20, ఆగస్టు 2019, మంగళవారం

మిస్టర్ నిర్మల


‘ఏమోయ్! ఒసే! ఇలా పిలుపులు లేవు. నేను ఆమెకు ‘ఏమండీ’. ఆమె నాకు ‘మిస్టర్’. పెళ్ళయిన మొదటి రోజునుంచీ ఇంతే!
'నా బాసూ నా బానిసా నా భార్యే. నా తప్పులు సరిదిద్దడానికి బాసు. నా తప్పులు భరించడానికి బానిస. ఇలా 48 ఏళ్ళు నాతో కాపురం వెళ్ళదీసింది'
‘మా ఆవిడ భయపడదు, నాకు కాదు. నేనూ భయపడతాను,అయితే ఆవిడకి కాదు.
‘ఇప్పటికే రెండు గుండె ఆపరేషన్లు. ఏటా ఒకసారి పుట్టింటికి వెళ్ళినట్టు ఆసుపత్రిలో మూడు నిద్రలు చేస్తుంది. ఇంటికి రాగానే జబ్బుల సంగతి మర్చిపోతుంది.
‘నేనలా కాదు. ప్రపంచం నా ముందు బలాదూర్ అనుకుంటా. కానీ చిన్న అస్వస్థత వస్తే చాలు  జావకారిపోతాను.
‘అలాంటిది నన్ను ఇన్నేళ్ళుగా కనిపెట్టుకుని వున్న  'గుండే' జారిపోతే.....
రోజు గడవడం ఎలా!
ఓ పాతికేళ్ళకు పూర్వం కమ్యూనిస్ట్ రష్యాకు  వెడుతున్నాను అని ఓ మిత్రుడితో చెబితే ఇలా అన్నాడు.
‘నువ్వు మాట్లాడకుండా బతకలేవు. అక్కడ మాట్లాడితే బతకలేవు’ 
రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు
ఇప్పటికి ఎన్ని గడిచాయో, ఇంకా ఎన్ని గడవాలో, ఎలా గడవాలో !
ఓకే! అందరూ చెబుతున్నట్టు గుండె దిటవు పరచుకుంటాను. మామూలుగా రోజులు గడిపే ప్రయత్నం చేస్తాను. రెండు గంటలు టీవీ చర్చలు, ఓ నాలుగుగయిదు గంటలు ఇలా పిచ్చి రాతలు. ఓ గంట తిండీతిప్పలు. నిద్ర పడితే ఓ ఆరుగంటలు. పట్టక పొతే పద్నాలుగు గంటలు ఎలా గడుస్తాయి. ఇప్పుడు నా  చుట్టూ వున్న ఈ  జనం ఒక్కసారి మాయమై పోయి ఒక్కడినే మిగిలితే!



15, ఆగస్టు 2019, గురువారం

‘వొట్రకంబు’ – భండారు శ్రీనివాసరావు

పరీక్షలకోసం పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకోవడం తప్ప మా చిన్నతనంలో విడిగా కావాలని ఫోటో దిగడం అనేది అబ్బురమే. అసలు కెమెరా అనేది చాలామంది ఇళ్ళల్లో కనిపించేది కాదు. రేడియో, కెమెరా ఉన్నాయంటే కలిగినవాళ్ళని అర్ధం.
అలాంటిది నేను ఓ యాభయ్ ఏళ్ళక్రితం ఫోటో దిగాను అంటే నేనే నమ్మను. కానీ ఏం చెయ్యను కళ్ళెదుట కనిపిస్తుంటే...
నేను బెజవాడ ఎస్సారార్ కాలేజీలో చేరకముందు కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని సింహాలమేడలోని అనేకానేక వాటాల్లో ఒక దానిలో అద్దెకు వుండేవాళ్ళం. (మా పెద్దన్నగారనుకోండి). ఆ మేడ ఆవరణలోనే రోడ్డుకు ఆనుకుని విశ్వా టైప్ రైటింగ్ ఇన్స్తిటూట్ వుండేది. అందులో సూర్యనారాయణ అని పనిచేస్తుండేవాడు. మాంచి హుషారు మనిషి. ఎప్పుడూ క్రాఫు చెదరకుండా దసరా బుల్లోడిలా ఉండేవాడు. ఆ రోజుల్లో స్కూలు ఫైనల్ పాసయిన ప్రతి వాడూ టైప్ నేర్చుకోవాలని అనుకునేవాడు. ఆ డిప్లొమా చేతిలో వుంటే ప్రభుత్వ ఉద్యోగం తేలిగ్గా వస్తుందని. అమీర్ పేటలో జావాలు, ప్లస్ లూ నేర్చుకునే వాళ్ళ మాదిరిగా అనుకోండి.
ఆ సూర్య నారాయణ ఇన్నేళ్ళ తర్వాత ఫేస్ బుక్ ద్వారా నన్ను పట్టుకుని వాట్స్ అప్ లో మూడు ఫోటోలు పంపాడు. టీవీల్లో నన్ను చూస్తుంటాడట. పేరేమో భండారు శ్రీనివాసరావు అని చెబుతారు, మనిషి చూస్తేనేమో వేరేగా వున్నాడు, ఆయనా ఈయనా ఒకరేనా అనే అనుమానంతో నాకు ఫోన్ చేసి అడిగాడు, టీవీల్లో కనిపించేది నువ్వేనా అని.
ఫోటోలు చూసిన తర్వాత ఆ అనుమానం ఎవరికైనా వస్తుంది. అప్పుడు సన్నగా రివటగా వుండే వాడిని. మా ఆవిడేమో మద్రాసు ఆంధ్రా మెట్రిక్. నాకు ‘వొట్రకంబు’ అని నిక్ నేమ్ పెట్టింది. (అప్పటికి పెళ్లి కాలేదు, ప్రేమ లేఖల స్థాయిలోనే వుంది. ఆ మాటకు అర్ధం పెళ్ళయిన తర్వాత చెప్పింది. అంటే ఇళ్ళల్లో పాజుట్లు (బూజు) దులిపే కర్ర)
సరే! ఏం చేస్తాం!
ఇప్పుడు సూర్యనారాయణ పంపిన పాత ఫోటోలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.


కింది ఫోటోలలో వున్నది: బెజవాడ కృష్ణలో నీళ్ళు లేనప్పుడు వెళ్లి దిగామని అతడే చెప్పాడు. నాతోపాటు (చివరి ఫోటోలో నేను కుడి నుంచి రెండు) వున్నది: సూర్యనారాయణ, డాక్టర్ దాసు మధుసూదనరావు, దాసు శ్రీరాములు, అడ్వొకేట్ గారి అబ్బాయి, ఆంధ్రయూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయి వైజాగ్ లో సెటిలయ్యారట. మూడో అతను అద్దేపల్లి సత్యనారాయణ, కృష్ణ లంక, ఇప్పుడు లేరట)

వృద్ధభారతం – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA telugu daily on 16-08-2019, Friday)

భారత దేశం  తన డెబ్బయి మూడవ స్వాతంత్రదిన  వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజునే పుట్టిన లక్షలాదిమంది కూడా అదేరోజున డెబ్బయ్యవపడి దాటివుంటారు. ఇన్నేళ్ళ తమ జీవితంలో స్వతంత్ర భారతం తమకేమి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈ ముదిమి వయసులో కాసింత ఆసరా కోరుకునే వృద్ధుల సంఖ్య కూడా ఈ దేశంలో తక్కువేమీ కాదు. ఒకరకంగా చూస్తే వృద్ధాప్య సమస్యల విషయంలో కలిగిన వారు, లేనివారు అనే తేడా లేదు.
ఒక వ్యక్తి పరిపూర్ణ జీవితం గడిపాడూ అంటే అతడు బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలను అనుభవించాడని అర్ధం. కానీ అన్ని దశల్లో మానవజీవితం ఒకే మాదిరిగా సాగడం అనేది ఈ సృష్టిలో సాధ్యం కాని విషయం. అయితే అన్ని దశల్లో కష్టాలు వుంటాయి, సుఖాలూ  వుంటాయి. వీటిని దాటుకుంటూ  రావడమే నిజమైన జీవితానుభవం.
ఈ నాలుగు దశల్లో మధ్యలో రెండింటిని మినహాయిస్తే మిగిలిన  రెండింటిలో తప్పనిసరిగా ఎవరిపైనో ఒకరిపైన  ఆధారపడాల్సిన పరిస్తితే! చిన్నతనంలో  కన్నవారి మీదా, పెద్దతనంలో కన్నపిల్లల మీదా ఆధారపడి నెట్టుకొచ్చే దుస్తితే!       
బాల్యం గురించీ, అందులోని మధురిమ గురించీ అనేకమంది అనేక రకాలుగా కధలు, గాధలు, గేయాలు రాసారు. నిజంగా అదొక అద్భుతమైన అపురూప దశ. కన్నవారికి మినహా తమకంటూ ఓ బాధ్యత అంటూ లేని జీవితభాగం ఇదొక్కటే. తలితండ్రులు ఎవరో తెలియని నిర్భాగ్య దామోదరులని తప్పిస్తే, ఏదొచ్చినా పైనుంచి కంటి రెప్పలా  కనిపెట్టి చూసుకునేవారు ఎల్లవేళలా వెన్నంటి  వుండే దశ కూడా ఇదే.
కౌమార, యవ్వనాలు జీవన పధాన్ని నిర్దేశించే దశలు. ఈ కాలంలో ఎవరి కర్మవారిదే. వాళ్ళ ప్రయత్నాలను బట్టే వారి బతుకులు మలుపు తిరుగుతాయి.
బాధ్యత లేని దశలు ఇవే. బాధ్యతతో మెలగాల్సిన దశలూ ఇవే కావడం  సృష్టిలోని మరో చమత్కారం.
ఇక మిగిలిందీ, బతికుంటే  చివరకు అందరూ చేరాల్సిందీ వృద్ధాప్యదశ ఒక్కటే. చేరేలోగా రాలిపోయే బతుకులు కొన్నయితే, చేరి వాడిపోయే జీవితాలు మరికొన్ని.
ఇవిగో వీటిని గురించే, జీవన సాగరాన్ని ఈదుతూ అంతిమంగా ఓ తీరానికి చేరుకొని అలుపు తీర్చుకుంటున్న వీరిని గురించే ఈనాడు నేను ముచ్చటిస్తున్నది.


2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అరవై ఏళ్ళు పైబడిన వృద్ధుల సంఖ్య పది కోట్ల పైమాటే. గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇది మరింత పెరిగి ఉండవచ్చు. దేశ జనాభా నూట పాతిక కోట్ల మందిలో ఇదెంత అనిపించవచ్చు కానీ మిగిలిన నూట పదిహేను కోట్ల మందికీ, వీరికీ తేడా ఏమిటంటే ఇతరుల మీద ఆధార పడి బతుకులు వెళ్ళదీయాల్సిన దుస్తితి. ముందే చెప్పినట్టు ఈ విషయంలో ఉన్నవారనీ, లేనివారనే తేడాలేదు. ఎంతటి సంపన్నులయిన వయో వృద్ధులయినా తమ  పిల్లల మీదనో, లేదా వాళ్ళు ఏర్పాటు చేసిన పనిమనుషులు, ఆయాలు, నర్సుల మీదనో ఆధారపడి బతుకు దొర్లించాల్సిందే! దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే 1947లో దేశ జనాభా సగటు జీవితకాలం 31 సంవత్సరాలు కాగా 2005 నాటికి అది  64 సంవత్సరాలకు పెరిగింది. ఇప్పటికిమరింత పెరిగివుంటుంది. సందేహం లేదు. అలాగే, మరణాల రేటు వెయ్యి మందికి  45 కాగా, అది   2007 ఆగస్టు  19 వ తేదీ నాటికి కేవలం  ఎనిమిది మందికి పడిపోయింది.
అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఇది చాలా మంచి పురోగతే.  మరణాల సంఖ్య చెప్పుకోదగిన విధంగానే తగ్గింది. జీవిత కాలం బాగా పెరిగింది. అయితే అలా జీవిస్తున్నవారి సుఖ సంతోషాలు ఏమైనా పెరిగాయా? అందరూ సంతోషంగా బతుకులు వెళ్ళదీస్తున్నారా? వారిలో సంతృప్త స్థాయి ఆశించిన స్థాయిలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ ‘అవును’ అనే  జవాబు దొరికినప్పుడే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామని గర్వంగా చెప్పుకోవడానికి వీలుపడుతుంది.
మా చిన్నప్పుడు వూళ్ళో చాలామంది వారి పెద్దతనంలో మంచానపడి ఆ  కుక్కి మంచంలోనే శేషజీవితం  గడిపి కన్ను మూయడం చూశాను. అప్పుడు తరచుగా కనబడే ఈ దృశ్యాలు ఈనాడు అరుదుగా కూడా కానరావడం లేదని చెప్పే పరిస్తితి లేదు. అప్పుడూ ఇప్పుడూ రోగాలు వున్నాయి. అయితే ఆ రోజుల్లో అదొక రోగమని తెలియకుండానే చనిపోయేవారు.  ఇప్పుడు ఇంకో రకం దుస్తితి. రోగమని తెలుసు. నయం చేయించుకోవచ్చనీ తెలుసు. కానీ అందుకోసం చేసే ఖర్చుతో ఆ రోగం నయమవుతుందో లేదో తెలియదు కానీ సంసారం మాత్రం ఆర్ధికంగా కునారిల్లి  పడకేస్తుంది.
అయితే, డబ్బు ఒక్కటే ఇప్పటివారి  సమస్య కాదు. అనేక రకాల ఆరోగ్య బీమా సంస్థలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బీమా చేయించుకునే నాటికి ఉన్న ధీమా ఒక్కసారి ఆసుపత్రి పాలు కాగానే నీరు కారిపోవడం ఖాయం.  అవసరం పడినప్పుడు ఆదుకోవాల్సిన బీమా పాలసి  అవసరంలో ఉన్నవారికి అవసరమైనప్పుడు ఆపన్నహస్తం అందిస్తోందా అంటే అనుమానమే. బీమా కార్డు చేతిలో ఉన్నప్పటికీ వేన్నీళ్ళకు చన్నీళ్ళ తోడు అన్నట్టుగా బీమా కంపెనీ ఇచ్చే సొమ్ముకు అదనంగా  కొంత చేతి చమురు వదిలితే కానీ ఆసుపత్రి నుంచి రోగి కాలు బయట పెట్టలేడు.  
వెనకటి రోజుల్లో చిన్న పిల్లల వైద్యులు అనే బోర్డులు కనబడేవి. ఇప్పుడు అన్ని ఆసుపత్రులలో పెద్దవారికి వైద్యం చేసే నిపుణులు కనబడుతున్నారు.      
పూర్వం ఉమ్మడి కుటుంబాలు వున్నప్పుడు రోగం రొష్టు వస్తే చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు వుండేవారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా చాలా సంసారాలు ‘ఒంటి రాయి, శొంటికొమ్ము’ అన్నట్టుగా సాగుతున్నాయి. నగరాల్లో పరిస్తితి చెప్పక్కర లేదు. మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాల బాట పట్టి వేరే ఊళ్లకు తరలి వెడుతున్నారు. విదేశాలకు పోయి స్థిరపడే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాపురాలు మొదలు పెట్టినప్పుడు రెండు గదుల వాటాలో గడిపినవాళ్ళు కూడా ఇప్పుడు మూడు నాలుగు పడక గదుల ఇళ్ళకు మారిపోయారు. అనుకోకుండా ఎవరయినా చుట్టమొచ్చి దిగబడితే ఎక్కడ పడుకోబెట్టాలి, తామెక్కడ నిద్ర చేయాలి అని బిక్కు బిక్కుమంటూ వుండేవాళ్ళు. ఇప్పుడో!  చెప్పుకోవడానికి మూడు బెడ్రూములు వున్నాయి, రోజూ తుడిచి, దులిపి శుభ్రం చేయడం తప్పించి, ఒక్కళ్ళూ వచ్చేవాళ్ళు లేరు అని గొణుక్కు౦టున్నారు.   సంపన్నులు నివసించే ప్రాంతాలలో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తాయి. వాటిల్లో వుండేది బిక్కుబిక్కుమంటూ ఇద్దరు ముసలి వాళ్ళు, వాళ్ళకు తోడుగా ఓ కుక్క, ఓ వాచ్ మన్. పిల్లలు మాత్రం విదేశాల్లో. విశాలమైన భవంతుల్లో ఆరుబయలు జైలు ఖైదీల్లా పెద్దవాళ్ళు. వీళ్ళు అక్కడికి పోలేరు. వాళ్ళు ఇక్కడికి రాలేరు.    
మొన్న మాకు తెలిసిన వృద్ధ దంపతులు ఆసుపత్రికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల హెల్త్ కార్డులు వున్నాయి. భార్యకి స్వైన్ ఫ్లూ అన్నారు. విడిగా ఓ విభాగంలో పెట్టారు. మర్నాడు ఆ పెద్దాయన కూడా అడ్డం పడ్డాడు. ఆయనకీ అదే వ్యాధి అని నిర్ధారించారు. కార్డుఉన్న  మనుషులు కనుక ఆసుపత్రి వాళ్ళు వెంటనే చేర్చుకున్నారు. చేర్చుకుంటూ అడిగారు, మీ పిల్లలు ఎవరూ రాలేదా అని. జవాబు చెప్పడానికి ఆయనకి జబ్బుతో పాటు సిగ్గు కూడా అడ్డం వచ్చి వుంటుంది. అబ్బాయి అమెరికాలో. అమ్మాయి ఆస్ట్రేలియాలో. డబ్బుకు కొదవలేదు. కానీ కనిపెట్టి చూసేవారే లేరు. దీన్ని ఖర్మ అనాలా! ప్రాప్తం అనాలా!  

NOTE: Courtesy Image Owner   

14, ఆగస్టు 2019, బుధవారం

Debate On Polavaram Project Reverse Tendering | News & Views#1 | hmtv Te...









ప్రతి బుధవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం  HMTV  న్యూస్  ఛానల్ లో  యాంకర్  శ్రీమతి లక్ష్మి  నిర్వహించిన న్యూస్ అండ్  వ్యూస్  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘురాం (బీజేపీ, ఫోన్ లైన్లో), శ్రీ రామనుజయ (టీడీపీ),  డాక్టర్  శ్రీధర్ (వైసీపీ).

Debate On Polavaram Project Reverse Tendering | News & Views#2 | hmtv Te...





ప్రతి బుధవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం   న్యూస్  ఛానల్ లో  యాంకర్  శ్రీమతి లక్ష్మి  నిర్వహించిన న్యూస్ అండ్  వ్యూస్  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘురాం (బీజేపీ, ఫోన్ లైన్లో), శ్రీ రామనుజయ (టీడీపీ),  డాక్టర్  శ్రీధర్ (వైసీపీ).

13, ఆగస్టు 2019, మంగళవారం

KSR Live Show | Chandrababu Naidu faces embarrassment for tweeting fake ...









ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కెఎస్ఆర్ లైవ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ లక్ష్మీ పతిరాజా (బీజేపీ), శ్రీ కరణం ధర్మ శ్రీ (వైసీపీ), శ్రీ రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ సుధాకరబాబు (వైసీపీ ఎమ్మెల్యే ఫోన్ లైన్లో)

12, ఆగస్టు 2019, సోమవారం

Is BJP To Start Targeting YSRCP In AP ? | The Debate With Venkata Krishn...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం    AP 24  7    న్యూస్  ఛానల్లో The Debate With Venkata krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సుందర రామ శర్మ(కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ కిషోర్ బాబు (బీజేపీ)