ఓ కధ చెప్పుకుందాం
నిజానికి ఇది కధ కాదు. నిజ జీవితమే.
కధల కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే కధలు. అలాంటిదే ఇది.
మా స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి కానీ, అన్నదమ్ముల సంతానం పది మందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో అన్నయ్య ఆకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం మిగిలాము.
చిన్నవాడి నైన నాకే రేపోమాపో ఎనభయ్ నిండుతున్నాయి. మా రెండో అన్నయ్య ఎనభయ్ నాలుగు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అగత్యం, అనుభవించాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో ఉంటుందని అనుకోను.
ఈ నేపధ్యంలో, నాలుగేళ్ల క్రితం అనుకుంటాను, ఖమ్మంలో వుండే మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి, పొలాలని కొత్తగా సర్వే చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి ఇది అక్షర రూపం. అదే ఇది:
“కింది ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ. వీరికి ఈడుకు వచ్చిన ఒక కూతురు కూడా ఉంది.
ఈ పిచ్చయ్య ఒకప్పుడు కంభంపాడు గ్రామం లోనే వుంటూ, కూలి పనులు చేసుకుని జీవించేవాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది.
అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం తలకిందులైంది. కొంత మంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా, వంటి మీద బట్టలు వేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో, వీరు తమ ఇళ్ళ మధ్య ఉండటానికి గ్రామస్తులు ఇష్టపడలేదు.
దాంతో, ఊరికి దూరంగా, చెట్టు నీడ కూడా లేని ప్రదేశంలో ఒక రేకుల షెడ్డులోనే చాలా ఏళ్ళుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపు మేరలో విద్యుత్ వెలుగులు కూడా కనిపించవు. పిలిచినా పలికే నాధుడే ఉండడు. ఉన్నా పలకరు. గ్రామ బహిష్కారం లాంటి శిక్ష. పగలు మండుటెండలో, రాత్రుళ్లు కటిక చీకట్లో ఆ రేకుల షెడ్డు లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారీ వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ అక్కడ ఒంటరిగా జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.
“ఈ విషయం మా రమేశ్ దృష్టికి వచ్చింది. ఒకరిద్దరు చెప్పడంతో, ఖమ్మంలో వుంటున్న వాడు, కంభంపాడు వెళ్లి మాకున్న ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని, ఒక మూలన పొలానికి అడ్డు లేకుండా ఒక చివరన జాగా చూపెట్టి, తాత్కాలికంగా ఉండమని చెప్పాడు. . దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని ఉంటున్నారు. వాళ్ళు వుంటున్న షెడ్డు అదే.
పిచ్చయ్య కోరిక ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి ఒక గూడు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. వాడు మొదలు పెట్టిన ఈ ప్రయత్నానికి మిత్రులు కొందరు సహకరించారు. మా మూడో అన్నయ్య పెద్ద కుమారుడు రఘు రెవెన్యూ డిపార్ట్ మెంటులో ఉద్యోగి. ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు గోపాలకృష్ణ కలిసి, వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ విషయంలో తలా ఒక చేయి వేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. వారికి స్థలం కేటాయించి, నివాస గృహం ఏర్పాటు చేయడానికి రెవెన్యూ అధికారులు సైతం సుముఖత వ్యక్తం చేశారు.
ఈ కధనానికి మా కుటుంబంలో వాళ్ళ స్పందన మొదలయింది. సోలార్ ద్వారా ఆ షెడ్డుకు ఒకటి, రెండు బల్బుల విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రతిపాదన వచ్చింది.
అతి త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా భండారు సంతానం మేలిమి బంగారం. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే వుంటారు. మేము సైతం అని ముందుకు వచ్చారు.
1 కామెంట్:
రమేశ్ గారు అభినందనీయులు. అలాగే ఆ మహిళలు ఇరువురికీ మానసిక వైద్యం అందేలా చేస్తే బాగుంటుంది. సాధారణ జీవితం గడపగలుగుతారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి