26, ఏప్రిల్ 2020, ఆదివారం

మార్పు చూడని కళ్ళు (రెండో భాగం)



చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్

నేను మాస్కో రేడియోలో పనిచేస్తున్నప్పుడు సోవియట్ అధినాయకుడిగా  గోర్భచేవ్ ఒక వెలుగు వెలిగారు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆ రోజుల్లో  టీవీల్లో, పత్రికల్లో పతాక శీర్షికలలో వచ్చేది. సోవియట్ యూనియన్ లో ఆయన ప్రారంభించిన ఆర్ధిక, రాజకీయ ప్రయోగాలతో పాశ్చాత్య దేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగుతుండేది. మీడియాలో అనుదినం కనబడాలనే చాపల్యం ఆయనకున్న బలహీనతల్లో ఒకటని చెవులు కొరుక్కునేవారు.
అధికారం పోయిన తర్వాత కూడా గోర్భచేవ్ ఈ అలవాటును వదులుకోలేదని  ఆయన తర్వాత అధికార పగ్గాలు స్వీకరించిన  బోరిస్ ఎల్త్ సిన్ దగ్గర  ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన  వ్యాచెస్లావ్ కోస్తికొవ్ తన జ్ఞాపకాల పుస్తకంలో రాసుకున్నారు.
కోమ్సమాలొస్కయా ప్రావ్దా అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్భచెవ్ ఒకసారి  బోరిస్ ఎల్త్సిన్ విధానాలను తూర్పారబట్టారు. ఆ ఇంటర్వ్యూ చేసింది దిమిత్రీ మురతోవ్. ఆ విలేకరి అంటే గోర్భచెవ్ కు చాలా ఇష్టం. సోవియట్ అధినేతగా రాజీనామా చేసిన తర్వాత గోర్భచెవ్ మురతోవ్ కి ఫోన్ చేసి ఆ పత్రికలో తాను కూడా  నెలకోమారు ఒక ఫీచర్ రాస్తానని అడిగారు. అప్పటికే ఆ పత్రిక యాజమాన్యం ముఠాలుగా విడిపోయి, వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుంటూ వుండడం వల్ల గోర్భచెవ్ కోరిక నెరవేరలేదు.  గోర్భచెవ్  ఆ పత్రికను ఎంచుకోవడానికి కారణం దానికి  పాఠకుల్లో ఉన్న ఆదరణ. 1990 ప్రాంతాల్లోనే ఆ పత్రిక సర్క్యులేషన్ రెండుకోట్ల ముప్పయి లక్షలు. అయినా ఆ పత్రికలో పనిచేసేవారిలో ఏర్పడ్డ లుకలుకల కారణంగా క్రమంగా మురతోవ్ వంటి జర్నలిస్టులు ఆ పత్రికను వదిలేశారు. వదిలేసి నొవయా గజేత (న్యూ గెజిట్) అనే పేరుతొ ఒక కొత్త పత్రికను ప్రారంభించారు. పత్రిక అయితే పెట్టారు కానీ దాన్ని నిలబెట్టే ఆర్ధిక స్థోమత వారికి లేదు. సాయం చేసే వారికోసం వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్న సమయమది.
అధ్యక్ష పదవిని వీడిన తర్వాత, గోర్భచెవ్ తన ప్రసంగాలు, రచనల ద్వారా సంపాదిస్తున్న సొమ్ముతో  ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గోర్భచెవ్ కు ఆయన స్వదేశంలో మాట ఎలా వున్నా అంతర్జాతీయంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. 1991లో ఆయనకు నోబుల్ శాంతి పురస్కారం లభించింది. ఆయన తన అనుభవాలతో రాసిన ఒక గ్రంధం దాదాపు ఎనభై ప్రపంచ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. కోట్ల సంఖ్యలో ఆ పుస్తకాలు  అమ్ముడు పోయాయి. అమెరికాకి పోటీగా నిలచిన సోవియట్ యూనియన్ ఆయన హయాములోనే అంగవంగ కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నం కావడం, రెండు జర్మనీల ఏకీకరణ జరగడం,  అణ్వాయుధాల సంఖ్యను భారిగా కుదించడంలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేకానేక కారణాల వల్ల గోర్భచెవ్ కు విశ్వ విఖ్యాతి లభించింది. అంచేత ఆయన అధికారం  చేజారిపోయినా భార్య రైసాతో కలసి నిరాడంబరంగా  జీవిస్తూ, విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేస్తూ, రచనావ్యాసంగం సాగిస్తూ కాలక్షేపం చేస్తున్న రోజులవి. అయినా ఏదో విధంగా మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టాలనే కాంక్ష ఆయనలో చావలేదని, అందుకే టీవీలు, పత్రికల ద్వారా తనకు జనంలో ఉన్న ఆదరణను మరింత పెంచుకుని మరోసారి  అధికార పీఠం చేజిక్కించుకోవాలనే కోరిక ఆయనలో పాతుకుపోయి  వుందని, అందువల్లే పత్రికలను ప్రోత్సహించే పని పెట్టుకున్నారని కూడా గోర్భచెవ్ మీద అపనిందలు వచ్చాయి.
“పత్రికను ఎలా నడపాలి? నడపడానికి ఏం చెయ్యాలి” అని మేము మల్లగుల్లాలు పడుతున్న సమయంలో 20 IBM 286-x కంప్యూటర్లు మా ఆఫీసుకు వచ్చాయి” అని చెప్పాడు మురతోవ్ ఆనందంగా. 1993 నాటికి  ఆ కంప్యూటర్లు అత్యంత ఆధునికమైనవి. గోర్భచెవ్ పంపిన ఆ కంప్యూటర్లతోనే మేము పత్రికను నడపడం  ప్రారంభించాము. అంతేకాదు, గోర్భచెవ్ స్వయంగా నొవయ గజిత పత్రికలో మూడు లక్షల  డాలర్లు పెట్టుబడి పెట్టారు”అని మురతోవ్ చెప్పారు. అలాగే మరోసారి డబ్బు అవసరం పడ్డప్పుడు లక్ష డాలర్లు మా పత్రిక బ్యాంకు ఖాతాకు జమ చేసారని కూడా ఆయన వెల్లడించారు.
“1995లో రష్యాలో సెల్ ఫోన్లు చాలా అరుదు. ఒకసారి గోర్భచెవ్ దంపతులను కలవడానికి వారింటికి  వెళ్లాను. మాటామంతీ అయిన తర్వాత రైసా గోర్భచెవా  ఒక అందమైన పెట్టెను నా చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే అందులో అత్యంత ఆధునికమైన మొబైల్ ఫోను వుంది.
“అవసరమైన సందర్భాలలో లాండ్ లైన్ కి ఫోను చేసి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటోందని అంచేత మొబైల్ ఫోను వుంటే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని గోర్భచెవ్ మీతో చెప్పమన్నారు” అందావిడ నాతో. నాపట్ల ఆయన చూపించిన వాత్సల్యంఎప్పటికీ  మరవలేను” అని చెప్పుకొచ్చారు మురతోవ్.
“ఇప్పటికీ ఆ మొబైల్ ఫోను మా పత్రికాఫీసులో మ్యూజియంలో భద్రంగా వుంది” అన్నారాయన.
“పత్రికల్లో పనిచేసేవారంటే  కూడా గోర్భచెవ్ ఎంతో ఆదరణ చూపేవారు. ఒక రిపోర్టర్ ఆసుపత్రిలో వుంటే యాభయ్ వేల డాలర్లు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. ఆయన ఇలాంటి సాయాలు జర్నలిస్టులకి అనేకం చేస్తుండేవారు” అని మురతోవ్ చెప్పారు కృతజ్ఞతగా.
(ఇంకా వుంది)

25, ఏప్రిల్ 2020, శనివారం

మార్పు చూడని కళ్ళు (1)- భండారు శ్రీనివాసరావు


(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)
1991 లో నేను ఇండియా తిరిగి వచ్చిన తర్వాత రష్యా ఎలా వుంది? ఈ ఆసక్తి ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.   
ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం సంగతులు. గుర్తుంచుకోవడము కష్టమే. గుర్తు చేసుకోవడమూ  కష్టమే. లాక్ డౌన్ కాలం ఇందుకు పనికొచ్చింది. స్పష్టాస్పష్టమైన దృశ్యాలు మనసులో కదలాడాయి. వాటికి స్పష్టత ఇవ్వడానికి మరికొంత ప్రయత్నం చేసాను. ఇరవై తొమ్మిదేళ్ళకు పూర్వం నాలుగేళ్ళకు పైగా రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేస్తూ  మాస్కోలో ఉండడమే ఈ ఆసక్తికి కారణం.
1991 ఆగస్టు రెండోవారం చివర్లో మొదలైన ఒక  అద్భుత, ఉత్కంఠపూరిత రాజకీయ నాటకానికి అదే ఏడాది చివర్లో తెర పడింది. సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలనే (Hard Liners) వర్గాలకు,  రిపబ్లిక్ లకు సర్వసత్తాక స్వేచ్చను ప్రసాదించాలని పట్టుబడుతున్న ( Reformers) వర్గాలకు నడుమ జరిగిన అధికార పోరులో అనేక అంకాలకు ఆ నాలుగున్నర నెలల కాలమే ఒక వేదికగా మారింది. అప్పటివరకు సోవియట్ యూనియన్ అధినాయకుడిగా ఓ వెలుగు వెలిగిన మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ను ఆయన భార్య రైసా గోర్భాచేవాతో సహా నల్లసముద్ర తీరంలోని ప్రెసిడెంట్ వేసవి విడిదిలో గృహ నిర్బంధంలో వుంచడం, ఆయనకు పార్టీలోనే రాజకీయ ప్రత్యర్ధి అయిన బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో నెగ్గి అత్యున్నత అధికార పీఠానికి చేరువకావడం, సోవియట్ యూనియన్ స్థానంలో సోవియట్ రిపబ్లిక్ ల సమాఖ్య ఏర్పాటు కావడం, చివరికి రద్దయిన సోవియట్ యూనియన్ ఆఖరు అధ్యక్షుడిగా మిహయిల్ గోర్భచేవ్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో సమాఖ్య అధ్యక్షుడిగా బోరిస్ ఎల్త్సిన్ అధికార పగ్గాలు స్వీకరించడం అన్నీ మెరుపు వేగంతో జరిగిపోయాయి.   
మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్. ఒకానొక కాలంలో తన విధానాలతో, ప్రసంగాలతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ  అధినాయకుడు. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని సవాలు చేస్తూ ఆవిర్భవించిన సోవియట్ యూనియన్ విచ్చిత్తికి బాటలు వేసిన వ్యక్తిగా చరిత్ర పుటలకు ఎక్కిన సోవియట్ నేత. 1985 నుంచి  1991 వరకు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధినాయకుడిగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఆ ఎదురులేని నాయకుడు ప్రస్తుతం ఏం చేస్తున్నట్టు?
ఆ లెక్కకు వస్తే, ఒకప్పుడు తమ కంటి చూపుతో దేశాలను శాసించిన అంతర్జాతీయ నాయకులు అనేకులు  తమ ముదిమి వయస్సులో ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా వుంటుంది.

(గోర్భచేవ్ అప్పుడు) 


(గోర్భచేవ్ ఇప్పుడు)



 (ఇంకా వుంది)

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

మల్లాది గారికి క్షమాపణలతో

మల్లాది వేంకట కృష్ణమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేసి తన ఫొటో తీసేయమని చాలా మృదువుగా రిక్వెస్ట్ చేశారు. అందుచేత ఆ పోస్టును, వారి ఫొటోను తీసేస్తున్నాను. వారి మనోభావాలను గౌరవించడం నా విధి. అలాగే ఇప్పటికే ఈ ఫొటోను, పోస్టును షేర్ చేసినవారు ఎవరైనా వుంటే దయచేసి వాటిని తొలగించి మీ అభిమాన రచయిత మనసు గాయపడకుండా చూడండి. ఇది నా విజ్ఞప్తి - భండారు శ్రీనివాసరావు

22, ఏప్రిల్ 2020, బుధవారం

ట్రంప్ పిచ్చోడో గట్టోడో కొద్ది నెలల్లో తేలుతుంది


వాడో పిచ్చోడు. దేశాన్ని నాశనం చేయడానికే వచ్చాడు”
అమెరికాలో ఎవరినన్నా కదిలిస్తే చాలామంది ట్రంప్ గురించి చెప్పే మాటలు. నిజానికి ఇందులో నిజమెంత?
చూడడానికి పెద్ద తాగుబోతులా కనిపించే ఈ పెద్ద మనిషికి తాగుడు అంటే గిట్టదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాడురా బాబూ  అని ముక్కుమీద వేలేసుకునేలా వుంటాయి అయన మాటలు. అమెరికా అధ్యక్షుడు కాకముందు, అయిన తర్వాతా ఆయన తీరింతే! మనసులో మాట పైకి అనేయడం తప్ప అలా అనడంవల్ల వచ్చే మంచీచెడుల గురించి పట్టించుకోని భోలాశంకరుడు.
కింది ఫోటో ట్రంప్ దే. 1987 లో ప్రసిద్ధ టీవీ యాంకర్ ల్యారీకింగ్,  సీఎన్ఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ చేసినప్పటిది. అప్పటికి ఆయనకు రాజకీయాల వాసన తెలియదు. తన వ్యాపారం తప్ప వేరే వ్యాపకాలు లేవు.
లారీ కింగ్ ఆ ప్రశ్నే అడిగాడు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని.
ట్రంప్ ఇలా జవాబు చెప్పాడు.
“ఎంతమాత్రం లేదు. కానీ ఒక విషయం. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని అనుకున్న మరుక్షణం ఆ పనిలోనే వుంటాను. మరో విషయం.  అలా నేను నిర్ణయించుకున్న తర్వాత నన్నెవ్వరూ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకోలేరు”     
అలానే అయ్యారు ఇరవై తొమ్మిదేళ్ళ తర్వాత. అదీ మొదటి ప్రయత్నంలోనే.
ప్రెసిడెంట్ ఎలక్షన్లకు ముందు ట్రంప్ మరో మాట చెప్పారు.
“మన దేశ ఆర్ధిక వ్యవస్థ, మనం గొప్పలు చెప్పుకునేంత గొప్పదేమీ కాదు. నిజం చెప్పాలంటే అదొక గాలి బుడగ. ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు”
“అమెరికా అమెరికన్లది. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా తట్టాబుట్టా సర్దుకుపోవాల్సిందే” ఇలా సాగేవి ఆయన ఎన్నికల ప్రసంగాలు.
ఇప్పుడు కొరానా విషయంలో కూడా ఆయనది వేరే దారి. ప్రస్తుత దుస్తితికి కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే అని అభిప్రాయపడేవాళ్ళే ఎక్కువ ఆ దేశంలో.
ఈ నేపధ్యంలోనే అయన మరో బాంబు పేల్చారు.
బయటి దేశాల వాళ్లకి అమెరికాలోకి ‘నో ఎంట్రీ’ అని ప్రకటించారు.
ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని 1987 లో ఇచ్చిన ఇంటర్వ్యూ లోనే తేలిపోయింది.
కాదు అది అహంకారం అంటుంది అక్కడి మెజారిటీ మీడియా. మీడియా విశ్వసనీయతని ఆయన గత ఎన్నికల్లోనే దెబ్బతీసారు.
ఆయనది  ఆత్మవిశ్వాసమా లేక అహంకారమా తేల్చుకోవడానికి మరి కొద్ది నెలల్లో జరిగే అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలు వేదిక కాబోతున్నాయి.
ఈ సారి కూడా మీడియా ఓడిపోతే ఇక దాని విశ్వసనీయత పూర్తి ప్రశ్నార్ధకమవుతుంది..     


(1987లో ట్రంప్)


    

21, ఏప్రిల్ 2020, మంగళవారం

లాక్ డౌన్ – భండారు శ్రీనివాసరావు


“ఈ కషాయం తాగించి రాత్రికి లంఖణం వుంచండి. రేపటికి తగ్గిపోతుంది’
“ఓ అయిదు రోజులు ఉదయం సాయంత్రం ఈ గోలీలు వేయండి. లేచి తిరుగుతాడు”
“భయపడాల్సిన పనేమీ లేదు, మూడ్రోజులు ఆస్పత్రిలో వుంటే చాలు, టెస్టులు చేయించి మందులు వాడతాం. నాలుగోరోజు ఇంటికెళ్ళి పోవచ్చు”
“ఐసీయూ నుంచి రేపు రాత్రి డిశ్చార్జ్ చేస్తాం! ఒక రోజు వార్డులో వుంచి పంపేస్తాం”
“రేపు ఉదయం ఆపరేషన్. తర్వాత మూడు నాలుగు రోజులు హాస్పటల్ లో వుండి వెళ్లి పోవచ్చు”
“పరిస్తితి బాగాలేదు. మహా అయితే నాలుగయిదు రోజులు, ఇంటికి తీసుకువెళ్ళి కావాల్సిన వాళ్లకు కబురు పెట్టుకోండి”
ఇవన్నీ ఇంతవరకు అందరికి తెలిసిన మాటలు. వింటూ వచ్చిన మాటలు.
ఈ కరోనా వచ్చిన తర్వాత వినబడని మాటలు.
ఎలా వచ్చిందో తెలవదు. ఎలా పోతుందో తెలవదు. ఎన్నాళ్ళు వుంటుందో తెలవదు.
జబ్బేమిటో తెలవదు. మందేమిటో తెలవదు. తెలిసినదల్లా బయట ప్రపంచంలో తిరగకుండా ఎవరికివారు ఇంట్లో ఉండడమే. ఒక రకంగా మంచి రోగం. ఖర్చులేని రోగం.
ఖర్చు లేదు సరే! ఆదాయం మాటేమిటి?
జరిగితే జబ్బంత సుఖం లేదంటారు. కానీ ఆ జరగడం ఎలా! ఎన్నాళ్ళిలా !
అన్నీ జవాబులేని ప్రశ్నలు. ఎవర్ని అడిగినా జవాబు చెప్పలేని ప్రశ్నలు.
జవాబులు వెతుక్కోవడానికి మాత్రం బోలెడు ఖాళీ సమయం వుంది.
అదే,
కరోనా లాక్ డౌన్!   

20, ఏప్రిల్ 2020, సోమవారం

“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....



“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...” అంటూ రెండుసార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రేడియో విలేకరిగా నేను ప్రత్యక్ష సాక్షిని. మూడోమారు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి నేను యాక్టివ్ జర్నలిజంలో లేను.
ఏప్రిల్ ఇరవై చంద్రబాబునాయుడు పుట్టిన రోజు. ఊహకు అందని రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడెనిమిది మాసాలకు ఆయన పుట్టిన రోజు వచ్చింది. ముఖ్యమంత్రి జన్మదినం అంటే చాలా హడావిడి వుంటుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ మరణించి మూడు మాసాలే అయింది. ఆ పరిస్తితిలో వేడుకలు సంభావ్యం కావని భావించి, తనకు శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పుష్ప గుచ్చాలతో హడావిడి చేయవద్దని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు. సాధారణంగా నాయకులు చేసే ఈ నిరాడంబర వినతులను అభిమానులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరు. దానితో తరువాతి సంవత్సరాలలో అయన మరో పద్దతిని ఎంచుకున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని ఇంట్లో లేకుండా ఆ రోజున ప్రజల నడుమ గడపడం.
అధికారంలో లేని కాలంలో కూడా పుట్టిన రోజులు ఆయనకు కొత్తకాదు. కాకపొతే ఈ సారి కరోనా లాక్ డౌన్ నడుమ ఈ ఏడాది పుట్టిన రోజు రావడం ఆయనకీ, అభిమానులకి ఒక కొత్త అనుభవం.
ఒక తరానికి చెందిన రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే చంద్రబాబు అదృష్టవంతులయిన రాజకీయులలో మొదటి స్థానంలో నిలుస్తారు. అత్యంత పిన్న వయసులో మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలిగారు.
ముందే చెప్పినట్టు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాస్తున్న వ్యాసం ఇది. దీన్ని గమనంలో వుంచుకుంటే రాజకీయంగా ఆయనతో విబేధించేవారికి అనవసరమైన అనుమానాలు కలగవు. గత నలభయ్ ఏళ్ళకు పైగా ఆయనతో వృత్తిపరంగా పెంచుకున్న సాన్నిహిత్యం కారణంగా తెలియవచ్చిన కొన్ని సంఘటనలు ఒక చోట గుదిగుచ్చి, వాటి ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడుతున్నాను.
బ్రహ్మాండమయిన ప్రజాకర్షణ, అద్భుతమైన ప్రసంగ పాటవం కలిగిన ఎన్టీ రామారావుని త్రోసిరాజని అధికార పీఠం ఎక్కిన చంద్రబాబుకు తన బలహీనత ఏమిటో బాగా తెలుసు. అంతవరకూ రాజకీయాల్లో మామ చాటు మనిషిగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ఎవరో తెలిసిన వారికి కూడా ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ప్రజలకు పరిచయం కావడానికి ఆయన ఎంచుకున్న మార్గం ప్రచారం. ఇందుకోసం ప్రతి సోమ వారం దూరదర్సన్, రేడియోల్లో ప్రజలతో నేరుగా మాట్లాడే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అలాగే అందివచ్చిన ప్రతి సందర్భంలో విలేకరుల సమావేశాల్లో ప్రసంగించడం. అప్పుడే కొత్తగా పురుడు పోసుకుంటున్న ప్రైవేటు మీడియాని వాడుకోవడం. ఈ ప్రయత్నం ఫలించింది. ప్రజలకి దగ్గర కావడానికి బాగా ఉపయోగపడ్డాయి.
ఇప్పుడంటే గంటలు గంటలు మాట్లాడే చంద్రబాబు నేటి తరానికి తెలుసు. కానీ తన బలహీనత ఏమిటో బాగా తెలిసిన మనిషి. దాన్ని అధిగమించడానికి ఆయన ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా కరెంటు అవసరం లేని రేడియోని పక్కన బెట్టి, కరెంటు లేకుండా పనిచేయని 'టీవీ' లకు ముఖ్యమంత్రిగారు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ, నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, 'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి, ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. ‘బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదనగా వుండేది.
సీరియస్ గా పనిచేసుకుపోతూ చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు. కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చా’ అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
‘రేపు హైదరాబాదు వస్తున్నాను, చంద్రబాబు గారిని కలిపిస్తారా?’
ఏడాదికి ఒక్క మారు వచ్చేది ఈ అభ్యర్ధన.
ఆవిడ బెజవాడలో ఓ స్కూలు టీచరు. రేడియోలో నా సీనియర్ సహోద్యోగికి దగ్గరి చుట్టం. ప్రతియేటా ఏప్రిల్ పందొమ్మిది సాయంత్రానికల్లా హైదరాబాదు చేరుకునేవారు. ఇరవయ్యవ తేదీ చంద్రబాబు పుట్టినరోజున ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపి వెంటనే బస్సెక్కి బెజవాడ వెళ్ళిపోయేవారు.
పుట్టిన రోజున వీ ఐ పీలను కలిసి శుభాకాంక్షలు తెలిపే అలవాటు నాకు లేదు. కానీ ఆవిడ పుణ్యమా అని నేను వెంటబెట్టుకు వెళ్లి పనిలో పనిగా శుభాకాంక్షలు చెప్పేవాడిని.
అధికారంలో ఉన్నవారిని కలవడానికి ఉబలాట పడేవాళ్ళు చాలామంది వుంటారు. కానీ ఈవిడ మనస్తత్వం నాకే ఆశ్చర్యమనిపించేది. చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆవిడ క్రమం తప్పకుండా హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపేది. నాకు తెలిసి ఇంతకూ మినహా ఆవిడ ఏనాడూ కూడా ఒక కోరిక కోరడం కానీ, ఆయనతో ఒక ఫోటో తీయించమని అడగడం కానీ చేసేవారు కాదు. నిష్కళంకమైన అభిమానానికి ఆవిడ ప్రతీక.
అభిమానం అంటే చొక్కాలు చించుకోవడం, పోస్టర్లపై పేడ కొట్టడం, తమ వ్యాఖ్యలతో ఇతరుల గోడలను నానా అంకచండాలం చేయడం ఎంతమాత్రం కాదు.
చివర్లో ఒక హితవాక్యం.
గతంలో ఆయన్ని అభిమానించినవారు, చంద్రబాబులో ఒక చాణక్యుడిని చూసి దగ్గరయ్యారు. ఇప్పుడు రాజకీయ చాణక్యం మాత్రమే కనబడుతూ వుండడం వల్ల దూరం జరిగారు.



19, ఏప్రిల్ 2020, ఆదివారం

కధలు రాయడం ఎలా!

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఏమంటారు?