6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

రేడియో రోజులు (ప్రారంభం)


పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా  సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై.  అబ్ ఆప్  వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’
ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది.  నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.     

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో,  ‘డెక్కన్ రేడియో’ అనే పేరుతో  ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్  ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం  ఒక కుటుంబం ఆద్వర్యంలో ఏర్పడింది.  ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు,  పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.  
మొహరం మాసంలో  రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.         
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్  రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్  లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది.  నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి  మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు.  నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే   డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్  ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.


(డెక్కన్ రేడియో స్టూడియోలో అలనాటి సంగీతకారులు)

తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి  విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్  బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే  వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో   ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.   

(సమాచార సేకరణకు సహకరించిన అనేకానేకమందికి అనేక వందనాలు. కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు - 06-09-2013)            

5, సెప్టెంబర్ 2013, గురువారం

చూసయినా నేర్చుకుందాం!



అదొక సువిశాల భవన ప్రాంగణం.
సుదూరంగా కెమెరా కన్ను నుంచి చూస్తే అంతా నిర్మానుష్యంగా వుంది. ఆ భవనం ప్రవేశ ద్వారం వద్ద ఓ వ్యక్తి వొంటరిగా నిలబడి వున్నాడు. కనుచూపుమేరలో ఎవరూ లేరు.  ఇంతలో ఓ పొడవాటి  నల్లటి మోటారు వాహనం అక్కడికి చేరుకుంది. దానికీ వెనుకా ముందూ ఎలాటి వాహనాలు లేవు. అందులో నుంచి ముందుగా  డ్రైవర్ దిగి వెనుక వైపు డోరు తెరిచిపట్టుకున్నాడు. ఒకే వ్యక్తి ఆ కారునుంచి దిగాడు.  కోటు బొత్తాములు సవరించుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటివరకు అక్కడ వొంటరిగా వేచివున్న వ్యక్తి రెండు అడుగులు ముందుకు వేసి కారులోనుంచి దిగిన వ్యక్తితో ఆప్యాయంగా  కరచాలనం చేశాడు. ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ద్వారం వైపు చేయి చూపించి  ఇతర అతిధుల రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయాడు. ఆ  వచ్చిన వ్యక్తి కూడా ఎవరికోసం ఎదురు చూడకుండానే  ఎవ్వరూ తోడు లేకుండానే వొంటరిగా నడుచుకుంటూ  లోపలికి వెళ్ళిపోయాడు.


(నిజంగానే ఇద్దరే ఇద్దరు)


చాలా దూరంనుంచి ఈ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న అనేక   టెలివిజన్ కెమెరాలు  దాన్ని  ప్రపంచ వ్యాప్తంగా తమ చానళ్ళలో  ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఎందుకంటే ఆ ఇద్దరూ సామాన్యులు కారు. కారునుంచి దిగివచ్చిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆయనకు స్వాగతం పలికిన వ్యక్తి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇదంతా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీఐపీ భద్రత పేరుతో ఎంతో హడావిడి చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలుచేసే అనుభవాలకు  అలవాటుపడిన ప్రాణాలకు ఈ రకమైన దృశ్యాలు నిజంగా ఎంతగానో వూరట కలిగిస్తాయి. అలా అని వాళ్లు భద్రతా చర్యల పట్ల ప్రమత్తంగా వుంటున్నారని కాదు. ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్ధవంతంగా వుపయోగించుకుంటున్నారని వేరే చెప్పనక్కరలేదు కూడా.  
మన దేశంలో ఈ దృశ్యం మరోరకంగా కానవస్తుంది.  ఒక స్థాయి కలిగిన నాయకులు కలుసుకున్నప్పుడు సయితం  కళ్ళు తిరిగే హడావిడి.  మందీ మార్బలం, పుష్పగుచ్చాలతో సంసిద్ధంగా వుండే  వ్యక్తిగత సిబ్బంది, ఏకే 47 వంటి తుపాకులు ధరించిన బ్లాక్ క్యాట్ బాడీ గార్డులు, ఎటుచూసినా అడుగడుగునా సాయుధ పోలీసు అధికారులు. ఇక విదేశీ ప్రముఖులు వస్తే చెప్పనక్కరలేదు. భద్రత పేరుతొ జనాలను కాల్చుకు తింటారు. చెప్పొచ్చేది ఏమిటంటే ఇలాటివాటిని చూసి నేర్చుకునేది ఏమైనా వుంటుందా అన్నదే. 


