16, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 17 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 16-11-2019, Saturday)

స్కూళ్లకు సెలవిచ్చారని రేడియో వార్తల్లో విని మారుమూల వూళ్ళల్లో బళ్లను మూసివేసిన రోజులున్నాయి. రేడియో వార్తల్లో అంతర్లీనంగా వుండే నిబద్ధతతకు ఈ ఉదంతాలు నిదర్శనాలు. అయినాసరే  రేడియోలో వచ్చే ప్రాంతీయ వార్తల్ని ప్రాచీన వార్తలు అంటూ ఎద్దేవా చేయడం కద్దు.
సుమారు  మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ - ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా  'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు కూడా అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
ఇక రేడియోలో వార్తలు గురించి చెప్పాల్సివస్తే -
నలభైయ్యేళ్ళ క్రితం రేడియో విలేకరిగా చేరినప్పుడు - ప్రభుత్వ మాధ్యమంలో పనిచేసే మాకు పోటీ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే రేడియో వరకు ఈనాటికీ ఎలాటి పోటీ లేదు.
పోటీ లేకపోవడంవల్లా. పోటాపోటీగా సంచలన వార్తలు ప్రసారం చేసి శ్రోతల సంఖ్యని పెంచుకోవాల్సిన అవసరం లేకపోవడంవల్లా, రేడియో వార్తల సేకరణ, కూర్పు ఇత్యాది కార్యక్రమం అంతా ఒక పద్ద్దతి ప్రకారం జరిగిపోతూ వుండేది. ఏదయినా సమాచారాన్ని ఉన్నతస్థాయి ప్రభుత్వ, పోలీసు వర్గాలనుంచి ద్రువపరచుకోవడానికి, పత్రికలవారితో పోలిస్తే రేడియో విలేకరికి కొంత వెసులుబాటు ఎక్కువనే చెప్పాలి. 'అవసరాన్ని మించి రేడియోలో అనవసరంగా ఏమీ చెప్పరు' అని రేడియోవారిమీద వున్న ముద్ర ఇలాటి సందర్భాల్లో చాలా ఉపకరించేది. మంత్రులు, సీనియర్ అధికార్లతో తీరిక సమయాన్ని ఖర్చుచేసే సందర్భాల్లో దొర్లే ప్రైవేట్ సంభాషణల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మా దృష్టికి వచ్చేవి. అయినా వాటిని సంచలనాత్మకం చేయాలనే ఆలోచన కూడా వుండేది కాదు. అందుకే, అధికారులు కూడా మాకు అవసరమైన సందర్భాలలో సరైన సమాచారం అందించేందుకు వెనుకాడేవారు కారు. ఉభయతారకమైన  ఈ సంబంధాలు, రేడియో విలేకరిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో నాకెంతో సాయపడ్డాయి.               
సంచలనం జోలికి పోకుండా వుంటే రేడియో వార్తల పరిధి చాలా తక్కువ. తెలిసిన లేదా తెలియవచ్చిన వార్తకు ఎలాటి నగిషీలు చెక్కకుండా ప్రసారం చేయడం వల్ల - రేడియో వార్తల్ని మెచ్చుకుని అభిమానించే నిత్య శ్రోతల్ని పెద్ద సంఖ్యలో  సంపాదించుకోగలిగాము. అలాగే పోటీ లేదని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రోతలకు అందించడంలో ఎప్పుడూ ముందే వుంటూ వచ్చాము. రేడియో బులెటిన్ లో ఎప్పుడయినా 'ఇప్పుడే అందిన వార్త' అని వినబడితే ఇంటిల్లిపాదీ చెవులు రిక్కించుకుని వినే ఆకర్షణ రేడియో వార్తలకే  చెల్లింది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
నాటి విషయాలు ముచ్చటించుకునేటప్పుడు ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఇన్నిన్ని ప్రైవేట్ టెలివిజన్ ఛానళ్ళు లేని ఆ రోజుల్లో రేడియో వార్తలకు ఎంతో ప్రాముఖ్యం వుండేది. రేడియో విలేకరి వచ్చేవరకు ముఖ్యమైన పత్రికా సమావేశాలు మొదలయ్యేవి కావంటే ఆ ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. వివిధ రకాల టీవీ నెట్ వర్కులు, బ్రేకింగ్ న్యూస్ ప్రక్రియలు లేకపోవడం వల్ల రేడియో వార్తల్లో కదాచిత్ గా వచ్చే 'ఇప్పుడే అందిన వార్త' కోసం  శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం,  అంజయ్య గారి భారీ మంత్రివర్గం రాజీనామా, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక, నెల రోజుల ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానంతరం ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిందని గవర్నర్ ఎన్ టీ రామారావును ఆహ్వానించడం వంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని మొట్టమొదట తెలుగునాట నలుదిక్కులకూ తెలియచెప్పిన ఘనత ఆకాశవాణిదే.
ఇక ఆ కోవలో చెప్పుకోదగిన వార్త ఎన్టీఆర్  మరణం. ఆయన మృతి చెందిన వార్త కొద్ది గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి ఉదయం వెలువడే మొట్టమొదటి ఇంగ్లీష్ బులెటిన్ లో ప్రసారమైంది. తద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది.
నర్రావుల సుబ్బారావు గారని ఒక న్యూస్ ఎడిటర్ వుండేవారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. నిజానికి ఆయన రైతు పక్షపాతి. ఆయన నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.  రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఓ అభిప్రాయం ప్రచారంలో వుంది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా ముప్పయి సంవత్సరాల రేడియో ఉద్యోగం అనుభవంలో గమనించిన అంశాలు కొన్ని వున్నాయి. ఈ కాలంలో విభిన్న రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కాలంలో గద్దె ఎక్కడంతో - వాటిని వ్యక్తిగతంగా సమర్ధించే శక్తులు, అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియోలో కూడా ప్రవేశించాయి. రాజకీయ నాయకుల ప్రత్యక్ష జోక్యం లేకున్నా, ఈ వ్యక్తి ఆరాధకుల వికృత పోకడల ప్రభావం రేడియో వార్తలపై పడిందనడంలో సందేహం లేదు. అయితే ఎలాటి రాజకీయ ముద్రాంకితాలు లేని ఉద్యోగులు కూడా అదే సమయంలో పూర్తి స్వేచ్చతో, తమ బాధ్యతలు నిర్వర్తించుకోగలుగుతున్నారు. అదే ఈ వ్యవస్థలో నేను గమనించిన విలక్షణ లక్షణం. 
(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పోటీ లేకపోవడం వల్ల సంచలన విషయాలు బయటకి రాలేదేమో ?
సర్కారు రేడియో లో, ఒక జర్నలిస్ట్ స్కాం ని బయటకి లాగుతాడా ?
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రేడియో లో ఉన్నాదా ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: రాలేదు, లాగడు, లేదు.