14, మే 2020, గురువారం

టీటీడీ వారికి శాయంగల విన్నపాలు – భండారు శ్రీనివాసరావు

కొండకు వెళ్ళే భక్తులకు పరిమిత సంఖ్యలో ఆ దేవదేవుడి దర్శనభాగ్యం కలిగించాలని టీటీడీ పాలకమండలి యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా కొంచెం అటూఇటూ రెండు మాసాలపాటు భక్తులకు స్వామి దర్శనాలు నిలిచిపోయాయి. ఇలా భక్తులకు దర్శనాలు నిలిపివేయడం అనేది తమకు తెలిసినంతవరకూ ఎప్పుడూ జరిగిన దాఖలా లేదని తిరుమల చరిత్ర సాకల్యంగా తెలిసినవారు చెబుతున్న మాట.
ఏదైతేనేం రేపోమాపో మళ్ళీ దర్శనాలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ సందర్భంగా నూతన పాలకమండలికి కొన్ని సూచనలు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులకు ప్రోటోకాల్ దర్శనాలు ఎటూ తప్పవు. ఇక మిగిలిన వీఐపీ, వీవీఐపి దర్శనాలనుకట్టడి చేయడానికి ఇదొక మంచి అవకాశం. వృద్ధులు,వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఎలాగూ వున్నాయి. పొతే, సంపన్నులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అధికారులు, అనధికారుల వత్తిడే టీటీడీ అధికారులకు ఎక్కువ. అలాంటివారు మహా వుంటే రోజుకు ఓ వేయి రెండువేల మంది వుంటారు. వారిని కనిపెట్టి చూసుకుని దర్శనాలు చేయిస్తే వాళ్ళు తమని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటారని అక్కడి అధికారుల భరోసా. కానీ వేల సంఖ్యలో క్యూ లైన్లలో పడిగాపులు పడే సామాన్య భక్తుల సంగతేమిటి? వారు నమ్ముకున్న ఆ వెంకన్నే వారి సంగతి చూసుకుంటాడన్న భ్రమలో వున్నారేమో తెలియదు. సరే ఇదలా ఉంచుదాం.
ఉదయం సాయంత్రం ఓ నిర్ణీత సమయాల్లో ఈ వీఐపీ దర్శనాలకు ముందు మంగళం పాడాలి. ఈ రెండువేల మంది కోసం క్యూ లైన్లలో సామాన్య భక్తులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. అంతగా అవసరం అనుకుంటే, సాధారణ క్యూ లైన్లను ఎలాంటి అంతరాయం లేకుండా ఓ పక్క నడుపుతూనే, ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా వచ్చిన వీఐపీని వచ్చినట్టు ప్రత్యేకమార్గం ద్వారా తీసుకువెళ్ళి గర్భగుడిలో కలిపేయాలి. ఇలా చేయడం వల్ల సామాన్య భక్తులు ఎలాంటి నిరీక్షణ అవసరం లేకుండా క్యూలో సాగిపోవడానికి వీలుపడుతుంది. ఎవరికోసమో తమని నిలిపివేశారనే భావన వారికి కలగదు. టీటీడీ వారికి సమయం కూడా కలిసివస్తుంది.
అయితే, చిక్కల్లా స్వామి సేవల విషయంలోనే. కొందరు సుప్రభాతం కోరుకుంటారు. మరికొందరు అభిషేకం. ఇంకొందరు కళ్యాణం. ఇలాంటి కోరికలు, లేదా మొక్కులు వున్న వారిని అత్యధిక రుసుములు వసూలు చేసి ఆయా దర్శనాలు కల్పించాలి. అది కూడా ముందు చెప్పిన పద్దతిలోనే సుమా.
మహాద్వారం నుంచి బయటకు వచ్చే వీవీఐపీలను టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూ చేసే ప్రదేశాన్ని టీటీడీ తక్షణం అక్కడి నుంచి మార్చాలి. దేశం కోసం దేవుడ్ని ప్రార్ధించామని వాళ్ళు సిగ్గువిడిచి చెప్పే అబద్ధాలను జనం టీవీల్లో వినలేకపోతున్నారు. ఇదే పనిని వాళ్ళు తాము బస చేసిన అతిధి గృహంలోనో, కొండ దిగివచ్చిన తర్వాతనో చేసి వుంటే బాగుంటుంది.
ఇలాగే చేయాలని కాదు ఈ విన్నపం. ఇలా కూడా ఆలోచనలు చేస్తే ఓ మంచి మెరుగయిన మార్గం కనబడకపోదు అనేది ఓ చిరు ఆశ.




6 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అరణ్యరోదన.

అజ్ఞాత చెప్పారు...

Very good suggestions sir. Please send the same to the TTD and concerned officers. Definitely it will be implemented as your word is respected.

అజ్ఞాత చెప్పారు...

భండారు శ్రీనివాస్ గారు, పనిలో పనిగా పాపం పగిలిపోయి పోయిన పింక్ డైమండ్ విషయం రమణ దీక్షితులు వారు, వారి బాసు Yవ్ సుబ్బారెడ్డి గారు, ఇంకా దానికోసం గుండెలు అలిసేలా బాధపడిన బ్యాచ్ అందరూ ఘట్టిగా దానిమీద నిజా నిజాలు (అసలు అలాంటి డైమండ్ ఉందా, ఉంటే ఎప్పుడు ఎలా పోయింది లేక YCP వాళ్ళ ప్రాపగాండా బాసు PK గారి creativity నా) తెల్చాలని కూడా ప్రార్ధించండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ పొలిటికల్ కామెంటు పెట్టిన రెండో అజ్ఞాత గారికి: కామెంటు పెట్టడంలో వుండే స్వేచ్చ పోస్టు పెట్టడంలో వుండదు. అంచేత నేను ఏమి రాద్దామనుకున్నానో దానికి పరిమితమయ్యాను. మీకు స్వేచ్చ వుంది కనుక పోస్టుతో సంబంధంలేని విషయాలు గురించి కూడా రాయమని ఓ ఉచిత సలహా చాలా తేలిగ్గా ఇవ్వగలిగారు. ధన్యవదాలు.

నీహారిక చెప్పారు...

మీరు భలేవారండీ కరోనా గోలలో వీ ఐ పీ లు స్వామి దర్శనం కోసం వస్తారంటారా ? ఇప్పట్లో పాదయాత్రలు కూడా ఉండవు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@నీహారిక: కామెంటు పెట్టడంలో వుండే స్వేచ్చ పోస్టు పెట్టడంలో వుండదు. అంచేత నేను ఏమి రాద్దామనుకున్నానో దానికి పరిమితమయ్యాను. మీకు స్వేచ్చ వుంది కనుక పోస్టుతో సంబంధంలేని విషయాలు ప్రస్తావించ గలిగారు.