17, జూన్ 2020, బుధవారం

రాజాకీయాల్లో కావాల్సింది విధేయతా అవకాశం వెతుక్కోవడమా


“రాజకీయాల్లో విధేయత చూపాలా, అవకాశం చూసుకోవాలా?” అంటే తలపండిన ఓ రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఇది:
“ఈ రెండూ అవసరమే. కానీ ఎన్నాళ్ళు విధేయత చూపాలి, ఎప్పుడు అవకాశం వెతుక్కోవాలి అనే సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాడే రాజకీయాల్లో రాణిస్తాడు. లేకుంటే ఇదిగో ఇలా నాలాగా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి సలహాలు ఇచ్చే పాత్రకు పరిమితమవుతాడు”  
పార్టీలతో, వాటి గుర్తులతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గిన వావిలాల గోపాల కృష్ణయ్య వంటివారు అరుదు. కానీ అటువంటి నిస్వార్ధ నాయకులుకూడా తరువాత కాలంలో ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అతిరధ మహారధులు ఓటమిపాలయ్యారు. 
ఒక్కోసారి పార్టీ గుర్తు చాలా మేలుచేస్తుంది అభ్యర్దులకి. 1978 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు ఎన్నికలకు ముందు కేటాయించారు. అభ్యర్ధి ఎవరు అనేదానితో నిమిత్తం లేకుండా ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేశారు. టీడీపీ సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ కారు గుర్తు అలాంటివే. తమ గెలుపు మీద అపారమైన  నమ్మకం ఉన్న వారు కూడా ఎదో ఒక పార్టీ పంచన చేరడం అందుకే.
తమిళనాట నెడు౦జెలియన్ (తెలుగు పత్రికల్లో పనిచేసేవారికి ఈయన పేరు రాయడం చాలా ఇబ్బందిగా వుండేది. ఇప్పుడు నేను రాసింది కూడా కరక్టు కాదు అని తెలుసు కానీ ఏం చెయ్యలేం) అనే ద్రావిడ నాయకుడు వుండేవారు. ఈయన వరసగా పదమూడు సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పని చేశారు. ప్రధానమైన శాఖలు వీరి అధీనంలోనే  ఉండేవి. పార్టీలో ఈయన మాట సుగ్రీవాజ్ఞ. అన్నాదొరై కాలంనుంచి మంత్రిగా పనిచేసిన సీనియర్. ముఖ్యమంత్రి కరుణానిధితో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆయన డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంటుగా పోటీ చేసారు. ఫలితం చెప్పక్కరలేదు. డిపాజిట్ కూడా దక్కలేదు.
రాజకీయాల్లో గెలుపోటములు కూడా చిత్రంగా వుంటాయి.
తమిళనాడు అసెంబ్లీకి ఒకసారి జరిగిన ఎన్నికల్లో జయలలిత అసాధారణ విజయం సాధించారు. ప్రత్యర్ధి పార్టీ డీఎంకే నుంచి ఒకే ఒక్కడు కరుణానిధి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే దారుణమైన పరాజయం మరోటి ఉండదని అంతా అనుకున్నారు. అదే కరుణానిధి మరో ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు.
(17-06-2020)        

13, జూన్ 2020, శనివారం

పోలీసులకు ‘నో ఎంట్రీ’ – భండారు శ్రీనివాసరావు


సాధారణంగా ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారం పోలీసుల చేతుల్లో వుంటుంది. వాళ్ళు బేరికేడ్లు కట్టి ప్రజల్ని వాటిని దాటి రావద్దని ‘నో ఎంట్రీ’ బోర్డులు పెడుతుంటారు. ఇప్పుడు అది తిరగబడింది. తమ ప్రాంతంలోకి పోలీసులకు ప్రవేశం లేదంటూ తమది పోలీస్ ఫ్రీ జోన్ అని పౌరులే ప్రకటించుకున్నారు.
ఈ చిత్రాతిచిత్రం అమెరికాలోని సియాటిల్ నగరంలో క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో చోటుచేసుకుంది.
ప్రతిరోజూ రాత్రి సియాటిల్ నుంచి మా పెద్ద కోడలు భావన క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ వుంటుంది, ఎలా వున్నారు బాగున్నారా అంటూ. ‘మీ దగ్గర కరోనా పరిస్తితి ఏమిటనేది మామూలుగా నా ఆరా.
‘కరోనాని బ్లాక్ ఎపిసోడ్ ఏనాడో కప్పివేసింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సంగతే’ అన్నది కోడలు.
అమెరికాని ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మొదట తన కుడి కాలు పెట్టింది సియాటిల్ లోనే. సియాటిల్ నగరం ఉన్న వాషింగ్టన్ రాష్ట్రం డెమొక్రాట్ల ఏలుబడిలో వుంది. అంటే ఆ రాష్ట్రపు గవర్నర్ డెమోక్రాటిక్ పార్టీ. నగర మేయర్ డెమొక్రాట్. దాంతో కరోనాను మించిన రాజకీయాలు నడుస్తున్నాయి. రిపబ్లికన్ అయిన ప్రెసిడెంట్ ట్రంప్ కీ వీళ్ళకీ చుక్కెదురు. ఒక నల్ల జాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించిన దరిమిలా అమెరికా అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు సంఘీభావం తెలిపేవారి సంఖ్య ఆ దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. “A day of action in solidarity” అనే పేరుతొ నిన్న సియాటిల్ నగరంలో బంద్ పాటించారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న దుకాణాలు ఈ బంద్ తో పూర్తిగా మూతపడ్డాయట. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ సంఘీభావ నిరసన కార్యక్రమంలో భాగంగానే కావచ్చు క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో పోలీసులకు ‘నో ఎంట్రీ’.
ఒక నల్ల జాతీయుడి హత్యకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో శ్వేత జాతీయులు ఎక్కువగా పాల్గొంటూ వుండడం అమెరికా ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతున్న మాట నిజమే అయినప్పటికీ, రాజకీయాల రంగూ రుచీ వాసనా ప్రపంచ వ్యాప్తంగా ఒకటే అనిపిస్తుంది ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారాలు గమనిస్తుంటే.

11, జూన్ 2020, గురువారం

కరోనా లేకపోతే కోటి వదిలేది (సరదా గల్పిక)

“ఈరోజు మా మనురాలి పెళ్లి. ఇంట్లో కూర్చుని చూస్తున్నాము”

ఆయనెప్పుడూ అంతే! చాలా సరదా మనిషి. దేన్నీ సమస్యగా తీసుకుని బాధపడరు, బాధ పెట్టరు. అది ఆయన నైజం. పైగా ప్రతిదాన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే వయసు మీద పడ్డా కూడా ఆరోగ్యంగా, చలాకీగా ఉండగలుగుతున్నారు.

“కరోనాకు ముందు ఇదిగో ఇదే మనవరాలి ఎంగేజ్ మెంట్ ధూమ్ ధాంగా గోవాలో చేశారు. నేనూ మా ఆవిడా ఇంకా అనేకమంది బంధుమిత్రులం గోవా వెళ్లాం. చాలా సరదాగా గడిపాము. మా అల్లుడి చేయి పెద్దది. చాలా గ్రాండుగా చేసాడు. పెళ్లి ఇంకా ఘనంగా చేయాలని ప్లాన్ చేశారు.

“ఈలోగా ఇదిగో ఈ కరోనా పిలవని పేరంటంలా దిగబడింది. పెళ్ళికి యాభయ్ మంది కన్నా ఎక్కువమందిని పిలవకూడదు. అంచేత మగపెళ్ళివారికి ప్రిఫరెన్స్ ఇచ్చి మేము సర్దుకున్నాము. స్టార్ హోటల్లో పెళ్లి. అందరికీ లింకులు పంపారు. అవి పెట్టుకుని ఇంటి నుంచే వివాహ వేడుకలు చూస్తున్నాం.”

“ఇంకో మాట. ఈ కరోనా లేకపోతే ఈ పెళ్ళికి ఒక కోటి వదిలేది మా అల్లుడుకి” అన్నాడాయన నవ్వుతూ.

(June, 2020)  


10, జూన్ 2020, బుధవారం

భయం – భండారు శ్రీనివాసరావు


రోశయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు  నుంచి  చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడంలేదు
దీనికి సమాధానం ప్రజలదగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీపాత తప్పితే యేమీ వుండేవికావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండదు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయినకొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా సంగతి చూస్తున్నాం కదా!

9, జూన్ 2020, మంగళవారం

సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు

సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.

“ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది మాత్రం వాస్తవం”

శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా  పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.

అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై    వైజాగులో తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన గణపతి రామాయణ సుధ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

“వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు.  ఎలా అని  గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”

శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”

అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు)      


8, జూన్ 2020, సోమవారం

నారాయణ నారాయణ

“ఇంట్లో వుండు, బతికిపోతావ్! బయటకి రాకు ప్రాణాలతో వుంటావ్ అన్నారు. ప్రాణభయమో యేమో తెలవదు, చాలా రోజులు జనం ఈ మాట విన్నారు.

తర్వాత తర్వాత కొద్దికొద్దిగా నిబంధనలు సడలిస్తూ వచ్చారు. ఫలితాలు ఇదిగో ఇలా! పత్రికల్లో వచ్చిన ఫోటోలు చూశారుగా.

చేపలు తినక చాలా రోజులు అయివుండొచ్చు. లేదా మృగశిర కార్తే ఆరంభంలో వచ్చే చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అనే ఆలోచన కావచ్చు. కానీ ఇలా మందలు మందలుగా బయటకు వస్తే ప్రాణాలకు కరోనా ముప్పు వుందనుకున్నప్పుడు  ఆరోగ్యానికి మంచి చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?

చిన్నప్పుడు ఓ కధ చెప్పేవారు. ఒకడు అవసాన దశలో వున్నప్పుడు అతడిచేత నారాయణ నారాయణ అనిపించాలని కుటుంబ సభ్యులు ఆరాటపడ్డారు. నారాయణ నారాయణ అంటూ చనిపోతే  స్వర్గానికి పోతాడనే నమ్మకంతో ఎంతో చెప్పిచూశారు కానీ అతగాడిచేత నారాయణ అనిపించలేకపోయారు. చివరికి వాళ్ళల్లో ఒకడు ఒక చేతిలో నారపీచు, మరో చేతిలో అణా పట్టుకుని ఇవేమిటని సైగచేశాడు. అవి చూసి అయినా నారాయణ అని అనకపోతాడా అనే ఆశతో. మంచానపడి  చావు ముంచుకొచ్చిన ఆ శాల్తీకి చావు తెలివితేటలు ముంచుకొచ్చి  వాటిని చూస్తూనే పీచు, కాసు అంటూ కళ్ళు తేలేశాడు.

గతంలో మందుకోసం ఇలాగే వీధుల్లోకి బారులు  తీరారు. ఇప్పుడు చేపలకోసం గుంపులు కట్టారు. నాలుక చవిచచ్చిన వారికి చావు భయం కూడా చచ్చిపోతుందేమో మరి.

సరే! గతంలో మృగశిర అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాదు చేపమందు. ఈసారి కరోనా కట్టడుల వల్ల చేపమందు ప్రసాద పంపిణీ వుండదని బత్తిన కుటుంబం వాళ్ళు ముందుగానే ప్రకటించారు. లేకపోతే ఈపాటికి హైదరాబాదు మీద మరో హైదారాబాదు వచ్చి పడేది.

లోగడ వున్నంత ఆదరణ ఈ చేపమందుకు ఇప్పుడు వుందని చెప్పలేము కానీ ఒకప్పుడు హైదరాబాదు చేపమందుకు చాలా గిరాకీ వుండేది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చేపమందు పంపిణీకి అంతర్జాతీయ ఖ్యాతి వుండేది. ఆయనే స్వయంగా ఈ చేప ప్రసాదం యేటా స్వీకరిస్తూ దానికి ఓ బ్రాండు విలువ తెచ్చిపెట్టారు.

ఉత్తర భారతం వారికి ఈ చేపమందు పట్ల నమ్మకం ఎక్కువ. వాళ్ళ నమ్మకం యేమో కానీ రేడియోలో పనిచేసే మా బోంట్లకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టేది. డిల్లీలోని ఆకాశవాణి డైరెక్టొరేట్ నుంచి మాకు యెన్నో అభ్యర్ధనలు వస్తుండేవి, మా బావమరది కుటుంబం వస్తోంది, మా మేనల్లుడి కుటుంబం వస్తోంది కాస్త సాయం చేయండంటూ. ఇక వాళ్ళకి వీఐపీ పాసులు, వసతికి ఏర్పాట్లు. ఇంతటితో అయితే పరవాలేదు, పోయేటప్పుడు రైలు రిజర్వేషన్లు. రైల్వే  రామ్మోహన్ కు పనిపెట్టే వాళ్ళం. ఆయన కిందా మీద పడి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించేవాడు. నిజానికి ఈ ఇబ్బందులు యెక్కువగా భరించింది మొహమాటం పాలు యెక్కువ వున్న మా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారే. నాది చిటికినవేలంత మాత్రమే.         


4, జూన్ 2020, గురువారం

దివ్యదృష్టి – భండారు శ్రీనివాసరావు


ఏకాంబరం హాల్లో పడక కుర్చీలో కూర్చుని, డిటెక్టివ్ వాలి మాదిరిగా కళ్ళు మూసుకుని టీవీ వింటున్నాడు’.
జర్మనీ నుంచి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఏకాంబరం కొడుకు పీతాంబరం తండ్రి పక్కనే కూర్చుని టీవీ చూస్తూ రిమోట్ తో ఛానల్స్ అటూ ఇటూ మారుస్తున్నాడు.
కళ్ళు మూసుకుని వున్న ఏకాంబరం, ఛానల్ మారగానే అది పలానా ఛానల్ అని పైకి చెప్పడం పీతాంబరానికి ఆశ్చర్యం కలిగించింది. అలా సుమారు పది పదిహేను టీవీల పేర్లు ఏ తప్పు లేకుండా కళ్ళు తెరవకుండానే చెబుతూ వుండడం చూసి అతడు నివ్వెరపోయి తండ్రిని అడిగాడు, చూడకుండానే అలా ఎలా చెప్పగలుగుతున్నావని.
ఏకాంబరం ఇలా జవాబు చెప్పాడు.
ఇదేమి బ్రహ్మవిద్య కాదు. ఎలాగూ ఇంకొన్నాళ్లు ఇక్కడే వుంటావు కదా!  లాక్ డౌన్ ఎత్తేసేసరికి నీకూ ఈ దివ్య దృష్టి అలవడుతుంది. కార్యక్రమం వింటూనే అదే ఛానలో ఇట్టే చెప్పేస్తావు