31, ఆగస్టు 2017, గురువారం

పలుకే బంగారమాయెరా!... బాపూ...పలుకే...



(ఈరోజు ఆగస్టు  31,బాపూ గారివర్ధంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు)
Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన నాలాగే ‘బాపూ రమణల’ వీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా. ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన విషయాలు అందులో వున్నాయి. కానీ శ్రీనివాసులు గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో, కింద ఇస్తున్నాను.
“నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన...అక్షరాలా ....
“కొన్ని మాటలు....” అని చెప్పి ఊరుకున్నారు.
బాపు మరణించిన రోజు... కుంచె కన్నీళ్లు కారుస్తూ వుండడం ఇంకా కళ్ళల్లో కదలాడుతూ వుంది. 
బాపు ఇక లేరు. ఇది జీర్ణించుకోవాల్సిన సత్యం. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి గుండెలు కూడా బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఆయన మరణంతో పూర్తయింది.
బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు. బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు. 
దటీజ్ బాపు...బాపు ఈజ్ గ్రేట్ 
ముళ్ళపూడివారి 'కోతికొమ్మ'చ్చికి ఆయన అభిమాన బృందం అభిమాన పురస్సర కొనసాగింపే 'కొసరు కొమ్మచ్చి' పుస్తకం. వెల కేవలం రెండువందలు. కేవలం ఎందుకంటున్నానంటే - ఇందులో అక్షరలక్షలు విలువ చేసే బాపూగారి 'రమణా నేనూ, మా సినిమాలు' అనే ముందుమాట వుంది.(ప్రతులకు నవోదయా) ఎదుటివాడిమీద జోకులేసి నవ్వుకోవడం కాదు, మన మీద మనమే జోకులేసుకుని నవ్వించే గుణం వుండాలి అనే బాపూ గారి మానసిక ఔన్నత్యానికి ఇదిగో ఒక మచ్చు తునక:
బాపూ గారి ఉవాచ:
"శంకరాభరణం ఎనభయ్ మూడోమాటు చూడ్డానికి దియేటర్ కు వెళ్ళినపుడు ఇంటర్ వెల్ లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగునవచ్చి బుల్లి మఖమల్ అట్ట పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. 'పెన్ను లేదమ్మా' అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి అందులోనుంచి పెన్సిల్ తీసి ఇచ్చింది. నేను సంతకం పెడుతుంటే చూసి, 'మీరు విశ్వనాద్ గారు కారా' అనడిగింది. 'కాదమ్మా' అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని, ఫ్రెండుని 'ఒసే. బాక్సులో లబ్బరు వుంటుంది ఇలా తే' అంది"


దటీజ్ బాపు !

కామెంట్‌లు లేవు: