ప్రధానిగా వున్నంతకాలం అందరూ
‘ఆహా!
ఓహో!!’ అన్నారు.
పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ
ఆర్ధిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి
మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠం పై వుంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత,
ఆయన పదవి నుంచి దిగిపోయిన తరువాత పొగిడిన ఆ నోళ్ల తోనే – తెగడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు
అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ ‘పదవే’ సర్వస్వమయిన కాంగ్రెస్ వారికి ‘ఆయన భజనే’ సర్వస్వమయిపోయింది.
పీవీని విమర్శించిన ‘పత్తిత్తులకు’ ఆయన చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ – వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’ – న్యాయస్థానాలలో నిస్సహాయంగా
‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా
ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా
పీవీని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’ అనే పదాలకి
తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం
చేయడానికే ఈ ఉదాహరణ.

(పీవీతో సోనియాగాంధీ)
పీవీ మరణించడానికి కొన్ని
నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస
చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన
కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
మాజీ ప్రధానిగా పీవీ రాజ
భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో
నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం
వెళ్లి - ఆ పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్
భవన్ గెస్ట్ హౌస్
మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి
చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు
వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని ‘పీవీ గారిని చూడడం
వీలుపడుతుందా’ అని
అడిగాము. అతడు తాపీగా 'లోపలకు
వెళ్ళండి' అన్నట్టు
సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు
అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు.
డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు
ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది.
ఎప్పుడో దశాబ్దాల క్రితం,
పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు
సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా
కొద్దికాలం పనిచేశారు.
అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి
విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన
అవసరం ఆయనకు
లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం.
ఆ తరవాత కూడా ఆయన ఏదో
మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి
కూర్చుంది – కొన్నేళ్ళ
క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ
కూర్చున్నాము. కాసేపటి తరవాత –
కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ
గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం
మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.