29, జూన్ 2024, శనివారం

‘ఇదేమి సినిమా?‘

 


‘అదేమరి! మీ వయసు వాళ్ళు చూసే సినిమా కాదది.’

‘అవును. ఏమిటో ఆ యుద్ధాలు. ఎవరు ఎవరితో కొట్టుకుంటున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్ధం కాలేదు. అదృష్టం ఏమిటంటే థియేటర్లో రుధిరం పారలేదు, అధునాతన మారణాయుధాల పుణ్యమా అని. ఆ యుద్ధాలు చూసిన తర్వాత సినిమాలో ఒక పాత్రకే కాదు, ఎవ్వరికీ చావు లేదేమో అనిపించింది.

‘ఇంకా

‘ ఒక్కో టిక్కెట్టు నాలుగు వందలు. యాభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి ఉద్యోగంలో మొదటి జీతం రెండువందల యాభయ్. మరి మండదా! ఆరువందల కోట్ల సినిమా అంటున్నారు. వారి డబ్బు బూడిదలో పోసినా, వారికి పన్నీరే దక్కుతోంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అలా వున్నాయిట భారీ స్థాయిలో  కలెక్షన్లు ఇంటా బయటా కూడా.  హైదరాబాదులో ఏ థియేటర్ లో కూడా మరో సినిమా లేదు, ఇది తప్ప, ఒకే దేశం ఒకే సినిమా లాగా. తీసిన వాళ్ళు సరే,  కానీ నా నాలుగు వందలు బూడిద పాలే కదా!’

‘తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే సినిమాకి ఆ మాత్రం డబ్బు ఖర్చు చేస్తే తప్పేమిటి’

‘’పోరాటాలు, యుద్ధాలు హాలీవుడ్ స్థాయిని మించిన మాట నిజమే. కానీ కధ సంగతి ఏమిటి? రివ్యూలు చదివి, చూసిన వాళ్ళు  కూడా ఏమీ అర్ధం కాలేదు అనేవాళ్ళు బోలెడుమంది.  అలాంటి కళ్ళు చెదిరే సన్నివేశాలు చూడడానికి ఇంగ్లీష్ సినిమాలు ఎలాగు వున్నాయి. అవతార్ లు, స్టార్ వార్స్ చూడలేదా! పైగా ఇందులో లేని యాక్టర్ లేడు అన్నట్టు బిల్డప్. అమితాబ్, ప్రభాస్, బ్రహ్మానందం ఇలా కొందర్ని తప్పిస్తే మేకప్ ముసుగులో ఎవర్నీ గుర్తు పట్టేట్టు లేరు. ఎవరో అంటుంటే వినబడింది, సినిమా మొదట్లో కనబడిన ఒక  పాత్రలో  నటించిన మనిషి రాజేంద్రప్రసాద్ లాగా అనిపించాడు అని. చివరికి, చివర్లో కనపడ్డ కమల్ హసన్ కూడా అంతే. జగన్నాధ రథచక్రాలు అనే డైలాగ్ ని బట్టి కొందరు గుర్తు పట్టారు. ఏదైనా అంటే ఈ చిత్రంలో పాత్రలు కనిపిస్తాయి, నటులు కనిపించరు అని. ఈ మాత్రం దానికి అంత స్టార్ కాస్ట్ ఎందుకు, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి తప్పిస్తే    

‘అదే చెప్పేది, ఆ డబ్బు ఎవరికి పోయింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు మనవే కదా! ప్రపంచ స్థాయి సినిమా తీసిన వారిని అభినందించాలి కానీ, ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా?

‘నేను చెప్పేది అదే. కోట్లాది డబ్బులు కోట్లాది డబ్బులు గుమ్మరించి ఇలా తీసే  అర్ధం పర్ధం లేని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే, మరి కొందరు బడా నిర్మాతలు ఇదే దారి పట్టి, తెలుగు సినిమా ఖర్చును హాలీవుడ్ స్థాయికి పెంచుతారు. సినిమా స్థాయి సంగతి మరచిపోతారు. నిజమే! పెద్ద సినిమా ఒకటి బాగా ఆడితే పరిశ్రమను నమ్ముకుని బతుకు బండి లాగించే వేలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. కానీ అందుకోసం లక్షలాదిమంది ప్రేక్షకులు చెల్లించుకునే మూల్యం మాటలేమిటి? ఇంతంత మొత్తాల్లో  డబ్బులు వాళ్ళూ, వీళ్ళూ తగలేయడం సమంజసమేనా!’

‘ఇక మీకు చెప్పడం నా తరం కాదు. మీ మనుమల్ని అడగండి, సినిమా ఎలావుందని, వాళ్ళు చెబుతారు మీకు సరైన సమాధానం.’  

(29-6-2024)  

 

14 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

హాయిగా ఇంట్లో జోగి నిదురోకుండా సినిమాకు డబ్బులు ఖర్చెట్టేసుకుని పోనేలా! తల బద్దలు కొట్టుకోనేలా ? శుభ్రంగా ఓ నెలలో అమెజాన్ లోనో నెట్ఫ్లిక్స్ లోనో వస్తే గిస్తే చూస్తే పోలా ! చాలా వెసులుబాటు కూడా వద్దనుకుంటే మీట నొక్కేసి నిదురోవచ్చు లేదంటే ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేసి హమ్మయ్య నేనూ‌చూసేసానోచ్ అని‌ ఓ రివ్యూ వ్రాసి పారేయొచ్చు :)


నటులను కోట్లాధిపతుల చేసిన అందరికీ శుభకామనల సహితం

చీర్సు తో


జిలేబి :)






విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నిన్ననే (జూన్ 28న) దేశప్రజల మీద పడ్డ సినిమాని అప్పుడే చూసేసారంటే ….. మీరూ వీరాభిమానులే అన్నమాట (జనరల్ గా సినిమాలకు) 🤔?

“అంతర్జాతీయ స్ధాయి” అంటే ఇదే గనక అయితే ఆ స్ధాయి సినిమాలను నిర్మించాలని మనవాళ్లు ఎగబడడం ….. మన సినిమాల స్ధాయిని మరింత దిగజార్చడమే అనాలి (ఇప్పటికే దిగజారిన దానిని కూడా మించి).

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ సినిమా మీద కొర్రు కాల్చి వాత పెడుతున్నట్లు వ్రాసిన ఈ రివ్యూ చదవండి ఓపిక ఉంటే 👇

(ఈనాటి Saturday 29-06-2024 పేపర్ Deccan Chronicle (Hyd) page.9)

Kalki 2898 AD movie review

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పైన నేనిచ్చిన రివ్యూ లింక్ పని చేస్తున్నట్లు లేదు. ఇదీ ఆ పేపర్ లింక్ 👇.

http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=18127035

అజ్ఞాత చెప్పారు...

ఒక రకం సినిమాలకు అలవాటు పడిన వారికి, సీనియర్ సిటిజెన్లకు కల్కి లాంటి చిత్రాలు సింక్ కావు. ఇంకా నయం మీరు అనిమల్ సినిమా చూడలేదు. కల్కి సినిమా ఎలా ఉన్నా అందులో అసభ్యత లేదు.

ఇప్పుడు భారీ బడ్జెట్ తో టెక్నికల్ హంగులతో కొంత పురాణాలు, కొంత ఫ్యూచర్ కలిపి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చెవులు చిల్లులు పడేలా లాజిక్ కి దూరంగా సినిమాలు తీస్తున్నారు. అది నచ్చే వాళ్ళు ఉన్నారు.

అజ్ఞాత చెప్పారు...

James Cameron తీసిన Alita సినిమాకి కాపీ అంటే, hotstar లో ఉంది.

అజ్ఞాత చెప్పారు...

Why zilebi is not in X?

అజ్ఞాత చెప్పారు...

రు. 440 ఒక టిక్కెట్టు ధర. అయినా ఎగబడి చూస్తున్నారు. సినిమాలు క్రికెట్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు గదంట్రా. 20-20 క్రికెట్ కప్పు నెగ్గితే 125 కోట్లు ప్రైజు మనీ ఇస్తున్నారట. ఐ పి ఎల్ లో కొంతమంది ఆటగాళ్ళకి మూడు నెలలు ఆడితే 23 కోట్లు. ఒక సినిమాకి50-100 కోట్లు రెమ్యూనరేషన్. ప్రపంచమే మాయాబజార్ గా మారిపోయింది. ఇది కలి మాయా లేక కల్కి మాయా?

అజ్ఞాత చెప్పారు...

Very poor India అని ఖటాఖట్ నెలకి 8500 రొక్కం ఎలాగు వస్తుంది కదా ఆ మాత్రం ఖర్చు చేయకుంటే ఎలాగండి ?

అజ్ఞాత చెప్పారు...

సినిమా వీడియో గేమ్ లా ఉంది.
మనది చందమామ కథల తరం, మనకు నచ్చదు.