15, మార్చి 2014, శనివారం

తిరుపతి వెళ్ళొద్దాం రండి! -1


తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుందామని అనుకుంటున్నారా! అలాటి వారికి నా ఉచిత సలహా!
కళ్ళూ చెవులూ రెండూ మూసుకుని యాత్రకు బయలుదేరండి. అదెలా అని అడగకండి. అక్కడ కళ్ళు తెరిచారంటే     ముడుపులతో మునిగితేలుతున్న సిబ్బందే మీకు కనిపిస్తారు. వీరిలో పెద్ద గద్దలు, పిల్లకాకులూ అందరూ వున్నారు. మినహాయింపు ఇచ్చే వాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  అంతా కలిసి పగలంతా  పోగేసుకున్న సొమ్మును రాత్రికి రాత్రే వాటాలు వేసుకుని పంచుకుంటారన్నది  స్థానికులు  బాహాటంగా చెప్పుకునే  దేవ  రహస్యం.   యాత్రీకులు, భక్తులు (కావలనే వీరిని విడదీసి చెప్పాల్సి వస్తోంది. భక్తులందరూ యాత్రీకులు కావచ్చుకాని, యాత్రీకులందరూ భక్తులు కారు) కలసి ఆ దేవదేవుడికి   చెల్లించుకునే ముడుపుల వివరాలు  బహిర్గతం చేస్తారు కాని ఈ బలవంతపు, నిర్లజ్జపు  వసూళ్లకు లెక్కాడొక్కా వుండవు. అయితే,  ఓ అనధికార అంచనా ప్రకారం తిరుమల తిరుపతుల్లో హారతి కర్పూరం అయ్యే భక్తుల  డబ్బు,  ఇంచుమించుగా ఆ ఏడుకొండల వాడి ఆదాయం అంత వుండొచ్చట.  చెవులు మూసుకుని వెళ్ళమని చెప్పింది ఇందుకే. ఇలాటి అప్రాచ్యపు విషయాలన్నీ ముందు చెవుల్లో పడి,ఆ పిదప మనసులో దూరి వున్న కాస్త మానసిక ప్రశాంతిని  దూరం చేస్తాయి. మూసుకున్న చెవులను దర్శనం అయ్యేదాకా అలాగే వుంచండి. ఎందుకంటే, దేవుడి సన్నిధానంలో వుండాల్సిన ప్రశాంతత, నిశ్శబ్ద ఆధ్యాత్మిక వాతావరణం మచ్చుకు కూడా వుండవు. క్యూలోవెనుకవారు మీద పడుతుంటే,  తమ ప్రమేయం ఏమీ లేకుండానే ముందుకు జరిగిపోతున్న జనాలను చేతులతో ముందుకు నెడుతూ 'ముందుకు జరగండి'  అనే 'శ్రీ వారి సేవకుల' హెచ్చరికలే గర్భగుడిలో  సైతం   కర్ణ కఠోరంగా వినవస్తుంటాయి.(ఇక్కడ గర్భగుడి అనే పదం కేవలం దేవాలయం అనే అర్ధంలో మాత్రమే. సామాన్యులకు గర్భగుడిలో ప్రవేశం అందని మావే. అది 'పెట్టిపుట్టిన' పెద్దమనుషులకు మాత్రమే. మిగిలినవారికి 'లఘు' దర్శనం. 'మహా లఘు' దర్శనాలే. అసలీ పేర్లు పెట్టిన వారికి 'పద్మ శ్రీ' బిరుదులివ్వాలి.)

(నేను తిరుపతికి వెళ్ళిన సందర్భాలే తక్కువ. మళ్ళీ అందులో, పైన చెప్పిన 'పెట్టిపుట్టిన' వారి జాబితాలోనే వెళ్ళిన సందర్భాలే మరీ  ఎక్కువ. అందువల్ల ఎలాటి సిఫారసులు లేకుండా సాధారణ పద్దతిలో వెడితే యెలా వుంటుందో చూద్దామన్న కోరిక కలిగింది. ఎన్నికల కోడ్ కూడా దీనికి సహకరించింది. అలా అని అదేదో అక్కడ తూచ తప్పకుండా అమలవుతోందని అనుకుంటే  అత్యాశే సుమా!.  ఓసారి అలా వెళ్ళి వచ్చి,  తెలుసుకున్న విషయాలను నలుగురితో పంచుకోవాలని చేసిన ప్రయత్నం ఇది. అనుభవాలను చిన్న చిన్న భాగాలుగా రాయాలని సంకల్పం. ఇది కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాదు. మెచ్చుకోవాల్సిన సందర్భాలు కూడా అనుభవంలోకి వచ్చాయి. సాధ్యమైనంత నిష్పాక్షికంగా రాయాలనేది మరో ఉద్దేశ్యం. ఎవరినీ నొప్పించడం  ఈవ్యాస పరంపర లక్ష్యం ఎంతమాత్రం కాదు. - భండారు శ్రీనివాసరావు)
(15-03-2014)

12, మార్చి 2014, బుధవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 22

లెనిన్ సమాధి
1924 జనవరి 21 వ తేదీన సోవియట్ వ్యవస్థ  నిర్మాత,  అక్టోబర్ విప్లవ సారధి అయిన   వ్లాదిమిర్ లెనిన్ మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై  ఆయన  శరీరాన్ని రసాయనిక ప్రక్రియల  ప్రకారం   భద్రపరచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో  ప్రజల సందర్శనార్ధం వుంచారు.


ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు  నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ సూచకమయిన కవాతు)ని చూడడానికి జనం ఎగబడేవారు. సుశిక్షితులయిన సైనికులు, చేతుల్లో తుపాకులతో మసోలియం ప్రధాన ద్వారం వద్ద  పోతపోసిన విగ్రహాల్లా నిలబడివుండేవారు. విధి నిర్వహణ సమయం ముగిసిన తరువాత  వారినుంచి బాధ్యతలు  స్వీకరించడానికి వచ్చిన వారి సహచరులు మరబొమ్మల మాదిరిగా కవాతు చేస్తూ వచ్చేవారు. కనుమూసి తెరిచేటంతలో వారి స్థానాలకి వీళ్ళు, వీళ్ళ స్థానాలలోకి వాళ్లు తటాలున మారిపోయే దృశ్యాన్ని రెప్పలార్పకుండా చూడడానికి సందర్శకులు చలినీ, మంచునీ లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడేవారు.


(లెనిన్ సమాధి దాపులో మా ఆవిడ శ్రీమతి నిర్మలతో, శ్రీమతి సరోజ రామకృష్ణ ) 

సోవియట్ యూనియన్  విచ్చిన్నం తరువాత  ఏర్పడ్డ  కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు  ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు,  రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి  లెనిన్  మసోలియం నిర్వహణ వ్యయంకోసం ఇచ్చే  నిధులను నిలుపుచేసింది కూడా.  తదాదిగా,   అభిమానుల విరాళాలతోనే   నెట్టుకు వస్తున్నారు.
మసోలియం తెరిచి వుంచే  సమయాన్ని కూడా  బాగా తగ్గించారు. అయినా సందర్శకుల  సంఖ్య  తగ్గలేదు. భద్రతా కారణాల రీత్యా,  రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న  ఆంక్షల  వల్ల కూడా  లెనిన్ మసోలియం  సందర్శన  అనేది ఇప్పుడంత సులువయిన వ్యవహారం కాదు.
గత ఎనభై ఎనిమిది ఏళ్లుగా మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే  అపూర్వం. ఇన్నేళ్ళ నుంచి,  క్రమం తప్పకుండా ప్రతివారం  నిపుణులు లెనిన్ పార్ధివ  శరీరాన్ని  ప్రత్యేకించి చర్మాన్ని  చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడిబారకుండా తగిన  జాగ్రత్తలు తీసుకుంటారు.
పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ కాయానికి   రసాయనాలతో  ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఇందుకోసం రెండు నెలలపాటు సమాధిని మూసివేస్తారు. ఆ సమయంలో  లెనిన్ భౌతికకాయాన్ని నెల రోజులపాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి వుంచుతారు. చర్మం నెమ్మదినెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్ళీ సరయిన రీతిలో  తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తతంగం  ఉద్దేశ్యం.


డాక్టర్ ఇల్యా  జబ్రస్కీ అనే 90 సంవత్సరాల  నిపుణుడు 1934 నుంచి   1952 వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని వున్నవారిలో  వున్నారు.   ఆయన తండ్రి బోరిస్, 1924 లో లెనిన్ మరణించినప్పుడు ఆయన  శరీరాన్ని భవిష్యత్ తరాలకోసం భద్రపరచిన తొలి బృందంలో పనిచేశారు.
ఈ డాక్టర్  చెప్పేదాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు.  మొదటిసారి ఎంబామింగ్  (embalming - రసాయనిక పూత)  చేసినప్పుడే వాటినన్నింటినీ  తొలగించారు. కాకపొతే కనుబొమలు,  మీస కట్టుతల వెండ్రుకలను మాత్రం  యధాతధంగా వుంచేశారు.
పోతే,  లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరేచోట ఖననం చేయాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై  ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. యాభయ్ ఏళ్ళకంటే  తక్కువ వయసున్న రష్యన్లలో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూవుండడం విశేషం. లెనిన్ ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని  తొలగించి  సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపొతే, ఆ  కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో  నాజీల నుంచి  బాంబు దాడి ముప్పు వుండగలదన్న భయంతో ఆ పని చేశారు.
‘లెనిన్ మసోలియం నుంచి ఆయన  శరీరాన్ని  తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక యెంతమాత్రం అనుమతించకూడదు’  అనేవారి సంఖ్య  ఇప్పుడు ఆ దేశంలో  క్రమంగా పెరుగుతోంది.  నిజానికి లెనిన్ కూడా తన తదనంతరం  తన భౌతిక కాయాన్ని ఇలా భద్రపరచాలని  ఎన్నడు  కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన  భార్య  నదేజ్డా కృపస్కయా చేసిన విజ్ఞప్తి  కూడా అదే.  లెనిన్ పేరు మీద ఏవిధమయిన  స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను  ఆవిడ కోరారు.
కానీ, అప్పటి  సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతిక కాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు. దానితో  ఆవిడ సూచనలను  ఎవరూ  పట్టించుకోలేదు.
స్టాలిన్  చొరవతో పనులు శరవేగంతో సాగాయి. ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఒక మసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు.
ఇందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి   ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద  పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా  జారీ అయ్యాయి. అయితే ఇందుకు   చాలా సమయం పట్టేట్టు వుండడం,  లెనిన్ భౌతిక కాయం శిధిలం అయ్యే సూచనలు కానరావడంతో  ఆ ప్రయత్నం మానుకున్నారు. ఎంబామింగ్  చేసి,  రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు.   కొద్ది రోజులపాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం  ఈ విధానం ద్వారా సాధ్యం. ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ. కానీ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్విత ప్రాతిపదికపై  ఏళ్ళ తరబడి పాడయిపోకుండా  చేయడం యెలా అన్నది ఆనాటికి  కనీవినీ ఎరుగని  విషయం.
ఉక్రెయిన్ లో అనాటమీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్  వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం ఈ బృహత్తర  కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. అంతేకాదు, అసాధ్యం అనుకున్న ఈ పనిని  జయప్రదంగా పూర్తిచేసింది.


అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడడంతో  ప్రభుత్వం చురుగ్గా కదిలింది.  సోవియట్  సైనికులు నిరంతరాయంగా శ్రమించి అరుణ వర్ణం కలిగిన చలువరాతితో మరో మసోలియాన్ని క్రెమ్లిన్ గోడ దాపునే  ఆఘమేఘాలమీద నిర్మించారు. లెనిన్ బౌతిక కాయాన్ని అందులోకి తరలించారు.
1953 లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్  చేసి లెనిన్ మసోలియంలోనే  ఆయన దేహం  సరసనే  భద్రపరిచారు.  ఆ తరువాత కృశ్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతిక కాయాన్ని అక్కడనుంచి తొలగించి  క్రెమ్లిన్ గోడ పక్కన  ఖననం చేశారు.
గోర్భచెవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్ సిన్  ‘రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను  తలపించేదిగా వుండరాదని’  అభిప్రాయపడ్డారు. అయితే,  లెనిన్ శరీరాన్ని అక్కడనుంచి తొలగించడం  అప్పట్లో సాధ్యం కాలేదు.  పుతిన్ మూడో పర్యాయం రష్యా అధినేతగా ఎన్నికయిన  తరువాత మళ్ళీ ఈ మధ్యకాలంలో  ఈ ఆలోచన  కొత్త చిగుళ్ళు వేస్తున్నట్టు అనిపిస్తోంది.
2024 సంవత్సరానికి  కామ్రేడ్  లెనిన్ కన్ను మూసి వందేళ్ళు పూర్తవుతాయి. అప్పటిదాకా ఆగుతారా  లేక ఈ లోగానే  అంతపనీ చేస్తారా – వేచి చూడాలి.

పాతికేళ్ళనాటి మాస్కో - 21

అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు.
ఇటీవల కొందరు అనువాదం గురించి వెల్లడిస్తున్న అభిప్రాయాలు చదువుతున్నప్పుడు నేనూ కొన్ని భావాలను పంచుకోవాలని అనిపించింది.


కీర్తి శేషులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు లోగడ ’అనువాద సమస్యలు’ అనే పుస్తకం రాశారు. నేను పాతికేళ్ళ క్రితం మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని రికార్డ్ చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో మాస్కో ‘రాదుగ’  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఈ మధ్యనే ఆయన చనిపోయారు)  నాకు ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ‘రారా’ గా ప్రసిద్ధులయిన రెడ్డి గారు రాసిన ఈ పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. అనువాద సమస్యలు అన్నింటికీ ఈ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.
నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.

కాబట్టి, రాసేది  అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి.                      

11, మార్చి 2014, మంగళవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 20


ఆస్తాంకినో టీవీ టవర్



అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన ఈ ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి.


మబ్బుల్ని చీల్చుకుని కానవస్తున్న టీవీ టవర్ 


ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.
‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపొతే వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అన్న ఆనిమల్ ఫాం రచయిత సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు అందులో వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి. ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి. కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.   
Courtesy Image owners       

చెఖోవ్ చెప్పిన చిన్న కధ

‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’

చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.
టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.

బుడుగు

 (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)  






(ఇంగ్లీషులో TINTUMON అని మరో బుడుగ్గాయ్ వున్నాట్ట. వాడి గురించిన ఇంగ్లీష్ జోకులు ఈ మధ్య ఎవరో పంపితే వాటిని   అచ్చ తెలుగులో అనువదిస్తే యెలా వుంటుందన్న ఆలోచనకు అక్షర రూపమే ఇది.- అచ్చంగా ఇది నా సొంతం కాదని బ్లాగు గుద్ది మరీ మనవి చేసుకుంటున్నాను.- భండారు శ్రీనివాసరావు)




“ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?”

“నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.”

“అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?”

“యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.”



బుడుగుని తీసుకుని వాళ్ల నాన్న ఆరోజు జూ పార్క్ కు వెళ్లాడు. బోనులో వున్న పులిని చూపించి అది ఎంత భయంకరమయిన జంతువో కొడుక్కుచెప్పసాగాడు.ఓ కంటితో పులిని చూస్తూ ఓ చెవితో తండ్రి చెబుతున్నది వింటున్న బుడుగు వున్నట్టుండి ఇలా అడిగాడు. “పులి అమాంతం బయటకు వచ్చి నిన్ను తినేసింధనుకో. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను యే బస్సు ఎక్కాలి?”



బుడుగు స్కూలుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు. బుడుగును పిలిచి ఏదయినా స్లోగన్ రాయమన్నారు. బుడుగు రాసిన స్లోగన్ ఇలా వుంది.

“ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి”



బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది.

“ఏమిటిది ? ఇది స్కూలనుకున్నారా!మీ ఇల్లనుకున్నారా! వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు.

బుడుగు లేచి అన్నాడు.

“సరే!ముందు మీరు మొదలు పెట్టండి”



బుడుగుతో టీచరు చెప్పింది.

“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”

బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.

“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.



మెడిసిన్ చదువుతున్న సీగాన పెసూనాంబ అనే రెండు జెళ్ళ సీతను వాళ్ళింటి కొచ్చిన ప్రొఫెసర్ అడిగాడు.

“ఎటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏమిటి” అని.

పక్కనున్న బుడుగు వెంటనే జవాబు చెప్పాడు.

“జంబలకడి పంబ”

ప్రొఫెసర్ అర్ధం కాలేదన్నాడు.

“మీరడిగింది నాకూ అంతే”-బుడుగు జవాబు.


10, మార్చి 2014, సోమవారం

కుమ్మేసుకుందాం రండి


ఈరోజు మీదే. కుమ్మేసుకోండిఅన్నాడు గుర్నాధం.
గుర్నాధం నాకు రెండేళ్ళ నుంచి పరిచయం. వాళ్ల టీవీ ప్రోగ్రాం కు వెళ్ళినప్పుడల్లా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తాడు. అతని నోట ఎప్పుడూ ఇలాటి అపభ్రంశపు మాటలు వినలేదు. ఇవ్వాలేమిటి ఇలా!  అందుకే ఆ మాట వినబడనట్టు నటిస్తూ స్టుడియో లోపలకు నడిచాను. ఆ వాతావరణం నాకు కొత్త కాదు. లైట్లూ, మూవింగ్ కెమెరాలు, కెమెరామన్లు(టింగ్లీష్) ఏదీ, ఎవరూ కొత్త కాదు. కాకపొతే ఆరోజు నేను నిర్వహించే పాత్రే కొత్తది.
ఆరోజు జర్నలిష్టుల దినం అట. అందుకని కొత్తగా వుంటుందని, కాస్త కొత్తదనం చూపించాలని  నాకీ కొత్త అవతారం ఇచ్చి ఆరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం నిర్వహించమన్నారు. అంటే యాంఖరయ్యపాత్ర అన్నమాట. రోజూ కూర్చుండే ప్రదేశమే అయినా కుర్చీ మారింది. చెవులకు ఏవో తగిలించి కూర్చోబెట్టారు. రేడియోలో నాలుగయిదు స్టేషన్లు కలిసినట్టు ఏవేవో నానారకాల ధ్వనులు కలగాపులగంగా వినీవినబడనట్టు వినబడుతున్నాయి. మైక్ టెస్టులు అయి, పత్రికావార్తల పఠనం పూర్తయి మొదటి బ్రేకుపడినప్పుడు అతిధులు ఒక్కొక్కరుగా వచ్చి కూర్చున్నారు. నాలుగు పార్టీలకు చెందిన వాళ్లు వాళ్లు. కాకపోతే ఇటీవలి కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల కారణంగా వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఈ మధ్యనే పార్టీలు మారడమే కాకుండా ఇన్నాళ్ళుగా కత్తులు దూస్తూ వచ్చిన పార్టీల్లోకే స్వగృహ ప్రవేశం చేశారు. ఇన్నాళ్ళుగా విశ్లేషక పాత్ర కాబట్టి వాళ్లు ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మారినా నాకొచ్చిన ఇబ్బంది ఏమీలేదు. ఎవరి పద్యాలు (వాదాలు) వాళ్లు పాడేవారు. పార్టీ మారిన వాళ్లు కాస్త జాగ్రత్తగా వొళ్ళు దగ్గరపెట్టుకుని కొత్త పార్టీ వాళ్లు రాసిచ్చిన పాత పాటల్నే ఆలపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొత్త వేషంలో వున్న నేను,  వాళ్లు ఇప్పుడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ముందు అర్ధం చేసుకుని ఆపైన వాళ్ళను ప్రశ్నలు అడగాలి. పార్టీ మారిన వాళ్ళను సరిగా గుర్తుపట్టలేకపోతే వాళ్లకు వచ్చే కొత్త నష్టం ఏమీ లేకపోవచ్చుకానీ నన్ను నమ్ముకుని పెట్టుకున్న ప్రోగ్రాం అభాసు పాలు అయ్యే అవకాశం వుంటుంది. కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన మహత్తర బాధ్యత నా మీదకే వచ్చిపడింది. అంచేత, ముందు  వొళ్ళూ, ఆ తరువాత  గొంతూ సర్దుకుని,  కుర్చీలో కాస్త వొంగి కూర్చుని (లేకపోతే యాంఖర్ అనుకోరేమో అని లోపల అనుమానం) నంగిగా పలకరింపుల చిరునవ్వులు రువ్వాను.
చెవులో జోరీగలాగా లోపలనుంచి ప్రోగ్రాం వాళ్లు రొదచేస్తున్నా పట్టించుకోకుండా ఫలానా వాళ్లు ఫలానా ఫలానా పార్టీలవాళ్ళు అంటూ పరిచయం చేయబోయి తొట్రుపడి ఒక పేరుకు మరో పార్టీ పేరు చెప్పి  మరో పేరుకు ఇంకో  పార్టీ పేరు చెప్పి ఆ తరువాత తీరిగ్గా  నాలిక్కరుచుకున్నాను. వాళ్లకు నేను చేసిన తప్పేమిటో తెలిసింది. కాని, కన్నంలో తేలు కుట్టిన దొంగలల్లే మిన్నకుండిపోయారు.
సరే! ప్రోగ్రాం మొదలయింది.
మొన్న ఢిల్లీలో....మొదలు పెట్టాను.
తెదేపా ప్రతినిధి అడ్డుకున్నాడు.
ఏం జరిగింది ఢిల్లీలో. మా నాయకుడు అంత పెద్ద వయస్సులో కూడా అంత పెద్ద వయస్సును కూడా లెక్క చేయకుండా అంతమంది తెలుగువారి....
“అసలు తెలుగువారి గురించి మాట్లాడే నైతిక హక్కు ....వైకాపా ప్రతినిధి అందుకున్నాడు.
మీరు మాట్లాడుతుంటే నేను మారు మాట్లాడకుండా విన్నాను. అలాగే...
అసలు నేను మాట్లాడింది ఎక్కడ ? ...ముందు మీరే కదా మా నాయకుడు అంటూ మాలావు గింజుకున్నారు.
ఆ మాటకు వస్తే తెలుగువారి గురించి, మళ్ళీ అదే మాటకు మళ్ళీ వస్తే యావత్ ప్రజలు గురించి, వారి కష్టాలు గురించి వారి నష్టాలు గురించి మాట్లాడే ఏకైక హక్కు శ్రీమతి ఇందిరాగాంధి  కుటుంబానికి చెందిన వారి కోడలు శ్రీమతి సోనియా గాంధీ గారి మార్గ దర్శకత్వంలోనూ,  వారి కుమారుడు, భావి భారత ఆశాజ్యోతి, కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనూ  నిద్రాహారాలు లేకుండా, అహరహమూ  శ్రమిస్తున్న ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నదని  నేను మనవిచేసుకుంటూ ఇంకా ఇంకా  చెప్పెదేమిటంటే ....కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం  ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళా నాయకురాలు నోరువిప్పి మళ్ళీ మూయడం మరిచిపోయి మాట్లాడడం మొదలెట్టారు.
ఏమిటి మీకున్న హక్కు ?  ప్రజలపేరు చెబుతూ ఆ ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా? స్కాముల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పడమా ? ఏమిటి మీకున్న హక్కు ?”
ఎవరో కొల్లగొట్టారని చెప్పే హక్కు మీకెక్కడిది? కొల్లగొట్టింది మీరందరూ. కొల్లగొట్టబడింది మేము. వుంటే గింటే, అయితే గియితే ఆ తరతరాల హక్కు,   ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక తరాలుగా పోరాటం చేసిన మాది”  టీ ఆర్ఎస్ ఆయన అందుకున్నాడు.   
చెవిలో ఏదో చెబుతున్నారు. ఎవరో శ్రోత లైన్లో వున్నారని.
పరిస్తితిని కాపాడడానికి ఇదే అదను.
ఒక్క నిమిషం  ఆగండి. కరీంనగర్ నుంచి వరహాలరావు గారు లైన్లో వున్నారుఅనేసి మానిటర్ వైపు చూసి అందులో నా మొహం కనబడడం లేదని నిర్ధారించుకుని ఎదురుగా పెట్టిన గ్లాసులోని నీళ్ళను చుక్క మిగలకుండా తాగేశాను.
ఇంతలో వరహాలరావు గారి కంఠం వినబడింది.
ముందాయనకు చెప్పండి. నాపేరు వరహాలరావు కాదు. రత్నాకరరాజు. మా వూరు కరీం నగర్ కాదు కాశీబుగ్గ
ఓహో! అలాగా ! నాకు కొత్త కదండీ . అందుకని కొత్తగా చెప్పాలనుకుని కొత్త పేరు కొత్త వూరు చెప్పాను. ఇంతకీ రావుగారు... అదే అదే రాజు గారు మీరు ఎవర్ని యేమని అడగాలనుకుంటున్నారు?”
నేను ఎవర్ని, యేమని అడగాలని అనుకుని లైన్లోకి రాలేదండి. అసలీ ప్రోగ్రాముల వల్ల ఏం సాధించాలని అనుకుంటున్నారో మీరు చెప్పండి.
ఒక్క రోజు భాగోతానికి మూతి మీసాలు పోయాయన్నట్టు ఈఒక్క రోజు యాంఖర్ వేషం యెందుకు కట్టానురా అనుకుంటు నాలో నేనే మధన పడుతుంటే చెవుల్లో బ్రేక్ చెప్పండి. ఆలస్యం అయితే ఎడ్వర్టైజ్ మెంటు వాళ్ళతో గోలఅని వినబడడంతో అమ్మయ్య అనుకుని ఇప్పుడొక చిన్న విరామంఅంటూ పెద్ద బ్రేక్ ఇచ్చేసాను.
ఆపేసిన తరువాత కూడా ఫ్యాన్ కాసేపు తిరిగినట్టు ఆ తరువాత కూడా వారి వాదప్రతివాదాలు కొనసాగుతూనే వున్నాయి.
ఈ మధ్యలో మా ఆవిడ గొంతు.
అదెలా. ఆవిడ ఎక్కడికయినా ఎప్పుడయినా రావచ్చుకాని చెప్పాపెట్టకుండా ఇలా వెంటపడి స్టుడియోలకి కూడా వస్తుంటే యెలా?
ఏమండీ ఏమైంది ఎందుకలా చెమటలు పట్టాయి. లేచి నీళ్ళు తాగండిఅంటోంది.
అయ్యో ఇదంతా కలా!

అయ్యో ఏమిటి అపభ్రంశంగా! అమ్మయ్య అనుకోవాలి కాని.