3, మే 2020, ఆదివారం

వై2కె – భండారు శ్రీనివాసరావు


ఇప్పుడు కరోనా అనే మూడక్షరాల వ్యాధి  యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నట్టు కొత్త శతాబ్ది (2000)ప్రారంభం కావడానికి  కొన్నిసంవత్సరాల ముందు Y2K అనే ఓ మూడక్షరాల పదం కంప్యూటర్ ప్రపంచాన్ని (వారి భాషలో దీన్ని బగ్ అంటారు) గజగజ వణికించింది.
1997/1996 ప్రాంతాల్లో చిన్నగా అంకురించిన ఓ సందేహం 1998 కల్లా ఇంతింతై, వటుడింతై అన్నట్టు పెరిగిపోయి కంప్యూటర్ల పాలిట పెను ముప్పుగా పరిణమించింది.
దీన్ని గురించి సామాన్యుల భాషలో చెప్పాలంటే, పైన చెప్పిన సంవత్సరాలనే తీసుకుందాం. 1998 ని 98గా రాయడం పరిపాటి. అంటే కంప్యూటర్లలో నాలుగు డిజిట్లకు (1998) బదులు రెండు డిజిట్లే (98) వాడతారు. బ్యాంకు ఖాతాలు, ఆదాయపు పన్ను లెక్కలు ఇలా ఒకటేమిటి అన్ని చోట్లా ఈ రెండు డిజిట్లే.
1998 సంవత్సరం డిసెంబరు ముప్పయి ఒకటి పోయి 1999 జనవరి ఒకటి రాగానే, అంటే ముప్పయి ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటగానే ఆటోమేటిక్ గా గడియారాలు, కంప్యూటర్లలో 98 పోయి 99 వస్తుంది. అలాగే  1999 డిసెంబరు ముప్పయి ఒకటి తర్వాత చివరి రెండు డిజిట్ల స్థానంలో 00 వస్తుంది. అంటే 2000 కి బదులు  1900 వస్తుంది. దాంతో కాలం వందేళ్ళు వెనక్కి పోతుంది. లెక్కలు డొక్కలు అన్నీ తారుమారవుతాయి. ఇదే Y2K BUG.
ఈ ముప్పును తప్పించుకోవడం ఎలా అన్నది పెద్దపెద్ద కంప్యూటర్ కంపెనీలకు పెద్ద తల నొప్పిగా మారింది. IBM మెయిన్ ఫ్రేమ్స్ సాయంతో ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాలంటే లక్షల సంఖ్యలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న సిబ్బంది అవసరమవుతారు. ఈ అంశమే భారత దేశానికి ముఖ్యంగా (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా మారింది. రాత్రికి రాత్రే అనేక చిన్న చిన్న కంపెనీలు, హైదరాబాదులోని  అమీర్ పేట చుట్టుపక్కల పుట్టుకొచ్చాయి. వేల సంఖ్యలో అభ్యర్ధులు శిక్షణా సంస్థల్లో క్రాష్ కోర్సులు పూర్తిచేసి అమెరికాకు వెళ్ళిపోయారు. చిన్నా చితకా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న యువకులు కూడా ఆ కోర్సులు చేసి ఇప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్ కొలువుల్లో కుదురుకున్నారు. అమెరికాలో ఈనాడు మంచి జీతాలతో మంచి జీవితాలు గడుపుతున్న అనేక మందిలో ఈ Y2K వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళందరూ రెండేళ్ళు కష్టపడి  కంప్యూటర్లలో 1999 తర్వాత 2000 వేల సంవత్సరం వచ్చేట్టు చేయగలిగారు.
దాంతో అంతర్జాతీయ కంప్యూటర్ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. 
Y2K గురించి రాసిన ఈ పోస్టు చూసి కప్పగంతు శివరామ కృష్ణ గారు ఆనాటి తమ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. వారికి కృతజ్ఞతలు : 
"నేను అప్పుడు కెనరా బ్యాంకు ఆబిద్ రోడ్ శాఖలో పనిచేస్తున్నాను. ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్నెన్ని ప్రింట్లు తీసామో! రెండు రోజులపాటు బాంకులోనే రాత్రిళ్ళు ఉండి, అన్నీ ప్రింటర్లు (అప్పట్లో అన్నీ డాట్ మాట్రిక్స్ ప్రింటర్లే) పని చేయించి ఒక పద్ధతి ప్రకారం మొత్తం ప్రింట్లు తీసి పెట్టాము. అంటే కంప్యూటర్లు పనిచేయకపోతే, మామూలు మాన్యువల్ పద్ధతిన మర్నాడు పనిచేయటానికి సిద్ధపడ్డాము. అన్నీ బాంకు శాఖల్లోనూ ఇదే విధంగా చేశారు.ప్రింట్లు తీసిన తరువాత, వాటి అవసరంపడితే, సంబంధిత ఖాతా వివరాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి. అందుకోసం నాకున్నా డాస్ సిస్టం పరిజ్ఞానం ప్లస్ ప్రింట్లు, ఆ ప్రింట్లు అన్నీ ఒక పద్ధతిలో సద్ది, ఆ మొత్తానికి ఇండెక్స్ చేసి పెట్టాను. అవసరం అయితే ఏ ఖాతా కావాలన్నా ఆ ప్రింట్ ఏ బాక్స్ లో ఉన్నదో చూపించే చిన్ని ప్రోగ్రాం చేసి పెట్టుకున్నాను. రకరకాలుగా test చేసి ఉంచుకున్నాము.
1 జనవరి 2000 రాంగానే మొదటి లాగ్ యిన్ చేసి చూస్తే, కంప్యూటర్లో సమస్య ఏమీ రాలేదు అని చూసుకుని, బాంకుల్లో పనిచేసే వారందరూ అప్పుడు ఇళ్ళకు వెళ్లారు." 
            

