5, ఏప్రిల్ 2022, మంగళవారం

జంధ్యాల బ్యాచ్ – భండారు శ్రీనివాసరావు

 యాభయ్ అయిదేళ్ళ క్రితం నేను ఎలా వుండే వాడినో నాకే తెలియదు. అంటే నా ముఖకవళికలు, రూపు రేఖలు, తలకట్టు, వేసుకునే దుస్తులు, మాట తీరు,  నడత, నడవడిక అన్నీ ఖచ్చితంగా మారిపోయే వుంటాయి. నన్ను అప్పుడు చూసిన వారికి ఇప్పుడు చప్పున పోల్చుకోవడం కష్టమే. అప్పుడు బక్కపలచగా ఉండేవాడిని. ఇప్పుడు మరీ బొద్దుగా కాకపోయినా ఒళ్ళు చేశాను. అప్పుడు దుబ్బులా వున్న జుట్టు పలచపడింది. పాపిడి కుడి నుంచి ఎడమకు  మారింది. పొట్ట వచ్చింది. ఆహార్యం మారింది. బెల్ బాటమ్స్, పెద్ద కాలర్ చొక్కాలు పోయి ఏదో కొంత పెద్దరికంగా అనిపించే దుస్తులు వచ్చి చేరాయి. సరే అప్పటికీ ఇప్పటికీ  మారినది మారండి కాలి చెప్పులే. బూట్లు అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు. కళ్ళజోడు అవసరాన్ని బట్టి కళ్ళమీదకీ, చొక్కా జేబులోకి మారిపోతూ వుండీ లేనట్టు వుంటుంది. మరి ‘వాళ్ళు’ నన్ను ఎలా గుర్తు పట్టేట్టు.

వాళ్ళు అంటే ఎప్పుడో యాభయ్ అయిదేళ్ళ క్రితం బెజవాడ ఎస్సారార్ కాలేజి బీకాం (జంధ్యాల బ్యాచ్) వాళ్ళు. మేమందరం  మూడేళ్లు కలిసి చదువుకున్న వాళ్ళం. మా క్లాసులో వందమందిమి వుండేవాళ్ళం. అదొక రికార్డు అప్పట్లో. నా రోల్ నెంబరు 66.  నేను సరే, వాళ్ళు నన్ను ఎలా గుర్తు పడతారు? ఏమో తినబోతూ రుచి అడగడం ఎందుకు?

మా కాలేజి మేట్స్ బ్రిగేడియర్ శ్రీరాములు, ధర్మవరపు రామ్మోహన రావు, బ్యాంకర్ ఎన్వీకే రావు చొరవతో ఈ కలయిక ఆలోచన పురుడు పోసుకుంది. ఈరోజు ఆచరణకు నోచుకుంది.

ఈవేళ పదిన్నరగంటలకు హైదరాబాదు నారాయణ గూడా లోని స్టేట్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో దాదాపు నలభయ్ మందిమి కలవబోతున్నాం. సాయంత్రం దాకా అక్కడే కబుర్లతో కాలక్షేపం. అలనాటి ముచ్చట్లు, చిలిపి చేష్టల పునశ్చరణ.  

(05-04-2022)

        

కామెంట్‌లు లేవు: