11, జనవరి 2013, శుక్రవారం

రేడియో రోజులు




రేడియో రోజులు

రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ వీ.వీ. శాస్త్రి  చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.


ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు  జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి శ్రీ కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై శ్రీ వీ.వీ. శాస్త్రి, శ్రీ మీనన్ ను కలసి రేడియో స్టేషన్ కు ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు  రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.
మీనన్ గారు  ఆరోజు చెప్పిన విషయాల్లో  ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది  కావడం వల్ల శాస్త్రి  గారికి బాగా  గుర్తుండిపోయింది.
“ భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
‘ ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.
అంతటితో ఆ సమావేశం ముగిసింది.     

9, జనవరి 2013, బుధవారం

దేవుణ్ణి దూరం చేసుకుని పెద్ద పొరబాటే చేశా!




దేవుణ్ణి దూరం చేసుకుని పెద్ద పొరబాటే చేశా!

దేవుడంటే వుండాల్సింది భక్తా? భయమా?


చిన్నతనంలో నాకు దేవుడంటే భయంతో కూడిన భక్తి. తెల్లవారుఝామున లేచి స్నానం చేసి బెజవాడ గవర్నర్ పేట శివాలయం వీధిలో వున్న గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి విబూది పట్టీలు పెట్టుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చేవాళ్ళం. అదేమిటో బడికి వెళ్ళిన తరువాత కూడా నుదిటిమీద విబూది రేఖలు అలాగే చెదరకుండా వుండేవి. ఇప్పట్లా గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు కొట్టడం, హుండీలో డబ్బులు వేయడం ఎరగం. ఆ రోజుల్లో గుళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా వుండేవి. కాసేపు కూర్చోవాలని అనిపించేది.
ఇళ్ళల్లో కూడా ఇప్పటిమాదిరిగా విడిగా పూజ గదులు వుండేవి కావు, దేవుడి గూళ్ళు తప్ప. దేవుళ్ళందరూ గూటికే పరిమితం. అక్కడే గోడమీద పసుపూ సున్నం  కలిపి ఎర్రగా తిరుపతి వెంకన్న నామాల పట్టెడ వుండేది. ఇంటిల్లిపాదీ అక్కడే నిలబడి దణ్ణం పెట్టుకునేవారు. స్నానం చేసి దణ్ణం పెట్టుకోవడం మినహా ఇక ఎలాటి నియమాలు వుండేవి కావు. నాకు తెలిసి అది భక్తి. ఇప్పుడు పూజ గదుల్లో దేవుడి పట్ల భక్తి కంటే భయం ఎక్కువ కనిపిస్తోంది.
తరవాత్తరవాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మనుషుల  మనస్తత్వాల్లో మార్పులు రావడం మొదలయింది. ‘దేవుడు లేదు’ అనే గోరాగారి ప్రభావం.(దేవుడు లేడు అనేవారు కాదు, ఎందుకంటే ఆయన దృష్టిలో దేవుడే లేడు కనుక ఆయన మగో ఆడో అనవసరం అనుకుని  ‘లేదు’ అని అంటుండేవారు. సరే! ఆయన మరణించిన తరువాత ఇప్పుడు ఆ కుటుంబానికి ఆయనే దేవుడు అనుకోండి. నిజానికి దేవుళ్ళు ఇలానే పుడతారేమో).
‘తెలుగునాట భక్తి రసం వరదలుగా పారుతోంది’ వంటి రచనల స్పూర్తి.
దేవుణ్ణి విమర్శిస్తే నలుగురిలో పెరుగుతున్న గౌరవం.
మొత్తానికి ఏమయితేనేం దేవుడు క్రమంగా దూరం అవుతూ వచ్చాడు. (ఇదీ ఒక భ్రమే! ఇందుగలడందులేడనేవాడు దూరం కావడం ఏమిటి? దూరం చేసుకోవడం ఏమిటి?)
తోటివాళ్ళు, సాటివాళ్ళు సావాసగాళ్ళు చాలామంది అదేబాటన వెడుతూ సంఘంలో మర్యాద,మన్నన పొందడం చూసి దేవుడికి మరింత దూరం జరిగాను. (ఈ నాస్తికులలో  చాలామంది దేవుడ్ని తమ బాగుకోసమే ఉపయోగించుకున్నారనీ, సాధారణ ఆస్తికులకంటే ఎక్కువగా దేవుడ్ని నమ్ముతారనీ చాలాకాలం తరువాత తెలిసింది). పెళ్లి వేడుకలకు స్వస్తిచెప్పాను. పిల్లలకు బాలసారలు చేసి పేర్లు పెట్టలేదు. మా పెద్ద పిల్లవాడు కడుపులో వున్నప్పుడు సూర్య గ్రహణం వస్తే, అప్పట్లో వున్న నమ్మకాలను కాదని  మా ఆవిడను చీకటి గదిలో పడుకోనివ్వలేదు. పైగా పిండి కలిపి రొట్టెలు చేస్తే, అవకరం కలిగిన  పిల్లలు పుడతారని భయపెట్టే జనం మధ్య సొంత ప్రయోగాలు ధైర్యంగా చేసాను. మా ఆవిడ సహకారం లేకపోతే ఇవి సాధ్యమయ్యే పనులు కాదు.
నా తరహా తీరూ చూసి మా వాళ్లల్లోనే చాలామంది నాకు నాస్తికుడనే ముద్ర వేసారు. పూజలు, పునస్కారాలతో దేవుణ్ణి మరింత దూరం చేసుకుంటున్నామన్నది నా ఉద్దేశ్యం. భక్త కన్నప్ప నాకాదర్శం. కానీ నా గోడు వినేవాళ్ళెవ్వరు ఆ దేవుడు తప్ప.  
సరే! దేవుళ్ళ గురించి తక్కువ మాట్లాడాలి ఎక్కువ ఆలోచించాలి అనే స్పృహ కలిగించింది మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు.  గోరాగారిని పరిచయం చేసిందీ ఆయనే. అనేక పరిశోధనలు చేసి నారసింహతత్వాన్ని బోధించింది ఆయనే. సమర్ధుడు కనుక ఈ ద్వంద్వ ప్రకృతిలో ఆయన నెగ్గుకు రాగలిగాడు. నేను కొట్టుకు పోయాను.
అయితే ఈ క్రమంలో సాగుతూ వచ్చిన సంభాషణల్లో, వాద ప్రతివాదాలలో అనేక ఆసక్తికర విషయాలు బోధపడుతూ వచ్చాయి. దేవుడ్ని నమ్మిన వారు, నమ్మని వారు కూడా తెలుసుకోదగ్గ సంగతులవి.
గుడిలో ఏముందీ?
గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం గుడిలో వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్నాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.  
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు,  అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో  మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ  సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి  ఇప్పుడో! వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి  మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో  ఇది సాధ్యమా అంటే అనుమానమే. (09-01-2013)                              

8, జనవరి 2013, మంగళవారం

రాజకీయం ఒక రక్షరేఖ



రాజకీయం ఒక రక్షరేఖ




దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో,వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ వున్నా రాజకీయ నాయకులతో పోలిస్తే తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బులూ వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనేవి అసలు పొసగని వాళ్లు కూడా డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం, ఎక్కడకు వెళ్ళినా పరపతి, ఒక్కసారి పలకరించినా చాలు పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
ఇప్పుడు టీవీల్లో కానవస్తున్న దృశ్యాలే దీనికి రుజువు. వేరే సాక్ష్యాలెందుకు?
(08-01-2013)

బరువు బదిలీ పధకం



బరువు బదిలీ పధకం

  

‘మీ సొమ్ము - మీ చేతిలో’ అనే నినాదంతో యువనేత రాహుల్ సలహాపై ‘నగదు బదిలీ’ పధకాన్ని ఎన్నికల బ్రహ్మాస్త్రంగా కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టింది. ఆ యువనేతను  ప్రధానమంత్రిగా  చూడడం ఒక్కటే తమ చిరకాల స్వప్నమని  బాహాటంగా ప్రకటించుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ‘మీ బరువు – మీరే మోయాలి’ అనే ట్యాగ్ లైన్ తో   ‘బరువు బదిలీ’ పధకానికి రూపకల్పన చేసి తాము కంటున్న ‘కల’ను తామే ‘కల్ల’ చేసుకుంటున్నారు.

పెరిగిపోతున్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ భారాన్ని ఇక యెంత మాత్రం  మోసే పరిస్తితి  లేదనీ, కాబట్టి ఆ బరువును వినియోగదారులకు ‘బదిలీ’ చేయక  తప్పదనీ చెబుతూ ప్రభుత్వం   చల్లగా తప్పుకుంటోంది.
మరి ఈ ‘బరువు బదిలీ’ పధకాన్ని  అన్ని రంగాలకు విస్తరింపచేస్తే  జనం పని గోవిందా!       (08-01-2013)

NOTE: COURTESY IMAGE OWNER

7, జనవరి 2013, సోమవారం

ఆరోగ్యశ్రీ కధా కమామిషూ


ఆరోగ్యశ్రీ కధా కమామిషూ


కొత్త సంవత్సరంలో ఒక సాయంత్రం ముచ్చట్ల సమావేశం

కలిపింది -  104,108 పధకాల రూపశిల్పి అయిన ఒక డాక్టరు గారు.

కలిసింది -  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి, ఆయనతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మరో అధికారి. స్టేట్ బ్యాంకులో అత్యున్నత పదవిలో పనిచేసిన ఇంకో అధికారి.  108 లో  కీలక భూమిక పోషించిన ఒక వ్యక్తి,  గుంపులో గోవిందుడిగా నేను సరే. పేర్లు పేర్కొనక పోవడానికి కారణం వేరే ఏమీ లేదు, వారి గౌరవాన్ని మరింత పెంచడానికే. అందరూ అందరే. నీతికీ, నిజాయితీకి ప్రసిద్ధులు, నిబద్ధులు. అందుకే మచ్చ లేకుండా అంతంత పెద్ద అధికార కొలువులు  చేసి  ఉద్యోగ విరమణ అనంతరం  గుండె మీద చేయివేసుకుని  హాయిగా నిద్ర పోగలుగుతున్నారు.    

ఈ మధ్య అంటే అంతగా కుదరడం లేదు కాని వీరితో 'సాయంకాలక్షేపాలు' నాకు గతంలో మామూలే.

మాటల నడుమ ఆరోగ్యశ్రీ  ప్రస్తావన వచ్చింది.

కట్  చేస్తే- 

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం

ఉదయం వేళల్లో సీఎం సాధారణ ప్రజలను కలుసుకునే సమయం.

సీఎం ఒక్కొక్కర్నీ కలుసుకుంటూ, వారినుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ, వాటికి తగిన హామీలను ఇస్తూ, సంబంధిత పేషీ అధికారులకు సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖకు కొత్తగా ఒక అధికారి వచ్చారు. విషయ అవగాహన కోసం ఆయన కూడా ఆ సమయంలో ముఖ్యమంత్రి వెంట వున్నారు.

సీఎం ను స్వయంగా కలసి కష్ట సుఖాలను చెప్పుకోవడానికి వచ్చిన ఆ మహా జనంలో ఒక అమ్మాయి కూడా వుంది. అయితే వచ్చిన కష్టం ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి అమ్మది. అది కూడా మామూలు కష్టం కాదు. తీవ్రమయిన ఆరోగ్య సమస్య. మామూలు మనుషులే కాదు కలిగిన వారిని కుదేలు చేసే క్యాన్సర్  మహమ్మారి. ఆవిడను   చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి కన్న కూతురు కోటి ఆశలతో అక్కడకు  తీసుకువచ్చింది.

ముఖ్యమంత్రి అమ్మాయి చెప్పింది సావధానంగా విన్నారు. స్వయంగా డాక్టర్ అయిన ఆయన మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. విషయం అర్ధం అయింది. ఏం చేసినా ఆవిడ బతికే అవకాశాలు శూన్యం.

కానీ మరోపక్క మా అమ్మ నాకు కావాలి. అనే ఆ అమ్మాయి విలాపం.

వైద్యం చేయిస్తాను. కానీ వ్యాధి ముదిరిపోయింది. ప్రయోజనం వుండకపోవచ్చు అన్నారు ముఖ్యమంత్రి.

ఆరు నెలలు బతికినా చాలు, నా కన్న తల్లి నా కళ్ళ ముందు వుంటే అదే పదివేలు అన్నదా అమ్మాయి.

చనిపోతుందని, ఇంకా ఎంతో కాలం బతకదనీ నాకూ తెలుసు. కానీ వైద్యం చేయించకుండా వుండలేము కదా!

ఆ జవాబుతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నారో యేమో.  ఒక నిశ్చయానికి వచ్చినట్టు ఆయన ముఖమే చెబుతోంది.  

ఏం చేద్దాం అన్నట్టు అధికారులవైపు చూసారు, ఏదయినా చేసి తీరాలి అన్నట్టుగా.         

ఎవరికీ ఏం చేయాలో, ఏం జవాబు చెప్పాలో తెలియదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో కొంత సాయం చేసినా అది అరకొరే.

ఆ అమ్మాయిని మరునాడు రమ్మన్నారు. సీఎం  అధికారులతో మాట్లాడారు. ఇలాటి అభాగ్యులకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక పరిష్కారంతో రమ్మన్నారు.

అరకొర సాయాలతో అభాగ్యులకు ఒరిగేదేమీ వుండదు. డబ్బున్న వారికీ, అది లేని వారికీ కూడా జబ్బులు వస్తాయి. వున్నవారికీ, లేనివారికీ ఒకే రకంగా వైద్య సదుపాయం అందించే అవకాశం లేదా? ప్రభుత్వం ఏమీ చేయలేదా?

ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ఆరోగ్యశ్రీ  

(08-01-2013)

ఎవరి గోల వారిదే అను ముఖ్యమంత్రి చిట్కా




ఎవరి గోల వారిదే అను ముఖ్యమంత్రి చిట్కా


గతంలో అంటే దాదాపు నలభై ఏళ్ళక్రితం అనుకుంటాను ముళ్లపూడి వెంకరమణ గారు సంభాషణలు గురించి చక్కని హాస్య గుళిక రాశారు. కొన్ని ఏకపక్షంగా అంటే ఎదుటివాడు చెప్పేది పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ పోవడం అయితే మరికొన్ని రైలు పట్టాల మాదిరిగా ఎక్కడా కలవకుండా ఎవరి గోల  వారిదే అన్నట్టు సాగుతుతుంటాయని కడుపుబ్బ  నవ్వించే కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు.
ఈ రోజు (07-01-2013) ఆంధ్ర జ్యోతి మొదటి పుటలో ప్రచురించిన ఒక వార్త అలనాటి ముళ్లపూడి వారి రచనను గుర్తుకు తెచ్చింది. చిత్తగించండి.
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు లో జరిగిన ‘నగదు బదిలీ పధకం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, సభకు హాజరయిన కొందరు మహిళలకు నడుమ సాగిన రైలుపట్టాల సంభాషణను ఆ పత్రిక ఇలా ప్రచురించింది.
“నగదు బదిలీ చేస్తున్నాం. ఇకపై బ్యాంకులే మీ ఇంటికి వస్తాయి”
“ఆరు సిలిండర్లతో పొయ్యిలో పిల్లి లేవడం లేదు. విద్యుత్ చార్జీలు భరించలేకపోతున్నాం”
“నిత్యావసర సరుకులు ఒకే ప్యాకెట్ గా అందజేస్తాం. బియ్యం, పసుపు, కారం, కందిపప్పు, చింతపండు, ఉప్పు, పంచదార  అందులో వుంటాయి. “
“నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏదో కొద్దిగా బియ్యం, కిలో చొప్పున సరుకులు ఇస్తే సరిపోతుందా? విద్యుత్ చార్జీలతో పాటు సర్ చార్జీలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నాం.”
“మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి”
యెంత బాగుందో కదా ఈ టెక్నిక్.
ఇక నుంచి బహిరంగ సభల్లో నాయకులను నిలదీసే జనాలను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీలు అక్కరలేదు, భాష్పవాయు తూటాలు ప్రయోగించనక్కరలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనిపెట్టిన ఈ చిట్కా చాలు.
(07-01-2013)  