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Y2k సమస్య వస్తుందని భయపడడానికి ఆ రోజుల్లో చెప్పిన కారణం ఏమిటంటే .... కంప్యూటర్ లో మెమరీ, స్టోరేజ్ స్పేస్ ఆ కాలంలో చాలా పరిమితంగా ఉండేవి, ఎందుకంటే ఆ రోజుల్లో అవి కాస్ట్లీ గా ఉండేవి (ఇప్పుడు బాగా చౌక అయిపోయాయి లెండి). కాబట్టి వీలైన చోటల్లా పొదుపుగా వాడేవారు. ఒక పొదుపు ఏరియా ఏమిటంటే సంవత్సరాన్ని కుదించి నాలుగు అంకెల బదులు (ఉదా; 1980) రెండంకెలే (ఉదా: 80) స్టోరేజ్ స్పేస్ కేటాయించేవారు కంప్యూటర్ ప్రోగ్రామర్లు తాము వ్రాసే ప్రోగ్రామ్స్ లో. అందువల్ల 99 (1999) తరువాత 00 అవుతుంది, దాన్ని కంప్యూటర్ 2000 బదులు 1900 గా భావించుకుంటుంది, ఆ రకంగానే కాల్-క్యులేషన్స్ చేస్తుంది, దాంతో అంతా తప్పుల తడక అయిపోతుంది అని భయపడ్డారు. దాన్ని సరి చేయాలంటే మొత్తం అణువణువూ చూసుకుంటూ ఎక్కడెక్కడైతే రెండంకెల స్పేస్ కేటాయించి ఉందో అక్కడల్లా దాన్ని నాలుగంకెల స్పేస్ కేటాయింపుగా మార్చాలనీ, చేసిన మార్పుల్ని క్షుణ్ణంగా టెస్ట్ చేయాలనీ (31 డిసెంబర్ 1999 అర్థరాత్రి లోగా), అదంతా బృహత్ కార్యక్రమం కాబట్టి వేలమంది ప్రోగ్రామర్ల అవసరం ఉందనీ అనేవారు (అది కూడా మెయిన్ ఫ్రేం, AS400 కంప్యూటర్ల పరిజ్ఞానంతో). ఆ రకంగా చాలా మందికి విదేశీ అవకాశాలు వచ్చాయి, మీరన్నట్లు అమీరుపేట-మైత్రీవనం సందుల్లోని కంప్యూటర్ కోచింగ్ సెంటర్లకు లాభసాటి వ్యాపారం దొరికింది 🙂.