9, సెప్టెంబర్ 2024, సోమవారం

అరాచకోపాఖ్యానం

అరాచకోపాఖ్యానం - భండారు శ్రీనివాసరావు 

" నువ్విక్కడ మాట్లాడకుండా బతక లేవు. రేపక్కడ ( మాస్కోలో) మాట్లాడితే బతక లేవు. ఎలా మరి?"
37 సంవత్సరాల క్రితం రేడియో మాస్కోలో పనిచేసేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరే ముందు నా తత్వం బాగా తెలిసిన మిత్రుడు ఒకడు అన్న మాట. (సోవియట్ యూనియన్ అంటే ఇనుపతెర దేశం అనే  విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ చెప్పిన మాట అది)
కానీ నా తత్వం గురించి చెప్పాను కదా! రూల్ అంటే అతిక్రమించడం. రూలు పాటించక పోతే ఎలా బతుకుతావు అనేది నా మిత్రుడు సున్నితంగా చేసిన హెచ్చరిక సారాంశం. 
అక్కడకు అంటే మాస్కో చేరిన తర్వాత చూస్తే పరిస్థితులు అలాగే వున్నాయి. మెట్రోల్లో, బస్సుల్లో, ట్రాముల్లో ఎక్కడ చూసినా నీరవ నిశ్శబ్దం. ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. మెట్రో ఎక్కగానే ఏదో పత్రికో, పుస్తకమో పట్టుకు కూర్చుంటారు. తమ స్టాపు రాగానే నిశ్శబ్ధంగా దిగిపోతారు. 
మేము నివాసం వుండే భవనంలో మాస్కో రేడియోలో పనిచేసే ఇతర భారతీయ భాషల న్యూస్ రీడర్స్ కూడా కాపురాలు వుంటారు. మొదట్లో అందరం కలిసే ఆఫీసుకు వెళ్ళే వాళ్ళం. వాళ్ళందరూ నియమాలు తు చ తప్పకుండా పాటించే రకం. పదింటికి ఆఫీసులో వుండాలి అంటే ఓ అయిదు నిమిషాలు ముందే వెళ్ళే వాళ్ళు. అందరం చేయాల్సిన పని ఒక్కటే. రేడియో అధికారులు బులెటిన్ ఇంగ్లీషులో తయారు చేసి తలా ఒక కాపీ ఇస్తారు. ఎవరి భాషల్లో వాళ్ళు దాన్ని తర్జుమా చేసి, స్టూడియోకి వెళ్లి చదవాలి. ఓ అరగంట వార్తలు, మరో అరగంట సర్కారు వారి విధివిధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి సుదీర్ఘ వివరణలు. ఈ గంట ప్రోగ్రాముకు మూడు గంటలు ముందు పోవడం ఎందుకు అనిపించి వార్తల టైముకి గంట ముందు పోయేవాడిని. దీనికి రెండు కారణాలు. ఒకటి ఆలస్యంగా లేచే అలవాటు. రెండోది ఇంటి భోజనం తప్ప బయట తినలేని బలహీనత. రేడియో క్యాంటీన్ లో మంచి భోజనం దొరుకుతుంది. కానీ నాకు సయించేది కాదు. నిజానికి ఇవన్నీ నా సమస్యలు. రేడియో వారికి ఏం సంబంధం? 
కానీ నా పద్ధతి నాది.
గీర్మన్ అని నాకు ఒక రష్యన్ సహాయకుడు వుండే వాడు. పది గంటలకు నేను సీట్లో కనబడకపోతే కంగారుగా ఇంటికి ఫోను చేసే వాడు. 
" మీరు ఇంకను రేడియోలో ప్రవేశించ లేదు. సమయము అవధి దాటుతుంది " అనేవాడు వచ్చీరాని తెలుగులో.
 " నేను టైముకి రావాలా? లేక టైముకి వార్తలు ప్రసారం కావాలా? " అని ఎదురు ప్రశ్నించే వాడిని.
కొన్నాళ్ళకు అతడికే బోధ పడింది, నేను ఎంత ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళినా అనువాదం పని పూర్తి చేసుకుని కరక్టుగా టైముకి వార్తలు చదవగలనని.
బెజవాడ ఆంధ్ర జ్యోతిలో కాలాలకు కాలాలు, పేజీలకు పేజీలు అనువాదం చేసిన అనుభవం రేడియో మాస్కోలో నాకు ఉపయోగపడింది.
నాకు అర్ధం కానిది ఒక్కటే, రూలు ప్రకారం నడిచే ఆ దేశంలో నా అరాచకాన్ని ఎలా అనుమతించారని.

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అసలు మాస్కో రేడియో లో తెలుగు వార్తలు ఎందుకు పెట్టారు ? ఎవరికోసం అనేది అర్థం కావడం లేదు. 🤔

ఆ వార్తలు ఎవరైనా విన్నారో లేదో కానీ మీ ఎడతెగని మాస్కోయణం ముచ్చట్లు మాత్రం ఆగడం లేదు.


భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత:Enigandla Sreenivas
Savitri Ramanarao నిజమే. కానీ అన్ని ప్రపంచ భాషల్లో ప్రసారాలు చేయడానికి అప్పుడు అధికారంలో వున్న సోషలిస్టు/కమ్యూనిస్టు ప్రభుత్వం. కమ్యూనిజం ఫిలాసఫీని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ప్రధానంగా వరల్డ్ రేడియో మాస్కో పనిచేసేది. మన దేశం నుంచి తెలుగు మాత్రమే కాదు మొత్తం 140 భారతీయభాషల్లో వార్తలు, ఇతర కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.
మాస్కోలో తెలుగు కుటుంబాలు పది పదిహేను వుండేవి. వీటిల్లో నాదొక కుటుంబం. వీళ్ళ కోసం నేను పోయిన ఏడాదే మాస్కోలో ఇండియన్ ఎంబసీ ఇంగ్లీష్ మీడియంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించింది. అంచేత అయిదేళ్ళు వుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా మా పిల్లల చదువులకు ఇబ్బంది రాలేదు. పైగా మేము మాస్కోలో వున్న కాలంలో మన ఎంబసీలో ఎనిమిది మంది తెలుగు వాళ్ళు వుండే వాళ్ళు. మాస్కోలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు అదనం. ఈ సంగతులన్నీ, మార్పుచూసిన కళ్ళు అనే పేరుతో రాసిన చిన్న పుస్తకంలో రాశాను.
సోవియట్ యూనియన్ గ్లాస్ నాస్త్, పెరిస్ట్రాయికా వంటి గోర్బ చెవ్ సంస్కరణల అనంతరం అంగ వంగ దేశాలుగా విచ్ఛిన్నమైన దరిమిలా ప్రచారం కోసం పెట్టిన రేడియో ప్రసారాలను కూడా నిలిపివేశారు. క్లుప్తంగా ఇదీ కధ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత: వెనుకటి రోజుల్లో -
రేడియో ఒక్కటే రాజ్యమేలుతున్న కాలంలో-
ఒక పెద్ద మనిషి నేను పనిచేస్తున్న ఆకాశవాణి కార్యాలయానికి ఫోన్ చేసి, ' మీ రేడియో వార్తలు వినలేక చస్తున్నాము ' అన్నాడు కోపంగా.
'పరిష్కారం మీ చేతుల్లోనే వుందికదా' అన్నాను జవాబుగా.
ఇందులో సమాధానం కన్నా ఎకసక్కెం పాలు ఎక్కువ వుందనుకున్నాడో ఏమో - 'ఎలా?' అన్నాడు మరింత కోపంగా.
'మీ రేడియో నాబ్ ని ఎడమవైపు తిప్పండి సరిపోతుంది.' అన్నాను కూల్ గా.
రేడియో పెట్టుకోవడం, ఆపుచేసుకోవడం మీ చేతుల్లో పనే కదా! అన్నట్టుగా ధ్వనించిన నా జవాబులో - ఏదయినా చమత్కారం తోచిందో ఏమో కాని, 'భలే వారే' అంటూ ఫోన్ పెట్టేసాడా శ్రోత.
మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మామూలే.

అజ్ఞాత చెప్పారు...

👍👏 Interesting facts.

Zilebi చెప్పారు...

అర్ధం కానిది ఒక్కటే, రూలు ప్రకారం నడిచే ఆ దేశంలో నా అరాచకాన్ని ఎలా అనుమతించారని.
:)

పెట్టిపుట్టిన పుణ్యం

మేమంతా ఇంకా అనుమతిస్తున్నా మే గా (మీరు టపాలు వ్రాయడానికి) చదివి మళ్లీ మళ్లీ అదే చదివి అలాగన్నమాట :)


జోక్స్ అపార్ట్ మీరెన్ని మార్లు రిపీట్ అన్నా "దూరదర్దన్" మహాభారత్ లా, రేడియో అక్కయ్య ప్రొగ్రామ్ లా , చదివించే గుణం‌~ సొబగు మీ రాతలకే గలదండోయ్ :)


విన్నకోట నరసింహా రావు చెప్పారు...

140 భారతీయ భాషలా‌ 🙄? ఒక అంకె ఏదో అదనంగా పడినట్లుందే 🤔?

Zilebi చెప్పారు...

బ్యాంకరు కండ్లు సున్నల గల్తీలను భలే పట్టేస్తాయి :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఒక అదనపు సున్నా మొత్తాన్నే మార్చెయ్యచ్చు కదండీ.

కాబట్టే మీ డబ్బు మీకు (మీకే) అప్పజెప్పడానికి బ్యాంకర్లు తీసుకునే జాగ్రత్తలలో భాగం ఆండీ 😎.

Zilebi చెప్పారు...

ఎంత మంచి వారండీ
ఆ మధ్య "అవును" బ్యాంకు వారు బాండ్లు మొత్తము గుటకాయ స్వాహా అన్నారనిన్ను సేటు బ్యాంకు దానికి వత్తాసు పోయిందనిన్ను విన్నా జీరోలు స్వాహా :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"వత్తాసు" పలకలేదు‌లెండి 😆.
'అవును' బ్యాంకు వారి నిర్వాకం వల్ల వారి డిపాజిటర్లకు, ఇతర కస్టమర్లకు నష్టం వాటిల్లకుండా ఆ బ్యాంక్ ని Reconstruction చేసి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా 49% SBI వారు తీసుకోవడం జరిగింది. జనహితార్థం అన్నమాట 😀😀.

అయినా ఇవన్నీ మీకు తెలియనివా!!