతే పరిస్తితి నిజంగా ఇలాగే తయారవుతుంది.

ఇదొక కొత్త జబ్బు. ఎవరికీ దీని గురించి పూర్తిగా తెలియదు. మిడిమిడిజ్ఞానంతో చెప్పే కబుర్లు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఈ విషయంలో సమాజాన్ని, ప్రజలను జాగృతం చేయాల్సిన మాధ్యమాలు రాజకీయాలు అనే కరోనాను మించిన రోగంతో కునారిల్లుతున్నాయి. నిన్ననే అనుకుంటా మురళీకృష్ణ గారు ఫోన్ చేశారు, మీడియా ద్వారా ఏమైనా చేయొచ్చా అని. దావానలంలా వ్యాపిస్తున్న కరోనా అని రాస్తే  టీఆర్పీ రేటింగులు పెరుగుతాయేమో కాని, సామాజిక బాధ్యత తీసుకుని ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయగల  తీరిక వున్నవాళ్ళు కలికానికి కూడా కానరావడం లేదంటే నిజంగా బాధపడాల్సిన, కాదు కాదు, సిగ్గుపడాల్సిన  విషయమే.

ఈ జబ్బుకు ఈ స్థాయిలో సాంఘిక బహిష్కరణ అవసరమా కాదా అన్నది సరయిన వైద్య నిపుణుల ద్వారా సేకరించి ప్రజలను చైతన్యం చేయకపోతే ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో!

కింది ఫోటో మిత్రుడు జగన్ మోహన్ పోస్ట్ చేసారు. ఒక కరోనా రోగికి ఓ స్టార్ హాస్పిటల్ లో వేసిన బిల్లు. అక్షరాలా మూడు లక్షల నలభయ్ వేల రూపాయలు. నిజానికి హోం క్వారంటైన్ లో ఈ చికిత్స తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న అపార్ట్ మెంట్లలో నివసించేవారి పరిస్తితి ఏమిటి? రోగం వచ్చిందని తెలియగానే ముందు ఇల్లు ఖాళీ చేయాలనే వొత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో పెద్ద సంఖ్యలో రోగులకు వసతి కల్పించడం కూడా అసాధ్యమే. అందరూ స్టార్ ఆస్పత్రుల ఖర్చు భరించలేరు.

కిం కర్తవ్యమ్?         

(26-06-2020)


No photo description available.

అయస్కాంతంగా మారిన రాజకీయం – భండారు శ్రీనివాసరావు

రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి  ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన

‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.

ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.

ఆప్తవాక్యం: రాజకీయాల్లో ఉన్నవారిని వారి రాజకీయాలు వారిని చేసుకోనివ్వండి. నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం  ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.

(26-06-2020)