23, జులై 2024, మంగళవారం

మాస్కో అతిథి


నందగిరి ప్రసాద్.  నలభయ్ ఏళ్ల క్రితం నేను మాస్కోలో తిరుగాడిన ప్రదేశాలన్నీ, ప్రస్తుతం మాస్కోలో ఉద్యోగం చేస్తున్న ఈ ప్రసాద్ గారు అనే పెద్ద మనిషి గత మూడు మాసాలుగా నాకు వీడియోలో ప్రతి ఆదివారం నాడు తాను కలయ తిరుగుతూ నాకు ఫోన్లో చూపిస్తూ వస్తున్నారు.  నిజానికి వీరితో నాకు పూర్వ పరిచయం లేదు. ఎప్పుడో నా బ్లాగులో, నా ఒకప్పటి మాస్కో జీవితం గురించి చదివి, గట్టి పట్టుదలతో ప్రయత్నించి, నా ఫోన్ నెంబరు పట్టుకుని ఓ రోజు ఫోన్ చేసారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు నేను అక్కడ వున్న అయిదేళ్ల కాలంలో చూసిన మాస్కోకు ఇప్పటి మాస్కోకు స్థూలంగా పెద్ద మార్పులు లేకపోయినా,  ప్రజల జీవన శైలి, వస్త్ర ధారణల్లో వచ్చిన మార్పులు స్పుటంగా కనిపించాయి. మళ్ళీ ఒకసారి మాస్కో వెళ్ళాలనే నా తీరని కోరికను ఆయన ఈ విధంగా తీరుస్తూ వస్తున్నారు.
 ప్రసాద్ గారు నాకు పరిచయం లేని మనిషి అయినా కూడా, వీడియోల్లో చూస్తూ వచ్చాను కనుక ముఖ పరిచయం లేని మనిషి అని చెప్పలేను.
నిన్న ఉదయం ఫోన్ చేసి, హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం నాలుగు గంటలకు  మీ ఇంటికి వస్తున్నాను, లోకేషన్ షేర్ చేయమని చెప్పి, అన్నట్టే వచ్చేసారు. గత మూడు నెలలుగా ఫోన్లో మాట్లాడుతూ వున్నా మేమిద్దరం ఒకరినొకరం కలుసుకోవడం ఇదే మొదటిసారి. రెండు గంటలు కూర్చుని మళ్ళీ ఆరు గంటలకు బయలు దేరి వెళ్ళిపోయారు. తాను మరో మూడు నాలుగేళ్లు మాస్కోలో వుంటానని, తాను కూడా (పెళ్లి కాలేదు కనుక) ఒంటరిగానే ఉంటున్నానని, తప్పకుండా వచ్చి తనతో వుండమని మరీ మరీ చెప్పారు. మేము మాస్కోలో వున్నప్పుడు తాను బెజవాడలో స్కూల్లో చదువుతున్నానని, తనకు ఇప్పటి మాస్కో తెలుసుకానీ, నలభయ్ ఏళ్ల క్రితం ఎలా వుండేది అన్నది నా రచనల ద్వారా తెలుసుకున్నానని చెబుతూ, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని అనుకున్నానని, అంచేత హైదరా బాద్ రాగానే మొదటి ఫోన్ మీకే చేసాను అని అన్నారు.
మొత్తం మీద నిన్న ఓ రెండు గంటలు ప్రసాద్ గారి మాటలతో కాలక్షేపం అయ్యింది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మాస్కోలో గ్లాస్కో పంచె వేస్కుని పౌడర్ పూస్కుని డిస్కో వింటూ ఫ్లాస్కో లో కాఫీ పోస్కొని రస్కో బిస్కో తింటూ కళ్ళు మూస్కోకుండా ఫ్రెస్కో చిత్రాలను చూస్కుంటూ రిస్కు లేకండా బాస్కో లీవ్ లెటర్ రాస్కుంటే బాగుంటుంది.