13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

అడ్డు కట్టలు



నిజమే! కొన్ని కొన్ని చాలా అత్యల్ప విషయాలే వినడానికి ఎంతో వింతగొలుపుతాయి అదేమిటో.
తెలుగు టీవీ సీరియల్స్ అంటే ఎలర్జీ. కొన్నాళ్ళు వాటిని చూస్తూ పొతే ఎలర్జీ అదే పోతుందన్నాడు ఒక ఉచిత సలహాదారు. ఆ మాటలు విని,  వరసగా రెండు రోజులు పనిగట్టుకుని సీరియళ్ళు చూసేసరికి ఆశ్చర్యంగా ఎలర్జీ మాయమయింది. కాకపొతే అవి అలవాటుగా మారుతుందేమో అన్న భయం పట్టుకుంది.
ఈ సీరియళ్ళలో నాకు నచ్చిన అంశం ఒకటి కనబడింది. టీవీ చర్చల్లో మాదిరిగా కాకుండా ఒక పాత్ర మాట్లాడుతుంటే మరో పాత్ర అడ్డం రాదు. ‘ఎంతపని చేసావు లక్ష్మీ’ అంటూ ఆమె మొగుడు ఓ అయిదు పేజీల డైలాగు మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చుకుంటూ, సగం కళ్ళతో మాట్లాడుతూ పోతుంటే ఆ భార్య పాత్ర పాపం కిమ్మనకుండా ఆసాంతం వింటుంది. అంతా అవనిచ్చి అప్పుడు మొదలు పెడుతుంది తన ఇన్నింగ్స్. ఇక ఆ మొగుడుగారు కూడా, టీవీ చూస్తున్న మనతో పాటు మరో శ్రోతగా మారిపోతారు. భార్య కడిగి గాలించి పారేస్తుంటే మౌనశ్రోతగా మిగిలిపోయి అప్పుడప్పుడూ క్లోజప్పులలో కళ్ళు విప్పార్చి చూస్తూ అలా ఒక శిలా విగ్రహంలా నిలబడి పోతాడు.
సంసారాల్లో మొగుడూ పెళ్ళాల నడుమ మాటామంతీ నడిచినా, అలాగే ఒకరి మాట మరొకరు ప్రశాంతంగా వినే వెసులుబాటు వున్నా ఇక ఆ సంసారంలో అపార్ధాల సీన్లకు అవకాశం ఉండదని, ఆ సంసార రధం నల్లేరు మీద బండిలా నడిచిపోతుందని ఓ సైకాలజిస్ట్ రాసిన గ్రంధంలో చదివిన జ్ఞాపకం.
అసలీ టెక్నిక్ పాండవోద్యోగ విజయాలు నాటకంలోనే వాడారని మా మేనల్లుడు అంటాడు. కృష్ణుడు పద్యం అందుకుని రాగయుక్తంగా పాడి చివర్లో పట్టుకున్న రాగాన్ని ఓ అరగంట సాగదీసి ముగించే వరకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడు కిరీటం సర్దుకుంటూ, మీసం దువ్వుకుంటూ వుండిపోతాడేకాని, తను పాడాల్సిన పద్యం వెంటనే ఎత్తుకోడు. అయినా ఆ నాటకానికి ఆ రోజుల్లో ‘రేటింగులు’ భేషుగ్గానే వున్నాయి.

టీవీ చర్చల్లో పాల్గొనే వాళ్లకి ఈ పాఠాలు ఎవరు చెబుతారు చెప్మా!


Courtesy Cartoonist Krishna garu

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నాటకాలలో స్టేజి మీద అందరూ మైకు చుట్టూ చేరి నిలబడి ఒకరి తరువాత ఒకరు డైలాగ్స్ చెబుతుంటారు. టీవీ సీరియల్స్ లో కూడా అదే తీరు. అందరూ
ఎల్ల వేళలా ఫుల్ మేకప్ లో ఉంటారు. ఒకరు డైలాగ్ చెప్పిన తరువాత మిగిలిన వాళ్ళ రియాక్షన్ ఒకటొకటి గా చూపిస్తారు. అప్పుడు చెవులు దద్దరిల్లెలా మ్యూజిక్. అంతా చేసి విషయం ఏమీ ఉండదు.

టార్చర్ లో ఇదొక రకం.