3, జులై 2021, శనివారం

లాకేత్వం ద క్కొమ్ము - భండారు శ్రీనివాసరావు

 ‘ఆయన దగ్గరకు సాయానికి వెళ్ళకు, లాకేత్వం, దక్కొమ్ము బాపతు’ అనే వాళ్ళు మా చిన్నప్పుడు.

కాస్త పెద్దయిన తరవాత కానీ అందులోని అర్ధం బోధపడలేదు.
అంటే ఏమీ లేదు. లేదనే.
‘లా’ కు ఏత్వంఅంటే ‘లే’, ‘ద’ కు కొమ్మంటే ‘దు’. ‘లేదు’.
లేదు, కాదు అనేవాడి దగ్గరికి పోయి ఏం లాభం అని ప్రతిపదార్ధ తాత్పర్యం.
మరి అడగందే అమ్మయినా పెట్టదంటారు. అటువంటప్పుడు అడక్కపోతే ఎలా అని లా పాయింటు తీసేవాళ్ళు వున్నారు.
నిజమే. పని వున్నప్పుడు ఆ పని చేసిపెట్టేవాడిని అడగాలి.
అయితే కొన్ని చేసే పనులు వుంటాయి. కొన్ని కాని పనులు వుంటాయి. మరికొన్ని ‘కాని’ పనులూ వుంటాయి. అంటే, చేయకూడనివి, చేయరానివి అని అర్ధం.
కొందరు చేయగలిగిన చేవ కలిగిన వాళ్ళుంటారు. కొందరు చేయలేకపోయినా ఆ చేవకు కొదవుండదు.
కొందరు చేయగలరు. కానీ చేసే చొరవ, చేవా రెండూ వుండవు.
మరికొందరు చేయలేరు, కానీ పనులు చేయించే చొరవ, చేవ రెండూ పుష్కలం.
ఇక చేయగలిగీ చేయను అనే మొండి రకం, చేయలేను, నా వల్ల కాదు అని మర్యాదగా తప్పుకునే రకం కూడా తారసపడుతుంటారు.
చేస్తాను, చెప్పండి అదెంత పనంటూ చిటికెలు వేసి పని కాకపోవడానికి కారణం ఆయన మాత్రం కాదని మనచేతనే నమ్మించే మనుషులూ మన మధ్యనే వుంటారు.
ఒకర్ని అపర శ్రీరామచంద్రులు, నిప్పులాంటి వాళ్ళు, నిజాయితీకి నిలుటద్దాలు అంటాము.
ఇంకొకర్ని సమర్ధ రామదాసులు అని పిలుస్తాము.
మొదటి వారిని బయట వాళ్ళు మెచ్చుకుంటే ఇంట్లోవాళ్ళు పనికిరాని రకంగా లెక్క గడతారు.
రెండో రకం వారిని ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే, పనులు చేయించుకున్న తరువాత బయట వాళ్ళు, ‘ఒట్టి లంచావతారం’ అనే పేరు పెట్టేస్తారు.
ఈ మధ్య ఇంకో థియరీ వినబడుతోంది.
‘లేదు, నా వల్ల కాదు’ అని ఆదిలోనే అంత్య నిష్టూరపు బాణీ ఎత్తుకోవాలని మేనేజిమెంటు పాఠాల్లో మొదటే చెబుతారని విన్నాను.
‘నో’ చెప్పగలిగిన వాడు సిబ్బంది చేత పనులు బాగా చేయిస్తాడని అదో నమ్మకం.
‘చచ్చినా సెలవు ఇవ్వను’, ‘అరిచి గీ పెట్టినా జీతం పెంచను’, బహుశా ఇలాంటి ‘నో’లు కాబోలు.
సరే! ఇది ఇలా ఒదిలేద్దాం.
ఒక్కటి మాత్రం నిజం.
‘నో’ చెప్పిన వాడ్ని మిత్రుల జాబితా నుంచి తొలగించడం అంటే మన స్నేహంలోనే ఏదో స్వార్ధం వుందనుకోవాలి.

కామెంట్‌లు లేవు: