29, మే 2020, శుక్రవారం

“చేసేది ఏమిటో..చేసెయ్యి సూటిగా...” – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha  daily on 30-05-2020, Saturday)
“చేసేది ఏమిటో..చేసెయ్యి సూటిగా...”

ఏడాదిగా ఏపీలో జగన్ మోహన రెడ్డి పాలన ఏ తీరుగా సాగుతున్నదో తెలపడానికి ఈ ఒక్క వాక్యం చాలు.
ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్. వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదించినవాళ్ళు మీడియా ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు.
“లక్ష్యాన్ని సాధించితీరాలి అనే గమ్య నిర్దేశనం చేసుకున్న తర్వాత మేము బాహ్య ప్రపంచాన్ని దాదాపు మరచిపోయాము. సినిమాలు, షికార్లకి స్వస్తి చెప్పాము. రోజువారీ సరదాలు మరచిపోయాము. ఏమైనా సరే, అనుకున్నది  సాధించితీరాలని  దృఢంగా చేసుకున్న నిర్ణయం ముందు ఇవన్నీ అత్యంత స్వల్పవిషయాలనే  నిర్ధారణకు వచ్చాము. అంచేతే మా జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకోగలిగాము”
బహుశా జగన్ మోహన రెడ్డి ఈ కోవకు చెందినవాడయి ఉండవచ్చు. అంచేతే, కేవలం తన కష్టాన్ని నమ్ముకుని తన పార్టీని ఎన్నికల్లో గెలిపించి, ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఇదంత సులభమైన వ్యవహారం కాదు. అయినా సరే, మొక్కవోని పట్టుదలతో, తన రెక్కల కష్టంతో దాన్ని సాధించగలిగారు. ముఖ్యమంత్రి అయిన తరవాత కూడా ఆయన తన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఒక పద్దతి ప్రకారం ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నారు. వాటికి అనుగుణమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణంలో ఇతరేతర విషయాలను వేటినీ  ఆయన చెవికి ఎక్కించుకోవడం లేదు.
ఈ నేపధ్యంలో, అఖండ విజయం ఆయనను అహంకారిగా, ఎవరి మాటను ఖాతరు చేయని మనిషిగా మార్చివేసిందని ఆరోపించేవారు కూడా వున్నారు.    
నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, చెల్లుబాటయిన మొత్తం ఓట్లలో అప్పటికి అయిదేళ్లుగా పాలిస్తున్న టీడీపీకి, కొత్తగా ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేసిన జనసేనకు, కాంగ్రెస్, బీజేపీ లకు కలిపి వచ్చిన ఓట్ల కంటే వైసీపీకి ఆరులక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ గణాంకాలనే  ప్రాతిపదికగా తీసుకుంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వాటిపై వైసీపీ విజయం సాధించి వుండేది అనేది  ఒక వాదన.
అయితే ఇంతటి బహుళ ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్య సూత్రాలను పట్టించుకోకుండా  తన చిత్తం వచ్చినట్టు పాలన సాగించవచ్చా అనేది ఆదినుంచి  ప్రతిపక్షాలు లేవదీస్తున్న ప్రశ్న. కరోనా పూర్వరంగం నుంచి తొలుస్తూ వచ్చిన ఈ సందేహాన్ని,  కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆ పార్టీలు  ఒకటికి పదిసార్లు ప్రజలకు చెబుతూ మరింత పెద్దది చేస్తూవచ్చాయి. కేవలం సందేహం అయితే పర్వాలేదు, జగన్ పాలనాపరంగా పూర్తిగా వైఫల్యం చెందారు అనేది జనం నమ్మేలా  చేయడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ మోహన రెడ్డిపై ముందు నుంచీ ఒక అపోహ వుంది, అయన ఎవ్వరి మాట వినని సీతయ్య అని. నిజమే కావచ్చు. కానీ 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటినుంచి  పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఒకరో ఇద్దరో, దామోదర సంజీవయ్య, టి. అంజయ్య వంటి వారిని మినహాయిస్తే అందరూ ఈ సీతయ్య కోవలోకి వచ్చేవారే. కాకపోతే వారిలో చాలామంది తమలోని ఈ స్వభావం బయట జనాలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. జగన్ మోహన రెడ్డికి ఆ శషభిషలు వున్నట్టులేదు. అందుకే ఆయన మీద ఈ అపోహలు తేలిగ్గా ముసురుకుంటున్నాయి కాబోలు.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి తన రెండు చేతుల్లోను రెండు పగ్గాలు ధరించి పాలనారధాన్ని ముందుకు నడుపుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా తొలిరోజుల్లోనే  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో అనిపించే రాజకీయ నిర్ణయాలు.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఎంత మంచి పధకం అయినా ప్రజల మద్దతు లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలని విజ్ఞులు పదేపదే సూచనలు చేసేది ఇందుకే.    
కిందటేడాది ఏప్రిల్ 11 వ తేదీన అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు ఆయన పాలిట అగ్ని పరీక్ష వంటివి. సరిగ్గా నలభయ్ రెండు రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మే 23న ఫలితాలు వెలువడ్డాయి.  నిజానికి ఆ ఎన్నికల్లో గట్టెక్కడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుకు  ఎంతో కీలకం. ఎందుకంటే ఆయనది ఒక ప్రాంతీయ పార్టీ. వరసగా రెండు ఎన్నికల్లో పరాజయం పాలయితే మూడోసారి ప్రజా పరీక్షకు సిద్ధం కావడం అనేది ఒక ప్రాంతీయ పార్టీకి, అందులో ఏనాడు అధికార పీఠం ఎక్కని రాజకీయ  పార్టీకి  అసాధ్యం అని అంటారు.  అయితే, జగన్ మోహనరెడ్డి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తం 175 స్థానాల్లో  151 సీట్లలో తన అభ్యర్ధులను గెలిపించుకుని కొత్త రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖించారు. ఈ విజయాల్లో అధికభాగం ఆయన తన సొంత రెక్కల కష్టంతో సాధించుకున్నవే.
గత ఏడాది కాలంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అనాలోచితమైనవి, తొందరపాటుతో కూడినవి కాకపోయినా చాలావరకు వివాదాస్పదంగా మారుతున్నాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు మొదట్లో దుందుడుకుతనంగా అనిపించినా తర్వాత తర్వాత వాటిల్లో సహేతుకత లేకపోలేదని జనమే ఒప్పుకునేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు కరోనాతో సహజీవనం చేయక తప్పదని జగన్ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే లేపింది. అందరూ ఆక్షేపించేలా చేసింది. చివరికి పాలకులు అందరూ అదేమాట చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది. కానీ ఈలోపలే ఆ ప్రకటనను జగన్ అనుభవరాహిత్యానికి గీటురాయిగా ముద్ర వేయడం జరిగిపోయింది.    
ఈ కరోనాకు తోడు పులిమీది పుట్రలా విరుచుకుపడిన వైజాగ్ విష వాయువు దుర్ఘటన దరిమిలా ప్రతిపక్షాల వాదన సరయినదేమో అనే శంక సమాజంలోని  కొన్ని వర్గాలవారికి కలిగేలా ఈ ప్రయత్నాలు తారాస్థాయికి చేరాయి.
తనపై దుష్ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగితే అంత మంచిదని జగన్ మోహన రెడ్డి భావిస్తున్నారేమో తెలవదు. దీన్ని బలంగా తిప్పికొట్టే ప్రయత్నాలు ఏవీ ఆయన వైపు నుంచి కానరావడం లేదు. బహుశా గతంలో ఇలాగే అన్ని  రాజకీయ పక్షాలు ఏకమై తనను ఒంటరివాడిని చేసినప్పుడు ప్రజలకు తనపట్ల సానుభూతి వెల్లువెత్తిన సంగతిని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రతిస్పందించకుండా మిన్నకుంటున్నారేమో తెలవదు. ముందే చెప్పుకున్నట్టు ఆయన ఎవరి అంచనాలకు అందని లోతైన మనిషి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఒక అభిమాన నాయకుని పట్ల అయన  అభిమానులు పెంచుకున్న అభిమానం ఎల్లవేళలా ఒకేలా వుండదు. అంతగా అభిమానించిన ఎన్టీఆర్ వంటి మహానాయకుడినే ఒక నియోజకవర్గం, కల్వకుర్తిలో ఓడించారు. పూచిక పుల్లను నిలబెట్టి గెలిపించుకునే సత్తా తనకుందని అహంకారపూరిత ప్రకటనలు చేయడం, ఓ చిన్న కారణం చూపెట్టి తన మంత్రివర్గంలోని మంత్రులను అందరినీ ఒక్క కలంపోటుతో  తొలగించడం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. 
కాకపొతే, గతంతో పోలిస్తే కొట్టవచ్చినట్టు కనబడుతున్న తేడా ఒకటుంది. అది ప్రచార ఆర్భాటం భారీగా తగ్గిపోయిన మాట నిజం. అలాగే, అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ ఏడాది పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది. కరోనా కట్టడి కాలంలో అది కొద్దిగా రూపు మార్చుకుంది. ముఖ్యమంత్రి నేరుగా విలేకరులతో మాట్లాడకుండా ముందుగా రికార్డు చేసుకున్న వీడియోని మీడియాకు విడుదల చేస్తున్నారు.

ఏడాది కాలం కళ్ళముందే కాలగర్భంలో కలిసిపోయింది. కానీ రెండు కొత్త తెలుగు  రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు ఆరేళ్ళు దగ్గరపడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. పోతిరెడ్డిపాడు వంటి అంశాలు ఇటీవల చిలికి చిలికి గాలివానగా మారడం గమనిస్తున్న వారికి ఈ ఇరువురు నాయకుల మధ్య సయోధ్య మూడునాళ్ళ ముచ్చట అవుతుందేమో అనే సందేహం కలిగితే ఆశ్చర్యపడాల్సింది లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు.   
చేసినవి ఎన్నో కనిపిస్తున్నా, చేయాల్సినవి ఇంకా చాలా మిగిలే వున్నాయి. ‘ఏడాదేగా గడిచింది ఇంకా నాలుగేళ్ల వ్యవధానం వుందిగా’ అనుకోవడానికి, ‘అయ్యో అప్పుడే ఏడాది పుణ్యకాలం గడిచిపోయింది, మిగిలింది కేవలం నాలుగేళ్లే’  అనుకోవడానికి చాలా తేడా వుంది. ఇది ముఖ్యమంత్రి గమనంలో వుంచుకోవాలి.
ఈ రెంటిలో జగన్ మోహన రెడ్డి దేనికి మొగ్గు చూపుతారు అనేదానిపై ఆయన పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రెండూ ఆధారపడివున్నాయి. (EOM)  

కామెంట్‌లు లేవు: