15, మే 2020, శుక్రవారం

కరోనా పులి – భండారు శ్రీనివాసరావు



నిన్న అంటే మే పద్నాలుగో తేదీ గురువారం నాడు దాదాపు అన్ని టీవీ ఛానళ్ళు ఒకే అంశాన్ని పదేపదే పలుసార్లు ప్రసారం చేశాయి, హైదరాబాదు మహా నగరంలో చిరుతపులి సంచారం అంటూ. ఆ చిరుత నగర రహదారులపై తచ్చాడుతున్న దృశ్యాలను అనేకసార్లు టీవీల్లో  చూపెట్టారు. పోలీసులు, జూ అధికారులు ఆ చిరుతను పట్టి బంధించడానికి నానా శ్రమ పడ్డారు. చివరికి అది, చెట్లూ చేమలతో నిండిన, ఎవరూ నివాసం ఉండని ఓ  విశాలమైన ఫాం హౌస్ ఆవరణలోకి తప్పించుకు వెళ్లిందని సమాచారం. పులివేట కొనసాగుతుందని అధికారులు చెప్పినట్టు ఓ స్క్రోలింగు వేసి  ఆ వార్తకు ఆ పూటతో మంగళం పాడేసి కొత్త వార్తల వేటలో పడిపోయారు ఛానళ్లవాళ్ళు.
చిన్నప్పుడు స్కూళ్ళలో మాస్టార్లు ఒక విషయాన్ని విశదంగా వివరించడానికి, లేదా పిల్లలకు దానిపై అవగాహన కలిగించడానికి ఏదో ఒక పోలిక చెప్పి దానికీ దీనికీ ముడిపెట్టి చెప్పేవాళ్ళు. నిజానికి అలా అరటిపండు ఒలిచినట్టు పాఠం చెప్పే అయ్యవార్లు అంటే పిల్లలకు కూడా అభిమానం వుండేది.
పులికీ, ఈ పాఠాలకు సామ్యం ఏమిటి అనే అనుమానం రావచ్చు. వుంది. కానీ,  ఎలాగూ ఇది చదివిన తర్వాత, ఇలా వివరణ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది వెలిబుచ్చే సందేహం ఇదే. ఇదేం పోలిక బాబూ అని అన్నాఅనవచ్చు.
పులి ఊళ్లోకి వచ్చింది. అది పచ్చి నిజం. అందరూ టీవీల్లో చూసారు. అడవిలోకి వెళ్ళింది అన్నారు. ఎవరూ చూడలేదు. కానీ జనాలు నమ్మారు. అది ఆ అడవిలోనైనా వుండిఉండొచ్చు. లేదా నగరంలోనే ఎక్కడైనా దాక్కుని వుండిఉండొచ్చు. కానీ ఎవరూ చూసిన వాళ్ళు లేరు. అలాగే పులి తను నివాసం వుండే నిజమైన అడవిలోకి వెళ్లి ఉండవచ్చు. ఇదీ చూసిన వాళ్ళు లేరు. ఇవన్నీ ఊహాగానాలే.
ఒకవేళ పులి నిజంగా నగరం పొలిమేరల్లోని ఆ ఫాం హౌస్ లో వుంటే... అంటే అది మన పక్కలో ఉన్నట్టే. కానీ కనబడలేదు కాబట్టి దాని గురించి పట్టించుకోవడం లేదు.
ఇక్కడే మేస్టార్లు చెప్పిన పాఠంలో పేర్కొన్న పోలిక.
పులి కూడా కనబడకుండా పోయింది. కానీ పక్కనే ఎక్కడో  కనబడకుండా వుంది. అది పట్టుపడేదాకా లేదా పట్టుకునేదాకా  నగరం అలానే స్తబ్దుగా వుండిపోదు కదా! అందుకే పులి వుంది అనే అనుమానం ఉన్నప్పటికీ నగర ప్రజలు నిన్నా నేడూ కూడా తమ మానాన తమ జీవనం యధావిధిగా  కొనసాగించారు.
అలాగే కరోనా. కరోనా కూడా కనబడని శత్రువు. కానీ వుందని తెలుసు. మందు కనుక్కునేదాకా ఏమీ చేయలేమనీ తెలుసు.
అందుకే, కరోనాకు సరైన  వాక్సిన్ కనుక్కునేదాకా దానితో  యుద్ధమూ చేయాలి. దానితోనే  సహజీవనమూ సాగించాలి.         

మంచి నీళ్ళ కరెంటు – భండారు శ్రీనివాసరావు


“We cannot afford this sort of luxury there”
యూకే, అమెరికా వంటి సంపన్న దేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపేవాళ్ళు కూడా ఇండియాలోని తమ చుట్టపక్కాలను చూడడానికి వచ్చినప్పుడు చెప్పే మాట ఇది.
మన ఇళ్ళను చూసి, మన ఇంట్లో ఫర్నిచర్ ని చూసి కాదు వాళ్ళు ఈ మాట చెప్పేది. మనం విచ్చలవిడిగా వాడుతున్న విద్యుచ్చక్తిని చూసి.
“ఆ గదిలో ఎవ్వరూ లేరు, అయినా  పంకా తిరుగుతోంది, ఆపేయవచ్చు కదా!’
“అందరం ఇక్కడే కూర్చున్నాం కదా! ఆ గదిలో ఏసీ ఎందుకు”
ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాదు, కాస్త చనువు వున్నవాళ్ళు లేచి వెళ్లి ఆ పంకాని, ఆ ఏసీని ఆపేసి వస్తారు కూడా.
ఎందుకంటే ఆ దేశాల్లో కరెంటు చార్జీలు ముట్టుకోకుండానే కాలిపోయే రకం.
మన దగ్గర వంటింట్లో ఇల్లాలు వంట చేస్తుంటుంది. కొరియర్ వాడు వచ్చి బెల్ కొడతాడు. వెంటనే ఆవిడ ముందు గ్యాస్ ఆఫ్ చేసి వెళ్లి తలుపు తీస్తుంది. అంతేకాని అదే గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేయదు. అంతేకాదు, వంట చేస్తున్నంత సేపు డ్రాయింగు రూములో టీవీ మోగుతూనే వుంటుంది. కావాలంటే గమనించి చూడండి.
సాధారణ కుటుంబాల్లో కరెంటు వాడకం గురించి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. ఎందుకంటే బిల్లు చూసిన తర్వాత కానీ చార్జీల సంగతి గుర్తుకు రాదు. నేనూ ఈ బాపతే. కానీ చార్జీల విషయంలో నా వాదన వేరు.
గతంలో ఎన్నో వ్యాసాలు రాసాను. ప్రతివాళ్ళం ఇళ్ళల్లో ఇంత హాయిగా వుంటున్నామంటే ఈ కరెంటు వల్లే. బయట ఎండ దంచుతున్నా ఫ్యాను గాలికి సేద తీరవచ్చు. రాత్రి వేళ గాలి బిగించి ఉబ్బతీసినా ఏసీ చల్లదనంతో హాయిగా కునుకు తీయవచ్చు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పెద్దపెద్ద టీవీలతో ఇంటినే ఒక థియేటర్ గా మార్చుకుని చక్కగా కాలక్షేపం చేయవచ్చు.
కానీ కరెంటు చార్జీలు మాత్రం పెంచరాదు. నేను రాస్తున్నది బీదాబిక్కీ విషయం కాదు, తీరి కూర్చుని సాంఘిక మాధ్యమాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళ గురించి. వాడుకున్న దానికి చార్జి కట్టి తీరాలి. చేసిన పనికి తగిన వేతనం ఇచ్చి తీరాలి. ఏదీ ఉచితం కాదు.  ఈనాటి కార్పొరేట్ ప్రపంచాన్ని శాసిస్తున్న సూత్రాలు.
ఇదేదో కరెంటు చార్జీల పెంపుగురించి సాగుతున్న వివాదంలో ఎవరినో సమర్ధించడానికి ఇది రాయడం లేదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేరుగా ఆయనతోనే చెప్పాను, కరెంటు చార్జీలు పెంచితే పరవాలేదని. సందర్భం గుర్తు లేదు, ముఖ్యమంత్రి ఆ రోజు జూబిలీ హాల్ లాన్స్ లో విందు ఏర్పాటు చేసారు. నేను అప్పుడే మాస్కో నుంచి వచ్చాను. అయిదేళ్ళ పాటు కన్ను కొట్టని కరెంటు దీపాలు చూసివచ్చిన మత్తులో వున్నాను.
ఆ రోజుల్లోనే కరెంటు చార్జీల గొడవ ఊపందుకుంటోంది. మాటలమధ్యలో ఏమిటి రష్యా సంగతులు అంటే నేను చెప్పాను. మంచి నాణ్యత కలిగిన కరెంటు ఇవ్వండి. చార్జీలు పెంచినా జనం ఏమీ అనుకోరు. అలా కాకుండా ఇలా వచ్చి అలా పోయే కరెంటుకు ఎక్కువ చార్జీలు వేస్తేనే జనంతో  చిక్కొస్తుంది’ అనేది నా జవాబు.
చివరికి షాక్ ఆయనకు కొట్టింది. నేను బాగానే వున్నాను. కానీ నా అభిప్రాయం మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా మారకుండానే  వుంది.
అయినా నేనేమైనా రాజకీయాల్లో వున్నానా ఏమిటి తరచూ అభిప్రాయాలు మార్చుకోవడానికి.
''అప్పుడప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేస్తుంటే కానీ పొలిటీషియన్‌ కానేరడు''  - కన్యాశుల్కం లో గిరీశం     

14, మే 2020, గురువారం

టీటీడీ వారికి శాయంగల విన్నపాలు – భండారు శ్రీనివాసరావు

కొండకు వెళ్ళే భక్తులకు పరిమిత సంఖ్యలో ఆ దేవదేవుడి దర్శనభాగ్యం కలిగించాలని టీటీడీ పాలకమండలి యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా కొంచెం అటూఇటూ రెండు మాసాలపాటు భక్తులకు స్వామి దర్శనాలు నిలిచిపోయాయి. ఇలా భక్తులకు దర్శనాలు నిలిపివేయడం అనేది తమకు తెలిసినంతవరకూ ఎప్పుడూ జరిగిన దాఖలా లేదని తిరుమల చరిత్ర సాకల్యంగా తెలిసినవారు చెబుతున్న మాట.
ఏదైతేనేం రేపోమాపో మళ్ళీ దర్శనాలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ సందర్భంగా నూతన పాలకమండలికి కొన్ని సూచనలు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులకు ప్రోటోకాల్ దర్శనాలు ఎటూ తప్పవు. ఇక మిగిలిన వీఐపీ, వీవీఐపి దర్శనాలనుకట్టడి చేయడానికి ఇదొక మంచి అవకాశం. వృద్ధులు,వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఎలాగూ వున్నాయి. పొతే, సంపన్నులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అధికారులు, అనధికారుల వత్తిడే టీటీడీ అధికారులకు ఎక్కువ. అలాంటివారు మహా వుంటే రోజుకు ఓ వేయి రెండువేల మంది వుంటారు. వారిని కనిపెట్టి చూసుకుని దర్శనాలు చేయిస్తే వాళ్ళు తమని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటారని అక్కడి అధికారుల భరోసా. కానీ వేల సంఖ్యలో క్యూ లైన్లలో పడిగాపులు పడే సామాన్య భక్తుల సంగతేమిటి? వారు నమ్ముకున్న ఆ వెంకన్నే వారి సంగతి చూసుకుంటాడన్న భ్రమలో వున్నారేమో తెలియదు. సరే ఇదలా ఉంచుదాం.
ఉదయం సాయంత్రం ఓ నిర్ణీత సమయాల్లో ఈ వీఐపీ దర్శనాలకు ముందు మంగళం పాడాలి. ఈ రెండువేల మంది కోసం క్యూ లైన్లలో సామాన్య భక్తులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అంతగా అవసరం అనుకుంటే, సాధారణ క్యూ లైన్లను ఎలాంటి అంతరాయం లేకుండా ఓ పక్క నడుపుతూనే, ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా వచ్చిన వీఐపీని వచ్చినట్టు ప్రత్యేకమార్గం ద్వారా తీసుకువెళ్ళి గర్భగుడిలో కలిపేయాలి. ఇలా చేయడం వల్ల సామాన్య భక్తులు ఎలాంటి నిరీక్షణ అవసరం లేకుండా క్యూలో సాగిపోవడానికి వీలుపడుతుంది. ఎవరికోసమో తమని నిలిపివేశారనే భావన వారికి కలగదు. టీటీడీ వారికి సమయం కూడా కలిసివస్తుంది.
అయితే, చిక్కల్లా స్వామి సేవల విషయంలోనే. కొందరు సుప్రభాతం కోరుకుంటారు. మరికొందరు అభిషేకం. ఇంకొందరు కళ్యాణం. ఇలాంటి కోరికలు, లేదా మొక్కులు వున్న వారిని అత్యధిక రుసుములు వసూలు చేసి ఆయా దర్శనాలు కల్పించాలి. అది కూడా ముందు చెప్పిన పద్దతిలోనే సుమా.
మహాద్వారం నుంచి బయటకు వచ్చే వీవీఐపీలను టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూ చేసే ప్రదేశాన్ని టీటీడీ తక్షణం అక్కడి నుంచి మార్చాలి. దేశం కోసం దేవుడ్ని ప్రార్ధించామని వాళ్ళు సిగ్గువిడిచి చెప్పే అబద్ధాలను జనం టీవీల్లో వినలేకపోతున్నారు. ఇదే పనిని వాళ్ళు తాము బస చేసిన అతిధి గృహంలోనో, కొండ దిగివచ్చిన తర్వాతనో చేసి వుంటే బాగుంటుంది.
ఇలాగే చేయాలని కాదు ఈ విన్నపం. ఇలా కూడా ఆలోచనలు చేస్తే ఓ మంచి మెరుగయిన మార్గం కనబడకపోదు అనేది ఓ చిరు ఆశ.




12, మే 2020, మంగళవారం

నూటికి నూరుపాళ్ళు జనం మనిషి


“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి  స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.
“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.
లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.
నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన  తర్వాత  ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో  స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపొయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము. పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.          
“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.

నిజంగా నూటికి నూరుపాళ్ళు జనం మనిషి. 


నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు


“కూరలో ఉప్పు సరిపోయిందా నాయనా” ఆవిడ అడుగుతోంది.
దేశం కాని దేశంలో ఆ మహాతల్లి తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కన్నతల్లి గుర్తుకువచ్చి  చలపతి కంట్లో ఉప్పటి కన్నీరు ఉబికి వచ్చి తింటున్న కంచంలో పడింది.
“సరిపోయింది”
తన కంటితడి ఆమె కంటపడకుండా పై పంచతో తుడుచుకుంటూ జవాబు చెప్పాడు చలపతి.

10, మే 2020, ఆదివారం

చాలా దిగులనిపించింది


అమ్మానాన్నల అబ్దీకాలు ఏటా పెట్టే బాధ్యత నా భుజాల మీదకు ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. బహుశా మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు చనిపోయిన తర్వాత అనుకుంటా. రెండో అన్నయ్య రామచంద్రరావు గారు దత్తు. మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు మా పెద్దన్నయ్య కంటే ముందే పోయాడు.
బుద్ది ఎరిగిన నాటి నుంచి ఈ కార్యక్రమంలో నాది ఎప్పుడూ తద్దినం పెట్టేవాడి  తమ్ముడి పాత్రే. చాలా పరిమితం. పిండాలు చేయడం, అయ్యగారు  చెప్పినప్పుడల్లా జంధ్యాన్ని సవ్యం, అపసవ్యం చేసుకుంటూ  కుడి ఎడమ భుజాలకు మార్చుకోవడం, మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాత పిండాలను అగ్నిహోత్రంలో వేయడం ఇలాటి చిన్న చిన్న పనులేవో చేస్తుండేవాడిని.
మా నాన్నగారి తద్దినం డిసెంబరులో, అమ్మగారి ఆబ్దీకం ఆగస్టులో. నాకు ఏడెనిమిదేళ్ళ వయసులో నాన్న పోయాడు కాబట్టి, తద్దినం అనే ఎరుకతో నేను పెట్టినవి అరవై అయిదు పైనే వుంటాయి. మా అమ్మగారు 1993 లో కన్నుమూసారు. ఇన్నేళ్ళుగా మా ఇంట్లో తద్దినాలు పెట్టే బ్రాహ్మణులు, భోక్తలకు ఏటా గుర్తుచేసే అవసరం లేకుండా వారికి తిధులు, మా పేర్లు, గోత్రాలు బాగా గుర్తుండిపోయాయి.
ఏటా జరిగే ఈ క్రతువులో మా ఇంటి కోడళ్ళ పాత్ర ఎక్కువ. నిష్టగా మడి కట్టుకుని తడి బట్టలతో కావాల్సిన సంభారాలు అందిస్తుండేవారు. దాదాపు ఓ మూడు దశాబ్దాల పాటు మా నాన్నగారి తద్దినం మా ఊళ్లోనే పెట్టేవారు. మూడో అన్నయ్య ఈ ఏర్పాట్లు చూసేవాడు. ఏడుగురు అక్కయ్యలు బావగార్లు, వాళ్ళ పిల్లలు అంతా బండ్లు కట్టుకుని కొందరూ, బస్సుల్లో మరికొందరు, రైళ్ళలో ఇంకొందరూ మా వూరు చేరుకునేవారు. తద్దినం పెట్టే ఇంటికి పెళ్లి కళ వచ్చిందనే వారు ఊళ్లోవాళ్ళు.
క్రమంగా ఇదంతా గతంలోకి వెళ్ళిపోయింది. మా మూడో అన్నయ్య, పెద్దన్నయ్య మరణంతో ఈ కార్యక్రమం హైదరాబాదులోని మా ఇంటికి పరిమితం అయింది. రావాల్సిన వాళ్ళలో చాలామంది హైదరాబదులో సెటిల్ అయ్యారు. ఖమ్మం నుంచీ, బెజవాడ నుంచీ కొన్నేళ్ళు అక్కయ్యలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏడుగురిలో ఇద్దరు వున్నారు. అయిదుగురు పైలోకాల్లో ఉన్న అమ్మానాన్నల వద్దకు వెళ్ళిపోయారు.
తద్దినం తేదీ దగ్గర పడుతుండగానే మా ఆవిడ ఫోను పెట్టుకుని మా అక్కయ్యల నెంబర్లు, ఊళ్లోవున్న చుట్టాల నెంబర్లు  కలిపి ఇచ్చేది, పలానా రోజు తద్దినం మీరు తప్పకుండా రమ్మనమని నాచేత చెప్పించడానికి. ఇలా ఒకరోజల్లా ఆమె ఈ డ్యూటీ వేసుకునేది.  నిజానికి ఇది నేను చేయాల్సిన పని.
మే తొమ్మిదో తేదీ మా ఆవిడ పదో  మాసికం. చిన్నవాడు సంతోష్ తల్లికి నల్ల నువ్వులు తర్పణం వదులుతుంటే చాలా దిగులుగా  అనిపించింది.    

9, మే 2020, శనివారం

ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?


రాజ్యాంగ బద్ధ వ్యవస్థలు అన్నింటికీ విధివిధానాలు వున్నాయి. విస్తృత అధికారాలు వున్నాయి. లేనిదల్లా వాటి మధ్య సమన్వయమే. సంక్షోభ సమయాల్లో వ్యవహరించాల్సిన పద్ధతే.
ఒకళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారు. మరొకరు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామంటారు. పలానా తేదీ లోగా నివేదిక ఇవ్వాలంటారు.
చివరికి ఇవన్నీ నెత్తికెత్తుకుని చేయాల్సింది స్ధానిక అధికార యంత్రాంగమే. వాళ్ళేమో అనుకోకుండా వచ్చి పడిన ఉత్పాతంతో ఉడ్డుగుడుచుకుంటున్నారు. సహాయకార్యక్రమాలు చూడాలో తెలియదు. నివేదికలు సకాలంలో తయారు చేయాలో తెలియదు.
ఉపద్రవాలు జరగకుండా ఈ సంస్థలు, వ్యవస్ధలు ఇంతకాలంగా ఏంచేస్తున్నాయో తెలియదు.
ఇలా ఏ దేశంలో అయినా జరుగుతుందా?
విశాఖ దుర్ఘటన ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలిగితే దేశానికి కావాల్సింది ఏముంటుంది?