6, నవంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (241) : భండారు శ్రీనివాసరావు

 

బ్రహ్మరాత
ఇప్పుడంటే నా రాత, తలరాత ఇలా తగలబడ్డాయి కానీ చిన్నప్పుడు నా చేతి రాత చాలా చక్కగా, పొందికగా వుండేది. ‘వీడికి రాతలో వున్న కుదురు బుద్దిలో వుంటే బాగుండేది’ అనేది మా బామ్మ.
బ్యాంకు కార్డులు వచ్చి బతికించాయి కానీ, లోగడ డబ్బు డ్రా చేయడానికి, 1975 నుంచి నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ కు వెళ్ళిన ప్రతిసారీ, ‘మీరు మీరే కానీ ఈ సంతకం మీది కాదు’ అనేవారు గ్లాసు విండో వెనుక వున్న ఉద్యోగులు. ఒకసారి ఇలాంటి తకరారే వస్తే నాకు చర్రున కోపం వచ్చి, ఒక కాగితం అడిగి తీసుకుని దానిమీద వరసగా డజను సంతకాలు చేసి, ‘మీ ముందే సంతకం చేశాను కదా! వీటిల్లో ఏ ఒక్కటైనా మరోదానితో సరిపోలితే అప్పుడు అడగండి. నా రాతే అంత! వంకర టింకర ఓ’ అన్నాను. ఇందులో సెన్సాఫ్ హ్యూమర్ ఏం కనిపించిందో ఏమో కానీ, వెంటనే టోకెన్ బిళ్ళ చేతిలో పెట్టి వెయిట్ చేయమంది.
నా రాత సరే! ఒకసారి బ్రహ్మరాత లాంటి చేతి వ్రాత చూశాను.
ఒక పట్టాన అర్ధం అయ్యేలా లేదు. మరో విషయం, అది రాసి ఇప్పటికి అక్షరాలా నూట ముప్పయి సంవత్సరాలు పైనే.
జీవితం అన్నాక మన విషయాలే కాదు, ప్రపంచానికి చెందిన అనేక సంగతులు కొన్ని చెవిన పడుతుంటాయి. మరికొన్ని కంట పడుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదొకటి.
వెనుకటి రోజుల్లో పాత కాగితాలు, దస్తావేజులు భద్రంగా దాచుకునే వారు. ఆస్తులు తరిగీ, కరిగీ కొంత, ఇప్పటిలా కంప్యూటర్లలో భద్రపరచుకునే వీలూ చాలూ అప్పటికి ఏర్పడక పోవడం వల్ల, ఏతావాతా ఏమైతేనేం పాత దస్తావేజులు, దస్త్రాలు అటకెక్కికూర్చున్నాయి. అటకల ఇళ్ళతో పాటు అవీ కొంతకాలానికి కనుమరుగు అయ్యాయి.
రేడియోలో కలిసి పనిచేసిన ఆర్వీవీ కృష్ణారావు గారు కొన్నేళ్ళ క్రితం పాత దస్తావేజు ప్రతి ఒకటి వాట్సప్ లో పంపారు. చెప్పాను కదా! ఎంత పాతది అంటే దాదాపు 130 సంవత్సరాల నాటిది. వారి ముత్తాత కాలం నాటిది.
ఆర్వీవీ కృష్ణారావు (పూర్తి పేరు రాయసం వీరభద్ర వెంకట కృష్ణారావు) గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు, (వీరు నాకు కూడా తెలుసు). గంగన్న పంతులు గారి తండ్రి వీరభద్రుడు గారు. వారి తండ్రి గారి పేరు కూడా గంగన్న గారే!
ఆర్వీవీ గారి ముత్తాత గంగన్న గారికి కొంత డబ్బు అవసరం పడింది. అదీ అయిదు వందల రూపాయలు. ఈనాం భూమి కొనుగోలు చేయడానికి చేసిన అప్పు తీర్చడానికి ఈ అప్పు అన్నమాట.
ఈ రోజు లెక్కల్లో అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భూస్వాములకు కూడా నగదు అవసరాలు వచ్చేవి. వాళ్లకు తెలిసినదల్లా భూమిని తనఖా పెట్టి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం. వెసులుబాటు అయినప్పుడు తీర్చడం. ఇలా అప్పు తీసుకోవడానికి పైకి కనపడని పెద్ద తతంగమే నడిచేది.
గంగన్న గారు వుండేది గోదావరి జిల్లా రేలంగి. డబ్బు అప్పు ఇచ్చే ఆసామి వుండేది తణుకులో. ఈ అప్పు పత్రం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అంచేత ఇవి రాయడానికి ప్రత్యేకంగా లేఖరులు వుండేవారు. (ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ అంటున్నారు)
కృష్ణారావు గారు పంపిన దస్తావేజు పత్రాల్లో చేతి రాత బ్రహ్మ రాతను పోలివుంది. చదవడం క్లిష్టం అనిపించినా, బ్రిటిష్ రాణి గారి చిత్రంతో వున్న రెండు రూపాయలు విలువ చేసే స్టాంపు పేపరు మీద రాసిన విషయాలను చదివి, అర్ధం అయినంత వరకు కొంత ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాను. (అర్ధం కాని చోట చుక్కలు ఉంచాను)
“.......ఆ 1891....... తణ్క్(ణ కింద కు వత్తు, తణుకు కావచ్చు) గ్రామ కాపురస్తులు, కమ్మవారు, షావుకారు చిట్టూరి యింద్రయ్య (ఇంద్రయ్య) కుమార్డు వెంకట కృష్ణయ్యకు, రేలంగి కాపురస్తులు , బ్రాహ్మణులు, యిన్నాందార్లు (ఇనాందారులు) రాయసం కృష్ణమ్మగారి కుమార్డు గంగన్న వ్రాయించి ఇచ్చిన అస్వాధీనపు తణ్ఖా (తణఖా, ణా కింద ఖా వత్తు) పత్రము.
“.......... యిన్నాం భూమి కొనుగోలు నిమిత్తం నేను చేసిన రుణాల తీరుమానం నిమిత్తంన్ను, నా కుటుంబ .......(బహుశా ఖర్చులు కావచ్చు) నిమిత్తంన్నూ యీ రోజు కృష్ణయ్య గారి వద్ద పుచ్చుకున్న రొఖం రు. 500 (అయిదువందల రూపాయీలు) యిన్ద్కు నెల / ఒక్కింటికి వందకు రు. 1 రూపాయి చొ# వడ్డీతో అయ్యే అసలుఫాయిదాలు తీరుమానం చెయ్యగలందులమని ......”
ఈ విధంగా సాగిపోయింది ఆ రుణపత్రం.
కింద గంగన్న గారు చేసిన సంతకం ఇంకా గమ్మత్తుగా వుంది.
‘రాయసం గంగ్గంన్న వ్రాలు’ అని దస్కత్తు చేశారు. ఆ రోజుల్లో తెలుగు అలా వుండేదేమో!
తణుకు సబ్ రిజిస్త్రార్ ఆఫీసులో రెండు రూపాయల స్టాంపుపై రిజిస్త్రార్ సంతకం చేసి వేసిన మొహర్ వుంది.
అయిదు వందల రూపాయలు అప్పు చేయాలంటే ఇంత తతంగం నడిచేది.
అప్పు పూర్తిగా అసలు ఫాయిదాలతో అనుకున్న వ్యవధికి ముందే చెల్లు వేసి తనఖా పత్రాలను వెనక్కి తీసుకున్నట్టు కూడా వాటిల్లో వుంది.
ఇప్పుడో.....
అప్పు చేయడానికి ఆలోచించనక్కరలేదు. తీర్చే విషయం గురించి అసలు బెంగ పడక్కర లేదు. చేసింది ఎంత పెద్ద అప్పయితే చట్టం నుంచి తప్పించుకునే అవకాశాలు అంత ఎక్కువగా వుంటాయి.
కింది ఫోటో :
130 ఏళ్ళ నాటి రుణ పత్రం నకలు





(ఇంకా వుంది)

3, నవంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (240) : భండారు శ్రీనివాసరావు


పరుగు ఆపడం ఒక కళ
ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు జీవిత చరిత్ర పుస్తకానికి పెట్టిన పేరు ఇది. సినీ నటుడిగా మంచి అవకాశాలు వున్నప్పుడే, ఆయన నటనకు భరతవాక్యం పలుకుతూ సినిమా రంగం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. చనిపోయే వరకు ఆయన దీనికి కట్టుబడే వున్నారు.
ఆయనతో పోలిక కాదు కానీ గత కొన్నేళ్లుగా నేను టీవీల్లో రాజకీయ చర్చల జోలికి వెళ్ళడం లేదు. దీనికి ప్రధాన కారణం మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణం. అంతకు ముందు దాదాపు పుష్కరం పాటు రోజుకు మూడాటలు, ఆదివారం, పండుగలకి నాలుగాటలు అన్న లెక్కన టీవీ చర్చలతోనే కాలం గడిచిపోయింది.
కొంత తేరుకున్న తర్వాత, అంతకు ముందు నుంచి అంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా కొన్ని పత్రికలకి క్రమం తప్పకుండా వారం వారం రాసే రాజకీయ వ్యాసాల రచనా వ్యాసంగాన్ని మళ్ళీ తలకెత్తుకున్నాను. కొన్ని వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. కొంతకాలం తర్వాత వాటికి కూడా స్వచ్చందంగా స్వస్తి చెప్పాను. కారణం ట్రోలింగు పేరుతొ ఈ మీడియాలో భయంకరంగా, అవిచ్చిన్నంగా సాగుతున్న వ్యక్తిత్వ హననం. సంపాదన పట్ల దృష్టి పెట్టకుండా, సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా, కప్పు కాఫీ కూడా ఆశించకుండా ఈ చర్చల్లో పాల్గొంటూ, చివరాఖరులో ఇలాంటి మాటలు పడలేక, పత్రికల్లో రాతలకు, ఛానళ్లలో ఇంటర్వూలకు ఒకేసారి మంగళం పాడాను.
తరువాత పత్రికల వాళ్ళు రాయమన్నా రాయలేదు. ఛానల్స్ వాళ్ళు అడిగినా వెళ్ళలేదు.
బహుశా, నా ప్రేమ వివాహం విషయంలో తీసుకున్నట్టే, నా జీవితంలో నాకై నేను చేసుకున్న మంచి నిర్ణయాలలో ఇదొకటి అనుకుంటున్నాను.
ట్రోలింగు చేసే వారికి నేను చర్చించే అంశాల మంచి చెడులతో నిమిత్తం లేదు. మర బొమ్మలకు వారికి తేడా లేదు. తాము మంచి అనుకున్న దానిని మనం గట్టిగా నొక్కి చెప్పాలి. చెడు అని వారు భావించేదాన్ని మరింత విడమరచి, వారికి అనుకూలంగా చెప్పాలి. అంతే! లేశ మాత్రం తభావతు వచ్చినా మనపై తాటి ప్రమాణంలో విరుచుకు పడతారు. ఇన్నేళ్ళుగా నాతో స్నేహవాత్సల్యాలతో మెలుగుతూ వచ్చిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు సయితం మౌనంగానే వుండిపోతారు తప్ప, కనీసం ఇలా చేయకండి అని వారి అనుచరగణాలతో నోటిమాటగా కూడా చెప్పేవారు కాదు. ఘడియ తీరిక లేకుండా, గవ్వ రాబడి లేకుండా ఇక ఎందుకీ కంచి గరుడ సేవ అని నేనే తప్పుకున్నాను. నిజం చెప్పొద్దూ, దరిమిలా దైహిక, మానసిక ఆరోగ్యాలు రెండూ కుదుటపడ్డాయి. (సావిత్రి గారూ! Savitri Ramanarao వింటున్నారా?)
జీవితం అంతా ముడిపడిన వ్యాపకాన్ని వదులుకున్న తర్వాత జీవితమే ఖాళీ అయినట్టు అయింది. రోజంతా ఖాళీనే. రిటైర్ అయిన తర్వాత ఇలా ఇంట్లో ఎక్కువ సమయం వుండే జీవితాన్ని కోరుకున్న నా సహచరి, తన జీవితాన్నే ముగించుకుని వెళ్ళిపోయింది. ఇల్లూ మనసూ ఒకేసారి శూన్యం. పొద్దు గడవడం, పొద్దుపుచ్చడం ఎలా అనే ప్రశ్న నా ముందు నిలిచింది.
ముందు తట్టిన ఆలోచన ఈ జీరో రచన. రెండు వందల ఎపిసోడ్లు దాటిన తర్వాత, నడిచి వచ్చిన దారి ఇంతటి సుదీర్ఘమైనదా? ఎప్పటికి తెమిలేను అనే సందేహం పట్టుకుంది.
దాంతో టీవీలో ఏ ఛానల్లో పాత నలుపు తెలుపు సినిమా కనపడ్డా చూడడం మొదలుపెట్టి, వాటిల్లో ఆ రోజులనాటి నా జీవన ఛాయలను వెతుక్కోవడం మొదలు పెట్టాను. అలా ఛానల్స్ మారుస్తుంటే ఒకసారి ఏదో క్రికెట్ మ్యాచ్ కనపడింది. నిజానికి నాకు క్రికెట్టు అంటే ఏబీసీడీలు తెలవ్వు.
1970 ప్రాంతాల్లో కొత్తగా బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు, కాలేజీ నుంచి తాజాగా ఇక్కడ అడుగుపెట్టాడు, ఎంతో కొంత క్రికెట్ పరిజ్ఞానం వుండక పోతుందా అని క్రికెట్ పోటీకి సంబంధించిన పీటీఐ వార్త ఒకటి నా ముందు పెట్టి అనువాదం చేయమన్నారు. మొదటి వాక్యమే ఫర్ ది లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ అని వుంది. క్రికెట్ మైదానంలో కనబడేవి మూడు వికెట్లు, మరి నాలుగు వికెట్లు ఏమిటనే సందేహం పొటమరించి, దాని నివృత్తి కోసం సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుగారిని ఆశ్రయించాను.
విషయం అర్ధమై ఆయన చిన్నగా నవ్వి, ‘పోనీ లెండి, అది వదిలేసి ఇవి చూడండి’ అని కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్, లియోపాల్డ్ విల్లీ, కాంగో యుద్ధం, పాట్రిస్ లుముంబా వంటి ఐటమ్స్ చేతిలో పెట్టారు అనువాదం చేయమని. అదీ అప్పట్లో క్రికెట్ గురించి నా అవగాహన.
ఇప్పటికి అది పెరిగింది లేదు కానీ, చూడగా చూడగా ఆసక్తి మాత్రం పెరిగింది. క్రికెట్ గురించి నాలుగంటే నాలుగు ముక్కలు రాయడానికి అది చాలు అనుకుని అప్పుడప్పుడూ అర్ధరాత్రి వేళ మేలుకుని చూస్తూ కామెంట్లు పెడుతుంటాను.
తోక టపా:
మితృలు, జేవీపీఎస్ సోమయాజులు గారు ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చూసి,
“Cricket was never my first choice. I never wanted to be a sportsperson” అంటున్న ఈవిడ ఎవరండీ అని అడిగాను, నా అజ్ఞానం, అమాయకత్వం బయటపడుతుందని తెలిసి కూడా.
ఆయన చెప్పిన జవాబు విని నాకు మతి పోయింది. భారత మహిళల జట్టుకు సారధ్యం వహించి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంను ప్రపంచానికి పరిచయం చేసిన మిథాలీ రాజ్. మూడేళ్ల క్రితం ఆమె మీద ఒక సినిమా కూడా తీసారట.
కింది ఫోటో: (Courtesy: shri Jvps Somayajulu )



(ఇంకా వుంది)

31, అక్టోబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (239) : భండారు శ్రీనివాసరావు

 రేపు మనది కాదు

అక్టోబర్, నవంబరు.

దేశంలో కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లు ఈ రెండు నెలల్లో బతికుండి మళ్ళీ పుడతారు. పుడతారో లేదో కానీ, తాము బతికే వునట్టు వున్నట్టు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇస్తే కాని మరుసటి నెల నుంచి పెన్షన్ రాదు. అంచేత ముసలీ ముతకా అందరూ తమకు పెన్షన్ వున్న/వస్తున్న బ్యాంకుకు బారులు తీరతారు. ప్రభుత్వాలు జీవన్ ప్రమాణ్ వంటి యాప్స్ ప్రవేశపెట్టి, ఇంటి నుంచే తాము బతికే వున్నట్టు బ్యాంకుకు తెలిపే వెసులుబాటు కల్పించారు. అయితే ఇందుకు కొంత ఫేస్ రికగ్నిషన్ వంటి సాంకేతిక ప్రజ్ఞ అవసరం.

సరే! బాగానే వుంది.

కానీ ఈ బతుకు సర్టిఫికేట్ కు, రేపు మనది కాకపోవడానికి ఏమిటి సంబంధం? వుంది.

ముందీ కధ చిత్తగించండి.

పెసిమిజం అనుకోకండి. నిజంగా రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు అనుమానం.

చాలా ఏళ్ళ క్రితం మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి.

ఒక రోజు ఆ పెద్దమనిషి గారి భార్య మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది.

ఎలాటి రోగం రొష్టు లేని ఆయన భార్య ఆ రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.

మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించ లేదు. సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ చేదు జ్ఞాపకంలా మిగిలి పోయింది.

రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు. ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.

నిజమే అనిపించింది.

అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని కూడా ఆ క్షణంలో అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట.

ఎందుకంటే రేపు మనది కాదు.

ఇది గుర్తుకు రాగానే బ్యాంకుకు బయలుదేరాను. ఈరోజు అక్టోబరు 31.

మతి మరపు కదా! లైఫ్ సర్టిఫికేట్ దాఖలుకు ఇవ్వాళే ఆఖరు రోజు అనుకున్నా. ఇంతలో మళ్ళీ గుర్తు వచ్చింది. ఫేస్ బుక్ స్నేహితులు రామనాద్ Ramnath Kampamalla గత ఆగస్టులో మా ఇంటికి వచ్చారు. ఆయన ఉద్యోగమే కంప్యూటర్ల సంస్థలో. లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఆయన సాయం తీసుకుని మొత్తం మీద ఆ ప్రక్రియ పూర్తి చేశాను.

తిరుగు టపాలో వచ్చినట్టు నిమిషాల్లోనే మెసేజ్ వచ్చింది.

మీ లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ పద్దతిలో జయప్రదంగా సమర్పించినందుకు కృతజ్ఞతలు. ఆ సర్టిఫికేట్ ని మీకు పెన్షన్ ఇచ్చే ఏజెన్సీ ప్రాసెస్ చేసి, పెన్షన్ విడుదల చేస్తుంది’

అమ్మయ్య! బ్యాంకుకు వెళ్ళే పని లేకుండా పోయింది అని సంతోషించి, ఆ విషయం అంతటితో మరిచిపోయాను.

మానవ మాత్రుడిని కనుక నేను మరిచిపోయాను.

ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక వ్యవస్థలకు ఈ మతి మరపు లేదు కదా! అందుకని గుర్తు పెట్టుకుని గుర్తు చేసాయి, నా అక్టోబర్ పే స్లిప్ లో. ‘మీరు వయసులో పెద్దవారు కాబట్టి నవంబరు లోపు దాఖలు చేయండి’ అని హుకుం లాంటి అభ్యర్ధన. మరి ఆగస్టులో దాఖలు చేసింది ఏమైంది?

తప్పదు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయక తప్పదు. మా ఇంటికి దగ్గరే. మరీ దగ్గర కాదు మరీ దూరం కాదు, యూసుఫ్ గూడా ఎస్.బి.ఐ. బ్రాంచి. పదిన్నరకు తెరుస్తారు. వాళ్లకు కాణీ ఆదాయం లేని పని నాది. పొద్దున్నే ఇలాంటి బోణీ ఎందుకని పదకొండు ప్రాంతంలో వెళ్లాను. కస్టమర్లు పలచగానే వున్నారు. సిబ్బంది కూడా మరింత పలచగా వున్నారు. మా రేడియోతో సహా చాలా చోట్ల రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో ఖాళీలను పూరించకుండా వున్న సిబ్బందితోనే నెట్టుకు వస్తున్నారు. బహుశా బ్యాంకుల పరిస్థితి కూడా అదేనేమో!

రిసెప్షన్ అని రాసి వున్న చోట నీరజ అనే అమ్మాయి నిలబడే పనిచేస్తోంది. వెళ్లి వచ్చిన పని చెప్పాను. అందుకు సంబంధించిన పెద్ద అధికారి, చిన్న అధికారి ఇద్దరూ బ్యాంకు ఏటీఎం పనిలో వున్నారు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి' అన్నది చాలా మర్యాదగా.

ఇప్పుడు బ్యాంకులు వెనుకటి మాదిరిగా లేవు. కార్పొరేట్ స్థాయిలో మంచి మంచి కుర్చీలు, ఏసీ సదుపాయం. ఇంటికి పోయి చేసేది ఇదే కదా అని, అక్కడే మంచి చోటు చూసుకుని సెటిల్ అయ్యాను.

ఉన్న అయిదారుగురో, పదిమందో సిబ్బంది కూడా కాగితాలు, నోట్ల బండిళ్ళు పట్టుకుని అటూఇటూ తిరుగుతున్నారు. నాలుగో తరగతి సిబ్బంది మాత్రం వాళ్ళ స్థానాల్లో సుఖాసీనులై విశ్రాంతి తీసుకుంటున్నారు. పెద్ద అధికారి, చిన్న అధికారుల జాడలేదు.

ఈ లోపున విశ్రాంతిలో వున్న నాలుగో తరగతి అధికారి మా వద్దకు వచ్చి పెద్ద సారు రావడానికి చాలా సమయం పడుతుంది అన్నాడు, ఇక దయ చేయండి అన్నట్టు.

నేను మళ్ళీ నీరజ గారి దగ్గరికి వెళ్లాను. ‘నాకు పెద్ద పనేమీ లేదు, సర్టిఫికేట్ ఆల్రెడీ జీవన్ ప్రమాణ్ ద్వారా ఇచ్చేశాను. అదేమైంది అనే నా సందేహం నివృత్తి చేస్తే వెళ్ళిపోతాను. కాదు కూడదు ఇవ్వాలి అంటే రేపు కూడా వ్యవధి వుంది కదా, వచ్చి ఇస్తాను’ అన్నాను. ఆ అమ్మాయి ఏమనుకుందో ఏమిటో, ‘వయసు ఎనభయ్, రేపు వస్తానంటున్నాడు’ అన్నట్టు నా వైపు ఎగాదిగా చూసి, ఒక కౌంటర్ లో తలెత్తి చూసే విరామం లేకుండా పనిచేస్తున్న అనూష అనే మరో ఉద్యోగిని వద్దకు తీసుకువెళ్లి, నేను వచ్చిన పని వివరాలు చెప్పింది. ‘ముందు కాసేపు ఆగండి ఆ అధికారి రాగానే మీ పని చూస్తారు’ అన్నది కాస్తా నా మాటలతో మెత్తపడి, ‘మీ పీ పీ ఓ నెంబరు చెప్పండి’ అన్నది. కీ బోర్డు మీద వేళ్ళు టకటకలాడిస్తూ, ఎదురుగా వున్న మానిటర్ లోకి చూస్తూ ‘మీరు ఆగస్టులో ఇచ్చింది ఇక్కడ డిస్ ప్లే కావడం లేదు, రేపు వచ్చి చెప్పండి, అప్పటికి అప్ లోడ్ కాకపోతే అప్పుడు చూద్దాము, రేపు ఒక్క అయిదు నిమిషాలు వస్తే చాలు, ఈ పని పూర్తి చేస్తాను’ అన్నది అనునయంగా.

నిజానికి ఇది ఆమె పని కాదు. అయినా ఆ మాత్రం భరోసా ఇచ్చింది. బ్యాంకుల సిబ్బంది పనితీరు పట్ల నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇలాంటి ఉద్యోగుల అవసరం చాలా వుంది.

నిజానికి బ్యాంకుల భయం బ్యాంకులది.

ఇవ్వాళ ముప్పయి ఒకటి. రేపు నవంబరు ఒకటిన నేను బతికి వుండాలి. అప్పుడే పెన్షన్. ఈ రోజే ఆ పని చేస్తే కుదరదు. ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఏం జరుగుతుందో ?

అందుకే అన్నది, రేపు మనది కాదు.

(ఇంకా వుంది)

25, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (238) : భండారు శ్రీనివాసరావు

 చిన్న మనుషులు – గొప్ప మనసులు

యాదమ్మ, స్వరూప, అంకిత , వనిత

గత మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో వివిధ దశల్లో మా జీవితాలతో ముడిపడిన వారిలో వీరున్నారు. జీతాల మీద పనిచేసిన వారే కానీ జీతాల కోసమే పనిచేయలేదు. అందుకే కుటుంబ సభ్యులు అయ్యారు.

యాదమ్మ, సంపూర్ణ ఇంటి పనిలో సహాయకులు. స్వరూప మా పెద్ద వదిన గారికి పెద్దతనంలో సహాయకురాలు, అంకిత మా మనుమరాలు జీవికకి కేర్ టేకర్, ఇక వనిత గత పదిహేను సంవత్సరాలుగా మా వలలి.

జీవితం అన్నాక కొందరు గొప్పవాళ్లు తారసపడతారు. అలాగే చాలామంది చిన్నవాళ్లు కూడా మన జీవన నౌక సాఫీగా సాగడానికి తోడ్పడతారు. నా జీవితాన్ని తరచి చూసుకునే ఇలాంటి సందర్భాలలో చిన్నా గొప్పా తారతమ్యం లేకుండా అలాంటి వారిని కూడా గుర్తు చేసుకోవడం సముచితమని నా భావన.

తెలుగువారికి గొప్ప పండుగలలో సంక్రాంతి ఒకటి. అది వెళ్ళిన మరునాడే కనుమ. అది కూడా పండగే. సంక్రాంతికి సొంతూరు వెడితే మర్నాడు కనుమ కూడా అక్కడే గడిపి రావడం ఆనవాయితీ. కనుమనాడు కాకయినా కదలదు అనే నానుడి పేర్కొంటూ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తారు.

అలా ఒకసారి 2019 లో కనుమ నాడు కూడా మా ఇంట పండగ సందడి చోటు చేసుకుంది. దానికి కారణం ఎప్పుడో పుష్కరం కింద మా ఇంట్లో పనిచేసిన మల్లయ్య కుటుంబం.

ముప్పయ్ ఏళ్ళ క్రితం మేము మాస్కోనుంచి వచ్చి హైదరాబాదు పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో మళ్ళీ కొత్తగా కొత్త కాపురం పెట్టిన రోజుల్లో, మల్లయ్య కుటుంబం మా ఇంట్లో పని చేసేది. మధ్యలో మేము చాలా ఇళ్ళు మారాము. అయినా ఆ కుటుంబంతో మా బంధం కొనసాగుతూ వచ్చింది.

ఆ ఏడాది కనుమ రోజు సాయంత్రం ఎల్లారెడ్డి గూడాలోని మా ఇంటికి ఇంటిల్లి పాదీ వచ్చారు. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. యాదమ్మ, మల్లయ్యలకు ముగ్గురు మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా చదువుతున్నారు. మల్లయ్య ఆడ సంతానం పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు. అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి చిన్నమ్మాయి ( మా కళ్ళ ముందే పుట్టింది) తిరుమలమ్మ (పెళ్ళిలో రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా అమ్మానాన్నలను చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’ అని.

వాళ్ళందరినీ చూసి మా ఆవిడ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ పిల్లల్లో ఇద్దరు ముగ్గురు ఆవిడ చేతుల్లోనే పెరిగారు. వాళ్ళ చదువులు, ఫీజులు, పుస్తకాలు వగైరా దగ్గరుండి కనుక్కుంటూ వుండేది. అందుకని ఆ కుటుంబానికి మా ఆవిడ అంటే అభిమానంతో కూడిన ఆరాధన.

అంతమంది ఆడపిల్లలు గల గలా మాట్లాడుతుంటే ఆడ సంతు లేని మేము ఎంతో సంతోషించాము. ఫోటో అంటే మొహం తిప్పుకునే మా ఆవిడ ఆ రోజు అందర్నీ తన పక్కన నిలబెట్టుకుని నాతో వాళ్ళ గ్రూపు ఫోటో తీయించుకుంది.

ఇది జరిగింది జనవరిలో. ఆగస్టులో ఆమె లేదు. ఫోటో మిగిలింది.

స్వరూప.

నలభై,యాభయ్ ఏళ్ళు వుంటాయి. పేరుకు తగిన రూపం కాదు అని మొదటిసారి చూసిన వాళ్ళు అనుకుంటారు.

కానీ ఆమె మనసు ఎంతటి ఉదాత్తమైనదో తెలిసే అవకాశం ఒకసారి వచ్చింది.

మా పెద్ద వదిన సరోజిని గారు జీవించి వున్నప్పుడు చేయి విరిగింది. మా కుటుంబంలో పెద్ద. ఆమెకు సాయంగా ఉండడానికి మా అన్నయ్య కుమారుడు రాఘవ రావు ఏదో ఏజెన్సీతో మాట్లాడి ఒక సహాయకురాలిని పెట్టాడు. ఆమే ఈ స్వరూప. మా ఇంటికి దగ్గర కాబట్టి, ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వెళ్లి మా వదినను చూసి వస్తుండే వాడిని.

ఒక రోజు నేను వెళ్ళే సరికి తల వాకిలి ఓరగా వేసివుంది.

లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచి వచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో కూలబడ్డాను.

వదిన మంచం మీద దిండును ఆనుకుని కూర్చుని, ఎదుటి మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా వింటోంది.

మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె రెండు చేతులూ పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకు పోతోంది.

నేను మౌనంగా వింటున్నాను.

అమ్మా! మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు. మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో రాత్రుళ్లు నాకు చెప్పకుండా లేస్తున్నారు. మీ పక్కనే పడుకుంటున్నాను. ఏమాత్రం అవసరం వున్నా నన్ను లేపండి. నేను దగ్గర వుండి మిమ్మల్ని బాత్ రూముకు తీసుకు వెడతాను. మీరు నా కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి నువ్వు రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం చేస్తే తల్లి శుభ్రం చేయదా! నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే పని లేకుండా నేనే చూస్తాను. లోగడ కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పని చేశాను. ఇవన్నీ నాకు అలవాటే. కాబట్టి నా మాట వినండి. నేను ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆ పైన దేవుడు నన్ను వదిలి పెడతాడా!

మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ గట్టిగానే చెబుతాను. మనసులో పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను. తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట రానీయకండి”

ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో చూడాలని వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి దొరికింది.

గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాను.

అంకిత

ఈ అమ్మాయిని మా మనుమరాలు జీవికకు కేర్ టేకర్ గా పెట్టారు.

అప్పటికి నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.

అంచేత ఏదో కంపెనీని సంప్రదించి ఓ కేర్ టేకర్ ని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప, వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.

మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని.

ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.

ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు.

నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బతిన్నది. కను చూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.

కొన్ని రోజులు గంట గంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.

ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.

ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.

అయితే ఒక విషయం చెప్పాలి.

ఇంత మొండి పిల్లను నా జీవితంలో చూడలేదు.

పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.

అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా’ అంటే ససేమిరా వినదు. ‘హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది’ అంటుంది.

నేనే చెబుతున్నా కదా’ అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.

ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.

సంక్రాంతి, దసరా వంటి పండుగలు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి అనితలతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు.

'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా అన్ని అవసరాలు మీరే చూసుకుంటున్నారు. ఒక వేయి నేను వుంచుకుని, మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను' అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా.

అందుకే ఆ అమ్మాయి ముట్టె పొగరుని సహిస్తూ, భరిస్తూ వచ్చాను. ఆమెకున్న ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ వచ్చాను.

కాంట్రాక్ట్ ముగిసింది. మనుమరాలు కటక్ లో వాళ్ళ అమ్మమ్మ గారింట్లో వుంది. నా ఆరోగ్యం కుదుట పడింది. ఏడాది ఆఖరులో వాళ్ళ కులదేవత పూజలు అవీ వున్నాయి, నెల రోజులు వుండను, వూరికి పోతాను అని ఏడాది కిందట పనిలో చేరేటప్పుడే చెప్పింది. అలాగే వెళ్ళిపోయింది.

పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.

తోకటపా:

మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో తాను వుంటే, అది ఎడిట్ చేసేదాకా వూరుకోదు. అంత మొండిఘటం.

కింది ఫోటో: మల్లయ్య కుటుంబంతో మా ఆవిడ నిర్మల




(ఇంకావుంది)