(సదస్సు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు నిర్మానుష్యంగా వున్న భవనప్రాంగణం) 
             
పోతే, యావత్  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో తొంభయ్ శాతానికి బాధ్యత వహిస్తున్న ఇరవై దేశాల అధినాయకుల సమావేశం కొద్దిసేపటి క్రితమే ఆ భవనంలో ప్రారంభం అయింది. రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్ (కమ్యూనిస్టుల ఏలుబడిలో లెనిన్ గ్రాడ్ గా పేరు మార్చుకున్న ఈ మూడు వందల ఏళ్ళ ప్రాచీన నగరం, కమ్యూనిస్టుల శకం అంతరించిన తరువాత తిరిగి పూర్వ నామానికి మారిపోయింది.)  పొలిమేరల్లోని కాన్ స్టాన్ టిన్ ప్రాసాదం  ‘రష్యా జీ- 20 సదస్సు’కు వేదికగా మారింది.  సిరియా పరిణామాల నేపధ్యంలో జరుగుతున్న ఈ సదస్సులో అగ్ర రాజ్యాల నాయకుల వైఖరులు యెలా వుండబోతున్నాయన్న అంశంపైనే విదేశీ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.  (05-09-2013)

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు



సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నానుఅని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడుఅని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.
గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.
ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.
తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు
ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.
మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.
1921 వ  సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.
పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.
ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.
అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు  చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.


(శివరాజు అప్పయ్య పంతులు గారు)

గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -

గురుద్దేవో నమః


(Today 5th September is TEACHERS DAY)

4, సెప్టెంబర్ 2013, బుధవారం

యోగ్యతాపత్రం


ఒక్కో రోజు అలాగే. అనుకోకుండా ఈ రోజు ఓ మంచి ముక్క, మరో యోగ్యతాపత్రం. సంతోషించడానికి ఇంకేం కావాలి. ఫేస్ బుక్ లో నేను రాసిన ఓ వ్యాసం పట్ల యండమూరి వీరేంద్ర నాథ్ గారి విశ్లేషనాత్మక స్పందన ఒకటయితే (Yandamoori Veerendranath this is what i wrote 10 years ago about subsidies, in my book MINDPOWER. all this is for votes. hence even opposition could not say 'no' to it. if possible read, our former Reservebank secretary's remark, how this is going to ruin our country with this bill... how states would suffer.)
సాయి గారి ఇంటింటి పత్రిక ‘రచన’ (సెప్టెంబర్ సంచిక) లో శ్రీ డి. వెంకట్రామయ్య గారి ప్రేమపూర్వక ప్రస్తావనలు.
చాలా వివరంగా రాసిన ఆయన వ్యాసాన్ని కాస్త కుదిస్తే – (అంతా నా గురించే కాబట్టి యెంత కుదించినా కాస్త ఎక్కువే అనిపిస్తే క్షమించాలి)
వెంకట్రామయ్యగారి ఉవాచ:


“హైదరాబాదు ఆకాశ వాణి వార్తావిభాగంలో మిగతా అందరికంటే నాతొ ఎక్కువ కాలం పనిచేసిన సహోద్యోగి, మిగతా అందరి కంటే నాకు అత్యంత ఆప్తుడు భండారు శ్రీని వాసరావు. 1975  లో ఆయన చేరినప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు నలభయ్ ఏళ్ళు మా స్నేహం చెక్కుచెదరకుండా వుంది. ...ఎన్నో విషయాల్లో ఏ మాత్రం పోలికా పొంతనా లేని మేమిద్దరం స్నేహితులుగా అన్నేళ్ళు అంత దగ్గరగా వుండడమే విచిత్రం.
“ఎప్పుడు నవ్వుతు, తుళ్ళుతూ గలగలా మాట్లాడుతూ వుండడం, తన వాక్చాతుర్యంతో,చమత్కారాలతో, చలోక్తులతో, వ్యంగోక్తులతో చుట్టూ వున్నవాళ్లనందరినీ కవ్విస్తూ నవ్విస్తూ వుండడం ఆయన సహజ లక్షణాలు. అసలీ మనిషి జీవితంలో ఎన్నడయినా  విచారం విషాదంలాంటివేమైనా వుంటాయా, ఎప్పుడయినా ఏ సందర్భంలో నయినా ఈయన సీరియస్ గా వుంటాడా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వాళ్ళందరికీ.
“ న్యూస్ రూమ్ అంటేనే వాతావరణం ఎప్పుడు ఎంతో కొంత ఉద్విగ్నంగా వుంటుంది. కాని శ్రీనివాసరావు అక్కడ వుంటే చాలు వేడి తగ్గిపోయేది. ఆయన మాటలతో, చలోక్తులతో అందరూ కాసేపు హాయిగా నవ్వుకునే వారు. కాస్త విశ్రాంతి దొరికినట్టుగా, వూరట లభించినట్టుగా అనిపించేది పనిచేసేవాళ్లకి.
“సరే! కొత్తగా వచ్చి చేరిన ఈ శ్రీనివాసరావు అనే ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన  పనితీరు యెలా వుంటుంది అని మొదట్లో అన్నీ సందేహాలే. ఇలాటివన్నీ తెలుసుకోవడానికీ, ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికీ అధమ పక్షం ఆరు మాసాలు పట్టింది. (పూర్తిగా అన్నమాట వాడకూడదేమో. ఎందుకంటే అప్పుడే కాదు.. ఇన్నేళ్ళ తరువాత కూడా నా మిత్రుడు భండారు శ్రీనివాసరావు లీలలూ, మాటలూ నాకు పూర్తిగా అర్ధం కావు)

(భండారు శ్రీనివాసరావుతో డి.వెంకట్రామయ్యగారి అనుభవాలు మరికొన్ని వచ్చే సంచికలో- ఎడిటర్) 
04-09-2013                

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఫుడ్ సెక్యూరిటీ


క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు గురించి తెలుసా అని.
తక్కున జవాబు వచ్చింది.
‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం దీని ఉద్దేశ్యం’ 


ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.
అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను సగటు తీసి గ్రేడ్లు ఇస్తారు.
సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.
కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.
చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.
ఈసారి అందరికీ తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం మానేశారు.
చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
చివరికి ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.
ఆ తరువాత ప్రొఫెసర్ చెప్పారు.
‘ఫుడ్ సెక్యూరిటీ బిల్లు వల్ల ఏం జరుగుతుందో మీ అందరికీ  అర్ధం అయిందనుకుంటాను.’ 
ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
 ‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,  
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు. మన ప్రధాన మంత్రి గారయినా అంతే. రాజకీయ అవతారం ఎత్తిన తరువాత ఆర్ధిక శాస్త్రాన్ని మరచిపోవాలి.
అదే జరుగుతోంది.

(నెట్లో కంటబడ్డ కధనానికి స్వేచ్చానువాదం)

03-09-2013

ఈ కార్టూన్ కి ఓ క్యాప్షన్ పెట్టండి ప్లీజ్


(ఇది నా సొంత ఐడియా కాదు, గతంలో బాపూ రమణలు 'జ్యోతి' పత్రికలో ఇలాటి ఆటలు ఎన్నో పాఠకులతో ఆడేవాళ్ళు)


చెత్త బండిగా రోల్స్ రాయిస్



పురుషులలో పుణ్య పురుషుల మాదిరిగా కార్లలో రోల్స్ రాయిస్ రాయసమే వేరు. గొప్ప గొప్ప వాళ్లు కొనుక్కుని గొప్పగా చెప్పుకునే ఆ గొప్ప కారును ‘చెత్త బండీ’గా వాడిన ఘనత ఒక భారతీయుడిది. నమ్మి తీరమంటోంది ఓ  ‘నెట్ కధనం.’
1940 కి పూర్వం ఆనాటి మైసూరు మహారాజా గారు ఇంగ్లాండ్ కి విహార యాత్రకి వెళ్లారు. లండన్ లో రోల్స్ రాయిస్ కార్ల షో రూమ్ కి వెళ్ళి అక్కడ కొత్త మోడల్ కారును చూసి ముచ్చటపడ్డారు. కానీ ఆ షో రూమ్ వారికి ఈయన ఎవరో తెలియదు. అది అందరికీ అమ్మే అల్లాటప్పా కారు కాదన్నట్టు చెప్పి  తిప్పి పంపించారు.
రాజావారికి రోషం పొడుచుకు వచ్చింది. స్వదేశానికి వచ్చిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వంలో తనకున్న సంబంధాలను వాడుకుని ఇంగ్లాండ్ నుంచి ఒక రోల్స్ రాయిస్ కారును ఆఘమేఘాల మీద దిగుమతి చేయించుకున్నారు. లండన్ లో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని అనిపించింది. వెంటనే ఆ కొత్త రోల్స్ రాయిస్ కారును రాజప్రాసాదంలో చెత్త రవాణా చేసే  వాహనంగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
దేశదేశాల్లో జనాల మన్ననలు అందుకుంటున్న తమ కారుకు మైసూరు రాజభవనంలో పట్టిన దుస్తితి రోల్స్ రాయిస్ కంపెనీ దృష్టికి వచ్చింది. ఆ కంపెనీ ప్రతినిధులు లబోదిబోమంటూ మైసూరుకు వచ్చి తమ కారు ప్రతిష్టకు భంగం కలిగించవద్దని మొర పెట్టుకున్నారు. అంతగా కావాలంటే కారు ధరకు ఎక్కువ మొత్తం చెల్లించి తమ కారును తాము తీసుకుపోతామని విన్నపం చేసుకున్నారు.
అంతా విని మైసూరు రాజా గారు మీసాలు సవరించుకుంటూ వారితో ఇలా అన్నారు.
“ ఆ మాటయితే ఓ పని చేయండి. రాజప్రాసాదంలో  చెత్త రోజుజుకూ పెరిగి పోతోంది.  మరో రెండు రోల్స్ రాయిస్ కార్లు వెంటనే పంపించండి. ధర ఎంతయినా పరవాలేదు.”
అప్పటినుంచి లండన్ లో రోల్స్ రాయిస్ షో రూమ్ కు  భారతీయులు ఎవ్వరు వెళ్ళినా వారిని మహారాజుల  మాదిరిగా చూడడం మొదలయింది.

 ‘యేమో ఏ పుట్టలో ఏ పాముందో’ అనే భయం అక్కడివారిని  పట్టుకున్నట్టుంది.