6, జూన్ 2013, గురువారం

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు



ఒకటి పక్కన పన్నెండు సున్నాలు అంటే ఇంగ్లీష్ లో ట్రిలియన్అంటారు. సంఖ్యలని లెక్కపెట్టడానికి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇలా లెక్కించే విధానం పాశ్చాత్య దేశాల్లో అమల్లో వుంది. నాలుగు ట్రిలియన్లు అంటే నాలుగు పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి. 2008 లో ప్రపంచ దేశాలలోని జనాలు పరస్పరం పంపుకున్న ఎస్ ఎం ఎస్లకు ఇది సమానం.
ఇదొక లెక్కమాత్రమే. అసలు లెక్క ఇంకాస్త ఎక్కువే కానీ సున్నాలగందరగోళం ఎక్కువై అసలు విషయంగుండు సున్నా అవుతుందేమోనని ఇవ్వడం లేదు. (ఇప్పుడు నడుస్తోంది – 2013. అంటే ఈ సంఖ్య ఎంతకు పెరిగి వుంటుందన్నది వూహకు కూడా అందదు)
పల్లెటూళ్ళకు కూడా పాకిన ఈ ఎస్ ఎం ఎస్ల కధాకమామిషూ ఏమిటో ఓసారి చూద్దాం.
ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ బుల్లి పరికరంఈనాడు హస్తభూషణంగా తయారయి కూర్చుంది. ఇంటికి ఒక్క ఫోనేఅబ్బురమనుకునే దేశంలో ఇంట్లోవున్న నలుగురూ నాలుగు ఫోన్లు ఎనిమిది రింగులుగా కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది.
635 510 000
అంటే ఫోన్ నెంబర్ అనుకునేరు ఒక లెక్క ప్రకారం రెండేళ్ళ క్రితం మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య ఇది. అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ.
మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ఎస్ ఎం ఎస్ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది.
  అప్పటినుంచి ఈ చిట్టి పొట్టి సందేశాల సాంకేతిక పిట్టప్రయాణం ఎదురులేకుండా సాగిపోయింది. అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలకు పనికివచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో – ‘ఎస్ ఎం ఎస్ల విశ్వవిహారం మొదలయింది. ఇంగ్లండ్ లో 2006 డిసెంబర్  లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒకే ఒక్కరోజున - యిరవై కోట్ల పైచిలుకుఎస్ ఎం ఎస్లు - పండుగ  శుభాకాంక్షలు తెలుపుతూ - ‘ఫోన్లు మారాయి.
ఈ లెక్కన ఈ లెక్కలు ఇప్పటికి ఎంతగా పెరిగాయన్నది లెక్కలు కట్టాల్సివుంది.
కానీ ఇలాటి లెక్కలు తీసేవాళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం – 2006 నాటికే ఈ ఎస్ ఎం ఎస్ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై బిలియన్ డాలర్లు దాటిపోయింది.
అమెరికాలాంటి దేశాల్లో వినియోగదారుల నుంచి ఒక్కొక్క ఎస్.ఎం.ఎస్.కు పదకొండు సెంట్లు వసూలు చేస్తున్నారు. మరి ఈ వసూలు రాజాలకు ఇందుకయ్యే ఖర్చు చిల్లి సెంటుకూడా వుండదు. దీన్ని నిలువు దోపిడీ అనాలా లేక అదనపు సదుపాయం కల్పిస్తున్నందుకు వసూలు చేస్తున్న అదనపుచార్జీ అనాలా! బియ్యం మిల్లు యజమానులకుతవుడుఅప్పనంగా మిగిలినట్టే, ఈ కంపెనీలకు ఇదొక అదనపు ఆదాయం.
ఇందులో ఇంతవుంది కాబట్టే ఎస్ ఎం ఎస్ ల పేరుతొ ఇన్నిన్ని స్కీములు, ఇన్నిన్నిగేములు.


పేలాలు పంచి పప్పులు దంచుకునేందుకు ఇంకెన్నో టక్కు టమారాలు.

పట్టుకుంటే పట్టు చీరెనుంచి ఆటాడుకుందాం రావరకు అన్నే ఎస్ ఎం ఎస్గేములే.

ప్రతి టీవీ చానల్ లో ప్రతి అంశం మీదా ప్రజాభిప్రాయసేకరణలే. ఎస్ ఎం ఎస్లు పంపాలని కోరని చానల్ తెలుగునాట కలికానికి కూడా కానరావడం లేదు.

పైగా ఈ ఎస్.ఎం.ఎస్.’ ల కు వసూలు చేసే ఛార్జీ ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువ. కానీ తియ్య నీటికి చేపలు ఎగబడే చందంగా ఎవరికివారు పోటీలు పడి తమ మొక్కుబళ్ళుచెల్లించుకుంటున్నారు. ఎవరి బాగుకోసం ఇదంతా. ఎవర్ని బాగుచేయడం కోసం ఇదంతా.                                                                      
బహుళ జాతి కంపెనీల మీద నిలువెత్తున ఎగిరిపడే వాళ్ళు కూడా చాపకింద నీరులా వ్యాపిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ ఎస్ ఎం ఎస్’ – వ్యాపార ధోరణులపై ఎందుకు చూపు సారించడం లేదో ఆలోచించాల్సిన విషయం.
టీవీ ఛానళ్ళు సయితం ఈ సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తూ వున్నాయో, ఇందులోని వ్యాపార మర్మంఏమిటో వెల్లడి చేస్తే బాగుంటుంది.కానీ ఇది జరిగే పనేనా!
తప్పులెన్నువారు తమ తప్పులు ఒప్పుకుంటారా!’             


రేడియో రోజులు


(నిజానికి ఇక్కడ రేడియో రోజులు అంటే నేను రేడియోలో పనిచేసిన రోజులని కాదు. ఆ రోజుల్లో రేడియో అని. నాకన్నా ముందు పనిచేసిన వారి జ్ఞాపకాలు మరింత ఆసక్తిగా వుంటాయని వారిలో కొందరితో  ముచ్చటించినప్పుడు తెలిసింది. వాళ్లు వయస్సులో చాలా పెద్దవాళ్ళు కావడం మూలాన పేర్లూ తారీఖులూ సరిగా గుర్తురావడం లేదని వారే చెప్పారు. అంటే ఏదన్నా విషయం గురించి చెప్పినప్పుడు దాని స్తూల భావాన్ని మాత్రం తీసుకుని, మూలాల్లోకి, చర్చల్లోకి పోకుండా స్వీకరించలిగితే నాటి స్మృతులను ఆస్వాదించడానికి ఆస్కారం వుంటుంది. లేదా చదువరుల్లో ఎవరయినా నాటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు వుండి, తప్పొప్పులను సవరించగలిగితే  ఈ రచనకు సంపూర్ణత్వం, సాధికారికత సిద్ధిస్తుంది. ఇది నా మనవి – భండారు శ్రీనివాసరావు)

తోకచుక్క రాలినప్పుడు ఎవరో పెద్దవారికి కాలం మూడిందని నా చిన్నతనంలో చెప్పుకునేవారు. అలాగే తుమ్మెదలు వున్నట్టుండి గుంపులు గుంపులుగా కానరావడం,  కప్పలు సంగీతం మొదలుపెట్టడం వాన  రాకడకు  సూచనలుగా పేర్కొనేవారు.
ఈ సందర్భంలో చెప్పుకోవలసిన విషయం మరొకటి వుంది. రేడియోలో మామూలు కార్యక్రమాలు నిలిపేసి విషాద సంగీతం ప్రసారం చేస్తున్నారంటే ఎవరో జాతీయ నాయకుడు కన్నుమూశారని జనాలకు అర్ధం అయ్యేది.
మరణ వార్తను ప్రసారం చేసేముందు రేడియో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. విషయం తెలిసినా, అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా మరణ వార్తలను ప్రసారం చేయరు. అధికారిక నిర్ధారణ జరగడానికి జరిగే కాలయాపన కారణంగా అనేకసార్లు ఆ నిందను ఆకాశవాణి వారే మోసేవారు. 
ఇంతకీ విషయానికివస్తే -
ఆ రోజు నిజాం నవాబు మరణించారు. ఆ వార్తను ధృవీకరించడానికి నిజాం కుటింబీకులే చాలా సమయం తీసుకున్నారు. కానీ చావుకబురు ఆగదు కదా. ఆ నోటా ఈ నోటా పడి కొందరికి తెలిసిపోయింది. యూ.ఎన్. ఐ. వార్తాసంస్థ  ధ్రువీకరణతో నిమిత్తం లేకుండానే సమాచారాన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రపంచం అంటే ఇక్కడ పత్రికలు. వార్తాసంస్థ పంపిన వార్త రాష్ట్రం వెలుపలి ప్రాంతాల్లోని పత్రికలకు తెలిసిపోయింది కాని ఇప్పట్లా త్వరితగతిన  సమాచారం  చేరవేతకు అవకాశం లేకపోవడం వల్ల దాని ప్రభావం హైదరాబాదులో అంతంత మాత్రమే అని చెప్పాలి. కానీ వార్త తెలిసిన రేడియో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేడియో ట్రాన్స్ మిషన్ వ్యవధి పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారిక సమాచారం  అందేదాకా విషాద సంగీతం ప్రసారం విషయం పక్కనబెట్టారు. ఈలోగా ఉన్నతాధికారి ఒకరు రేడియో ప్రసార వ్యవధిని పొడిగిస్తున్నట్టు సిబ్బందికి తెలియ చెయ్యడానికి  స్టూడియోలోకి వెళ్లారు. గుమ్మం దగ్గర నిలబడి తలుపు వోరగా తెరిచి సిబ్బందితో మాట్లాడుతున్నప్పుడు బయట నడవాలో వున్న వేరే సిబ్బంది నిజాం మరణంపై  వినవస్తున్న వదంతులు గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ప్రసారం అయిపొయింది. అప్పటి హడావిడిలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాని హైదరాబాదు నుంచి వెలువడే ఒక చిన్న పత్రికలో ఆ విషయం ప్రచురించారు. ఆ తర్వాత కూడా  జనంలో ఈ విషయం చర్చకు రాలేదు కాని పత్రికావార్తపై మాత్రం రేడియో అధికారులు స్పందించి విచారణ జరిపారు. సంబంధం వున్నవారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. (06-06-2013)

చిన్నసార్లు వస్తున్నారు – భండారు శ్రీనివాసరావు


దేశంలో అతిపెద్ద రాష్ట్రం  అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడయిన అఖిలేష్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన దరిమిలా తలలు పండిన రాజకీయ నాయకుల్లో చిన్న కదలిక మొదలయింది.  రేపో మాపో తమ రాజకీయ వారసులను తెర మీదకు తీసుకు రావాలని పధకాలు రచిస్తున్న రాజకీయ పితాశ్రీలందరూ  ఆ పని ఇంకా ఎంతమాత్రం ఆలశ్యం చేయకుండా వెనువెంటనే ఆచరణలోకి తీసుకురావాలని తొందర పడుతున్నారు. ఈ  విషయంలో  మాత్రం అన్ని పార్టీల నాయకులదీ, ప్రత్యేకించి అవకాశం వున్న నాయకులందరిదీ ఒకే తీరు.
అఖిల భారత స్తాయిలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం అంతగా కలిసి రాకపోయినా ఆ పార్టీకి అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడం ఒక్కటే ఆ పార్టీ శ్రేణుల లక్ష్యం. రాహుల్ గాంధీకి ఆ నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాటవాలు వున్నాయా లేదా అన్న దానితో వారికి నిమిత్తంలేదు. ఆ పార్టీకి చెందిన అధి నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి అట్టడుగు నాయకులవరకు ఇదే వరస. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతారు. ఇటీవల జరిగిన యూ పీ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను రాహుల్  ఒంటి భుజం మీదకు ఎత్తుకుని వొంటరిగా  పాటుపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకలేదు. ఇదే వేరొకరయితే అతగాడి రాజకీయ భవితవ్యం పార్టీలో ప్రశ్నార్ధకంగా మారివుండేది. అధినేత్రి కుమారుడు కాబట్టి పరాజయ కారణాలకు అతడిని బాధ్యుడుడిని చేయలేదు. అందుకే ఇంకా ఆయన్ని భావి భారత ప్రధాని అభ్యర్ధుల జాబితానుంచి తొలగించలేదు.
అప్పుడప్పుడు, అడపాదడపా ప్రియాంకా గాంధీ పేరు నలుగుతున్నప్పటికీ, రాహుల్ మాత్రమే ఇప్పటికీ దారీ తెన్నూ లేని కాంగ్రెస్ పార్టీకి దారి చూపే  చుక్కాని. ప్రధాని అభ్యర్ధిగా పార్టీ శ్రేణులు రాహుల్ భజన చేస్తున్నప్పటికీ జనం ఆమోదం లభించడానికి మాత్రం మరో ఏడాది  వేచివుండక తప్పదు, గత్యంతరం లేక మధ్యంతరం ముంచుకు వస్తే తప్ప.
మరో జాతీయ పార్టీ బీజేపీకి ఈ ‘యువరక్తం’ గొడవలేదు. అక్కడి అగ్రనాయకులందరూ కురు వృద్ధులే. మోడీ పేరు మీడియాలో మోగుతున్నప్పటికీ, వయస్సు రీత్యా ఆయనంత కుర్రకారేమీకాదు. నడికారు దాటినవాడే.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, యువతరం నాయకుడిగా జగన్ జనంలోకి దూసుకు పోతున్నాడు. ఆయన్ని ఎదుర్కునే రాజకీయ పార్టీలన్నీ గతంలో  చేసిన, లేదా ప్రస్తుతం  చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలే జగన్ పట్ల శ్రీరామరక్షగా మారుతూ వున్నాయి. పాతతరం నాయకులెవరికీ ఎన్నికల సమరంలో ఆయన్ని  ఎదిరించి నిలవగల సత్తా లేదని ఇటీవలి  గత చరిత్రే చెబుతోంది. వ్యక్తిగతంగా అన్ని మరకలు అంటి కూడా, అవినీతి ఆరోపణల్లో కూరుకుని పోయి కూడా, జైల్లో కాలుపెట్టి  సంవత్సర కాలం  దాటిపోతున్నా కూడా అన్ని పార్టీల్లో వున్న దిగువ స్థాయి కార్యకర్తల చూపు వై.ఎస్.ఆర్. పార్టీ వైపు వుండడం ఆయా పార్టీల అధినాయకులకు మింగుడు పడడం లేదు. వున్న పార్టీల్లో పొసగలేక, బయటకు పోయేదారిగా భావించి పోయేవాళ్ళేకానీ అలాటివారివల్ల తమ పార్టీలకు వచ్చే నష్టం ఏముండదు అని పైకి సర్ది చెప్పుకుంటున్నా లోలోపల ఎవరి భయాలు వారికి వున్నాయి. అందుకే ‘యువ రక్తం’ పేరుతొ కొత్త నాయకులను పార్టీలోకి తీసుకువస్తే  ఎన్నికల  ముహూర్తం నాటికయినా పరిస్తితి  కొంతలో కొంతయినా మారక పోతుందా అన్నది వారి ఆశ. ముఖ్యంగా ఎలాటి మచ్చా లేని, అవినీతి ఆరోపణల మరకలు అంటని విద్యాధిక యువకుడు రంగప్రవేశం చేస్తే జగన్ పార్టీని కట్టడి చేయడం సాధ్యమని భావించేవాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఆవశ్యకత హెచ్చుగావున్నట్టు తోస్తోంది. ఎందుకంటే టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలకంటే ఎక్కువ కాలం అధికార పీఠానికి దూరంగా వుండడం అంటే చాలా ఇబ్బంది. కాంగ్రెస్ పరిస్తితి వేరు. జాతీయ పార్టీ కాబట్టి, రాష్ట్ర స్థాయి నాయకులు కొంతకాలం అధికారానికి దూరంగా వున్నా ఏదోవిధంగా ఓపిక పట్టగల స్తితిలో వుంటారు. మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భరోసా వారిలో పుష్కలం. ఎదుటివారి  వైఫల్యాలే వారికి  రక్షరేకు.  ప్రత్యామ్నాయం లేక  ప్రజలే  తమకు ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వ పగ్గాలు అప్పగించక పోతారా అన్నది వారి మరో ధీమా.
కానీ టీడీపీ పరిస్తితి ఇందుకు విభిన్నం. గత ఎన్నికల్లో గెలుపు వూరించి వూరించి, కూతవేటు దూరంలో కనిపించిన అధికారం చేజారి పోయి మరో ‘చేతి’కి చిక్కిన విషయాన్ని తలచుకుని  టీడీపీ నేతలు ఇప్పటికీ చింతిల్లుతూ వుండడం చూస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అరంగేట్రం చేయడం వల్లనే మహాకూటమి మహా ఓటమి పాలయిందని లెక్కలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజం. కానీ, ప్రజాస్వామ్యంలో అంతా అంకెల మహత్యమే. ఒంటి చేత్తో లెక్కించగల అతికొద్ది వోట్ల తేడా వచ్చినా గెలుపు గెలుపే.
అందుకే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఒక కొత్త కార్డు కావాలి. టీడీపీ కంటే కూడా ఆయనకే వ్యక్తిగతంగా ఈ అవసరం ఎక్కువ. ఎన్టీ రామారావు గారు  తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు ‘ఆంధ్రులు – ఆత్మగౌరవం’ నినాదంతో పాటు నెహ్రూ  కుటుంబం వారసత్వ రాజకీయాలను  ఎండగడుతూ చేసిన విమర్శలు కూడా  జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీ స్తాపించిన తొమ్మిది నెలలల్లోనే  అధికార అందలం ఎక్కడానికి  ఎన్టీయార్  అనుసరించిన ఆ విధానం బాగా  దోహదపడింది. మరి ఇప్పుడు అదే పార్టీ  వారసత్వరాజకీయ  విధానాలను అనుసరిస్తే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది బాబు  గుంజాటన. దీనికి తోడు పైకి వొప్పుకున్నా వొప్పుకోకపోయినా నందమూరి, నారా కుటుంబాల నడుమ చాపకింది నీరులా పాకుతున్న  వారసత్వ ‘రాజకీయాలు’ కూడా టీడీపీ అధినేత, తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం విషయంలో మీనమేషాలు లెక్కించడానికి కారణమనే వారు కూడా వున్నారు.
ఏమయితేనేం, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ఎట్టకేలకు  ‘మంచు గడ్డను’ బద్దలు కొట్టారు. తాను టీడీపీ లో ‘కార్యకర్తగా’ పనిచేయబోతున్నట్టు ప్రకటించి ఆయన రాజకీయ అరంగేట్రం విషయంలో అలముకునివున్న అనుమానాలన్నింటినీ  ఆయనే పటాపంచలు చేశారు.        
పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే  పనిచేస్తానని ఓ పక్క చెప్పుకుంటూనే, యువతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంటూ పార్టీలో తాను నిర్వహించబోయే పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పకనే లోకేష్  చెప్పారు.
అనేక అనూహ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, భవిష్యత్తు పట్ల ఆందోళనతో వున్న టీడీపీ శ్రేణులకు   ఎంతో ఉత్సాహం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి మరెంతో  వూరట కలిగించే విషయమే ఇది.  పార్టీ ప్రతిష్ట వేగంగా కొడిగడుతున్న తరుణంలో చంద్రబాబు ఇటీవల స్వయంగా పూనుకుని పునరుజ్జీవ చర్యలు చేపట్టారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ,  తెలంగాణా పై కేంద్రానికి  మరో లేఖ ఇవ్వడం వంటి పలు కీలక నిర్ణయాలతో పాటు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా   ‘పాదయాత్ర’ చేసి పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురింప చేశారు. దరిమిలా మార్పుచెందుతున్న రాజకీయ పరిణామాల  నేపధ్యంలో – లోకేష్ వంటి యువకుడి దన్ను వుంటే లభించే ప్రయోజనాన్ని  ఆయన అంచనా వేయకుండా వుండరు. వేయరని,  బాబు గురించి బాగా  తెలిసిన వారెవ్వరూ అనుకోరు.

అందుకే రానున్న ఎన్నికలకల్లా అన్ని పార్టీల్లో ‘చిన్నసార్లే’ కానవస్తారు.                                   

5, జూన్ 2013, బుధవారం

పత్రికాస్వేచ్చకు సరికొత్త భాష్యాలు


అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.
ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికా స్వేచ్చకు భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్చ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.
నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం – అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ‘ఎడిట్’ చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో ‘పత్రికా స్వేచ్చకు’ పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రా యించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ‘ఎడిటోరియల్ పాలసీ’కి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగావున్నప్పుడు వారి పత్రికలలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరేవ్వరు - ‘ఎడిటోరియల్ పాలసీ’ అంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమె పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం – ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికా స్వేచ్చకు అర్ధమేముంటుంది?
నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక – సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.
“అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.
‘అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు ఎదురుగా ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి”
భండారు శ్రీనివాసరావు (28-04-2010)

4, జూన్ 2013, మంగళవారం

దైవం మానుష రూపేణ




ఈ చరాచర ప్రపంచంలో అత్యంత ఘోరంగా, అతి హేయంగా మీరు  చీదరించుకునే ప్రాణి ఎవరుఅని మా ఆవిడను అడిగితే సాలెపురుగు అంటుంది. మా మనుమరాలిని ఇదే ప్రశ్న అడిగితే బల్లిఅని జవాబిస్తుంది. కొన్నేళ్ళక్రితం వరకూ- ఇలాటి ప్రశ్నకు నా సమాధానం సోమమ్మగారు అనబడే సోమిదేవమ్మగారు. 

బెజవాడ గవర్నర్ పేటలో లంకంతకొంపనీ ఇద్దరు ఆడపిల్లలనీ, ఆవిడకు వొదిలేసి సోమమ్మగారి మొగుడు ఆమె చిన్నతనంలోనే కాలం చేసారు. పిల్లలను పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసి పెద్దరికంగా వుండాల్సిన ఆ పెద్దావిడ - మడీతడీఅంటూ - అంటూ సొంటూఅంటూ- అయినదానికీ, కానిదానికీ అందర్నీ ఆడిపోసుకునేది. కడవంత నోరు చేసుకుని చిన్నా పెద్దా తేడాలేకుండా శాపనార్ధాలు పెట్టేది. ఆమెను చూస్తుంటే చిన్నవాళ్లమయిన మా అందరికీ ఓ బ్రహ్మరాక్షసిలా కనిపించేది. ఇల్లు ఆవిడది కావడం మూలానా, అంత తక్కువ కిరాయికి మరో ఇల్లు దొరికే అవకాశం లేకపోవడం మూలానా - అక్కడ అద్దెకు వున్నవాళ్ళు ఎవ్వరూ ఆమెకు ఎదురు నిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. దానితో, ఇక ఆమె నోటి దురుసుకు ఎదురు లేకుండాపోయింది. మనిషేమో ఆజానుబాహువు.  ‘మడీ దడీపేరుతొ అరకొరగా మడిబట్ట చుట్టుకుని, 'అసింటా అసింటా' అంటూ  అందరినీ కసురుకుంటూ అందరిళ్ళలో తిరిగేది. ఆమెని చూస్తే చిన్నతనం నుంచీ నాకు అదోకరకం అసహ్యం.  పెరిగి పెద్దయిన తరవాత కూడా అది మరింత పెరిగిపోయిందే కానీ  ఆ ఏహ్యభావం నన్ను వొదిలిపెట్టలేదు. నాతో పాటే పెరిగి పెద్దయిన ఆమె మనుమలు ఏదో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. చిన్నవాడికి ఒక్కడికే ఇంకా పెళ్లి కావాల్సివుంది. అనుకోకుండా అతడికి బంగారం లాటి పెళ్లి సంబంధం వచ్చింది. ఒంట్లో ఇంట్లో బాగావున్న ఓ ఖామందు గారు పిల్లనిస్తామని ఏకంగా వాళ్ళ  ఇంటికే వచ్చారు. బాపూ గారి సినిమా పాట మాదిరిగా కట్నమెంత లావో - పిల్ల అంత లావు’. డబ్బా మజాకా! ఎగిరి గంతేసి వొప్పుకున్నారు. పెళ్ళున పెళ్లయిపోయింది. కానీ మూడు ముళ్ళు పడ్డ మూన్నెళ్లకే ఆ అమ్మాయి ఆసుపత్రిలో పురుడు పోసుకుని పండంటి పిల్లాడికి తల్లయింది. అప్పుడుకానీ అంత గొప్ప సంబంధం తమని  వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందన్న విషయం వాళ్లకు అర్ధం కాలేదు. సోమమ్మగారి సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ సంగతి తెలిసి ఏమాత్రం జాలిపడలేదు. పైగా అలాటి మనిషికి అలాగే కావాలని బాహాటంగానే నోళ్ళు నొక్కుకున్నారు. ఆ అమ్మాయి తలిదండ్రులు సరేసరి -కన్నె వయసులో కాలుజారిన కన్న కూతురికి పుట్టబోయే బిడ్డ - తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అడ్డం కాకూడదని, హడావిడిగా పెళ్లి చేసి, ఆసుపత్రిలో పురుడు పోసి ఆ పసికందుని అక్కడే వొదిలేసి కూతుర్ని తీసుకుని వెళ్లి  పోయి చేతులు కడిగేసుకున్నారు. అప్పుడేమి జరిగిందన్నదే ఈ కధ కాని కధకు క్లైమాక్స్.

సోమమ్మగారిది నిప్పులుకడిగే మడీ ఆచారం అని చెప్పుకున్నాము కదా. మనవడి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు. ఇంటావంటా లేని ఘోరం జరిగిపోయింది. ఆచారాలకు  నెలవయిన ఇంట్లో అనాచారం పురుడు పోసుకుంది.  కన్న తల్లేమో నిర్ధాక్షిణ్యంగా రోజుల పిల్లవాడిని వాడిమానానికే వొదిలేసి వెళ్లి పోయింది. ఈ పరిస్తితుల్లో ఆమె మానసిక పరిస్తితి ఎలావుంటుందో తేలిగ్గా వూహించుకోవచ్చు. కానీ, అందరి వూహల్ని పటాపంచలు చేస్తూ సోమమ్మగారు సరాసరి ఆసుపత్రికి వెళ్ళింది. అంతా కళ్ళింత చేసుకుని చూస్తూ వుండగానే ఎవరికీ అక్కరలేని ఆ అనాధ శిశువుని అబ్బారంగా  వొడిలోకి తీసుకుంది. అందరూ కాదనుకుని వెళ్ళినా - నీకు నేనున్నానంటూఇంటికి తీసుకు వచ్చింది. కన్నతల్లి కాదన్నా, ఆ తల్లిని కన్నవాళ్ళు కాదనుకున్నా, కట్టుకున్నవాడు బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నా అమ్మమ్మ గారు ఆవిడిక నా దృష్టిలో సోమమ్మగారు కాదెంత మాత్రం కాదు – ‘అమ్మమ్మ గారే’ - ఆ చిన్ని వయస్సులోని ఆ చిన్నారికి అమ్మయింది.
అమ్మయి లాలించింది. అమ్మమ్మయి ఆడించింది. నాన్నయి నడిపించింది. నాన్నమ్మయి నీతి కధలు చెప్పి నిద్రపుచ్చింది. తల్లీతండ్రీ లేని ఆ అనాధ శిశువుకు సర్వస్వం అయింది. సర్వం తానే అయింది. ఇప్పుడు చెప్పండి !
ఆమెను ఛీత్కరించాలా! దైవసమానురాలని భావించి నమస్కరించాలా!
మనుషుల్ని కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి అంచనా వేసుకోగలిగేలా ఎవరిని వారు సంస్కరించు కోవాలా!
 
నేను ఆమె పట్ల చేసిన పొరబాటు ఇంకెవ్వరూ చేయరనీ, చేయకూడదనీ మనసారా కోరుకుంటూ  – మనసు పొరల్లో  కదలాడుతున్న 'ఈ జ్ఞాపకాన్నిఇన్నేళ్ళ తరవాత బయటకు తీస్తున్నాను. ఇందువల్ల ఎవరి మనసు అయినా బాధ పడితే క్షంతవ్యుణ్ణి. - మరణించిన తరవాత కూడా, నా మనస్సులో జీవించే వున్న ఆ అమ్మమ్మగారిఔన్నత్యాన్ని నలుగురికీ తెలపడమే ఒక్కటే  ఇందులోని ఉద్దేశ్యం.
అందుకే అన్నారు - ప్రార్ధించే పెదవులకన్నా - సేవ చేసే చేతులు మిన్న 
 (30-08-2010)

ఇది ఇండియా – అది అమెరికా


(ఆంధ్ర జ్యోతి – 04-06-2013)
షిండే మింగిన ప్రాణం
ఆమెకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి గేటు వరకు వచ్చేశారు. అక్కడ సైంధవులు అడ్డుపడ్డారు. దీంతో గేటు వద్దే ఆమె మరణించింది.  ఆ సైంధవులు ఎవరంటే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భద్రతా దళాలు. చత్తీస్ ఘడ్ మావోయిస్టుల దాడిలో  గాయపడినవారిని పరామర్శించేందుకు షిండే రాయ్ పూర్ ఆస్పత్రికి వచ్చారు. అదేసమయంలో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది.  షిండే భద్రతాదళాలు ఆమెను  ఆసుపత్రిలోకి తీసుకుపోనీకుండా అడ్డుకున్నారు. అత్యవసరంగా వైద్యం అందించాలని ఎంతగా ప్రాధేయపడ్డా ప్రయోజనం లేకుండాపోయింది. సకాలంలో వైద్యం అందక   మరణించిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఇది ఇండియా.
పోతే మరో సంఘటన.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం. అది అమెరికా.    

 (04-06-2013)   

30, మే 2013, గురువారం

సులభంగా చావాలంటే?




జీవితమే మధురమూ అని పాడుకోవడం సులభమే. కాని జీవించడం అంత వీజీ ఏమీ కాదు. అందుకని దాన్ని అర్ధం చేసుకోవాలనే అర్ధం పర్ధం లేని ఆలోచనలను వొదిలేసుకుని ఎంచక్కా జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి.

దానికి కొన్ని చిట్కాలున్నాయి. హాయిగా నవ్వుకోవడం. వీలయితే నవ్వించడం.

హాయిగా జీవించడం సరే ! సులభంగా జీవితాన్ని అంతం చేసుకునే నిఖార్సయిన పద్ధతులు ఏమయినా వున్నాయా గురువుగారూ!అని అడిగాడొక శిష్యులుంగారు.

మూడున్నాయి రాసుకోఅని మొదలు పెట్టాడు మూడొచ్చిన గురువులుంగారు.

మొట్టమొదటి పధ్ధతి. రోజూ పది పెట్టెలు సిగరెట్లు వూదేసేయ్. పదేళ్లు ముందుగానే గుటుక్కుమంటావ్.

రెండోది రోజూ క్రమం తప్పకుండా మందు కొట్టు. ముప్పయ్యేళ్ళు ముందుగానే టపా కట్టేస్తావ్.

ఇక ఆఖరు చిట్కా ఏమిటంటే కనుముక్కుతీరు చక్కగా వున్న అమ్మాయిని చూసి నిజాయితీగా ప్రేమించడం మొదలు పెట్టు. ముందుగా ఏం ఖర్మ. ప్రతిరోజూ చచ్చి బతుకుతుంటావ్.