6, జనవరి 2013, ఆదివారం

డేరింగ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి


డేరింగ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి



కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తరువాత త్వరితగతిన  నిర్ణయాలు తీసుకోవడంలో  విఫలం అవుతున్నారన్నది ఆయన్ని సమర్ధించేవారు కూడా  చేస్తూవస్తున్న ప్రధాన విమర్శ.  కిరణ్  ఎక్కువగా అధికార గణం మీదనే ఆధారపడతారని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రివర్గ సహచరులను కూడా విశ్వాసం లోకి తీసుకోరని సొంత పార్టీ నాయకులే చెణుకులు విసురుతుంటారు.  సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన లోగుట్టు మనిషి అనే పేరు.   రేడియో, దూరదర్శన్ విలేకరిగా పనిచేసే రోజుల్లో  మిగిలిన కాంగ్రెస్ నాయకులలాగానే ఆయన కూడా నాకు    బాగా తెలిసిన మనిషే. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా ప్రెస్  గ్యాలరీ పాసులను నియంత్రిస్తూ  ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మూడు దశాబ్దాలకు పైగా నాకున్న అసెంబ్లీ ప్రెస్ పాసు రద్దయినా కూడా   నేను ఆయన నిర్ణయాన్ని స్వాగతించాను. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు అంటే ఆషామాషీ కాదనీ, పరిమిత సంఖ్యలో పాసులను  ఇవ్వడం వల్ల వాటికి వుండే   గౌరవం, విలువలను మరింత పెంచినట్టు  అవుతుందని  భావించి  కిరణ్ కుమార్ రెడ్డి  తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పదవీ విరమణ చేసిన మా బోటివారికి ఆ ప్రివిలేజ్ లేకుండాపోయిన మాట నిజమే. అయినా కూడా  స్పీకర్  మంచి పనే చేసారని అభిప్రాయపడ్డ జర్నలిస్టులలో నేనొకడిని.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి నేను  క్రియాశీలక పాత్రికేయ  వృత్తి నుంచి తప్పుకోవడంవల్ల  ముఖ్యమంత్రి  వ్యవహార శైలిని గతంలో మాదిరిగా దగ్గరనుంచి పరిశీలించే అవకాశం నాకు  లేకుండాపోయింది. కాకపొతే, పైవేట్ టీవీ ఛానళ్ళ పుణ్యమాఅని జర్నలిజం రంగంతో నా సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఆ రీత్యా   ఎప్పటికప్పుడు ఆయన పరిపాలన గురించి బేరీజు వేసుకోవాల్సిన అవసరం, వేసుకోగలిగిన అవకాశం నాకు లభించాయి.
ఆయన ముఖ్యమంత్రి అయిన ఇన్నేళ్ళకు డేరింగ్ చీఫ్ మినిస్టర్ అని కితాబు ఇవ్వడానికి సరయిన ప్రాతిపదిక కరెంటు చార్జీల పెంపు రూపంలో నాకు కనబడింది.


నిజమే, పవర్ చార్జీలను ఆయన తప్ప ఇంత భారీ స్థాయిలో ఒకేసారి  పెంచగల ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి  వుంటుంది?  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సయితం ఇంతటి సాహసోపేత నిర్ణయానికి పూనుకుని వుండేవారు కాదేమో.
రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఆధారపడుతూ వచ్చిన అధికారులు కూడా ఒకే తడవ ఇంత భారీగా పెంచే ప్రతిపాదనలు సమర్పించలేదనీ, ఇప్పుడు కాకపొతే (వచ్చే ఏడాదికి ఎన్నికలు ముంగిట్లోకి వస్తాయి కాబట్టి) మరెప్పుడూ పెంచే అవకాశం ప్రభుత్వానికి దొరకదనీ (నౌ ఆర్ నెవ్వర్) వాదించి కిరణ్ కుమార్ రెడ్డే పూనుకుని ‘వడ్డన’ పరిమాణాన్ని బాగా పెంచమని అధికారులకు  సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి అనుకూల మీడియా కూడా కోడై కూసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆయన  తరహా చూస్తుంటే వెనక్కు తగ్గే సూచనలు కానరావడం లేదు.
వాస్తవానికి కాంగ్రెస్ ఈ నాడు అధికారంలో వున్నదంటే అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఈ అంశం కూడా. నాడు తెలుగుదేశం పార్టీ  సంస్కరణల పేరుతొ విద్యుత్ చార్జీలను పెంచడం అనేది  ఆనాడు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీకి బాగా కలసి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత , ‘పవర్ డిస్కం’ ల ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి ‘హరాకిరీ’ వంటి ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాన్ని తీసుకోగలిగారంటే నిజంగా ఆయన డేరింగ్ చీఫ్ మినిస్టరే. డేర్ డెవిల్ చీఫ్ మినిస్టరే.
గతంలో వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా  ఆయన రాష్ట్ర ఖజానా సంక్షేమానికే పెద్ద పీట వేశారన్న పెద్ద అపవాదు మోశారు.
రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, 104, 108,  ఫీజు రీయింబర్సుమెంటు వంటి వోట్ల గుడ్లు పెట్టే  అనేక సంక్షేమ   పధకాలను అధికారుల మాట విని అటకెక్కించే ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దిగజారిందని, తెలుగుదేశం వారు కూడా విమర్శించడానికి సంకోచించిన ఆరోగ్య శ్రీ పధకాన్ని అధికారగణం సలహా మేరకు   ప్రభుత్వ నిధులను  ఆచి తూచి ఖర్చు పెట్టే విధానానికే  పచ్చ జెండా వూపి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేసారని సొంత పార్టీ నుంచే విమర్శలను ఎదుర్కోవడానికి చాలా తెగువ కావాలి. అది తనలో పుష్కలంగా వుందని  కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించారు.    
భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం పన్నులు కూడా కిరణ్ హయాం లోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కాకపొతే అవి కలిగినోళ్ల వ్యవహారాలు కనుక ప్రజల్లో అత్యధికులు పట్టించుకునే అవకాశం వుండదు.
కానీ, కరెంటు చార్జీల సంగతి అలా కాదు. ఈ మంట రాజుకోవడం చాలా తేలిక. ఈ అగ్నికి ఆజ్యం పోసేవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఆ రకమయిన విభీషణులకు కాంగ్రెస్ పార్టీలో కొదవ వుంటుందని అనుకోలేము.
ఇంకో  ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇలా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకోవడం ఆషామాషీ కాదు. అయినా ధైర్యం చేస్తున్నారంటే ఏమిటి అర్ధం? ఏమి చేసినా, చేయకున్నా రాష్ట్ర ప్రజలు మరోసారి, అంటే మూడోసారి వరసగా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం వుత్తమాట అని నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా ఇలాటి తెగింపుకు పూనుకోవడం  సహజమే అనేవారున్నారు.    
రెండు రకాల రాజకీయ నాయకులే ఈ రకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఒకరు – రాజనీతిజ్ఞులు. వీళ్ళు రేపు గురించి భయపడరు. పదేళ్ళ తరువాత పరిస్థితులు గురించి ఆలోచిస్తారు. దేశం, దేశ భవితవ్యమే వీరికి ముఖ్యం. వోట్లు, సీట్లు, అధికారం కాదు.
ఆ విధంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం ఆహ్వానించదగిందే.
మరో రకం – వీరికి రేపు అనేదే లేదు.  తనని నమ్ముకుని బాధ్యత అప్పగించిన పార్టీని ఎన్నికల రేవు దాటించి అధికార తీరం చేర్చాల్సిన అవసరం ఇలాటి వారికి వుండదు. తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగే పదవులు వీరివి. అటువంటప్పుడు ఇలా తెగించి నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డేమివుంటుంది?
మరి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రెండింటిలో ఏ రకం.
కాలమే జవాబు చెప్పాలి.
మరో సంగతి కూడా ఇక్కడ ముచ్చటించుకోవడం అప్రస్తుతం  కాకపోవచ్చు.
ఏమి చేసినా, చేయకున్నా రాష్ట్ర ప్రజలు మరోసారి, అంటే మూడోసారి వరసగా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం వుత్తమాట అని నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా ఇలాటి తెగింపుకు పూనుకోవడం  సహజమే అనేవారు కూడా వున్నారు మరి. జపాన్ వారి హరాకిరి అంటే ఇదే.


(06-01-2013)